Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 4


    విచిత్రంగా అనిపించిందతనికి.

    "కొంపదీసి ఈ వేళ కూడా ఈ గదిలోనే చీకటి పడేవరకు ఉండాలా?..." లేచి కిటికీ దగ్గరికి నడిచి చువ్వలు పట్టుకుని బయటి వర్షంలోకి చూస్తూ అంది కన్య.

    ఆ సన్నని నడుమూ పొడుగ్గా వేలాడుతూన్న జడా అతనికి మతిపోగొడుతున్నయ్.

    "అప్పుడంటే భయపడ్డాంగాని, ఇప్పుడు రాత్రంతా ఇక్కడ గడిపినా హాయిగానే ఉంటుంది..." అలా అంటూంటే అతని గొంతులో మార్పు వచ్చింది-

    వెనక్కి తిరిగి అతనివంక ఓ క్షణం చూసింది కన్య.

    "ఓహో! ఇప్పుడు చాలా ధైర్యవంతుడివయావన్న మాట..." అంది నవ్వుతూ.

    "అవును!......" లేచి ఆమె దగ్గరికి నడిచాడు సామంత.

    "అప్పటికీ, ఇప్పటికీ నాకు ధైర్యమిస్తోంది నువ్వేగా...." అన్నాడు వెనుకనుంచి ఆమె రెండు భుజాలమీద చేతులు వేస్తూ.

    కన్య దిగ్భ్రాంతితో అతనివంక చూసింది. అతని చేతులు ఆమెని మైనపుబొమ్మలా అతనివేపు తిప్పుకొన్నాడు. బలంగా కన్యను తన గుండెలకు హత్తుకొన్నాడు. ఆమె పెదాలను అందుకోవడానికి ఆత్రుతగా ముందుకు వంగాడు. కన్య మందహాసం చేస్తూనే తల వెనక్కి వంచి, ఓ చేయి అతని గుండెలమీద ఉంచి వెనక్కి నెట్టింది నెమ్మదిగా. సామంత దెబ్బతిన్నట్లు ఆమెవంక చూశాడు.

    "మనం చిన్నవాళ్ళం కాదుగా, సామంతబాబూ! పెద్దవాళ్ళమయ్యాం.... మనిద్దరకూ సంసారాలున్నాయి..."

    ఛటుక్కున ఆమెను వదిలేశాడు సామంత.   

    తను తప్పు చేసినట్టూ, ఆమె తనను మందలించినట్టూ అనిపించి సిగ్గుపడ్డాడతను.

    "కోపం వచ్చిందా?" అతని చేతుల్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని నవ్వుతూ అడిగింది కన్య.

    అలా అంటూండగానే హఠాత్తుగా ఆమె కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్. ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చేయసాగింది.

    సామంత నివ్వెరపోయాడు. ఇంతలోనే ఏమయిందీమెకు?

    "ఏయ్, కన్యా! ఏమిటిది? ఏడు పెందుకు?" అన్నాడు ఖంగారుగా. కన్య వినిపించుకోలేదు. కింద పెదవిని పైసంటితో నొక్కిపట్టి దుఃఖాన్ని ఆపుకోవడానికి విఫలయత్నం చేసింది. రెండు చేతులతోను ఆమె ముఖాన్ని పట్టుకొని తనవేపు తిప్పుకొన్నాడు సామంత.

    "కన్యా!.... నేనలా చేశానని ఏడుస్తున్నావా?" అన్నాడు బాధగా.

    కన్య ఇక సంభాళించుకోలేకపోయింది. పూర్తిగా అతనిమీదికి ఒరిగిపోయి, అతని గుండెల్లో ముఖం దాచేసుకొంది.

    "నీకు తెలియదు, సామంతబాబూ! కలకాలం నీ గుండెల్లో చోటు చేసుకోవాలని పరితపించిపోయాను. చిన్నప్పటినుంచీ మనం గడిపిన పత్రిక్షణం, ప్రతి సంఘటనా మనసులో - భద్రపరుచుకొన్నాను. నువ్వు నన్నలాగే తలుచుకొంటావనీ, నా కోసం వస్తావనీ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాను. నాన్న నాకు పెళ్ళి చేయాలని ప్రయత్నించినా ఏడ్చి, వద్దని గొడవచేసి, తప్పించుకొన్నాను..."

    సామంత ఆ ప్రతిభుడయి వింటూండిపోయాడు. కొంచెం కొంచెంగా ఆమె మాటల భావం అతని కర్థమవుతూంది.

    "చివరికి మీ వివాహ పత్రిక వచ్చింది... మనం కట్టిన ఆ బొమ్మరింటి దగ్గర ఆ రాధాకృష్ణుల విగ్రహం చూసుకొంటూ ఎన్ని రోజులు ఏడ్చానో నీకు తెలియదు... చివరికి నాన్న బలవంతం మీద పెళ్ళికి ఒప్పుకొన్నాడు కాని, ఈ తోట... బొమ్మరిల్లు... ఈ పరిసరాలు, జ్ఞాపకాలు - వీటిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఇవెప్పుడూ నా కళ్ళముందు మెదలుతూండవలసిందే!..... రాత్రి నువ్వు నాన్నతో అంటూన్న మాటలు వింటూంటే నాకు గుండెలు ఝల్లుమన్నాయి. నీకు ఒకే ఒక్క మాట చెప్పాలని నిన్ను ఒంటరిగా కలుసుకున్నాను, సామంతబాబూ!  

    ఈ తోట నువ్వు అమ్మివేస్తే ఈ బొమ్మరింటినీ, నా అనుభూతుల్నీ ఆఖరికి నన్ను కూడా అమ్మేసినట్లే...."

    సామంత కళ్ళనిండుగా నిండిన నీటిని తుడుచుకొని ఆప్యాయంగా ఆమె వీపు నిమిరాడు. "ఇంక నేను వెళతాను... నాన్న వస్తారేమో...." అతనికి దూరంగా జరిగి కన్నీళ్ళు తుడుచుకొంటూ అంది కన్య.

    "ఇంత వర్షంలోనా? తడిసిపోవూ?"

    "ఫరవాలేదు. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకొంటాను.." అతని చేతుల్లోంచి తన చేతులు నెమ్మదిగా విడిపించుకొని అక్కడినుంచి వడివడిగా వెళ్ళిపోయిందామె. గేటు దాటేవరకూ ఆమెవంకే చూస్తూండిపోయాడు సామంత. అప్రయత్నంగా అతనికి దుఃఖం పొర్లుకొచ్చింది. మంచం మీదికి ఒరిగిపోయి చిన్నపిల్లాడిలా విలపించసాగాడు.

    వర్షం తగ్గింది. మబ్బులు మెల్లగా విచ్చుకోసాగినాయి. వెలుగు చీకటిని ముట్టడించింది.

    సామంత లేచి కూర్చున్నాడు. ఏదో నిశ్చయించుకొన్నవాడిలా గది బయటికొచ్చి తాళం వేసి చకచకా రంగన్న ఇంటివేపు అడుగులు వేశాడు. రంగన్న ఇంట్లోనే భార్యతోబాటు వంటపనితో హడావుడిగా ఉన్నాడు.

    సామంత సూట్ కేస్ లో విడిచిన బట్టలు సర్దుకొంటూ, "నేను వెళ్తున్నాను, రంగన్నా..." అన్నాడు.

    "ఎక్కడికి?" ఆశ్చర్యంగా అడిగాడు రంగన్న.

    "హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను... ఇప్పుడు ఇక్కడినుంచి ప్యాసింజర్ ఉంది విజయవాడకి..."

    "భోజనం చేసి వెళ్లమను, నాన్నా... సిద్ధంగా ఉంది..." అంది కన్య లోపలినించి.

    సామంత వినలేదు.

    రంగన్న సూట్ కేస్ తీసుకొని స్టేషన్ కి నడిచాడు.

    "భోజనం కూడా చెయ్యకుండా వెళ్ళిపోతున్నారేం, బాబూ? నా మీద ఏమీ కోపం కలగలేదు కదా?..." అన్నాడు రంగన్న బాధగా.

    "అదేం లేదు, రంగన్నా! అర్జెంటు పనొకటి గుర్తుకొచ్చింది... అంతే..." తేలిగ్గా నవ్వుతూ అన్నాడు సామంత. అతనికిప్పుడు ఉల్లాసంగా ఉంది.

    కొద్ది నిమిషాల్లోనే రైలు వచ్చింది. ఫస్ట్ క్లాస్ లో ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్నాడు సామంత.

    "మధ్యాహ్నం తోట చూడ్డానికి వాళ్ళెవరో వస్తారని చెప్పారు కదు, బాబూ!" అడిగాడు రంగన్న.

    "అవును, రంగన్నా, నేను మనసు మార్చుకొన్నాను! ఈ తోట ఎప్పటికీ అమ్మబడదని వాళ్ళకి చెప్పు...."

    రంగన్న ఆశ్చర్యానందాలతో సామంత వంక చూస్తూండిపోయాడు.

    రైలు కూతవేసి నెమ్మదిగా కదిలింది.

                                          * * * * *

 Previous Page Next Page