Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 41


    అతడి పరిస్థితి అర్థమయింది యశోదకి "వివేక్ ని పసితనంలో... అంటే మరీ నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు ఎవరు పెంచారు?"
    "ఇంకెవరండీ, అమ్మగోరేనండీ! చిన్నబాబు పనులన్నీ ఆరే చూసుకునే వారు"
    "మావగారికి కూడా కొడుకంటే అపురూపమేనా"
    "హమ్మనాయనో! చిన్నబాబుగారు ఆయన ప్రాణమండీ. పైకట్టా పులిలా కనిపిస్తారు కానీయండీ. కొన్ని సమయాల్లో నిజంగా పులే అనుకోండీ కానీ చినబాబుగారి విషయంలో మాత్రం యెన్నపూసేనండీ. చినబాబు కోరుకుంటే కొండ మీది కోతైనా దిగి రావలసిందే"  
    "చిన్నతనంలో.... ఏడాదీ, రెండేళ్ల వయసులో వివేక్ ఎక్కువగా పేచీలు పెట్టేవాడా"
    "అయ్యగారు గారాబు చేసేవారు కదండీ. అందుకని అయ్యగారి దగ్గర మారాలు చేసేవోడు. బాబు ఏదడిగితే అది అయ్యగారు తెప్పించేవోరు. అమ్మగారి దగ్గర ఏమో పాటలూ పద్దేలూ వల్లించేవోరు"   
    "ఏదడిగితే అది... అంటే?"
    "ఒకసారి చెట్టు మీద కోతిని చూసి అది కావాలి" అన్నాడు. అప్పటికప్పుడు పాలేరుని పట్నానికి లగెత్తించి, పెద్ద కోతి బొమ్మ తెప్పించారు."      
    "ఇంట్లో చెట్టు మీదికి కోతి వచ్చిందా?"
    "ఇంట్లో కాదమ్మాయిగారూ పొలంలో. ఇంటికీ పొలానికీ ఎక్కువదూరం లేదు."  
    "మరి. మూడేళ్ల వయసులో వివేక్ ని పొలానికి తీసుకెళ్ళేవారా?"
    "పొలానికంటే అయ్యగారు పన్జెయ్యాలేంటి? కర్ర పెత్తనమేగా. ఏడాది నిండినప్పటి నుండీ, మేలుకుని ఉన్నంతసేపూ చినబాబు అయ్యగారి భుజాల మీదే ఉండేవారు. నిద్రొస్తే మాత్రం దాసీ దానికిచ్చి ఇంటికి పంపేవోరు."    
    "అమ్మగారు ఎప్పుడైనా వివేక్ ని అదిలించేవారా"
    "అమ్మగారా? అదేం మాటండీ. చీమనీ దోమనీ కూడా అదిలించరే. కన్నబిడ్డని అదిలిస్తారా. కానీ ఆమె గోరి దగ్గిర ఏం మంత్రం ఉందో, అయ్యగారి దగ్గర ఆగం ఆగం చేసే చినబాబు గోరు అమ్మగోరి దగ్గర మాత్రం బంగారు బొమ్మల్లే కూచుని ఏం చెపితే అది యినేవోరు.
    "పెద్దమ్మగారి దారే ఏరు లెండీ. నాలాంటి రౌడీ ముండాకొడుక్కి కూడా ఆయమ్మని చూస్తే దూరం నుంచే మొక్కబుద్దేస్తుంది."
    "పెద్దమ్మగారు ఏం చెప్పేవారు?"
    "కధలు, చెప్పేవోరండీ, భలే భలే కధలు. అప్పుడప్పుడు మేం కూడా నిలబడిపోయి ఆ కధలు వివే వాళ్ళం. కూసింత పెద్దయ్యాక చినబాబు కూడా కధలు చెప్పేవోడండీ. సానా సానా గమ్మత్తుగా ఇంట్లో జరిగినయ్యే, తను సూసినయ్యే, కధలుగా చెప్పేసే వోరు. మేం నవ్వుకోలేక సచ్చేవోళ్లం"   
    "అంటే, నువ్వు మొదట్లో మామూలు పాలేరువేనా?"
    "అవునండి"
    "మరి. ఆయనగారికి ఇంత ముఖ్యమైన వాడివి ఎలా అయ్యావు?"
    "అది సెప్పాలంటే ఆడోళ్ల సంగతి సెప్పాలండీ"
    "చెప్పు"
    "అయ్యగోరికి ఆడోళ్ళని సప్లయి చేసేది నేనేనండీ!. మరి నా లెవల్ పెరగదేంటండీ."
    "పెద్దమ్మగారికి తెలుసా?"
    "తెలవకుండా ఎట్టా ఉంటాదండీ"
    "మరి ఆవిడ ఊరుకున్నారా?"
    "రత్తిగోల జరిగినప్పట్నుండీ, అమ్మగారు పెద్దయ్యగారితో సంసారం మానేశారండీ! అరి ఆడోళ్ల గురించి ఏమి పట్టించుకునే వోరు కాదండీ! అయినా కట్టుకున్న పెళ్ళాం దగ్గర జేరనియ్యకపోతే మొగుడన్నవోడు బయటి ఆడోళ్ల దగ్గరికి పోక ఏం చేస్తాడండీ" సవాలు విసిరాడు.... అది పట్టించుకోలేదు. ఆమె మనసు మరొక వాక్యం మీద నిలిచింది.  
    ప్రసూనకీ, దేవిశంకర్ కీ, వేరు వేరు పడక గదులు ఉండటం ఆమె దృష్టికి ఏనాడో ఆకర్షించింది.
    "రత్తిగొడవ జరిగాక. అమ్మగారు పెద్దయ్యగారితో సంసారం మానేశారు....." అన్న వాక్యం ఆమెలో కుతూహలాన్ని రేపింది. ఏదో పెద్ద గొడవ లేకపోతే ప్రసూన లాంటి స్త్రీ సహనం కోల్పోయి అంత కఠినమైన నిర్ణయం తీసుకోదు.   
    "రత్తి గొడవ చెప్పు"
    "మరి. ఆడోళ్ల సంగతి....."
    "వేషాలెయ్యక జరిగింది క్లుప్తంగా చెప్పు"
    క్లుప్తంగా చెప్పటం వీరన్నకి రాదు. ఆ సంగతి యశోదకి తెలుసు. ఆమెకి కావలసింది కూడా యధాలాపంగా మాట్లాడినట్లు చెప్పడమే. అలా అయితేనే మూల మూలల రహస్యాలూ బయటికి వస్తాయి.
    అతడు సెక్స్ వర్ణనల్లోకి దిగకుండా అలా హెచ్చరించింది.
    "అయ్యగోరి పొలంలో చిన్న పెంకుటిల్లుందండీ! చిన్నదంటే చిన్నది గాదండీ. ఒక మోస్తారుదండీ. ఊళ్ళో మోతుబరి రైతులిద్దరు ముగ్గురికి పొలాల్లోనే అట్టాంటి ఇళ్ళున్నాయండీ."
    "ఆడోళ్ల యవ్వారాలన్నీ ఆటిల్లోనేనండీ. ఏ మాటకామాటే చెప్పుకోవాలండీ. అయ్యగారు మొదట్లో, రోజూ ఆడవాళ్ళని పిలిపించుకునే వోరుకాదండీ. ఎన్నడో ఓనాడు ఎవర్నో అదీ సానాసక్కగా వయసులో ఉంటే పిలిపించుకునేవారండి. రత్తి సక్కనిదేనండీ. ఎర్రగా జామ పండులాగుండేది పెళ్లయినా పిటపిటలాడుతూ ఉండేది. దొంగ సచ్చింది అదే అయ్యగారిని తెగ కవ్వించిందండీ. డబ్బు కూడా అడగలేదండీ."
    "ఇదంతా తనమీద మోజని అయ్యగారు మురిసి పడ్డారు.... కుతంత్రమని తెలీదు. కాసుకోలేక పోయారు మా ఊళ్ళో ఒక కట్టుందండీ. మామూలు పోట్లాటలయితే అందరూ కల్పించుకుని న్యాయం, అన్యాయం మాట్లాడుతారండీ ఆడవాళ్ల విషయాలయితే ఎవరూ జోక్యం కలిగించుకోరండీ!"  
    "నాయుడు సచ్చినోడు, మొగాడిలాగా ఎదుటబడికొట్టలేక ఆడముండ రత్తి నడ్డుపెట్టుకుని దాని మొగుడినుపయోగించుకుని అయ్యగారి మీద దెబ్బతీశారు."
    "తర్వాత మేం ఆ రత్తి మొగుడి పనీ, నాయుడి పని కూడా పట్టేశాం" హత్యని సూచించే ఒక విచిత్రమైన శబ్దం చేశాడు వీరన్న యశోదకి భయం వేసింది సంభాషణ మార్చటానికి ప్రయత్నం చేసింది.   
    "ఈగలాటాల కారణంగా పెద్దమ్మగోరు అయ్యగారితో... అయ్యగారితో...."
    "సంసారం మానేశారా? అంటారు అంతేగా....!"
    "గలాటాలు కాదండీ. ఇట్టాంటియి మా వైపు మామూలే!."

 Previous Page Next Page