Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 3


    అతనాశ్చర్యపోయి "బలే డాషింగ్ గర్ల్ లా వున్నావే! ఎందుకు నా పేరు నీకు?" అన్నాడు.

 

    "పరిచయాలు చేసుకోవాలి కదండీ. ముందు ముందు ఎందుకయినా పనికి వస్తాయి."

 

    "అలాగా?" నా పేరు సోమలింగం."

 

    "గ్లాడ్ టు మీట్ యూ సోమలింగంగారు. మీరు నాకంటే ఎంత సీనియరో తెలుసుకోవచ్చా?"

 

    "మనం సెకండియర్ చదువుతున్నాం."

 

    "మనం అంటే...? ఓ రాయల్ ఉయ్- ఆ? అంటే మాకంటే ఓ ఏడాదే అన్నమాట ఎక్కువ. అంటే నిరుడీ టైముకి మీరు... మొత్తంమీద అనుభవం సంపాదించేశారు."

 

    "ఏయ్! అధికప్రసంగం చేస్తున్నావే! దీనికి పనిష్మెంట్ ఏమిటో తెలుసా?"

 

    "సెలవియ్యండి సార్. మనం రెడీగావున్నాం."

 

    "నువ్వు నాతో క్యాంటీన్ కి రావాలి. మేము తినేవన్నీ ఇప్పించాలి."

 

    "ఓహో! మీ పనిష్మెంట్ రిఫ్రెష్ మెంట్సా? పదండి స్వామీ."

 

    అతనూ, ఇంకో అయిదారుగురు సీనియర్సూ కలిసి మాధవి ఒక్కతెనూ క్యాంటీన్ కు తీసుకెళ్ళారు.

 

    "నాకు ఇడ్లి."

 

    "నాకు దోసె."

 

    "నాకు ఉప్మా."

 

    అందరూ తలొకటి ఆర్డరిస్తున్నారు.

 

    "ఏమండీ సోమలింగంగారూ మీకేం కావాలి! చెప్పండి?" అతని ముఖం ఎర్రబడింది. "నా పేరు సోమలింగమా...?"

 

    "మీరేకదుసార్ చెప్పారు. కాని మీ పర్సనాలిటకి తగ్గట్లు లేదండీ పేరు. అన్నట్లు మన ఇంటి పేరేమిటండీ!"

 

    "ఏయ్! అధికప్రసంగం చాలించి నాకు ఇడ్లీ సాంబారూ పట్టుకురా."

 

    "అలాగే సార్. కాని... మనలో మనమాట- మనకి ఇడ్లీసాంబారు అంటే ఇష్టమా అండీ?"

 

    "ఏయ్! అధికప్రసంగం చెయ్యొద్దన్నానా?"

 

    "అలాగే సార్. మీ ఇష్టప్రకారమే చేద్దాం" అని మాధవి కౌంటర్ దగ్గర డబ్బులిచ్చి కూపన్లు తీసుకుని ఎవరికి ఏం కావాలో అన్నీ చకచకా సప్లయ్ చేస్తోంది.

 

    "ఏమండోయ్ ఇడ్లీ సాంబార్ గారూ."

 

    అతను కళ్ళెర్రజేసి చూశాడు "ఏయ్ నా పేరు-"

 

    "సారీ! సోమలింగంగారూ! ఇంకో ప్లేటు ఇడ్లీ, సాంబారు తెమ్మంటారా?"

 

    "ఊ. పట్రా."

 

    "అలా చెప్పండి సార్ ఆర్డరూ" అని మాధవి మళ్ళీ కౌంటర్ దగ్గరకు పరిగెత్తింది.

 

    "ఒరేయ్ రాజా! ఈ అమ్మాయి ఎవర్రా అద్వితీయురాలి వుంది. జంకూ గొంకూ లేకపోగా డైలాగ్ మీద డైలాగ్ కొడుతుందేమిటి?"

 

    "పైగా నువ్వేమో ఏడిపించటానికి అంటే నిన్ను సోమలింగాన్ని చేసేసిందేమిటి?"

 

    "చెబుతా. ఈ రాజా అంటే ఏమిటో అనుకుంటోంది. ఈ మాధవిని సోమమ్మని చేసి కూర్చోబెట్టకపోతే నా పేరు..."

 

    "ఏమండోయ్ సోమలింగంగారూ! ఇదిగో ఇడ్లీ, సాంబార్." అంటూ మాధవి ప్లేటు అతని ముందుంచింది.

 

    "ఇదిగో! నీకు పాడటం వచ్చా?" అనడిగాడు రాజా.

 

    "ఒక్కపాటేమిటి? డాన్స్, వీణ, తబలా, మృదంగం, సితార్, గిటార్ మనకురాని విద్యలేదు సంగీతంలో. క్లాసికల్, లైట్ మ్యూజిక్ రెండూవచ్చు. అయితే ఒక్కటే చిక్కు. మనం కూడా ఆప్యాయంగా ఇప్పుడే తిన్నారా? అవన్నీ... చెప్పండి మొదలుపెట్టమంటారా?"

 

    "ఒరేయ్ ఒద్దని చెప్పరా! నాకసలే నాసియా, వామిటింగ్ ఎక్కువ" అని రహస్యంగా బ్రతిమాలాడు రాజాను ఒక ఫ్రెండ్.

 

    "నేను పాడమంటే పాడాలి. అంతేగాని నీ ఇష్టప్రకారం కాదు."

 

    "పోనీలెండి. డాన్స్ చెయ్యమంటారా? భారతనాట్యం, కూచిపూడి, కథాకళి, జపపద నృత్యాలు..."

 

    "ఏదీ! చెయ్యి చూద్దాం" అన్నాడు రాజా కోపం వచ్చి.  

 

    రెడీ? వన్... టూ... త్రీ."

 

    "ఒరేయ్ వద్దని చెప్పరా. నాకసలే ఎలర్జీ, నాసియా, వామిటింగ్..." అన్నాడు ఇందాకటి ఫ్రెండ్ మళ్ళీ బ్రతిమిలాడుతూ.

 

    మాధవి నిజంగా డాన్స్ చెయ్యటానికి ఆయత్తపడి చేతులు గాలిలో కదిలిస్తూ భంగిమ మార్చుకుంటోంది.

 

    "ఇప్పుడు కాదు. ఆపు" అన్నాడు రాజా.

 

    "ఇప్పుడు కాక మరెప్పుడు?" అనడిగింది మాధవి.

 

    "అది మేము చెప్తాం" అన్నాడు రాజా.

 

    "అప్పుడు మేము చేస్తాం" అంది మాధవి.

 

    "ఇహ రండి పోదాం" అని లేచాడు రాజా స్నేహితులతో.

 

    ఆ రోజు క్లాసులేం జరగలేదు. ఒక్కొక్క డిపార్ట్ మెంటుకూ సంబంధించిన ప్రొఫెసర్లు వచ్చి వైద్యవిద్య ప్రాముఖ్యతను గురించి వివరించి స్టూడెంట్స్ కు ఇన్ స్పిరేషన్ ఇస్తూ మాట్లాడి ఉత్సాహపరిచారు.

 

    "రేపట్నుంచీ మీకు క్లాసులు మొదలవుతాయి. ఎనాటమీలో డిసెక్షన్ వుంటుంది. ఫిజియాలజీ ప్రాక్టికల్స్ కూడా వుంటాయి. ప్రాక్టికల్స్ కి వచ్చేటప్పుడు మీరు ఏప్రాన్స్ వేసుకురావాలి" అని అన్నారు.

 

    మధ్యాహ్నం మాధవి, కల్యాణి కలిసి బజారు వెళ్ళారు. బట్టలషాపులో ఏప్రాన్ కి కావాల్సిన క్లాత్ తీసుకుని అక్కడ్నుంచి వాళ్ళు డైరెక్టు చేసిన టైలర్ దగ్గరకెళ్ళారు.

 

    టైలర్ షాప్ మెడికల్ స్టూడెంట్లతో కిటకిటలాడుతోంది. సూటూ, బూటూ వేసుకుని, టై కట్టుకొని ఆ టైలరే పెద్ద ప్రొఫెసర్ లా వున్నాడు.

 

    కొలతలు తీసుకుంటున్నంతసేపూ వసపిట్టలా వాగుతూనే వున్నాడు.

 

    "ఈ ఊళ్ళో నాలా ఏప్రాన్స్ ఎవరినైనా కుట్టమనండి- ఛాలెంజి చేస్తాను. మెడికల్ స్టూడెంట్స్ కెలా కుట్టాలో, ప్రొఫెసర్లకెలా కుట్టాలో, సర్జన్లకెలా కుట్టాలో- మనం ఆథారిటీ. ఇక్కడేకాదు మలేషియానుంచి, ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి అల్జీరియానుంచి నాకు కొలతలిచ్చి ఆర్డర్లు పంపిస్తూ వుంటారు. మనం కుట్టిన ఏప్రాన్స్ వేసుకుంటే- ఫ్యూచర్ లో వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లవుతారు మేడమ్. ఓ పదేళ్ళ తర్వాత మీరే చూస్తారుగా."

 Previous Page Next Page