అతనికి పుస్తకపఠనం ఎక్కువయింది. ఆటపాటల్లో అభిరుచి లేకపోవటం వల్ల టైమంతా కొత్తపుస్తకాలు చదవటంలో గడిపేవాడు.
దానితోపాటు రాయాలన్న జిజ్ఞాసకూడా అధికం కాసాగింది. ఏమి రాయాలో, ఎందుకు రాయాలో తెలీకుండానే పేజీలకు పేజీలు రాసివేయసాగాడు. అతని మనస్సులో ఎప్పుడూ ఏదో ఆలోచన మోదుల్తూ వుండేది. రాత్రంతా నిద్రలేకుండా ఆలోచనలతోనే సరిపోయేది. గంటకో నూతన యితివృత్తం స్ఫుర్తిస్తూవుండేది. ఊహాపథంలోకి వచ్చిన ప్రతి విషయం కాగితం మీదకు ఎక్కిస్తూ వుండేవాడు. తండ్రి చూడకుండా డాబామీదకు ఎక్కి గది తలుపులు బిడాయించుకుని, లేకపోతే కాలేజీలో ఖాళీగావున్న క్లాస్ రూమ్స్ లో కూర్చుని రాసేస్తూ వుండేవాడు. ఒక నెల్లో పదిహేను కథలు తయారుచేశాడు. తరువాత అవి చూసుకుని "అబ్బా! యివన్నీ నేనే రాశానా?" అని నివ్వెర పోయాడు. వాటిని ఇంట్లో పెట్టుకుని పూజించటం అతని ఉద్దేశం కాదు. తన రచన, పేరు అచ్చులో చూసుకోవాలన్న తాపత్రయానికి లోటులేదు. గబగబ ఒకరోజు స్టాంపులు తెచ్చి వాటిని వివిధపత్రికలకి పంపించేశాడు. పత్రికలవాళ్ళ దగ్గర్నుంచి జవాబు వస్తే ఇంట్లో చూస్తారని కాలేజి ఎడ్రస్ యిచ్చాడు.
అయితే అవన్నీ అతని వూహాలోకంలో ఎగురుకుంటూ వచ్చిన యితి వృత్తాలే. వాటిలోని నిజానిజాలు, సహజత్వం వీటిని గురించి అతనికి తెలియదు.
నెల తిరిగింది. మధుబాబు అన్నిట్లోను జాగ్రత్తగా స్టాంపులు పెట్టి పంపించటం వలన వాటిగురించి అతనికి తెలీకుండా వుండే పరిస్థితి ఏర్పడలేదు. ఒకదానివెంట ఒకటి తిరిగి రాసాగినై. కృంగిపోవటమంటే ఏమిటో జీవితంలో మొదటిసారిగా తెలిసివచ్చింది మధుబాబుకు. ఒక్కొక్కటీ తిరిగివస్తోంటే కళ్ళనీళ్ళ పర్యంతం అయేది. కాని అవి మళ్లీ చదువుతోంటే అన్నీ తప్పుల కుప్పలుగా కనిపించేవి. "ఇన్ని తప్పులు ఎట్లా రాశాను" అని సతమతమయేవాడు. అయితే అతని ఆశ్చర్యం మేరకు పంపించినవాటిల్లో రెండుకథలు రెండు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఒకటి మాసపత్రిక, ఒకటి వారపత్రిక. అతని ఆనందానికి హద్దులేదు. ఒక్కొక్క కథని పదిసార్లు చదువుకున్నాడు. ఎక్కడైనా అచ్చుతప్పులు కనిపిస్తే "అయ్యో!" అని నొచ్చుకున్నాడు.
ఈ అచ్చయిన కథల్లో తను ఏమీ పొరపాటు చేసినట్లు కనిపించలేదు అతనికి. పైపెచ్చు తనే రాశాడా అన్నంత ఆశ్చర్యం కలిగింది. తనకు తెలియని సంగతులు వున్నాయి వాటిల్లోకూడా. ఆ రచనలు తను ఎట్లా సృష్టించాడు!
అతని స్నేహితులందరూ ఆ కథలు చదివారు. కాని ఒక్కరూ మెచ్చుకున్న పాపాన పోలా. చప్పరించేశారు. పత్రికలవాళ్ళు పేజీలు నింపడానికి చెత్తా చెదారం చూసుకోకుండా యీ రోజుల్లో పబ్లిష్ చేస్తున్నారని ఒకడు తీర్మానించాడు. వేటినో దృష్టిలో పెట్టుకుని రాసినట్లుందని మరొకడు నిర్ధారణ చేశాడు. "మొదటి కథలు అంతకంటే ఏం బాగుంటాయిలే?" అని ఓ ప్రబుద్ధుడు ఓదార్పుగా అన్నాడు.
మధుబాబు ఖిన్నుడయాడు. ఒక్కప్రాణికూడా తనని మెచ్చుకోటల్లో. ఈ బడుద్ధాయిలందరూ అసూయని వెలిగక్కుతున్నారని అతను గ్రహించలేక పోయాడు. ఆ సాయంత్రం తల్లిదగ్గరకు పోయాడు, తల దువ్వుకుంటూంటే.
"అమ్మా! నేను రాసిన కథ అచ్చయిందే" అన్నాడు.
సుందరమ్మగారు సంతోషించింది. కొడుకు ఎప్పుడూ ఏదో రాస్తుంటాడని తెలుసు కాని వారించే ప్రయత్నం ఏమీ చెయ్యలా. "ఏదీ! పట్రా చూద్దాం" అన్నది.
మధుబాబు పత్రికలు తెచ్చి ఇచ్చాడు. ఆవిడ తలదువ్వుకోవటం పూర్తిచేసి, ఉత్సాహంగా చదివింది. ఆవిడకవి నచ్చాయి. కొడుకు ఎదురుగా కూర్చున్నాడు తల్లిముఖంలోని ఫీలింగ్స్ పరీక్షగా చూస్తూ.
ఆవిడ తలయెత్తి చిరునవ్వు నవ్వి "బాగున్నాయిరా" అంది. అనుభవంలేని యీ లేతవయస్సు కుర్రాడు తనకు తెలీని విశేషాలగురించి ఎట్లారాయగలిగాడన్నా అనుమానం ఆవిడకెందుకో కలగలేదు.
మధుబాబుకు తల్లితో ఏం మాట్లాడడానికీ తోచలేదు. అతనికి సిగ్గువేసింది. మెల్లిగా అక్కడినుంచి బయటపడ్డాడు.
సుందరమ్మగారు ఈ విషయాన్ని తన మనసులో మాత్రమే దాచుకోలేదు. ప్రక్కయిళ్ల ఆడవాళ్ళు యిద్దరిముగ్గురితో ఈ సంగతి చాటింది. ఆ పత్రికలు వాళ్లకు చదవమని యిచ్చింది.
తర్వాత మధుబాబు కథలింకా విరివిగా రాయటం మొదలుపెట్టాడు. రాయటం ఎక్కువయినాక పుస్తకపఠనం తగ్గింది. క్లాసులో పాఠాలు వినటం లేదు. ఇప్పుడు క్లాసుపుస్తకాలనిండా ఏదో ఇష్టంవచ్చిన వ్రాతలు వ్రాయసాగాడు.
మరుసటి నెలకూడా మూడునాలుగు కథలు ప్రచురించబడినై. స్నేహితులు మళ్ళీ పాత అభిప్రాయాల్ని కొత్తభాషలో వ్యక్తం చేశారు. అయితే అతను రాసినవి పిల్లల కథలని ఎవరూ పొరపడకూడదు. తను పిల్లవాడినని అతను అనుకోవటంలేదు. రాసింది ఏ పత్రిక్కీ పంపించటానికి అతను సంకోచించటం లేదు. తిరిగి వచ్చినప్పుడు పడేబాధ వుండనేవుంది. తరుచు రాసేవాళ్ళలో అతనికి కొంతమంది అభిమాన రచయితలుండేవారు. వాళ్ళు తన దృష్టిలో చాలా గొప్పవాళ్ళుగా కనబడేవాళ్ళు. ఎప్పటికైనా తనకంతటి పేరుప్రఖ్యాతులు వస్తాయా అని, ఆ స్థితికి ఎదగగలనా అనీ ఉవ్విళ్ళూరుతూ వుండేవాడు.
పాఠకుల్లో ఓ వాడుక వుంది. ఒకసారి ఓ రచన ఒకరిది అచ్చయితే, యిక ఆ రచయిత పేరుచూడగానే సంపాదకులు ప్రచురించి వేస్తూ వుంటారనీ చదవనుకూడా చదవరనిన్నూ. మధుబాబుకూడా మొదటిలో ఈ విషయం విశ్వసించాడు. అందుకని తన కథలు వేసుకున్న పత్రిక్కి ఉత్సాహంగా పింపించాడు. కాని అతని అభిప్రాయం పొరపాటయింది. అవి నిక్షేపంగా తిరగివచ్చాయి. ఒకడు మరీ ప్రఖ్యాతుడు అయితేగాని ఈ తిరిగిరావటం బెడద తీరదని నిట్టూర్చి వూహించాడు. ఏ ఇతర రంగాల్లోనయినా ప్రజలు బ్రహ్మరథం పట్టి సాధారణంగా పైకెత్తివేస్తారుగానీ ఈ కవులనీ, రచయితలనూ జీవితమంతా సంపూర్ణమయిన విజయము వరించదన్న సత్యాన్ని తెలుసుకునేందుకు అతనికి బొత్తిగా లేతవయసు.
నాలుగయిదు నెలలు గడిచేసరికి ఓ యిరవై కథలుదాకా అచ్చయినాయి. కానీ ఒక్కరుకూడా అతనికి దమ్మిడీ పంపలేదు. అతను ఆశించనూలేదు. నిజానికి రాసినవాటికి డబ్బులు ముట్టుతాయన్న విషయంకూడా అతనికి తెలియదు. కాని ఒకరోజు "మొట్టమొదటిగా వేసుకున్న వారి పత్రికనుంచి మూడురూపాయలు మనిఆర్డర్ వచ్చి అతన్ని సంభ్రమంలో ముంచెత్తింది. జీవితంలో మొట్టమొదటిసారిగా డబ్బు సంపాదించాడు. ఆ మొత్తం అల్పమా అధికమా అన్న మీమాంస అతనికి కలగలేదు. పోస్టుమేన్ అందులోనే ఓ బేడా కాజేశాడు. మనిఆర్దర్ ఫారంలో చింపియిచ్చిన అడుగుముక్క తీసుకువెళ్లి గర్వంగా స్నేహితులముందు పెట్టాడు. "ఏమిటి? ముష్టి మూడు రూపాయల పారితోషికమా? ఛీఛీ" అన్నారు వాళ్లు. మధుబాబుకు ఉక్రోషం వచ్చింది. "మరి.... చిన్నకథ" అన్నాడు బయటపడకుండా. "కథలో వర్త్ వుండాలిగానీ చిన్నదయితేనేమి?" అన్నాడొకడు తేల్చిపారేసి. ఇంకొకడు సలహా ఇస్తూ "మిగతా రచయితలకి ముప్ఫయి రూపాయిలదాకా యిస్తూ వుంటార్రా. అసహ్యంగా మూడురూపాయలేమిటి? తిరగగొట్టు' అన్నాడు. మధుబాబుకి ఈ సలహా నచ్చలేదు. ఇది తిరగగొడితే తన అభివృద్ధికి ఆటంకం తెచ్చుకున్న వాడవుతాడు. అయినా ఈ డంబాలు పలుకుతున్న వారందరికీ ఒక్క దమ్మిడీ అయినాకూడా సొంతంగా సంపాదించటం చేతకాదు. జవాబు చెప్పకుండా అక్కడినుంచి వచ్చేశాడు.
తన సాహిత్య వ్యాసంగాన్ని గురించి తండ్రికి తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాడు. విశ్వనాథంగారయితే న్యూస్ పేపర్ తప్ప విడిగా ఒక్క అక్షరంముక్క చదవడు. అసలాయనకు తనకొచ్చే వుత్తరాలు చదువుకోవటమే బద్ధకం. కాని ఆయన స్నేహితులంతా రకరకాల వ్యాపకాల వాళ్లు. మధుబాబు పేరుని వాళ్లు పత్రికలలో చాలాసార్లు చూడటం తటస్థించింది. "కాని ఈ కుర్రవాడు రాస్తున్నాడా? ఎవడో ఇంకొకడికి ఇదే పేరూ, ఇంటిపేరూ కలిసి వచ్చింది" అనుకున్నారు.
కాని తరచు కనిపిస్తుండేసరికి సంశయం వచ్చి, చివరకు సుబ్రహ్మణ్యం అనే ఆయన మాటల సందర్భంలో విశ్వనాథంగారిని అడిగాడు.
"వాడా! వాడి మొహం. అచ్చయే పాటి సామర్థ్యం వాడికెక్కడ వుంది?" అని విశ్వనాథంగారు బయటికి అన్నారు. కాని.....అనుమానం వేసింది కొంచెం. కొడుక్కి వున్న పిచ్చి ఆయనకు తెలుసుగదా.
సుబ్రహ్మణ్యంగారు వెళ్ళిపోయాక ఇంట్లోకి వెచ్చాలు ఏంకావాలో రాస్తోంది. చేస్తున్నపని ఆపి "అవును" అంది భయంగా.
"మరి నాకెందుకు చెప్పలేదు?" అన్నాడాయన.
ఆవిడ బదులు చెప్పలేదు. తలవంచుకుని కూర్చుంది.
"కోప్పడతాననా" అన్నాడాయన మెల్లగా.
ఆవిడ తలవూపింది.
నిజానికిప్పుడు విశ్వనాథంగారికి కోపంరాలేదు. కాలేజీలో పెట్టిన పరీక్షలలో కొడుక్కి బాగానే మార్కులు వస్తున్నాయి. బాగానే చదువుతున్నట్లున్నాడు. "అప్పుడప్పుడూ కథలు రాస్తే పోయిందేమి?" అనుకున్నాడు. అదే పిచ్చిగా పెట్టుకోకూడదు. మొట్టమొదట చదువు. తరువాత యీ వ్యాపకం. హాబీక్రింద తీసుకోవచ్చు.
భార్యతో యిలా అన్నాడు. "వాడు చదువు పాడుచేసుకోకుండా రాసుకుంటే నేనెందుకు కోప్పడతాను? కాని తల్లీ కొడుకులిద్దరూ నాకు తెలీకుండా గుళ్ళకాషాయం చేస్తే నాకు కోపంవస్తుంది. నాకు ఇష్టంలేని పని అసలు చెయ్యకూడదు. చేసినా చాటుమాటున అసలు చెయ్యకూడదు. నన్ను గట్టిగా అడిగితే అప్పుడప్పుడూ రాసుకొనమని నేనే అని వుండేవాడినిగా."
తన పర్మిషను లేకుండా కుటుంబంలోని వాళ్ళు ఏ పని అయినా ఎందుకు చెయ్యాలని ఆయన ఉద్దేశం. ఆ రాత్రి కొడుకుని పిలిచి "నువ్వు రాసినవన్నీ ఇలా పట్రా" అన్నాడు.
తల్లిముఖతః తండ్రికి తెలిసిన విషయం విని వుండటంచేత మధుబాబు ఉలిక్కిపడలేదుగాని..... తను కష్టపడి ప్రోగుచేసిన ఆస్తి అంతా తండ్రి చిన్నాభిన్నం చేసివేస్తాడేమోనని గుండెల్లో రాయిపడ్డది. అచ్చుపడ్డ ప్రతిరచనా అందంగా కత్తిరించి, పదిలంగా ఫైలు చేస్తూండేవాడు. మారుమాట్లాడకుండా ఆ ఫైలు తీసుకొచ్చి తండ్రిముందు పెట్టాడు. "రోజూ రాస్తున్నావా?" అని అడిగాడాయన గంభీరంగా మధుబాబు లేదన్నట్లు తలవూపాడు. "రోజూ రాయబోక, వారానికి ఓ రోజని పెట్టుకో. ఆదివారం పెట్టుకో. ఆరోజుతప్ప యిహ దానిప్రమేయం జ్ఞాపకం వుంచుకొక, నెలకు ఒక్కకథ రాయి. అంతకంటే రాయబోక. ఇది నీ చదువుకు ఎంతమాత్రం ఆటంకం కాకూడదు. తెలిసిందా! చదువు, చదువు. దాని తర్వాతనే యివన్నీ."