Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 3


    "కన్యా..." అన్నాడు ప్రయత్నంగా లేచి నించుంటూ.

    కన్య బిడియంగా నవ్వింది. "ఆ విగ్రహం నీ కింకా గుర్తుందా, సామంత బాబూ..."

    సామంత చేతిలోని విగ్రహం ముక్కలు విసిరిపడేసి, చేతుల కంటిన మట్టి దులుపుకొంటూ నవ్వాడు.

    "నిజంగా ఇక్కడి కొచ్చేవరకూ ఏమీ గుర్తులేదు. బొమ్మరిల్లు చూసేసరికి ఆ విగ్రహం గుర్తు కొచ్చింది."

    ఎందుచేతనో అతనికి తను పెద్ద తప్పుచేసినట్లు అనిపించసాగింది.

    వర్షం చినుకులు పెద్దవయాయ్. మబ్బులు మూసుకొని, ఉన్న వెలుగుని కూడా హరించడానికి ప్రయత్నిస్తున్నయ్.

    "అలా వసారాలో నించుందాం, సామంతబాబూ! వర్షం ఎక్కువవుతోంది..." అంది కన్య గడివేపు వడివడిగా అడుగులు వేస్తూ. ఆమె వెనకే తనూ నడవసాగాడు సామంత.

    అప్పుడూ ఇంతే! పెద్ద ఆరిందాలా లంగా, జాకెట్టూ వేసుకొని ప్రతి పనికీ కన్యే ముందు నడిచేది. తను వెనుక.

    కన్యలో ఇంత మార్పు ఉంటుందని తను ఊహించలేదు. ఆమె ఇంత అందంగా, ఆకర్షణీయంగా ఉండగలదని కూడా అనుకోలేదు.

    గది బయటే వసారాలో గోడ కానుకొని నిలబడింది కన్య.

    సామంత ఆమె కెదురుగా చెక్క ట్రెల్లిన్ మీద కూర్చున్నాడు.

    "నువ్విక్కడే ఉన్నావన్న సంగతి నాకు తెలియదు కన్యా. ఉదయం కూడా ఇంట్లో కనిపించలేదు కదా...."

    "కనిపించకూడదనే అనుకొన్నాను సామంతబాబూ! కానీ... తప్పలేదు..."

    "అదేమిటి?" అనుమానంగా అడిగాడు సామంత.

    నవ్వేసింది కన్య.

    "అది సరేగాని, సామంతబాబూ! ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నేనెప్పుడయినా గుర్తుకొచ్చానా?"

    ఏం చెప్పాలో తెలియలేదు సామంతకి నిజానికి ఆమెని ప్రత్యేకంగా గుర్తు చేసుకొన్న సందర్భాలేమీ అతనికి జ్ఞాపకం లేదు.

    "గుర్తుకు రాకపోవడమేమిటి??.." అంటూ నసిగాడు.

    "మీ నాన్నగారు వస్తూండటం వలన నీ సంగతులన్నీ తెలుసుకొంటూనే ఉండేదాన్ని. పెద్ద చదువులు చదవడం, ఉద్యోగంలో చేరడం, పెళ్ళి చేసుకోవడం, పిల్లల్ని కనడం..." నవ్వుతూ అంది కన్య తలవంచుకొని.

    సామంతకి నవ్వుతోబాటు ఆశ్చర్యం కూడా కలిగింది.

    తన సంగతులన్నీ తెలుసుకుంటూనే ఉందన్నమాట. తండ్రి ఒకటి, రెండుసార్లు ఆమె గురించి చెపితేగాని , అసలామె గుర్తుకి రాలేదు తనకి.

    వర్షం బాగా పెద్దదయిపోయింది. ఉండి ఉండి చలిగాలి రివ్వున కొడుతూంది. బంగాళాపెంకులమీద నుంచి వర్షపునీళ్ళు కిందికి ధారలుగా జారుతున్నాయి, ఆ గది చుట్టూ!

    "ఈ ముసురు వదిలేట్లు లేదు. పద. లోపల కూర్చుందాం!" అన్నాడు సామంత. ఇద్దరూ లోపలికి నడిచారు.

    మంచంమీద దుప్పటి దులిపివేసి కూర్చున్నాడు సామంత. కన్య టేబుల్ దగ్గరున్న కుర్చీ అతని కభిముఖంగా తిప్పుకొని కూర్చుంది.

    "ఓసారి ఇలాగే పెద్ద గాలీ వానా వచ్చింది - గుర్తుందా, సామంతబాబూ! ఇద్దరం ఇలాగే బాగా చీకటి పడిపోయేవరకూ ఈ గదిలో చిక్కడిపోయాం."

    ఠక్కున గుర్తుకొచ్చింది సామంతకి.

    ఆ రోజు స్కూలుకి సెలవు. పెద్దగాలి వర్షపు చినుకులుగా ఉన్నా ఇద్దరూ తోటలో బొమ్మరింటి దగ్గర ఆడుతూ కూర్చున్నారు. సాయంత్రానికల్లా వర్షం, గాలి ఉధృత మయిపోయాయ్. ఆ గాలిలో ఇంటికెళ్ళాలంటే ఇద్దరకూ భయమేసింది. ఇద్దరూ గదిలో కిటికీ దగ్గర కూర్చుని వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని భయంగా ఎదురుచూస్తూ గడిపారు. బాగా చీకటి పడ్డాక రంగన్న లాంతరు తీసుకొచ్చి ఇద్దరినీ ఇంటికి చేర్చాడు.   

    "అవునవును, భలే భయం వేసిందిలే నాకా రోజు..." అన్నాడు సామంత.     

    ఉప్పెనలా నవ్వింది కన్య.

    నవ్వుతున్నప్పుడు మరింత అందంగా తయారయినా ఆమె రూపం సామంతని సమ్మోహితుణ్ణి చేసింది. గాలికి పైట ఎగిరెగిరి పడినప్పుడల్లా ఆమె ఉబికిన వక్షస్థలం కనిపించి అతనిలో వేడిగా కోర్కెలు రగులుకొంటున్నాయి. ఇంత అందమైన కన్యతో అన్నేళ్ళు గడిపి, ఆమె అందాన్ని గుర్తించలేకపోయాడే తను! నిజంగా తను గుడ్డివాడు. కన్య ఇప్పుడు తనమీద కలిగిస్తున్న ప్రభావం అప్పుడే కలిగించి ఉంటే, ఆమెను అనుభవించకుండా వదిలేవాడు కాదు! ఇప్పుడు తనకీ వివాహం అయింది. ఆమె కూడా వివాహితురాలు.   

    అయితేనేం?

    సామంత గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. తల ఎత్తి కన్య వంక చూశాడు.

    కన్య ఇంకా నవ్వుతూనే ఉంది.

    అందమైన ముఖం, చక్కని పలువరస, ఎర్రని పెదాలు, పొట్ట దగ్గర జానెడు మేరకు నగ్నంగా కనబడుతూన్న శరీరం....

    పిచ్చెక్కించేస్తున్నాయి.

    "మీ ఆవిడ గురించి ఏమీ చెప్పలేదేం? అందంగా ఉంటుందా, లేక నాలా అనాకారా?"

    సామంత సిగ్గుగా నవ్వి ఊరుకొన్నాడు.

    "నువ్వు చాలా అందంగా ఉన్నావు, కన్యా! ఈ అందమంతా అప్పట్లో ఎక్కడ దాచావో తెలియటం లేదు..." అన్నాడు కొద్ది క్షణాలాగి.

    కన్య మాట్లాడలేదు. అతనిమీద నుంచి చూపు మరల్చి మరోవేపు చూడసాగింది.

    "అన్నట్లు, మీ ఆయన గురించి ఏమీ చెప్పవేం? ఏం చేస్తుంటాడు?"

    "గుమ్మడిపాడులో పొలం కౌలుకి చేస్తుంటాడు. అప్పుడప్పుడూ వచ్చి, ఒకటి, రెండు రోజులుండి వెళ్ళిపోతుంటాడు..."

    "అదేం? నువ్వు కాపరాని కెళ్ళలేదూ?"

    "ఊ హు!..."

    "ఎందుకని?..." సంభ్రమంతో అడిగాడు సామంత.

    "ఈ ఊరు.. ఈ తోట... వీటిని విడిచి నేనుండలేను, చినబాబూ! అదేమిటో పిచ్చి అనుబంధం..."    

 Previous Page Next Page