దగ్గరగా చేరేసి ఉన్న ప్రసూన తలుపుల మీద కొట్టాడు దేవిశంకర్.
"లోపలికి రావచ్చా?" అడిగాడు.
"రండి!"
తలుపులు తోసుకుని లోపలికి వచ్చి, ప్రసూన మంచం మీద కూచోబోయాడు దేవిశంకర్.
"అలా కుర్చీలో కూచోండి!" సౌమ్యంగానే అన్నా చాలా ఖచ్చితంగా ఉంది ఆ మాట. చిన్నబుచ్చుకుని కుర్చీలో కూర్చున్నాడు, చుట్టూ చూస్తూ "చాలా రోజులయింది ఈ గదిలో అడుగు పెట్టి!" అన్నాడు.
"ఏదయినా చెప్పటానికి వచ్చారా?"
"అవును! వివేక్ విషయం! చూశావుగా ఎలా మాట్లాడుతున్నాడో!"
"తప్పతాగి వంటి మీద తెలివిలేని వాళ్ళు ఎలా అయినా మాట్లాడుతారు"
"అలా కాదు!. వాడి మాటల్లో కొంత... కొంత కాదు. చాలా నిజం ఉంది వాడు ఎంత డిసిప్లైన్ గా ఉండేవాడో నీకు తెలుసు. అలాంటి వాడికి నీ కోడలే తాగుడు అలవాటు చేసింది. ఏదో మనసులో పెట్టుకునే ఈ పాడు అలవాటు చేసింది. బహుశాః వాడు తప్ప తాగి వళ్ళు తెలీకుండా ఉన్నప్పుడు ఈవిడ గారు తన మగస్నేహితులతో తిరిగేదేమో?"
"నేను నమ్మను...."
"అందుకే వివేక్ పింకూని వీడు నా కొడుకు కాడు! అంటున్నాడేమో?"
"నాకు లేదు... కానీ వాడు నీ నోట్లోంచి ఊడిపడ్డట్లుగా ఉన్నాడు. కానీ నీ కోడలి ప్రవర్తనతో వాడి మనసు చెదిరిపోయి ఉంటుంది. అందుకే అలా మాట్లాడుతున్నాడు. పోనీ నువ్వే ఒకసారి నీ కోడలితో మాట్లాడి విషయమేమిటో తెలుసుకోరాదూ?"
"మాట్లాడతాను. మీరు వెళ్లండి!" అంది కరుగ్గా.
చిన్నబుచ్చుకుని కుర్చీలోంచి లేచాడు దేవిశంకర్.
* * *
అత్తగారు గదిలోకి రాగానే మర్యాదగా లేచి నిలబడింది యశోద.
"మనలో మనకి మర్యాద లక్కరలేదు కూచో" పొడిగా అంది ప్రసూన. ఆ గొంతు ఎప్పటిలా లేదు అపస్వరాలు పలుకుతోంది కూచుంది యశోద.
గడియారం చూసుకుంది.
"క్లినిక్ కి వెళ్ళాలా?"
"అవును"
"పోనీ ఇప్పుడైనా మానేయకూడదూ?"
నవ్వింది అదే సమాధానమైనట్లు.
"నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా?"
"నేను మీకెప్పుడూ అబద్ధం చెప్పను"
"వివేక్ మొదటి నుంచీ తాగుబోతు కాడు. వాడికి పనిగట్టుకుని తాగుడు నేర్పించింది నువ్వేనని తెలిసింది. నిజమేనా?"
"నిజమే!"
"ఇలా వాడికి తాగుడు అలవాటు చెయ్యడంలో నీకు వేరే ఉద్దేశమేదైనా ఉందా?"
"ఉంది!"
"ఏమిటది?"
"క్షమించండి!"
మొదటిసారిగా కోడలి మీద పట్టరాని కోపం వచ్చింది ప్రసూనకి "నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్లు ఆనందించు. నేను కల్పించుకోను కానీ నీ ఆనందం కోసం వివేక్ జీవితాన్ని పాడు చెయ్యకు. ఇది ఘోరం"
నిరసనగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ పింకూని కూడా తీసుకుపోయింది ప్రసూన.
నిర్ఘాంతపోయి నిలబడిపోయింది యశోద..
12
జానీకి ఫోన్ చేసింది యశోద.
"ఇన్నాళ్లకి నేను గుర్తుకొచ్చానా? మీ అబ్బాయిని నాకు చూపించవా? ఎలా ఉన్నాడు? బాగా ఆడుతున్నాడా" అని గబగబా మాట్లాడేస్తున్నాడు.
అతడి నిష్కల్మష ధోరణిని మనసులో అభినందించుకుంది యశోద.
అతడు ఎంతోమంది అమ్మాయిలతో తిరిగే మాట యాదార్థమే కానీ మోసం, కపటం, కల్మషం, ఇతనిలో లేవు. ఆడ స్నేహితులతో కూడా అతడు "నేను వాళ్ళ టైప్ కాన"ని చెప్పేస్తాడు.
"అదంతా సరే. నేను ఇదివరకు నిన్ను కోరిన సాయం ఇప్పుడు కావాలి. అర్జంట్ గా...."
"వాట్! వాట్! నువ్వు నన్ను సాయం కోరుటా? నైన్త్ వండర్. నేను వెంటనే ఆ సాయం చెయ్యలేదా? అది టెన్త్ వండర్. పోనీ ఇప్పుడు చెప్పు యమ అర్జంటుగా చేసేస్తాను."
"మరిచిపోయావా? నీ జగదేకవీరుడితో మాట్లాడాలి....."
"వ్వాట్?"
జానీ లాంటి డాషింగ్ యువకుడు కూడా కొన్ని క్షణాలు వెంటనే మాటలాడలేకపోయాడు. అతను అస్వాభావికమైన లోగొంతుతో నెమ్మదిగా అన్నాడు "యశోదా! ఇది చాలా రిస్క్ స్టెప్. ఇప్పుడు నీవు తల్లివి కూడా అయ్యావు. ఈ గొడవలకి దూరంగా ఉండు. నీ సైకాలజీ రీసెర్చ్ నీ జీవితం కంటే గొప్పది కాదు. మీ మావ దేవిశంకర్ సామాన్యుడు కాడు. ఆ కొండచిలువ జోలికి వెళ్లకు. అమాంతం నిన్ను చుట్టేసి ఏ కొండకో నొక్కేసి నుగ్గు నుగ్గు చేసేయగలడు."
అది నిజమని తెలుసు యశోదకి. కానీ ఇప్పుడు ఈ సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్. ఆమెకు అకాడమిక్ రీసెర్చ్ కాదు. జీవితం కంటే ఎక్కువగా జీవస్మరణ సమస్యగా మారి కూర్చుంది. పింకూ పుట్టినప్పటి నుంచీ వివేక్ తాగుడు ఎక్కువయింది.
వివేక్ పూర్తిగా దుర్మార్గుడయితే, ఈర్ష్యతో తనని ఇంట్లోంచి తరిమేసి మరో పెళ్ళి చేసుకునేవాడు.... లేదా ఇంకేదైనా చేసేవాడు. చాలా మంచివాడూ, ఉదారుడూ అయితే సహనంతో నిజాలు తెలుసుకోవటానికి సహనంతో ప్రయత్నించేవాడు.
కానీ చాలామంది మనుష్యుల్లాగా అతడు అటూ, ఇటూ, కాని వాడు. పసివాడిని ద్వేషించగలిగే క్రౌర్యం లేదు. ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. వాడిలో స్పష్టంగా కనిపిస్తోన్న తల్లి ముద్రని చూసి, గర్వంతో పొంగిపోతాడు. కానీ రాజీపడలేడు.