.....మంచి భార్య దొరకడం అదృష్టం. అలాంటి అదృష్టవంతుల్లో నేనూ ఒకణ్ణని పెళ్ళయిన ఆరునెలల్లో నిశ్చయంగా తెలిసిపోయింది.
సాధారణంగా పెళ్ళయిన మొదట్లో భాగస్వామిపట్ల ఉండే అభిప్రాయాలు, తర్వాత్తర్వాత మారతాయి. అరుంధతి విషయంలో అలా జరగలేదు.
పెళ్ళయి మూడేళ్ళయినా సంతానం కలగలేదన్న చిన్న అపశృతి తప్ప మాకే చింతా లేదు.
* * *
దూరంగా కోడి కూత వినబడింది. అప్పుడే తెల్లవార వస్తోందన్న మాట! నేనింకా నాకొచ్చిన కలగురించే ఆలోచిస్తున్నాను. ప్రతి విషయాన్ని తార్కికంగా, సహేతుకంగా ఆలోచించడం నాకలవాటు. అఫ్ కోర్స్! ప్రతి సామాన్యుడూ అలాగే అనుకోవచ్చనుకోండి.
ఇప్పుడా కళ నాకెందుకొచ్చిందనడానికి కారణం మాత్రం నాకు స్పష్టంగా తెలుస్తోంది.
ఆ కల ఆరాత్రి నాకు రావటానికి కారణం....
ఆ రోజు సాయంత్రమే సుమద్యుతిని నేను చూడడం!
కూరగాయలు కొనుక్కొని, నేను అరుంధతీ స్కూటర్ మీద వస్తుండగా రిక్షాలో కనపడ్డారు ఆ దంపతులు. మూడు సంవత్సరాల తరువాత చూడటంతో వెంటనే గుర్తుపట్టలేకపోయాను. గుర్తుపట్టగానే వెన్నులోకి రక్తం వేగంగా ప్రవహించింది.
తను నన్ను చూసిందా?
"ఏమో!
నేను మాత్రం సడన్ బ్రేక్ తో స్కూటర్ ఆపబోయాను. వెనుక నుంచి తూలి వీపుమీద పడిన భార్య- నా ఉనికిని గుర్తు చేసింది. బ్రేక్ మీద కాలు తీసేసి..... మామూలుగా ముందుకు సాగాను. కానీ- చాలా రోజుల తర్వాత కనబడి సుమస్యుతి నా ఆలోచనల తేనెతుట్టెని కదిపింది.
బాగా లావయిందామె! రఘువరన్ మరింత మీసాలు పెంచాడు. బొటనవేల్తో మిగతా వేళ్ళ అంచుల మీద రాస్తున్నాడు. దావూద్ ఇబ్రహీం కుడిభుజంలాగా వున్నాడు. ప్రియురాళ్ళ భర్తలు ఆ విధంగా కనబడడంలో తప్పులేదనుకుంటాను.
అయితే సుమద్యుతి భర్త విషయంలో మాత్రం నేనే కాదు, ఎవరైనా ఆ అభిప్రాయానికే వస్తారు.
సుమద్యుతి వళ్ళో కనబడిన బిడ్డ వయసు నాకు తెలీదు. కానీ ఆమె పొదివి పట్టుకున్న భంగిమని బట్టి- ఆ శిశువు నెలలకి మించినదయివుండదనిపించింది. ఆమెని చూసాకే నాకు ఈ కల వచ్చింది. అదే రాత్రి!......
మనసు కోతిలాంటిది. అది రకరకాలుగా ఆలోచిస్తుంది. మనని సంతోషపెట్టడానికి ఎన్నెన్నో వేషాలేస్తుంది. రోమాన్స్ నుంచి శాడిజం వరకూ అన్నీ మనసువేసే వేషాలే కదా!
అలా నా మనసు తాలూకు శాడిజానికి పరాకాష్టే ఈ 'కల' అన్న వూహరాగానే నేను సిగ్గుతో కుదించుకుపోయాను. నాకొచ్చిన కలలో వ్యక్తులు స్పష్టంగా గుర్తున్నారు. పరుగెడుతున్న స్త్రీలో సుమద్యుతి, వెంటాడుతున్న వ్యక్తిలో ఆమె భర్త పోలికలు కనబడడం నాలోని రాక్షస ప్రవృత్తికి నిదర్శనం కాక మరేంటి?
ఈ విధంగా ఆలోచిస్తూ నేను పక్కమీద అటూ ఇటూ కదలడం చూసి "ఏం.....నిద్రపట్టటంలేదా?" అంది అరుంధతి.
"అవును" అన్నాను.
"ఏదైనా కాస్త ఉపయోగపడే కార్యక్రమం చేద్దామా?" అంది.
నేను హుషారుగా లేచి కూచుంటూ "అంతకన్నానా?" అన్నాను.
"అయితే పదండి- తొందరగా మొహం కడుక్కోండి. తలంటుతాను.తెల్లవారు ఝామునే గుడికెళ్ళాలి. మొన్న ఆచార్యులవారు చెప్పారు. ఆ గుడిలో దేవుణ్ని ప్రార్థిస్తే కోర్కెలు నెరవేరుతాయంట" అంది.
నేను నీరుగారినట్టు, "నే కోరిక తీరాలంటే గుడికెళ్ళడం ఉపయోగపడేకార్యక్రమం కాదు. ఇంకేదో వుంటుందనుకుంటా!" అన్నాను.
"సర్లెండి- ఆ కార్యక్రమాలన్నిటికీ రాత్రులెలాగూ ఉన్నాయి కదా! సూర్యోదయానికి ముందే ఆ గుడికెళితే కోరికలు తీరతాయట!! లేవండి.....లేవండి. తన దగ్గరికి రప్పించుకోవాలనే బహుశా ఆ దేవుడు తెల్లవారు ఝామునే మీకు మెలకువ వచ్చేలా చేసాడు' అంది తొందరపెడుతూ.
నాకు నిద్రపట్టకపోవడానికి కారణం దేవుడు కాదనీ, అర్థరాత్రి వచ్చిన కల అనీ చెప్దామనుకున్నాను కానీ అంత స్వచ్ఛమైన ప్రత్యూషపు వేళ ప్రియురాలి పేరెత్తి మరో శోభన్ బాబుని కావడం ఇష్టం లేకపోయింది. లేచి పెరటివైపు నడిచాను. అరుంధతి పాలవాడికోసం ముందు తలుపు తీయడానికి వెళ్ళింది.
బ్రష్ మీద పేస్ట్ పెట్టుకుని పెరటివైపు మెట్లు దిగుతున్నాను.
అప్పుడు వినిపించిందా కేక!
రెండే రెండుసార్లు-
ఆ తరువాత్ గాఢమైన నిశ్శబ్దం.
ఒక్క ఉదుటున మెట్లెక్కి గాలికన్నా వేగంగా హాలు దాటి ముందు గదిలోకి వచ్చాను. ఇనుప జాలీ తలుపుల అంచుకి అనుకుని నిలబడి వుంది అరుంధతి. గుండెల మీద చెయ్యి వేసుకుని భయం భయంగా చూస్తోంది. పెద్దవైన ఆమె కళ్ళలో విభ్రాంతి చోటు చేసుకుంది. తూరుపు తెల్లవారుతుండడంతో మెట్లమీద కాంతి మరింత ప్రస్ఫుటమయింది.
ఆమె చూస్తున్న వైపే నేనూ నా దృష్టిని సారించాను.
లిప్తపాటు నేనూ నా కళ్ళని నమ్మలేకపోయాను.
మెట్లమీద నెలల పసికందు నిద్రపోతోంది!!!
......తెల్లవారు ఝాము కలలు నిజమవుతాయని నమ్మే స్టుపిడ్ ని కాను నేను. నాకు ఆ కల ఎందుకొచ్చిందో సోదాహరణంగా వివరించాను కదా!
సుమద్యుతి నా పేరు కూడా మర్చిపోయి వుండవచ్చు!
మరి ఈ పాప ఎవరో.....
......నేనిలాటి ఆలోచనల్లో వుండగానే అరుంధతి "ఎవరో పాపాత్ములు. నెలల బాబుని ఇలా వదిలిపెట్టటానికి మనసెలా వచ్చిందో పాడు.... పాపం రాత్రంతా చలిలో వున్నట్టున్నాడు. వళ్ళు ఎంత చల్లగా వుందో చూడండి....." అంటూ వాడిని ఎత్తుకుని మొహంలోకి తేరిపారచూస్తూ "ఎంత ముద్తోస్తున్నాడో...... ఇంకా అలా నిలబడి వున్నారేమిటండీ. త్వరగా తయారవ్వండి. గుడికి వెళ్ళాలి" అంటూ ఆ శిశువుని లోపలి తీసుకెళ్ళింది. నేనింకా శిలా ప్రతిమలా నిలబడే వున్నాను.
ఇది జరిగి పదేళ్ళ పైగా అయింది.
ప్రారంభం
అనుబంధానికీ, రక్త సంబంధానికీ మధ్య అవినాభావసంబంధం వుంది. దాన్ని అధిగమించిన మనిషి విశ్వ జనీన ప్రేమకు అర్హుడవుతాడు.
* * *
ప్రతిరోజూ ప్రొద్దున్నే నేనూ, అంకిత్ సముద్రం ఒడ్డున జాగింగ్ చేస్తాం. సముద్రం మీదనుంచి అలలు అలలుగా తేలి వచ్చే గాలి, వాడి చిక్కటి - నల్లటి జుట్టుతో ఆటలాడుతూ ఉంటుంది. అటువంటి సమయంలో-అసలే అందమైన వాడి మొహం, నుదుటి మీద పడే వెంట్రుకల్తో మరింత చూడముచ్చటగాగా వుంటుంది.
నా ప్రతీ ఉదయమూ అంకిత్ తో ప్రారంభం అవుతుంది. ఎప్పుడయినా రాత్రిళ్ళు పెకాటతోనో -స్నేహితులతోనో బాగా ఆలస్యమయినాసరే.....ప్రొద్దున్న అయిదింటికల్లా టంఛనుగా లేపేస్తాడు. చాలా చిత్రంగా-సముద్రపు ప్రెష్ గాలికి, ఆ రాత్రి తాలూకు మత్తంతా క్షణాల్లో వదిలిపోతుంది.
మేమిద్దరమూ, బీచ్ కి వచ్చే సమయానికి- నా మనసింకా నిద్రపోతూనే వుంటుంది. విశాఖపట్టణం బీచ్- ఆంధ్రదేశానికి ప్రకృతి ఇచ్చిన కానుక అనుకుంటాను.
వెలుగూ చీకటికాని సమయంలో మేమక్కడ అడుగుపెడతాం. ప్రపంచం గాహ్తంలోకి జారిపోయిందేమో అన్నట్టు అంతటా నిశ్శబ్దం. జనం ఇంకా కలల్ని నెమరేసుకుంటూ నిద్ర పోతుంటారు. పగటితాలూకు నైరాశ్యాన్ని ఆహ్వానించలేక కలల్ని ఆశ్రయిస్తూంటారు. నాకయితే- ఇంతలా ప్రకాశిస్తున్న వర్తమానాన్ని నిద్రలో వృధా చేసుకుంటున్నందుకు- వారిమీద జాలి కలుగుతుంది. సముద్రపు అలల పియానో మెట్లమీద గాలివ్రేళ్ళు కదలాడుతుంటే వచ్చే సంగీత శబ్దం- ఆ నిశ్శబ్దాన్ని పెళ్ళి కూతుర్ని చేసినట్లు అలంకరిస్తూ వుంటుంది.
కళ్ళెం కదలగానే రేసుగుర్రం పరుగెత్తినట్టు - బీచ్ లో కారు దిగ్గానే అంకిత్ దౌడు తీస్తాడు. నేనూ అప్పుడే జీవం పోసుకున్నట్టు కదలటం ప్రారంభిస్తాను. మాలో పెరుగుతున్న ఉత్సాహాన్ని చూసి సూర్యుడు చీకటి దుప్పటి కొద్దిగా తొలగించి విష్ చేస్తాడు.
ఇదంతా చూస్తుంటే- ఒకప్పటి నేనేనా అనిపిస్తూ వుంటుంది. కాసింత బెదురు, కాస్త పిరికితనం, జీవితం పట్ల అభద్రతాభావం.......ఇవన్నీ నానుంచి ఎప్పుడు దూరమయ్యాయి?
అంకిత్ పుట్టినప్పటి నుంచీ అనుకుంటే ఆ భావం చాలా గమ్మత్తుగా వుంటుంది. నేనూ, అరుంధతీ....మా ఇద్దర్లోనూ కొత్త ఉత్సాహాన్ని, ఊపిరినీ నింపినవాడు అంకిత్, అందులో సందేహం లేదు. జీవితంపట్ల నమ్మకాన్నీ, రేపటిపట్ల ఆశనీ మేము వాడి చుట్టూ సృష్టించుకున్నాం.
మధ్యతరగతి నుంచి మరోమెట్టు పైకెక్కటానికి కూడా అదే కారణం!
వాడి భవిష్యత్తు బావుండాలంటే- నేను మరింత సుస్థిరమైన పునాది నిర్మించాలన్న అందమైన కోరికే నన్ను మరింత కష్టపడేలా చేసింది. ఉద్యోగంలోంచి వ్యాపారంలోకి దింపింది.
నాకెందుకో- అంకిత్ లో ప్రతిరోజూ చేసే ఈ జాగింగ్ కే, మా అనుబంధానికి దగ్గిర సంబంధం వుందనిపిస్తూ వుంటుంది. భవిష్యత్తులోనికి దూసుకుపోయే ముందు- ఒకర్నొకరు ఉత్సాహపర్చుకుని, ఆత్మీయంగా విడిపోతాం.
......మళ్ళీ తిరిగి రాత్రి కలుసుకోవటానికి!
అప్పుడయితే మాతోపాటు వాడి అమ్మ అరుంధతికూడా వుంటుంది. "హవుస్" కీ తేడా తెలియజెప్పటం కోసం!
అరుంధతి కూడా ఇప్పుడు కలల్లో - వంకాయల ధర కిలో వందకి పెరిగినట్టు అరవటం మానేసింది. అంకిత్ త్వరత్వరగా పెద్దాడయిపోయి సూటేసుకుని కార్లో మా ఆఫీసుకి వెళ్ళినట్టు కలలు కంటోంది. అవి కలలు కావని, ఆ దృశ్యం పది పన్నెండేళ్ళలో నిజమవుతుందని మాకు తెలుసు. వాడు రాంక్ హొల్డరు. ఈ వయసులోనే వాడు రీడర్స్ డైజెస్ట్ క్రమం తప్పకుండా చదువుతాడు. ఇదంతా 'పుత్రోత్సాహము తండ్రికి' అని ఎవరైనా నవ్వుకున్నా నేనేమి బాధపడను. ఇంకెవరయినా సరే- అంకిత్ లాంటి గుణాలున్న కుర్రాడిని "మా అబ్బాయి" అంటూ పరిచయం చేసి, వాడి దినచర్యనీ గుణగణాల్నీ చెప్తే, నేనూ అంతే ప్రశంసతో చూస్తాను. అక్కడ అందంకాదు ప్రదానం. వ్యక్తిత్వం.