"మీరెక్కువగా సెంటిమెంటు గల యితివృత్తాలూ, ప్రేమకథలూ రాస్తూ వుంటారని చెప్పుకుంటారు?"
"చెప్పుకోవటమెందుకు? నిజమే!"
"దానికి కారణమేమిటో తెలుసుకోవచ్చునా?"
ప్రమీలాదేవి నవ్వింది "నాకలాగే రాయటం చేతవచ్చు. అందుకని...."
కొంచెం వివరిస్తే బాగుంటుందేమో.....?
"ప్రపంచంలో రకరకాల మనుషులుంటారు. రకరకాల ప్రవృత్తులుంటాయి. తమకలవాటైన, స్వాధీనపడే, తేలిగ్గా లొంగే యితివృత్తాలు ఆయా మనుషుల నుండీ, ప్రవృత్తులనుండీ రచయిత తీసుకుంటూ వుంటాడు. నన్ను షిప్పింగ్ గురించీ, ఫిషింగ్ గురించీ రాయమంటే రాయగలనా? నేను మెడికల్ సబ్జెక్ట్స్ తీసుకుంటాను. అది డ్రైగా వుండకుండా ప్రేమ, సెంటిమెంట్ వున్న ఇతివృత్తాల్లో వాటిని యిముడుస్తాను. అదీకాక ప్రేమ అనేది అంటరాని వస్తువు కాదు. ప్రపంచ సాహిత్యంలో ఎక్కువ ప్రాచుర్యం పొందేవి ప్రేమ కథలే!"
"రచనల్లో సామాజిక స్పృహ వుండాలికదా?"
"సమాజంలో ప్రేమ లేదా?"
"అదికాదు. సమాజంలో ప్రజల్ని ఉత్తేజపరిచే సమస్యల్ని కళ్ళకు కట్టినట్లు రచయితలు చూపించాలి కదా?"
"అవి రాసేవాళ్ళు అవీ రాసుకోవచ్చు. ప్రజలను మేల్కొలిపి జ్ఞానోదయం చేస్తానంటే ఎవరు కాదంటారు?"
"అందరూ అలానే రాస్తేనే మంచిది కదా?"
"అప్పుడు జీవితం ఒక డాక్యుమెంటరీ సినిమాలా వుంటుంది. మొగుడూ పెళ్ళాల శృంగారం, ప్రేమ లేకుండా సీరియస్ గా జీవిత సమస్యల్ని చర్చించుకుంటూ అన్నం తింటున్నప్పుడూ, షికారుకు వెళ్ళినప్పుడూ, రాత్రుళ్ళు పడుకున్నప్పుడూ సీరియస్ నెస్ మెయిన్ టెయిన్ చేస్తే ఎలా వుంటుందో ఆలోచించండి....?"
ఇంటర్వ్యూ చేసే అమ్మాయి నవ్వసాగింది.
"పోనీ మీరు చెప్పండి. మీరెవర్నయినా ప్రేమిస్తే సరే-లేకపోతే అటువంటి ఆలోచనలు రావా? మీ మనసుని అటువంటి ఆకర్షణనుండి అరికట్టగలుగుతున్నారా?" ప్రమీలాదేవి సూటిగా అడిగింది.
ఆమె సిగ్గుపడింది. కలర్ టి.వి.లో ఎర్రబడిన ఆమె కపోలాలు మరింత ఎర్రగా గోచరించాయి.
"పోనీ చెప్పవద్దులే. బహుశా ఈ టీ.వీ. మీ తల్లిదండ్రులుకూడా చూస్తూండవచ్చు. దాచుకోండి."
ఆ అమ్మాయి ముసిముసిగా నవ్వింది.
"మీ పాపులారిటీకి కారణమేమిటి?"
"ఏ ఇతివృత్తం తీసుకున్నా, సహజంగా మలచగలగటం, సహజంగా రాస్తున్నాం గదా అని డ్రైగా రాయకుండా, వాటికి కొన్ని హంగులు చేర్చి, అలంకారం చేయటం. ప్రేమకోసం ప్రేమకథలు రాయకుండా, జీవిత సమస్యల్లోంచి ప్రేమ ఆవిర్భవించేలా చేయటం, అంటే రొటీన్ గా, యాంత్రికంగా కాకుండా, బయోలాజికల్ గా ఇతివృత్తం వెనుక అంతర్వాహినిలా ప్రవహిస్తూ వుండటం..."
ఇలా సాగింది ఇంటర్వ్యూ.
కార్యక్రమం అయిపోయాక రాజా, మాలతీ లేచారు. రూంలోకి వచ్చాక రాజా అన్నాడు ఆమెతో "సిస్టర్! మీరు నాకో సాయం చెయ్యాలి. రేపెలాగైనా ప్రమీలాదేవికి ఫోన్ చేసి, నేనిక్కడ వున్నానని చెప్పాలి."
"అలాగే. నేనింక వెళతాను. గుడ్ నైట్ సర్!"
"గుడ్ నైట్!"
మాలతి బయటకు వచ్చింది. ఆఫీస్ రూం దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ నరేంద్ర తన డ్యూటీ పూర్తి చేసుకుని ఆమెకోసం నిరీక్షిస్తున్నాడు.
"ఇహ వెళదామా?"
ఆమె తల ఊపింది.
ఇద్దరూ హాస్పిటల్ మెట్లు దిగి గేటుదగ్గరకు వచ్చారు. వాచ్ మన్ గేటు తెరిచాక నరేంద్ర పోర్టికోలోంచి దిజల్ట్ మిస్ట్ కలర్ ఫియట్ కారు బయటకు తీశాడు. మాలతి డోర్ తీసి, ఫ్రంట్ సీటులో అతని ప్రక్కన కూర్చుంది. కారు మెల్లగా కదిలి నరేంద్ర ఇంటివైపు పరిగెత్తసాగింది.
* * *
ప్రఖ్యాత రచయిత్రి ప్రమీలాదేవి స్ప్రింగ్ డోర్ తెరచుకుని గదిలోకి అడుగుపెట్టింది.
ఆమెను అక్కడిదాకా అనుసరించిన మాలతి మళ్లీ వస్తానని సెలవు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది.
"రండి" అన్నాడు రాజా బెడ్ మీద లేచి కూర్చుని సాదరంగా ఆహ్వానిస్తూ.
"రాజా! మీరేనా?" అన్నదామె ఎంతో ఆశ్చర్యంగా. ఆమె ముఖంలో ఆనందం పొంగి పొర్లింది.
"ఆ అమ్మాయి ఫోన్ చేసి రాజా అనే అతను మిమ్మల్ని చూడాలని ఎంతో ఉత్సాహపడుతున్నాడు. అతను మీకు తెలుసట. దురదృష్టవశాత్తూ పేషెంటు కాబట్టి అతను రాలేడు. మీరే రావాలని రిక్వెస్ట్ చేసింది. అంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేదు. మీరే అన్న అనుమానం కలిగింది....ఇన్నాళ్ళూ ఎక్కడున్నారు? కొంతవరకూ తెలిసినా వివరాలు తెలీవు. అసలేం జరిగింది? చెప్పండి?" అన్నదామె చాలా ఆతృతగా.
"ముందు కూర్చోండి. అన్నిటికీ సమాధానాలు చెబుతాను" అన్నాడు రాజా చిరునవ్వుతో. ఆ చిరునవ్వు వెనుక విషాదం ఆమె దృష్టిపథంనుండి తప్పించుకోలేదు.
మెడికల్ కాలేజిలో చదువుతున్న రోజుల్లో అతనికామె రెండేళ్ళు సీనియర్. రాజా క్లినికల్ సైడుకు రాకపోయినా అతను చాలా పాపులర్ ఫిగర్ అవటం చేత, కాలేజి మీటింగుల్లో, కార్యక్రమాల్లో రెండుమూడుసార్లు ఇద్దరూ కలసి పనిచెయ్యటంవల్ల బాగా పరిచయముంది. ఆమె అంటే రాజాకి గౌరవముంది. అతనంటే ప్రమీలాదేవికి అభిమానముంది.
"ఎంత దృఢంగా వుండేవారు? ఇలా చూస్తానని ఎప్పుడూ ఊహించలేదు" అన్నదామె అతన్ని పరిశీలనగా చూస్తూ బాధగా.
"నాక్కూడా అదే ఆశ్చర్యం - నా గురించి" అన్నాడు.
కొంచెం ఆగి "ఇప్పుడు చెప్పండి?" అన్నది.
"ఏమిటి?"
"మీ జీవితం"
"ఎక్కడ్నుంచి మొదలుపెట్టను?"