కదల్లేదు. వేళ్ళు గట్టిగా బిగించాడ ఇంకా గట్టిగా.... అబ్బా, యెంత బాధ ఓదుర్చోగలదు? గోళ్ళు గుచ్చాడు. నిద్రలోవలె పక్కకు తిరిగింది, చేయిని తప్పించుకొని. స్త్రీ విషయంలో పురుషుడికి అధికమైన ప్రేమ, ద్వేషంగా మారడం చాలా సులభం. కోపమూ, భగ్నమయ్యే ప్రేమా, అతన్ని పశువుని చేస్తున్నాయి.
వంటావిడా, వెంకట్రావుగారూ తెలుసుకుంటారనే పిరికితనమూ, తన అసహాయత్వానికి కారణమైన దుర్భలత్వమూ, అతన్నంత క్రూరుణ్ణి చేశాయి. ఆమె జడలో యిమడక చెంపలమీద జీరాడే జుట్టుని, దేని మెలికలి చూసి కవులు పరవశమౌతారో, ఆ జుట్టుని పట్టుకుని గట్టిగా లాగాడు. సిగ్గూ, భయమూ, జాలీ అన్నీ పోయినాయి. గట్టిగా యింకా గట్టిగా లాగాడు. దిండుమీద నుంచి తల పైకిలేచింది. బాధతో మొహం ముడుచుకుంది. ఇంకా అరవదేం? ఇంకా బతిమాలుకోదేం? ఇంకా ఓడిపోదేం! క్రౌర్యం హెచ్చుతోంది. బాధ పెట్టాలి- నరకాలి. చంపాలి. అర్ధంకాని ప్రోత్సాహాలు సముద్రతరంగాలవలె హృదయంలో వూగిపోతున్నాయి. అదంతా ప్రేమంటే నమ్మడు.
చేత్తో జుట్టు పట్టుకుంది.
"అబ్బా" అంది జాలిగా, ఉత్సాహం తక్కువయింది. అతనికి, రెండోవేపు జుట్టు పట్టుకుని లాగాడు. వేడిగా శ్వాస ఒస్తూంది. బాధకు లోబడి, చెయ్యి ఒదిలేసి కూచుంది, ఏమనదు. జుట్టు వూడిపోతుందేమే ననిపించింది.
కోపం వచ్చింది. తల తిరిగింది. ఇంకేం చేస్తాడు? తల పట్టుకుని విసిరి వెనక్కి కొట్టాడు. గోడకు తగిలి "దబ్" మని శబ్ధమయింది. ఇల్లంతా మేలుకొని చూస్తున్న దనిపించింది. ఒక్కనిమిషం యిటూ అటూ చూశాడు. చప్పున కూలబడి యేడ్చాడు. ఎండాకాలంలో వురిమి చప్పున నిశ్శబ్ధమైన చల్లని గాలివేసి, వర్షించి నట్టయింది. గుండ్రని చేతులు తలకింద పెట్టుకుని గుడ్లువిప్పి రెండు నిమిషాలు రవణ అతనికేసి చూచింది, అతను యేడుస్తూంటే తను పడుకున్నందుకు సిగ్గుపడి చప్పున లేచి నుంచోబోయింది. వెళ్ళిపోతుందనుకుని, గోపాలరావు చెయ్యి పట్టుకుని కూచోబెట్టాడు. సిగ్గుపడుతూ చెరుగుతో అతని కళ్ళు తుడిచి, సిగ్గెక్కువై కళ్ళు వాల్చి, వూరుకుంది. గోపాలరావు దగ్గిరికి జరిగాడు. ఆమె చేతులు అతని మెడచుట్టూ కలిపింది. గోపాలరావు కన్నీళ్ళు ఆమె ఒళ్ళో పోగుపడుతున్నాయి. ప్రతి వేడిచుక్కా ఆమె తొడల్ని ఒణికించింది. ఆమెకు మాట్లాడాలని వుంది. సిగ్గు, కంఠాన్ని నొక్కుతోంది. సిగ్గుతో పోరాడి జయించింది.
"ఎందుకు ఏడుస్తారు?"
కంఠం సంతోషాన్ని సూచిస్తూంది. తనకోసం ఏడుస్తున్నాడు భర్త! తను తన బాధ కారణం.
"నిన్ను బాధించాను"