Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 5

                   
                                          రావణాసూరుడి బొమ్మ

    మరో అరగంటలో సామర్లకోట చేరుకుంటుంది రైలు. టైమ్ చూసుకొంటూ కూర్చున్నాను . ఆ రాత్రంతా ఎలాగోలా గడిపేను కానీ, ఆ అరగంట గడపడం మాత్రం దుర్లభమయిపోతోంది. ఒక్కొక్క నిముషం ఒకో గంటలా గడుస్తోంది. అంతవరకూ వేగంగా వెళ్తోన్న ఆ రైలు అకస్మాత్తుగా తాబేటిలా నడుస్తున్నట్లనిపించసాగింది. అసహనంగా వాచీవంక చూసుకొంటూ కూర్చున్నాడు. బయట ఇంకా చీకటిగానే ఉంది.

    "భగవంతుడా! రాజిని కాపాడు." మనసులోనే దేవుడిని ప్రార్థించుకొన్నాను. అలా అనుకుంటోంటే నా కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్. జేబులోని టెలిగ్రామ్ తీసి మరోసారి చదివాను. "రాజికి సీరియస్ గా ఉంది. వెంటనే బయల్దేరు." అంతకుముందు రోజు ఉదయం ఇచ్చిన టెలిగ్రామ్ అది. మరిప్పుడు పరిస్థితి మెరుగయిందో, మరింత క్షీణించిందో! రైలు నెమ్మదిగా ఆగిపోయింది. బయట స్టేషనేమీ కనిపించటంలేదు. బహుశా సిగ్నల్ ఇవ్వలేదేమో! ఆ ఆలస్యం నన్ను మరింత కృంగదీస్తోంది. అయిదు నిమిషాల తర్వాత మళ్ళీ బయల్దేరింది రైలు. సామర్లకోట దగ్గరవుతున్న కొద్దీ రాజిని గురించిన ఆలోచనలు, సాతస్మృతులు క్రిక్కిరిసిపోతున్నాయ్ నాలో. రాజి మావయ్య కూతురు. నాకంటె నాలుగయిదేళ్ళు చిన్నదనుకుంటాను.

    ఆమె పుట్టిన సంవత్సరానికే అత్తయ్య చనిపోయింది. అప్పుడే రాజిని తనతోపాటు మా ఇంటికి తీసుకొచ్చేసింది మా అమ్మ. రాజిని చూస్తూనే నేనూ, అక్కయ్యా, చెల్లాయీ అందరం ఆశ్చర్యపోయాం. అప్పటికే రెండేళ్ళ పిల్లలా కనిపించేది. మా అందరికంటె బలంగా ఉండేది. అప్పటికే నడిచేయడం చూసి మావాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మూడేళ్ళ కే దానికి మాటలన్నీ వచ్చేశాయ్. అయిదేళ్లు వచ్చేసరికి రూపు కూడా మారిపోయింది. పెద్ద పెద్ద కళ్ళూ, కోలమొహం, చిన్న నోరూ, కళ్ళు కనిపించకుండా మొహంమీదకు పడే జుట్టూ నాకు భయంగా ఉండేదెందుకో దాన్ని చూస్తూంటే. నాకంటె చిన్నదయినా మా ఇద్దరినీ చూస్తే ఆ విషయం ఎవరూ నమ్మేవారు కాదు. నేనే దానికంటే చిన్నవాడినని అనుకొంటూండేవాళ్ళు.  

    అది మొదటి కారణం - రాజి అంటే నాకు అయిష్టం కలగడానికి. రెండోది దాని ప్రవర్తన! తను నిజంగానే నాకంటె పెద్దదానిలా ప్రవర్తించేది. నన్ను ఏదొక సాకు తీసుకొని మందలిస్తూండేది. నేను మా ఇంటి చుట్టుప్రక్కల కుర్రాళ్ళందరితో రాజూ - దొంగా ఆటలాడుకొంటూంటే తనూ వచ్చి జొరబడి ఆడేది. సాధారణంగా నేనూ, శీనుగాడూ, చంద్రంగాడూ దొంగల వేషాలు వేసేవాళ్ళం. శంకరం, రాధాగాడూ, రాఘవరావూ రాజులుగా ఉండేవాళ్ళు. మిట్టమధ్యాహ్నం రెండింటికి అందరం పెద్దాళ్ళకు తెలీకుండా మా ఇంటి వెనుక ఉన్న సరుగుడు తోటలోకి రహస్యంగా ఓ సంకేత స్థలంలోకి చేరుకుని ఆడుకునేవాళ్ళం. తీరా ఆట ప్రారంభించబోయే సమయానికి, ఎక్కడినుంచి వచ్చేదో తనూ వచ్చి నిలబడేది రాజి. దాన్ని చూడగానే మాకందరికీ పై ప్రాణాలు పైనే పోయేవి. "నేనూ ఆడతాను" అనేది మా అందరివేపూ నిర్లక్ష్యంగా, బెదిరింపుగా చూస్తూ. దాని పొగరు చూస్తూంటే నాకు కడుపు రగిలిపోయేది.

    "వద్దు" అనడానికి మాకెవరికీ దమ్ముల్లేవు. ఎందుకంటే మేమంతా అలా ఆ ఎండలో పడి సరుగుడు తోటల్లో ఆడుతున్నట్లు మా పెద్దాళ్ళతో చెప్పేస్తుంది. దాంతో మాకు దెబ్బలు తప్పవు. ఈ విషయం అందరికీ తెలుసు. పోనీ ఆడనిద్దామా అంటే ఒక పార్టీలో ముగ్గురు, మరో పార్టీలో నలుగురయిపోతారు. అదీగాక సరుగుడు బెత్తాలతో మేము చేసే యుద్ధంతో ఆడపిల్ల పాల్గొనడం మాకిష్టంలేదు. ఏమీ చేయలేక దాన్ని రాజులపార్టీలో వేసేవాళ్ళం. ఆట ఆఖర్లో పాల్గొనడం మాకిష్టంలేదు. ఏమీ చేయలేక దాన్ని రాజులపార్టీలో వేసేవాళ్ళం. ఆట ఆఖర్లో రాజులకూ దొంగలకూ మావూరి టూరింగ్ సినిమా హాల్లోని సినిమాలోలా జరిగే కట్టి యుద్ధం మేమూ చేస్తూంటే రాజి తానో బెత్తం తీసుకొని మా వెనుకనుంచీ అందరినీ నిజంగానే చావబాదేసేది. అలా నిజంగా బాదకూడదని ఎన్నిసార్లు చెప్పినా నిష్ప్రయోజనమే అయేది. చాలాసార్లు మా అందరి వొళ్ళూ వాతలు తేలిపోయేవి. తిరిగి దాన్ని కొట్టాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం అయ్యేది కాదు. రాకెట్లా దూసుకుని పారిపోయేది. దాన్ని వెంబడించి అందుకోగల శక్తి మాలో ఎవరికీ లేదు. దాని బాధపడలేక కొద్దిరోజుల్లోనే మేమా ఆట కట్టివేశాం. గోళీలాటయితే అది మా జోలికి రాదనీ, ఒకవేళ వచ్చినా దానికా ఆట రాదు కాబట్టి రాజిని తేలిగ్గా ఓడించి మోచేత్తో దేకించ వచ్చనీ, అలా చేస్తే రెండోసారి అది మా జోలికి రాదనీ నిర్ణయించుకొని మర్నాడు అందరం గోళీలు నేర్చుకుని ఆట మొదలెట్టాం. మామూలుగానే సమయానికి వచ్చి నుంచుని నేనూ ఆడతానంది రాజి తనదగ్గరున్న గోళీ చూపిస్తూ. అసలు ఆ రోజు మేము గోళీలాట ఆడాలని నిర్ణయించుకున్నట్లు దానికెలా తెలిసిందో మాకెవ్వరికీ అర్థం కాలేదు. తర్వాత కూడా మాదే ఘోర పరాజయం. ఒక కన్ను మూసి ఖచ్చితంగా గురి చూసి మా గోళీలను ఆమడ దూరం పోయేట్లు కొట్టటం మొదలుపెట్టింది. రాజికి తప్ప మిగతా మా అందరి మోచేతులూ చర్మం లేచేట్లు గీరుకుపోయినయ్యా రోజు. మా అందరికీ మతిపోయినట్లయింది. "ఈ గొడవంతా ఎందుకు? అసలు మనం మధ్యాహ్నం పూట ఆటలాడవద్దు" అన్నాడు చంద్రంగాడు ఏమీ చేయలేక. అదే మంచిదని అందరం వారం రోజులపాటు ఇళ్ళు కదలడం మానివేశాం. అవకాశం దొరికితే ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూడసాగాను నేను. అప్పుడే మా కోసమని కేరమ్ బోర్డ్ కొనుక్కొచ్చారు నాన్నగారు. నేనూ, చెల్లీ ఓవేపూ, అక్కా, రాజి మరోవేపూ ఉండి ఆడాము. ఆడిన ఎనిమిది గేముల్లోనూ అయిదు గేములు గెల్చుకొందది. దానిచేతిలో ఏముందోగాని అది కొట్టిన ప్రతి కాయినూ బీరుపోకుండా పాకెట్ అయేది. ఆ రోజు నుంచీ అదంటే ఓ విధమయిన ద్వేషం కూడా మొదలయింది నాలో. నేను ఓడిపోతున్నందుకు కాదది. గెలిచినప్పుడల్లా, నావంక అదోరకంగా ఠీవిగా, గర్వంగా చూసేదది. మేమిద్దరం సింగిల్స్ అడినప్పుడు నా పని మరీ ఘోరంగా ఉండేది. రెండు స్ట్రయికుల్లోనే బోర్డ్ క్లీన్ అయిపోయేది. అప్పుడు దాని చూపునుంచి తప్పించుకోడానికి నానా అవస్థాపడేవాడిని. తరువాత అసలు అది ఉన్నప్పుడు ఆడడం మానేసేవాడిని. రానురాను దాని ఎదుటపడి తిరగడానిక్కూడా మనస్కరించేది కాదు నాకు. నేను ఫోర్త్ ఫారం కొచ్చేసరికి రాజి ఫస్ట్ ఫారంలో చేరిపోయింది. రాజి బాధ నాకొక్కడికే కాదు. అమ్మా, అక్కయ్యా, చెల్లీ అందరూ విసుక్కొంటూనే ఉండేవారు. రాజి అల్లరిని  తగ్గించడానికి అమ్మ ఎన్నో ప్రయత్నాలు చేస్తూండేది. ఎంత అల్లరిచేసినా, తల్లి లేనిదవడం వల్ల అదంటే వల్లమాలిన ప్రేమ అమ్మకి. ఒక్కనాడు కూడా కొట్టలేదు. రాజికి మాత్రం రోజుకో గొడవ చేయకపోతే నిద్రపట్టేది కాదు. ఓ రోజు హాల్లోని అద్దం పగులకొట్టేసింది. అది చాలా ఖరీదయిన అద్దం. కావాలని లోతుగా ఉన్న నూతిలో బక్కెట్లు పడేసి చెప్పకుండా ఊరుకొనేది. మరో రోజు రెండు అందమయిన గాజుప్లేట్లు దాని చేతిలో ముక్కలయిపోయాయ్. వాటిని నాన్నగారు కలకత్తా నుంచి తెప్పించారు. మరో రోజు చక్కని అలారం టైంపీస్ రాజి చేతిలో నుంచి జారి కిందపడి ముక్కలయిపోయింది అద్దం. ఆ తరువాత అది పనిచేయడం మానేసింది. ఓసారి జరిగిన సంఘటన ఇంకా కళ్ళకు కట్టినట్లే గుర్తుంది... ప్రక్కింటి వాళ్ళ పెరట్లోని జామచెట్టు మీద జామకాయలు రాల్చడానికని రాళ్ళు రువ్వడం మొదలుపెట్టింది. అందులో ఓ రాయి వాళ్ళ గడపలో నుంచున్న పక్కింటి కుర్రాడికి తగిలి నెత్తికి పెద్ద గాయమయిపోయింది. ఆ యింటి వాళ్ళు కోపం పట్టలేక అమ్మని నానామాటలూ అని వెళ్ళారు. అమ్మ రాజిని దగ్గరకు తీసుకొని "ఇంత రాలుగాయివేమే," అని కన్నీరు పెట్టుకొంది.

    సెకండ్ ఫారం కొచ్చేసరికి రాజిమీద నాకు ద్వేషం మరింత ఎక్కువయిపోయింది. హైస్కూల్లోకూడా మా స్నేహితులు ఏమేం చేస్తుందీ, ఎక్కడెక్కడ తిరుగుతుందీ అన్నీ సీక్రెట్ ఏజంట్లా కనిపెట్టి అమ్మకు చెప్పేస్తూండేది. అప్పట్లోనే రాజికి నాకూ ఘోరమయిన యుద్ధం కూడా జరిగింది. ఆ రోజు మానాన్నగారు మాంఛి బొమ్మల కథల పుస్తకం తెచ్చిచ్చారు నా కోసం. తీసుకొని ఒక్కొక్క పేజీ చూస్తుంటే నా దగ్గరకొచ్చి "ఆ పుస్తకం ఇటివ్వు " అంది రాజి. నాకు కంపరం పుట్టుకొచ్చింది. "ఇవ్వను" అన్నాడు కోపంగా.   

    హఠాత్తుగా ముందుకి వంగి నాచేతిలోని పుస్తకం లాక్కుని పరుగెత్తసాగింది. గట్టిగా పట్టుకోవడం చేత ఆ పుస్తకం అట్టమాత్రం నా చేతిలో మిగిలిపోయింది. అలా చిరిగిపోయినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. అది నాన్నగారికి చూపిస్తే రాజిని చావడగొడతారని నాకు తెలుసు.

 Previous Page Next Page