సాయంత్రం దోవలో తూముమీది వొంతెనమీద కూచున్నాడు. రవణ వొస్తుందన్న ఆశ పూర్తిగా వుంది. తను అంత గట్టిగా చెప్పిం తరువాత నిర్లక్ష్యం చేస్తుందా? వొంటరిగా ఆడది కొత్తవూళ్ళో ధైర్యం చేసి యెట్లా రాగలదా అనే సందేహం అతనికి రాలేదు. నాలుగైదుసార్లు రవణకోసం రోడ్డు వెతికాడు. అతని ముందు చెవులూ, తోకలూ ఆడిస్తో గడ్డి మేస్తున్నాయి ఆవులు. ఎవరో ఒకామా, ఒకాయనా సైకిళ్ళ మీద వెడుతున్నాకు. అతనికి యీర్ష్య కలిగింది. వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది. ఎంత స్వేచ్ఛగా నవ్వుకుంటున్నారూ! ఊరపిచ్చుకల గుంపు కదలకుండా కూచున్న అతని కాళ్ళముందువాలి, రివ్వున యెగిరి పోయింది.
చీకటి పడుతోంది. క్రమంగా చెట్లూ, రోడ్డూ మాయమవుతున్నాయి అతని దృష్టి నించి. నిరాశా, రోషమూ, దుఃఖమూ కమ్ముకున్నాయి అతని మనసుమీద. చీకటిపడ్డ తరువాత బైలుదేరుతుందేమో! "నిజంగానే వొకసారివస్తే. ఇంత యేడిపించినందుకు రెండు చెంపలూ గట్టిగా వాయించి".... పాపం యేడుస్తుంది అప్పుడు దగ్గిరకి లాక్కుని గట్టిగా చేర్చుకుని, అన్ని అపరాధాలూ మరచిపోవచ్చు. రాకూడదూ? రాదు. మళ్ళీ కోపం వచ్చింది. ఎందుకు తన నిట్లా బాధపెట్టాలి తనభార్య! కానీ, కానీ యెన్నటికన్నా తన యింటికి రాకపోదుకద! తన అధికారం లోంచి తప్పించుకోలేదు కద! అప్పుడూ - యీ కసి అంతా తీర్చుకోవాలి. ఏడ్చి పాదాలమీద పడి వేడుకున్నా క్షమించకూడదు.
అతను లేచేప్పటికి, చంద్రుడు తాటిచెట్ల వెనక నించి సముద్రం లోంచి మల్లే పచ్చగా వుదయించి గోపాలరావు కాళ్ళ దగ్గిర వున్న నీళ్ళలో పక్కున నవ్వాడు. అంతా నిశ్శబ్దం. ఎక్కడ వున్నానని చుట్టూ చూశాడు. చుట్టూ యిసిక మైదానం, వొంటరిగా తను, వెనక అడవి, అతని హృదయంలో పెద్దశాంతి వొచ్చింది.
ఇంటికి వెళ్ళేటప్పటికి తన శాంతి అంతా అబద్ధమని తోచింది. తానిందాకటి నించి పొందిన వైరాగ్యం కల, తన భార్యా, ఆమె నిర్లక్ష్యమూ, తన అసహాయత్వమూ, అవే సత్యం-స్థిరమైనవి. గుండెల్లో బరువు తోచింది. ఈ లోకంలోకి, ఈ కష్టాలలోకి మళ్ళీ యెందుకు వొచ్చానా, ఆ భావ ప్రపంచంలోంచి అనిపించింది. భోజనం చెయ్యాలని లేదు. కాని వంటావిడ కాచుకుని కూచుంది. వెంకట్రావుగారు గదిలో కూచుని వున్నారు, తనమీద ఆదుర్ధా వల్లనే నేమో! భోజనానికి రమ్మంది ఆవిడ రానంటే ప్రశ్నలు, ఏవో అబద్ధాలు, ఇవన్నీ నిర్వహించలేదు. భోజనం చేసే బాధే నయం.
ఏం తింటున్నాడో తెలీకుండా తిని, చెయ్యి కడుక్కుని బైటపడ్డాడు. అంతసేపూ రవణ యేమయిందా, తను అన్నానికి రాలేదనే ఆదుర్దా కూడా లేదు కదా ఆమెకి-అని జిజ్ఞాస పడుతోనే వున్నాడు. చెయ్యి తుడుచుకుంటో హాల్లోపలికి వొచ్చేటప్పటికి ఆ మూల మంచం మీద పడుకున్న రవణ కనపడ్డది. దగ్గరలో ఎవరూ లేరు, చప్పున పక్క దగ్గరకి నడిచాడు.
"ఒకసారి, బైటికిరా, మాట్లాడాలి
రవణ మాట్లాడలేదు. నిద్రా? కాదు. తప్పక దొంగ వేషమే. అబద్ధపు సిగ్గు. ఒంగి నడుంమీద చెయ్యేసి కోపంతో కదిలించాడు. అతని మనసంతా కోపం మీదనే వుంది. కాని చేతివేళ్ళ చివరలనుంచి, ఆనందతంత్రులు చలిస్తున్నాయి. హృదయంలోని కోపం అటూ ఇటూ బెదిరి, పొంగి పాలమీది మడ్డివలె పక్కలకు ఒదుగుతోంది. కోపంతో మండే కళ్ళతోనే, దగ్గిరగా కలుసుకున్న ఆమె పెదిమలూ, చంపలమీద పడుకున్న కనురెప్పల చివర్లూ చూస్తున్నాడు. కాని కోపాన్ని అతను ఒదల తలచుకోలేదు. ఆమె బుజాన్ని గట్టిగా పట్టుకొని సౌఖ్యపడుతో వూయించి - గట్టిగా గొంతుక శబ్దం కాకుండా, "ఒస్తావా, రావా? రావూ? పెంకితనం వొదులుస్తా వుండు."