Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 3


    ఈ లోపల సిస్టర్ ఆక్సిజన్  పెట్టేసింది. లోపలకు  వెళ్ళి సెలైన్ స్టాండు ఆయాతో పట్టించుకు వచ్చి సెట్ కూడా తీసుకు వచ్చింది.

    నేను ఆమె చేతిలోని  సిరంజి తీసుకుని ముందుకు  వంగుతూండగా "మీరిస్తారా ? నన్నివ్వమంటారా ?" అంది. ఎందుచేతో  ఆమె మాటల్లో  మృదుత్వం, మార్దవం లేక కటుత్వమున్నట్లు  అనిపించింది నాకు.

    "ఎందుచేత ?" అన్నాను.

    "కొత్తగా వచ్చారు కదా, అనుభవం లేదేమోననీ" అంది నిర్లక్ష్యంగా.

    నేను నవ్వి "ఫర్వాలేదండీ. ప్రయత్నిస్తాను. నేను  ఫెయిలయితే మీరే స్టార్టు చేద్దురుగాని" అన్నాను.

    ఆ సమయంలో  వెనకటి ఓ సంఘటన నా స్మృతిపథంలో మెదిలింది.


                                                                  *    *    *

    నేను తర్డియర్ లోకి కొత్తగా వచ్చిన  రోజుల్లో  హాస్టల్లో  ఖాళీలేక బయట గదిలో వుంటున్నాను. ఒకరోజు మధ్యాహ్నం  ఇంటివారమ్మాయి నా గదికి వచ్చి "మీ దగ్గర సిరంజి వున్నదా ?" అని అడిగింది.

    "ఉన్నది" అని జవాబు చెప్పాను, పర్యవసానంగా ఆలోచించకుందా.

    "మా అమ్మకు డిశ్చార్జి ఓవర్ గా అవుతోంది. మా ఫ్యామిలీ డాక్టరు ఊళ్ళోలేరు. మందు మా ఇంట్లోనే వుంది. వచ్చి యింజక్షన్  నివ్వండి."

    నా గుండెల్లో రాయిపడింది. నా తొట్రుపాటు  పైకి కనిపించకుండా, బయటకు బింకంగా "అలాగే సిరంజి స్టెరిరైజ్ చేసి  తీసుకొస్తాను" అన్నాను.

    "త్వరగా  రండి" అని చెప్పి వెళ్ళిపోయింది.

    ఇహ నా అవస్థ ఏం చెప్పను ?ఎనాటమీ, ఫిజియాలజీ ప్యాసయిన  కొత్తలో చాలామంది విద్యార్ధులు అప్పుడే డాక్టర్ల మయిపోయామని  ఛాతీలు ముందుకు విరుస్తారు. తిరుపతికి పోయొచ్చేవారూ, సూట్లు కుట్టించేవాళ్ళూ, స్కూటర్లు కొనేవాళ్ళూ కోకొల్లలు! ఆ ఉత్సాహంలో నేను కూడా స్టెతస్కోపు మొదలైన వాటితోపాటు యింజక్షన్  సిరంజి  కూడా కొనేశాను అయితే వాటి నింతవరకూ  ఉపయోగించిన  పాపాన పోలేదు, అంత అవసరమూ రాలేదు.

    ఇప్పుడింక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. కాసేపు  గదిలో అటూ యిటూ పచార్లు చేసి, చివరికో యోచనవచ్చి  అద్దంముందు నిలబడి  సిరంజి చేతిలో పట్టుకుని  నా బుజంక్రిందుగా  డెల్టాయిడ్ కండరంలో  కాస్త గుచ్చుకుని చూసుకుని కుడిచేత్తో సిరంజి పట్టుకున్న  భంగిమ సరిగ్గా వుందా లేదా, చూసినవారికి  ఎబ్బెట్టుగా  కనిపించదుగదా  అని ప్రాక్టీస్ చేస్తుండగా, ఆ హడావుడిలో  సూది లోతుగానే దిగబడి "అబ్బా" అనిపించింది.

    తర్వాత  సిరంజి స్టెరిలైజ్ చేసి  యింటివారి  పోర్షన్ లోకి వెళ్ళి, యింటావిడకు  ధైర్యంగా  యింజక్షన్ చేసేశాను. చేసిన  మందేమిటో కూడా తెలియదు. ముఖంమాత్రం  అనుభవ మున్నవాడిలా  మహ గంభీరంగా పెట్టాను.

    సాయంత్రానికి యింటివారమ్మాయి  పరుగెత్తుకుంటూ వచ్చి  "మీరు యింజక్షన్ చేసిన చోట  అమ్మకి  యింత లావు వాచిందండీ, వచ్చి చూడండి" అంది.

    నా గుండెల్లో  రైళ్ళు పరుగెత్తాయి. "పదండి, చూద్దాం" అని బింకం ప్రదర్శిస్తూ  ఆమె వెనకాలే వెళ్ళాను.

    నిజమే, ఆమె చెప్పింది. చేసినచోట  కదుములా  కట్టి యింతలావు వాచీ వుంది. నేను ముట్టుకుని, అటు నొక్కి,ఇటు నొక్కి, యింతేనా అన్నట్లు ,తేలిగ్గా, "అబ్బే  యిదేం ఫర్వాలేదండీ. ఎందుచేతనో  మందు సరిగ్గా, ఎబ్ సార్బ్ అవక  అలా వాపు తేలింది. వేణ్ణీళ్ళ  కాపడం పెడితే అదే తగ్గిపోతుంది. అయినా నా ఎక్స్ పీరియన్స్ లో ఎప్పుడూ  యిలా  అనలేదు. ఆ మాట కొస్తే  నాకెప్పుడయినా  జ్వరం  వస్తే  నా యింజక్షన్ నేనే చేసుకుంటూ వుంటాను" అన్నాను.
    ఇంటివారమ్మాయి  ఆశ్చర్యంగా  కళ్ళు పెద్దవి  చేసి  చూసింది. ఈయన వంటిమీద యీయనే సూదెలా గుచ్చుకుంటాడు చెప్మా  అన్న భావం ,ప్రశంసా కనబడ్డాయి ఆమె చూపుల్లో.

    "బహుశా ఒకటయి  వుంటుందండీ. యింజక్షన్   చేశాక, గట్టిగా రుద్దలేదు మీరు. అందువల్ల గడ్డకట్టి  వుంటుంది" అన్నది బయటకు వచ్చాక.

    నాకు ఆసరా దొరికినట్లయి, "అవునవును. మరచిపోయినట్లున్నాను. అది కూడా ఓ కారణమై వుండవచ్చు" అన్నాను, నన్ను అపార్ధం చేసుకోనందుకు కొద్దిగా సంతోషిస్తూ.

    ఆ రాత్రంతా  అలజడితో నాకు నిద్ర లేదు. మరునాడు యింటావిడ వాపు తగ్గిందని చెప్పేదాకా నాకు మనశ్శాంతి లేదు.

    తర్వాత నా అల్పత్వానికి  నేనే ఒక విధమైన యిన్ ఫీరియారిటీ  కాంప్లెక్స్ ఫీలై  యీ లోటు నాలో వుందనుకున్నాను. నా గది వూడ్చే పనిమనిషికి 'నీకు ఒంట్లో  బాగులేదని చెప్పి  పది పదిహేను యింజక్షన్లు పొడిచి, మందులూ అవీ కూడా  నేనే కొని, ఆ తర్వాత  అది దాని భర్తను కూడ  'బలహీనంగా వున్నాడు  చూడం' డని  తీసుకువస్తే, అతని మీద రక్తనాళంలోకి  యివ్వడం  కూడా ప్రాక్టీస్ చేసి  యిన్ ట్రా వీనస్ కూడా నేర్చుకున్నాను. తర్వాత అవసరమున్నప్పుడు  యిరుగూ, పొరుగూ రావటం, నేను పొడుస్తూ వుండటం పరిపాటయి పోయింది.


                                   *    *    *

    అదంతా  గుర్తుకువచ్చి, నవ్వుకుంటూ  వెయిన్ లోకి సిరంజి గుచ్చాను. మొదటి ప్రయత్నంలోనే కృతకృత్యుణ్ణి కాగలిగి, సిరంజిలోకి  రక్తం త్రోసుకు వచ్చింది. అప్పుడు సూది మొదట్లో  చెయ్యి  నొక్కిపట్టి  వుంచి, సూది నుంచి సిరంజి  విడదీసి  గ్లూకోజ్ ఫ్లో అవుతూన్న  ట్యూబ్ సూదికి కనెక్ట్ చేశాను. సిస్టర్ దానిపై  ప్లాస్టర్ వేసి అంటించింది.

    ఎందుచేతనో  యీ సిస్టర్ కొంచెం  నిర్లక్ష్యంగా, అహంభావంగా వున్నట్లు కనిపించింది. తర్వాత  తర్వాత ఎన్నో సందర్భాలలో సెలైన్ పెట్టలేక  సతమతమవుతూంటే వెళ్ళి  సాయం చేస్తూ వుండేవాడిని.

    ఒకసారి కేసు లేమేమి  వున్నాయో  చూసుకుందా మనుకుంటుండగా వార్డులో చిన్న కలకలం  చెలరేగింది. "చీఫ్ వతున్నారు, చీఫ్ వస్తున్నారు" అన్న కంఠాలు వినిపించాయి.

    వార్డుకు చీఫ్ రౌండ్స్ కి వస్తున్నారంటే  ప్లాట్ ఫారం  మీదకు మెయిల్ బండి వస్తూన్నంత సందడిగా వుంటుంది.

    ఏప్రాన్ వేసుకుని  హుందాగా  లోపలకు  అడుగుపెట్టారు  చీఫ్ చక్రపాణి. ఆయన వెనుక అసిస్టెంట్ రామదాసూ, జగన్నాధం కూడా అనుసరిస్తూ వచ్చారు.

    చక్రపాణిగారు  చాలా  తెలివైనవారనీ, ఆయనది  చాలా చరుకైన  మెదడు అనీ, ఎమ్. డి. ఫస్ట్ ఛాన్సులో తెచ్చుకున్నాడనీ చెప్పుకుంటారు. కాని ఎందుచేతనో  ఆయనంటే  నాకు చాలా ఎలర్జీగా  వుండేది. ఆయన ఎత్తు పళ్ళూ, వగరుస్తూన్నట్లు  మాట్లాడే పద్దతీ నాకు నచ్చేవి కావు.

    నేను తర్డియర్  చదువుతూన్నప్పుడే, ఒకసారి క్లాసులో పాఠం చెబుతూ చెబుతూ మధ్యలో  చమత్కారంగా  ఒక తెలుగు సామెత చెప్పాడు. ఆయన తెలుగు మాట్లాడటం చూసి నేనాశ్చర్యపడి "అరె! ఈయన తెలుగు వాడేనా ఏమిటి ? తమిళు డనుకుంటున్నానే" అన్నాను  ప్రక్కవాడితో.

    సరిగ్గా  అదే సమయానికి  నేను మాట్లాడటం  ఆయన చూశాడు. "ఏమిటి మాట్లాడుతున్నావు ?" అనడిగాడు, వెంటనే, యింగ్లీషులో.

    నేను విధిగా  లేచి నిల్చున్నాను, తల వంచుకుని.

    "కాలేజిలో  నిన్న  జరిగిన  ఎలెక్షన్ల గురించా ? లేకపోతే కొత్తగా విడుదలయిన సినిమా గురించా ? ఏం మాట్లాడుతున్నావు చెప్పు" అన్నాడు.

    నా తల కొట్టేసినట్లయింది. సాధారణంగా బాల్యం  మొదలుకుని  అంతవరకూ  ఏ టీచరుచేత, లెక్చరరుచేతా  మాటపడలేదు.

    చేసేది లేక మెదలకుందా  తల వంచుకుని  నిలబడ్డాను.

    ఆయన చాలా వ్యంగ్యంగా  మాట్లాడా ననుకుంటాడు. అయిదు నిమిషాల సేపు ఏదో దండకం చదువుతూనే వున్నాడు. అందులోని  హాస్యాన్ని ఆస్వాదించి  ప్రక్క విద్యార్ధులు  నవ్వుతున్నారు. నా కళ్ళు  చీకట్లు క్రమ్మినట్లయి మాటలు వినపడటం మానేశాయి.

    అప్పట్నించీ  ఆయనంటే  నాకు మరీ ఎలర్జీ. మొత్తంమీద  చీఫ్, అసిస్టెంటులలో  ఒకరు అంటే నాకు పడని  యూనిట్ లో నేను పోస్ట్  చేయబడ్డాను. అయినా నాకు చికాకనిపించలేదు. ఎందుచేతో  నా కలాంటి సంఘటనలంటేనే  యిష్టం.

    లోపలకు  వస్తూనే  నా వంక  గంభీరంగా  చూసి "ఓహో! మీరున్నారా యిక్కడ ? కేసులన్నీ
 చూశారా ?" అన్నాడు.                

    "ఇంకా లేదండీ."

    "ఏం ? యిందాకటినుంచీ  ఏం చేస్తున్నారు ?"

    "ఓ.పి. నుంచి  వచ్చేసరికి  ఆలస్యమైంది. ఇంతలో  ఓ కేసుకు డ్రిప్ పెట్టాల్సి వచ్చింది."

    "ఆల్ రైట్, కమాన్."

    స్టాఫ్ యింతలో  నా చేతిలో ప్రిస్కిప్షన్  బుక్ కుక్కి, తను ఓ పుస్తకం తీసుకుని  అనుసరించసాగింది.

    ఒక్కొక్క బెడ్ దగ్గరా  ఆగి, పేషెంటుని  పరామర్శచేసి, అవసరమైన చోట  పరీక్ష  చేస్తున్నాడు. ఓపిక వున్న రోగులు  కూర్చుని  నమస్కారం  చేస్తున్నారు. ఓపికలేనివారు  పడుకునే  చేతులు  జోడిస్తున్నారు.ప్రిస్కిప్షన్ చెబుతూంటే  నేను  గబ గబ  రాసుకు పోతున్నాను.

    "ఈ కేసుకు పెన్సిలిన్  ఇవ్వాళ్టి నుంచీ ఆపుచేసి  సల్ఫా డిమిడిన్ పెట్టండి. వన్ టాబ్లెట్ టి.డి.ఎస్.... యిది సబ్ ఎక్యూట్ బాక్టీరియల్ ఎండో కార్డైడిన్. క్రిస్టిలిన్ పెన్సిలిన్  టెన్ లాక్స్ ఉదయం, సాయంత్రమూ మీరు వచ్చి యిస్తూ  వుండాలి....యీ కేసుకు ఒకరోజు లివర్  ఎక్స్ ట్రాక్ట్ ఒకరోజు బి. కాంప్లెక్స్ యిస్తూ వుండాలి....ఈ అమ్మాయికి రేపు ఉదయం బ్లెడ్  యూరియాకి బ్లడ్  పంపించాలి....ఈమె  ఎవరు ? కొత్తగా  ఎడ్మిట్ అయిన కేసా ? రొటిన్ యిన్వెస్టిగేషన్స్  అన్నీ చేయించండి. యూరిన్ ,షుగర్, ఆల్ బ్యుమిన్, పస్ సెల్స్_ అన్నీ  మీరే స్వయంగా చూడాలి. సిస్టర్స్ తో చేయిస్తే  కుదరదు. ఇది మెనింజైటిస్  కేసు. రేప్పొద్దున్నే  లంబార్ పంక్చర్ చేసి సి.ఎస్.ఎఫ్. రిపోర్టుకి పంపించండి....కేసు షీట్లు చాలావరకూ  ఖాళీగా  వున్నాయే. పోస్టింగ్ మారుతుందనే  సరికి  చివరి వారంలో  కేసు పూర్తి చేయాలి. రెండురోజుల్లో  అప్ టు డేట్ గా వుండాలి....ఈవిడ  వంతులవుతున్నా యంటూంది. యిది హార్టు కేసు. ఇవ్వాళ్టి నుంచీ  డిగాక్సిన్ ఆపు చేయండి....ఎందుకాపమన్నాను డిగాక్స్ ?"

    ప్రశ్న అనుకోకుండా  ఠక్కుమని  వచ్చింది. మామూలు ధోరణిలో చెప్పుకు పోతున్నాడనుకున్నాను గానీ, అది ప్రశ్న అనుకోలేదు. మరుక్షణంలో స్పురించి, వెంటనే తేరుకుని "వాంతులు డిగాక్సిన్ సైడ్ ఎఫెక్ట్....అందుకని" అని నసిగాను.
    "దట్స్ గుడ్....అరె ! ఈవిడ పరిస్థితి బాగులేదే" అంటూ  నేను డ్రిప్ పెట్టిన  కేసుదగ్గర  ఆగి, ఆమెను జాగ్రత్తగా  పరీక్ష చేశాక "ఏమిచ్చారు !" అనడిగారు.

 Previous Page Next Page