Read more!
 Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 3


    కొంతసేపయిన తర్వాత తల ఎత్తి అద్దాలలోంచి హాల్లోకిచూసేసరికి అక్కడ ఎప్రాన్ తో నిలబడి ఒక క్లర్కుతో మాట్లాడుతోన్న శైలజ కనిపించింది.

 

    బజర్ నొక్కేసరికి పరశురాం లోపలకు వచ్చాడు.

 

    "ఆఫీసు హాల్లో లేబరేటరీలో పనిచేసే శైలజ వుంది. వెళ్ళి పిలుచుకురా."

 

    రెండు నిముషాల్లో శైలజ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని అతనిముందుకు వచ్చి నిలబడింది.

 

    "యస్ సర్."

 

    "టేక్ యువర్ సీట్ మిస్ శైలజా!"

 

    "మిస్ శైలజా!" ఈ సంబోధన ఆమె వంటిమీద ఏదో విద్యుత్ తీగె ప్రాకినట్లు తాకింది. కలవరపాటును అణచుకుంటూ ఎదురుగా వున్న సీట్లో కూర్చుంది.

 

    శైలజ ఈ కంపెనీలోకి వచ్చి మూడు నెలలయింది. సన్నగా, కొంచెం పొడవుగా మెరిసే తారలా వుంటుంది. తెల్లని శరీరం, మెడమీద ఎడంవైపు పుట్టుమచ్చ, నల్లటి ఒదులుజుట్టు, నల్లగా వెలిగే కళ్ళూ- తర్వాత- అదొక్కటే ఆమె శరీరం మీద బయటకు కనిపించే నలుపు.

 

    "ఓ రీసెర్చికి కావలసిన కెమికల్స్ వచ్చేవారం అమెరికానుండి వస్తున్నాయి మిస్ శైలజా! అది చెబుదామనే కబురు చేశాను."

 

    "ఆఫీసులో నేనూ అదే అడుగుతున్నాను సర్!"

 

    "మిస్ శైలజా! మన కంపెనీ వచ్చాక ఆంధ్రదేశంలో పెద్ద సంచలనం వచ్చింది. మందులు ఇంత తక్కువధరలో సామాన్య ప్రజానీకానికి అందుబాటులో వుండేటట్లు చెయ్యటం అందరికీ దిగ్భ్రమ కలిగిస్తోంది. కేవలం లాభాలు చేసుకుని లక్షలు సంపాదించటం నా ధ్యేయంకాదు. మన దేశంలో ఇమ్యూనిటీ పటిష్ఠంగా లేకపోవటంవల్ల రోగాలు అధికం, మందుల ధరలు అధికం, డాక్టర్ల ఫీజులతోబాటు అధిక వ్యయంతోకూడిన మెడిసిన్స్ కొనలేక ప్రజలు నానా యిడుములూ అనుభవిస్తున్నారు. శక్తివంతంగా పనిచేసే మందులు తక్కువ ధరలకు ప్రజలకు అందివ్వాలి."

 

    శైలజ అతని ముఖంలోకి చూస్తూ మౌనంగా కూర్చుంది.

 

    "నీకు మొదటిరోజునే చెప్పాను. ఆల్కహాలు అంటే నాకెంత అసహ్యమో! ధనికులూ త్రాగుతున్నారు, మధ్యతరగతివాళ్ళూ త్రాగుతున్నారు. రోజు కూలీతో జీవించే శ్రమజీవులూ త్రాగుతున్నారు. ఆఖరుకి విద్యార్థులుకూడా త్రాగుతున్నారు. ఈ మద్యపానంవల్ల ఆర్థికంగా అప్పులపాలయి నలిగిపోవటమేగాక ఆరోగ్యాలు గుల్లయి అర్థాంతరపు చావులు చస్తున్నారు. ఈ మద్యపాన వ్యసనాన్ని అరికట్టగలిగే ఔషధాన్ని కనిపెట్టటానికి అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు జరిగాయి. విజయవంతం కాలేదు. ఏ పనయినా దీక్షతో చేస్తే సాధించలేకపోమని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ రీసెర్చిసెక్షన్ మొదలుపెట్టాను. ఇందులో మిస్ చూడామణి రెండేళ్ళుగా పనిచేస్తోంది. ఆవిడకు అసిస్టెంట్స్ అవసరమనిపించింది అందుకే నిన్ను నియమించాను. ఈవేళ ఇంటర్వ్యూకి ఇంకో అతన్నికూడా పిలిచాను. ఎందుకంటే విభిన్న దృక్పధాలు తీసుకుని సమన్వయపరుచుకోవటానికి, విజయవంతం కావడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం."

 

    టేబిల్ మీద ఫోన్ మ్రోగింది.

 

    రిసీవర్ తీసుకున్నాడు "యస్."

 

    "సర్! ఫణీంద్రకుమార్ ను మీరు ఇంటర్వ్యూకి రమ్మని రాశారు. ఇంటర్వ్యూ కార్డు తీసుకొచ్చాడు" కమలామణి గొంతు.

 

    "లోపలకు పంపించు."

 

    ఒక్క నిముషం తర్వాత పరశురాం తలుపు తెరవగా ఎర్రగా, పొడుగ్గా వున్న ఓ యువకుడు లోపలకు వచ్చాడు. టక్ చేసుకున్నాడు. కళ్ళు చురుగ్గా మెరుస్తున్నాయి. సిటీబస్సులో చాలా దూరంనుంచి రావటంవల్ల కాబోలు ముఖాన కొంచెం చెమట పట్టి, క్రాఫింగ్ కొద్దిగా చెదిరివుంది.

 

    కల్నల్ కి నమస్కారం చేశాడు.

 

    "టేక్ యువర్ సీట్."

 

    అతను కుర్చీలో కూర్చోబోతూ శైలజని చూసి ఉలికిపడి ఒక్కక్షణం బొమ్మలా నిలబడిపోయాడు. అతన్ని చూడగానే ఆమె ముఖంకూడా నల్లబడి పోయింది. ఒక్క క్షణం అంతే, తర్వాత ఇద్దరూ సర్దుకున్నారు. అతను ఆమె ప్రక్కనున్న సీటులో కూర్చుని కల్నల్ ముఖంవంక చూశాడు.

 

    "మిస్టర్ ఫణీంద్ర. ఎం.ఎస్.సి. ఫస్టుక్లాస్. మార్చికి ఎందుకు ఎపియరవలేదు?"

 

    "ఇంట్లోని పరిస్థితులవల్ల."

 

    "కంపెనీ నిబంధనలన్నీ చదివావు కదూ?"

 

    "చదివాను."

 

    "పెళ్ళి కాకూడదు."

 

    "కాలేదు."

 

    "అంతేకాదు. ఉద్యోగం ఇస్తే మూడేళ్ళదాకా పెళ్లి చేసుకోనని బాండ్ రాసి ఇవ్వాలి."

 

    "అలాగే రాసిస్తాను."

 

    "అంతేకాదు. ఈ మూడేళ్ళూ ఎలాంటి ప్రేమ వ్యవహారాల్లో, చెడు నడతల్లో పడకూడదు. అలా జరిగితే ఉద్యోగానికి ఉద్వాసన చెప్పటానికి కంపెనీకి అధికారం ఉంది."

 

    "అలాగే."

 

    "కంపెనీ వున్న కాలనీలోనే మీరు వుండాలి. బయటెక్కడా ఉండటానికి వీల్లేదు."

 

    "అలాగే."

 

    "మొదటి ఆరునెలలూ సిక్ అయితే తప్ప సెలవు పెట్టటానికి వీల్లేదు. సిక్ అయితే కంపెనీ తరపు డాక్టరుదగ్గరే ట్రీట్ మెంటు తీసుకోవాలి."

 

    "అలాగే."

 

    "ఒక్క అయిదునిముషాలు బయట వుండండి, ఈలోగా నా నిర్ణయం ఆలోచించుకుని చెబుతాను."

 

    ఆ యువకుడు తల ఊపి లేచి బయటకు వెళ్ళాడు.

 

    "ఏమంటావ్ మిస్ శైలజా?"

 

    "ఏమిటి సర్?"

 

    "ఈ కుర్రాడ్ని పెట్టుకుందామా?"

 

    ఆమె ముఖం వెలవెలబోయినట్లయింది. కల్లోలాన్ని అణుచుకుంటున్నట్లు పెదవులు అదిమిపట్టింది.

 

    "చెప్పు మిస్ శైలజా!"

 

    "మీ ఇష్టం సర్."

 Previous Page Next Page