నాకూ ఈ ఆలోచన మంచిదనిపించింది. కానీ, ఈ అర్థరాత్రి డాక్టరెక్కడ దొరుకుతాడు? భద్రాచలం వెళ్ళాలి. మోటార్ సైకిల్ మీద అంతదూరం వెళ్ళిరావడానికి ఎంతలేదన్నా పావుగంట పడ్తుంది. నాకు మావాళ్ళమీద కోపం వచ్చింది. మునిగిపోయినట్టు ఈ రోజే సెకండ్ షోకి వెళ్ళాలా?
భద్రం నావైపే చూస్తున్నాడు. నేను తలూపి, "డాక్టర్ ని తీసుకొస్తాను" అన్నాను. అతను మాట్లాడలేదు. నేనే .... మీ ఆవిడకి చెప్తా నీ విషయం. నేను లేనపుడు వచ్చిందంటే కంగారు పడుతూంది. అదీగాక ఇక్కడ ఎవరో ఒకరు ఉండటం ముఖ్యం" అన్నాను.
"కంగారుతో గొడవ చేస్తుందేమో?"
"అయినా ఒకళ్ళు వుండటం మంచిది."
"అవునులే. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో-తను ఉండటమే మంచిది, కానీ తనొక్కదానికే చెప్పు"
నేను కదిలి తలుపు దగ్గిరకు వచ్చాను, తలుపు వెయ్యబోతూ ఆగి అతడివైపు చూశాను. భద్రం కూడా కళ్ళు వీలైనంత పక్కకి తిప్పి నా వైపు చూశాడు. ఏమాత్రం అటూ ఇటూ జరిగినా బ్రతికి అతడు చూడటాన్ని నేను చూడటం అదే ఆఖరిసారి.
తలుపు దగ్గిరగా జారేసి చప్పుడు చెయ్యకుండా మెట్లు దిగాను. నాలుగిళ్ళవతల వున్న ఎ.ఇ. ఇంటికి వెళ్ళాను. భద్రం భార్య నన్ను చూసి లేస్తూ "నన్ను కాస్త మా ఇంటిదగ్గిర దిగబెడ్తారా?" అంది. తలూపాను.
"ఆయనకి నేనసలు పట్టలేదు చూడండి. నేనిక్కడ ఉండి పోయానని తెలిసికూడా ఇంటిలో పుస్తకం చదువుతూ కూర్చుండి పోయారు" అంది దార్లో వస్తూ.
అప్పుడు చెప్పాను భద్రం పరిస్థితి. జరిగినదంతా వివరించి చెప్పేసరికి ఆవిడ శిలా ప్రతిమలా నిలబడిపోయింది. హిస్టీరియా స్ట్రోకులాటి దేమైనా వచ్చిందేమో అనుకుని భయపడ్డాను. కానీ, అటువంటిదేమీ లేదు.
"ఎలా.....ఇప్పుడెలా?" అంది.
"మీరు బయటే నిలబడి వుండండి. నేనో పావుగంటలో వచ్చేస్తాను. మరీ అవసరమైతే తప్ప లోపలి వెళ్ళకండి"
ఆవిడ మెట్లెక్కి అద్దం కిటికీలోంచి భర్తను చూచి ఏడవటం మొదలుపెట్టింది. నేను ఆలస్యం చేయదల్చుకోలేదు. మోటార్ సైకిల్ దగ్గరికి పరుగెత్తి. కొంతదూరం వరకూ నడిపించుకుంటూ వెళ్ళి, దాని శబ్దం అక్కడివరకూ వినిపించదని నమ్మకం కుదిరాక, స్టార్టుచేసి పోనిచ్చాను.
రోడ్డు చాలా ఘోరంగా వుంది. వెళుతూంటే పురుగులు మొహానికి రాళ్ళలా తగలసాగాయి. అయినా పది నిముషాల్లో భద్రాచలం చేరుకో గలిగాను.
డాక్టర్ రంగారావుకి నలభై ఏళ్ళుంటాయి. స్థూలకాయం. ఎప్పుడూ మొహంమీద నవ్వు చెరగదు. ఇంతకుముందు రెండు సార్లు ఆయన్ని కలిశాను.
ఏమిటీ అర్థరాత్రి దర్శనం?" అన్నాడాయన తలుపుతీస్తూ.
"పాము కాటుకి కావాల్సిన సిరమ్ తీసుకొని అర్జెంటుగా రావాలి" అన్నాను వగరుస్తూ.
ఆయన మొహంలో చిరునవ్వు మాయమైంది. "ఎవర్ని కరిచింది పాము?" అన్నాడు ఆందోళనగా.
"ఇంకా లేదు. కాని రామభద్రం పడుకొని వుండగా అతడి రగ్గులోకి దూరి- కడుపుమీద పడుకుని వుంది" సాధ్యమైనంత తక్కువ మాటల్తో పరిస్థితి వివరించటానికి ప్రయత్నించాను.
వెంటనే అర్థం చేసుకున్నాడు డాక్టరు. మరి ప్రశ్నలు వేయలేదు. "మందు నా దగ్గిర లేదు. మీరు వెనక్కి వెళ్ళిపోండి. రెండు నిముషాల్లో నేను నా స్కూటరు మీద వస్తాను. ఈ లోపులో అతడు కదలటంగానీ, మాట్లాడటంకానీ చేయవద్దని చెప్పండి" అంటూ అదే నైట్ డ్రస్ లో స్కూటర్ దగ్గరికి పరుగెత్తాడు. వెంట వెంటనే ఆయన తీసుకుంటున్న ఆ నిర్ణయాలు చూసి, పరిస్థితిని ఆయన బాగా ఎదుర్కోగలడన్న నమ్మకం కుదిరింది.
ఈ సారి కొంచెం తొందరగా, అంటే దాదాపు అయిదారు నిముషాల్లో మా నివాసానికి చేరుకున్నాను.
మెట్లెక్కుతూ వుంటే కిటకీలోంచి లోపలి చూస్తూ మరో ఆకారం కనిపించింది. లావుగా, స్థూపాకారంలా వున్న ఆ శరీరం కామాక్షమ్మగారిది. ఆవిడ ఎ.ఇ. భార్య. భద్రం దగ్గిర ఒక్కతే ఉండలేక అతడి భార్య ఈవిడ్ని తీసుకొచ్చినట్టుంది.
తలుపు తోసుకుని లోపలి ప్రవేశించాను. నన్ను చూసి రామభద్రం, "ఈవిడ్ని ఆ వరండా అవతల్నుంచి వెంటనే బయటకు పంపించు" అన్నాడు.దాన్ని బట్టి ఈ పావుగంటలోనూ ఆవిడ ఎంత హైరానా పేట్టి వుంటుందో గ్రహించగలిగాను.
"డాక్టరుగారు వస్తున్నారు. వచ్చేవరకూ నిన్ను కదలకుండా పడుకో మన్నారు" అన్నాను ధైర్యం చెపుతున్నట్టు భద్రంతో.
"ఇప్పుడు నేను చేస్తుందేమిటంట?" విసుగ్గా అన్నాడు.
నేనుకూడా విసుగ్గా- "చూడు భద్రం! మనం మాట్లాడటం కూడా మానెయ్యాలన్నాడు. అసలు మాట్లాడకూడదు" అన్నాను.
"మరైతే నోర్మూసుకో" కోపంతో అతడి నోరు వంకర పోయింది. అతడివైపు జాలిగా చూశాను. దాదాపు డెభ్భై నిముషాలపాటు అంగుళమైనా కదలకుండా అలాగే నిశ్చలంగాపడుకుని వుండటం ఎలాంటి నరకమో నేను అర్థం చేసుకోగలను. ఇంకో ఐదు నిముషాలు-అంతే! డాక్టరు వస్తే ఇక అంతా అతడే చూసుకుంటాడు. ఈ లోపులో ఇతడికోసం ఏదైనా చెయ్యాలనిపించింది.
చేతిరూమాలు తీసి మొహం మీద చెమట తుడవబోయాను. నా ప్రయత్నం గ్రహించి అతడు తల తిప్పుతూ- "వద్దు , తుమ్ములొస్తాయ్" అన్నాడు కోపంగా.
ఈ లోపులో బైట ధడేలున ఏదో పడినట్టు చప్పుడయింది.
నేను బయటికి పరుగెత్తాను.
చిన్న ముక్కాలిపీట వేసుకొని కిటికీలోంచి లోపలిచూస్తున్న కామాక్షమ్మ గారు- పీట జారటంతో వెల్లకిల్లా పడింది. నేను వెళ్ళేటప్పటికి ఆపసోపాలు పడుతూ లేస్తూ వుంది. భద్రం భార్య ఆవిడకి చేయి అందించి సాయం చేస్తోంది. ఆవిడ పీట వేసిన చోట కింద చెక్క విరిగి వుంది.
"అబ్బాయ్! పాము వెళ్ళిపోతుందంటావా?" అని అడిగింది అంత బాధలోనూ ఆసక్తిగా.
ఆఁ, మీరిలా గొడవచేస్తే తొందరగానే వాడిని కాటేసి వెళ్ళిపోతుంది" అన్నాను. భద్రం భార్య తిరిగి ఏడవటం ప్రారంభించింది. వీళ్ళ బారినుంచి నన్ను రక్షించటానికా అన్నట్టు దూరంగా స్కూటర్ శబ్దం వినిపించింది. మరో నిముషంలో రంగారావు మెట్లెక్కి పైకి వచ్చాడు. ఇద్దరం లోపలి నడిచాం. మా వెనకే లోపలి రాబోయిన కామాక్షమ్మగారు- నేను కోపంగా చూడటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
డాక్టరు ఇవేమీ గమనించకుండా సరాసరి భద్రం పక్కదగ్గరికి వెళ్లిపోయాడు. పేషెంటు నుదుటిమీద చెయ్యివేసి. 'భయపడకు' అంతా సర్దుకుంటుంది అన్నట్టుగా తట్టాడు. భద్రం కనురెప్పలల్లార్చి అర్థం చేసుకున్నట్టు సూచించాడు.
డాక్టరు నన్ను దూరంగా తీసుకెళ్ళి చిన్నస్వరంతో "ముందు అతడికి సీరమ్ ఇంజెక్టు చెయ్యాలి. ఇంట్రావీనస్" అన్నాడు.
ఉలిక్కిపడ్డాను.
ఇంట్రావీనస్ రక్తనాళంలోకి ఇంజక్టు చేస్తూన్నప్పుడు అతడు కదలక తప్పదు. అదీగాక రక్తనాళం దొరికేవరకూ సూదిని చేతిలో పొడుస్తూ ఉండాల్సిందే. అంత బాధని భద్రం కదలకుండా ఓర్చుకోగలడా?
ఈ రాత్రి కాళరాత్రి అయ్యేటట్టు వుంది.
ఇద్దరం ముందుగదిలోకి వచ్చాం.
భద్రం కళ్లు పెద్దవి చేసుకొని మమ్మల్ని చూడసాగాడు. అతడి కళ్ళలో భయం కొట్టొచ్చినట్టు కనబడుతూంది. ఎందుకోమేం తప్పునిర్ణయం తీసుకున్నామేమో అని ఆ క్షణం నాకు అనిపించింది.
అంతలోనే డాక్టరు వంగి, భద్రం చెయ్యి పట్టుకున్నాడు. పదహారో శతాబ్దపు వస్త్రాన్ని అతి జాగ్రత్తగా పరిశీలించినట్టు అతడి చేతిమీద దుప్పటిని కొద్దికొద్దిగా పక్కకు జరిపాడు. ఈ పని నంతటినీ అతడు మాత్రం జాగ్రత్తగా కొద్ది దూరంలో నిలబడి చెయ్యటాన్ని నేను గమనించాను.
భద్రం చెవి దగ్గరికి వంగి, "ఇంట్రావీనస్ చేస్తున్నాను. కొద్దిగా నొప్పిగా ఉన్నా ఓర్చుకోవాలి. ముఖ్యంగా కడుపు దగ్గర కదలకూడదు." అనటం నాకు వినిపించింది. భద్రం మాట్లాడ లేదు. అతడి మోహంలో ఎ భావమూ లేదు. నుదుటిమీద చెమట మాత్రం ధారాపాతంగా కారుతూంది.
దుప్పటిని సుతారంగా మోచేతివరకూ పైకి తోసేక, రంగారావు ఒక ఎర్రటి రబ్బరుగొట్టం తీసి చేతికి బిగించాడు. చేతిమీద నీలపు రక్తనాళం పైకి ఉబ్బింది. ఆల్కహాలు దూడిలో ముంచి దానిమీద రాశాడు. తరువాత లాంతరువైపు తిరిగి, నా చేతిలోంచి సిరెంజి తీసుకొని, కొద్దిగా సిరమ్ ని గాలిలోకి వెదజల్లాడు.
నేను, భద్రం డాక్టరునే గమనిస్తున్నాం. దీపం వెలుగులో భద్రం మొహంలో ప్రేతకళ కొట్టొచ్చినట్టు కనబడుతూంది.
బయట జరిగే తతంగం తెలియని మిన్నాగు మాత్రం దుప్పటికింద వెచ్చగా పడుకుని వుంది.
భద్రం పక్కనే నిలబడి గమనించసాగాను. మోచేతికింద వెచ్చగా పడుకుని వుంది.
భద్రం పక్కనే నిలబడి గమనించసాగాను. మోచేతికింద నీలంగా ఉబ్బిన నరంలోకి డాక్టరు సూది గుచ్చాడు. అతడి శరీరం చిన్న జర్క్ ఇచ్చింది. నా దృష్టి చప్పున అతడి కడుపు మీదికి వెళ్ళింది. అదృష్టవశాత్తూ అక్కడే కదలికా లేదు.
ఇంతలో డాక్టర్ సూది తీసి మళ్ళీ పొడిచాడు. ఆయనకి నరం దొరకటం లేదు. నేను జాలిగా భద్రంవైపు చూడటం తప్ప ఏమీ చెయ్యలేక పోయ్యాను. రెండు మూడుసార్లు పొడిచిన తరువాత సరిగ్గా దొరికింది. కొద్దికొద్దిగా మందు ఎక్కించాడు. తరువాత సూది తీసేసి నా చేతికి సిరెంజి అందిస్తూ మోకాళ్ళమీద వంగి, భద్రంతో..... "ఇంక మీకేమీ ఫర్వాలేదు. కానీ కదలకండి. ప్లీజ్! ఇప్పుడే వస్తాను" అంటూ నిశ్శబ్దంగా బైటికి నడిచాడు. నేనూ ఆయనతోపాటే బయటికి వచ్చాను.
"ఏమైంది?" అని అడిగింది భద్రం భార్య ఆందోళనగా.
"పాముని చంపేశారా?" దాదాపు భద్రం భార్యని పక్కికితోస్తూ ముందుకొచ్చి అడిగింది కామాక్షమ్మ. ఆవిడ మొహంలో భయంకంటే థ్రిల్ ఎక్కువ కనబడుతూంది. వచ్చిన తరువాత తన ఆయనకీ, మిగతా వాళ్ళకీ ఒక ప్రత్యేక్ష సాక్షిగా ఈ కథని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నట్టూ కనబడింది నాకు.
విసుగ్గా- "పాముని చంపేస్తే ఆయన ఇంకా అలాగే ఎందుకు పడుకుని ఉంటాడు?" అని అడిగాను.
"మీరింతకీ ఏం చేశారు?" అని అడిగింది భద్రం భార్య.
"విషానికి విరుగుడు ఇచ్చాను. అది ఎంతవరకు పనిచేస్తుందో తెలీదు. మిన్నాగు విషానికి విరుగుడు లేదు. అదీగాక నా మందు ఓల్డు స్టాకు" అన్నాడు డాక్టరు. మళ్లీ మా మొహాల్లో భయంచూసి, ధైర్యం చెబుతున్నాట్టూ- "అయినా కొద్దిలో కొద్ది మెరుగు. మీరేం భయపడకండి. బహుశా నా మందు అతడిని రక్షించవచ్చు. ఈ లోపులో మనం ఏదైనా ఆలోచించాలి" అన్నాడు.
కామాక్షమ్మ ముందుకొచ్చి-"ఒక్కసారి రగ్గు లాగేసి పాముని దులిపేస్తే?' అంది. డాక్టరు మాట్లాడలేదు. మళ్లీ ఆవిడే- "ఒకరు రగ్గు లాగేస్తే. మరొకరు కర్రపట్టుకుని రెడీగా వుండొచ్చు. రగ్గు లాగెయ్యగానే కర్రతో దాన్ని క్రిందికి తోసేసి చంపెయ్యాలి" అంది, అంతా డిసైడ్ అయిపోయినట్టు.
"కర్రతో అతడి కడుపుమీదే కొడితే మరింత తొందరగా ఛస్తుంది కదా!" అన్నాను కోపాన్ని అణుచుకుంటూ. "మళ్లీ క్రిందికి తోయ్యటం దేనికీ?"
కామాక్షమ్మ నావైపు కొరకొరా చూసింది. నేను దాన్ని పట్టించుకోకుండా డాక్టరువైపు తిరిగి, "మనం ఏదో ఒకటి తొందరగా చెయ్యాలి. వాడు మరీ నెర్వస్ అయిపోతున్నాడు" అన్నాను.
"నేనర్థం చేసుకోగలను" అన్నాడు డాక్టర్. "కడుపుమీద పాము పడుకునుంటే కదలకుండా ఉండటం కష్టం. అసలింతసేపు అతడలా స్పృహలో ఉండగలిగినందుకే మెచ్చుకోవాలి." సాలోచననగా గడ్డం గోక్కుంటూ"-ఏం చెయ్యాలో తోచటంలేదు. రగ్గు నెమ్మదిగా లాగితే దానికి నిద్రాభంగం కలక్కపోవచ్చు. కానీ రగ్గు మడతల్లోంచి అది లేచిందంటే ప్రమాదం. పోనీ ఒక్కసారిగా లాగేసి ఏం జరిగిందో అది గ్రహించే లోపులో తోసేద్దామా అంటే, ఆ కంగార్లో అది భయపడి కాటు వేసిందంటే మరీ కష్టం" అన్నాడు.