Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 3


    ఓ పక్క హంతకుడు తనింట్లోనే దాగున్నాడని చెపుదామని పెదవి చివరిదాకా వచ్చింది' హంతకుడు అన్నింటికి తెగించినవాడిలా వున్నాడు. పైగా చేతిలో రివాల్వర్ వుంది. పోలీసులు చేతిలో కర్రలు టార్చ్ లైట్ తప్ప  ఇంకేంలేవు. హంతకుడు ముందేగట్టిగా హెచ్చరికచేశాడు. తన్నిపట్టిస్తే, తనను గాని తన వాళ్ళనిగాని ముక్కలు ముక్కలుగా సరుకుతానన్నాడు. ఏం చేయగలదు, నోరుమూసుకోవడం తప్ప. పోలీసులు చెప్పారు అతను మామూలు మనిషి కాదని, నరరూప రాక్షసుడని. ఇప్పుడేం చేయాలి? శృతికి పాలుపోలేదు.

    పోలీసులు వెళ్ళిపోయిం తర్వాత తలుపేయడం మర్చి పోయి నిద్దట్లో నడిచే మనిషిలా నడుస్తూ వచ్చి మంచంమీద కూర్చుంది. కళ్ళు గట్టిగా మూసుకుంది.

    టక్ మని తలుపు గడియవేసిన చప్పుడు. వెంటనే టిక్ మని ఫాన్ స్విచ్ ఆర్పిన శబ్దం కావటంతో శృతి కళ్ళు తెరిచి చూసింది.

    అతను వెనుక గదిలోంచి ఎప్పుడొచ్చాడో తలుపేసి ఫాన్ ఆ పేసి కుర్చీలాక్కుని కూర్చుంటూ శృతి కళ్ళు తెరవటం చూసి, "థాంక్స్, నీ ఉపకారం మర్చిపోను" అన్నాడు.

    శృతి బిత్తరపోయి అతనివేపు చూసింది.

    "థాంక్స్ చెప్పాను వినపడిందా?"

    అప్పటికి చలనం వచ్చింది శృతిలో. టక్కున  మంచం మీదనుంచి లేచింది. పెద్దపులిని చూసి ప్రాణభయంతో పరుగెత్తే సాధుజంతువులా బైటికి పారిపోదామని రెండంగల్లో తలుపు దగ్గరకు చేరింది. "ఆగు" అతని సింహగర్జన వినగానే చటుక్కున ఆగిపోయింది.

    "ఊ....ఇటు తిరుగు"

    శృతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెనుతిరిగి అతని చేతిలో రివాల్వర్ చూసి వణికిపోయింది.

    "వచ్చి యథాస్థానంలో కూర్చో"

    శృతి కదలివచ్చి మంచంమీద కూర్చుంది.

    "గుడ్. నువ్వు చూడడానికి మంచి అమ్మాయివి లాగానే వున్నావ్, కాపోతే కాస్త తలతిక్క పనులు చేస్తూన్నావ్. ఇందాక పోలీసులొచ్చినపుడే బైటికి పారిపోక పోయావా! ఇప్పుడు నాముందా నీ పరుగు? ఆంజనేయుడి ముందు కుప్పిగంతుల్లా....."అంటూ అతను పకపక నవ్వాడు.

    శృతి కేంమాట్లాడాలో తెలియలేదు.

    "నీ పేరేమిటి?"

    "దేనికి?"

    "ఎందుకు? ఏమిటి? ప్రశ్నలు నాకు నచ్చవు  పిల్లా నీ పేరు చెప్పవనుకో, అప్పుడు నీతో ఏ గోడతోనో మాట్లాడినట్లు మాట్లాడాల్సి వస్తుంది. ఇంతకూ నీ పేరేమిటి?"

    "శృతి"

    "శృతి, చాలా బాగుంది"

    నీ మెచ్చుకోలు నాకేం అక్కరలేదున్నట్లు మూతి ముడుచుక్కూర్చుంది శృతి.

    "నా పేరు నీ కక్కరలేదా?"

    తనోపక్క ఇదెక్కడి పీడాకారంరా బాబు అని భయపడి చస్తుంటే అతనికంతా వేళాకోళంలా వుంది. ఎలక్కి ప్రాణసంకటం, పిల్లికి చెలగాటం అని పెద్దలు వూరికే సామెత సృష్టించారా? అతని పేరు నంబి రామయ్యో, కుమ్మరి రాముడో ఎవరికీ కావాలి.

    శృతి చురచుర అతన్ని చూసింది.

    "ఊ.....నీ తీరు చూస్తుంటే అడిగేట్టు లేవు సరే! నేనే చెపుతాను, నా పేరుమురారిదేముడు. అందరూ దేముడూ అని  పిలుస్తారు. నువ్వూ అలానే పిలుస్తానంటే నాకేం అభ్యంతరం లేదు." అని మురారి దేముడు వంగుని ప్యాంటు పైకి మడవటం మొదలు పెట్టాడు.

    "మురారి దేముడు. దేముడూ! అని అంతా పిలుస్తారట. ఓ దొంగ, హంతకుడు అతని పేరు దేముడు! బాగుంది" అనుకుని నవ్వుకుంది శృతి. రాణి రుద్రమదేవి నవలలో మురారి దేముడు పేరుంది, అని గుర్తుకొచ్చింది.

    "ఏమిటో నీలో నీవే నవ్వుకుంటున్నావు. నా పేరు అంత నవ్వోచ్చేట్టు వుందా?"

    "ఆ....నవ్వే వచ్చింది దేముడా! అని  పిలవంగానే దొంగలు, హంతకులు ప్రత్యక్షమయ్యేజులివికదా అని....."

    అబ్బో అన్నట్లు మురారి దేముడు బుజాలెగరేశాడు. చాలా కోపంగా వున్నావే! రామా అని పిలవంగానే శ్రీరామ చంద్రుడే  వస్తున్నాడా! ఏ చిలిపికృష్ణుడో, చిల్లరదేముడో వస్తున్నాడుగాని. ఊ.....మాటలతో తెల్లవారేటట్లుంది. నా బట్టలు తడిసిపోయాయి. ఆ గదిలో వున్న లుంగీ, షర్టు ఓ పెద్ద పాతగుడ్డ, వుంటే ఏదన్నా ఆయింట్ మెంటు, టించరుంటే మరీ మంచిది తెచ్చిపెట్టు" అన్నాడు షర్టువిప్పి పక్కన పడేసి.

    "ఎందుకు?" అంది శృతి.

    "ఎందు కేమిటి నా బట్టలు తడిశాయి కనపట్టంలా?"

    "కనపడుతూనే వుంది. మళ్ళీ వానలో వెళ్ళేవాడికి పొడిబట్టలెందుకు?"

    "నే వెళుతున్నానని ఎవరు చెప్పారు?" తాఫీగా అన్నాడు మురారి దేముడు.

    "ఏమిటి ఇప్పుడెళ్ళిపోవా? భయంతో కళ్ళు పెద్దవి చేసి అడిగింది శృతి.

    "వెళ్ళను."

    "శృతికి కాళ్ళల్లోంచి వణుకు బైలుదేరి నడినెత్తికి పాకింది.

    "ఇందాక ఆ పోలీసు కుక్కలు నీతో చెప్పింది మర్చి పోయావా? నాకోసం ఈ పేటంతా కాపలా పెట్టారుట. అయినా వాళ్ళ కళ్ళుగప్పి పారిపోవటం బ్రహ్మవిద్య కాదు. బైట జోరుగా వర్షం కురుస్తున్నది. పారిపోతూ ఇలా వచ్చాను. ఈ ఏరియా పూర్తిగా నాకుకొత్త. బైట గాఢాంధకారం, దెబ్బతిన్న కాలు బాగా  సల్పుతున్నది. చాలా రక్తం పోయిందేమో కాలు కింద మోపటం కష్టంగా ఉంది. ఈ పరిస్థితులలో పారిపోవటం, అదే పరుగెత్తటం చాలా కష్టం" అంటూ మోకాలుపైకి ప్యాంటు మడిచాడు మురారిదేముడు.

    ఇందాక కంగారులో చూడలేదుగాని ఇప్పుడు చూసింది శృతి. కాలి పిక్కకి  గాయమయి ఇంకా రక్తం ఊరుతూనే వుంది. రక్తం ధారగా కారిన గుర్తు కాలినిండా వుంది. మాసిన తెల్లప్యాంటు రక్తంతో ఎర్రబారి తడిప్యాంటు వల్ల చాలా ఆక్రమించుకుంది ఆ ఎరుపుతనం. "దెబ్బెందుకు తగిలింది?" అని అడిగింది గాయన్నే చూస్తూ.

    "సింపుల్, ఏముంది నే పరుగెత్తుతుంటే పట్టుకోలేక కాల్చారు. నా అదృష్టం బాగుండి గుండు కాలిలో దిగబడలేదు. వరసగా రెండు గుండ్ల పిక్కమీద నుంచి దూసుకుపోయాయి. గాయం బాగానే అయింది ఏదన్నామందు, గుడ్డ ఇస్తే గాయం తుడిచి కట్టు కట్టుకుంటాను."

    శృతి ఏమనుకుందో లేచివెళ్ళి అయిడెక్స్, చినిగినతెల్ల లుంగీ గుడ్డ తెచ్చి ఇచ్చింది.

    తీరుబడిగా తడిగుడ్డతో గాయం చుట్టూ రక్తం తుడిచేసి అయిడెక్స్ రాచి "కాటన్ లేదా?" అని అడిగాడు.

    "ఉందిగాని అది పరుపులు చినిగితే తీసి మూటగట్టిన దూది" కావాలని వీలయినంత వ్యంగ్యంగా అంది శృతి.

    "కొత్త పరుపులు కుట్టించడానికి పనికివస్తుంది దూది. నొక్కి నవ్వుతూఅని సర్రున లుంగీచించి కలికి కట్టుకట్టేశాడు. లేచి నిలబడ్డాడు."ఓ లుంగీ, ఓ షర్టు నా ముఖాన పారేస్తే ఈ తదిబట్టలు విప్పేస్తాను. చలి వణికించేస్తున్నది" అన్నాడు తడి షర్టు విప్పుతూ.

    "అన్నయ్య షర్టు మీకు చాలదు, మా అన్నయ్య చాలా పొట్టి."

    "ఫరవాలేదు ఎలాగోలా తొడుక్కుంటాను, జాకెట్ లావయినా వుంటుందికదా?"

    శృతికి నవ్వొచ్చింది. అంతలోనే తనో దొంగతో, హంతకుడితో మాట్లాడుతున్నట్టుగుర్తుకొచ్చింది. "నే నివ్వను" మొండిగా అంది.

    "సరే! నేనే తీసుకొంటాను" అని పక్క గదిలోకి నడిచాడు మురారిదేముడు.

    శృతి  బిగుసుకుపోయి నుంచుంది.

    మురారిదేముడు కాలికి కట్టు కట్టుకుంటున్నప్పుడు రివాల్వర్ కుర్చీ పక్కనున్న స్టూలుమీద పెట్టాడు. దాన్నక్కడే వుంచి ఇప్పుడు లోపలికెళ్ళాడు. శృతి చూపులు రివాల్వర్ మీద పడ్డాయి.

    శృతి కళ్ళు మెరిశాయి.

    శృతికళ్ళకి రివాల్వర్ మారణాయుధంలా కనిపించలా! ఎడారిలో బిందెడు నీళ్ళు దొరికినట్లనిపించింది.

 Previous Page Next Page