Previous Page Next Page 
వివాహం పేజి 40

   
    నువ్వు ఒచ్చింది, తనొళ్ళో ఏడుస్తూన్న ఆ పెద్దపాపని చూసి.

    "మరి ఎందుకు అట్లా చేశారు."

    "మరి ఎందుకు రాలేదు నువ్వు?"

    ఎందుకు రాలేదో రవణకి తెలీదు. ఎందుకంత వుగ్రుడైనాడో అతనికీ తెలీదు. ఆమె పెంకితనమూ అతని కోపమూ రెండూ పురాతనం నుంచి ఒచ్చే "యిన్ స్టింక్ ట్సు" అని తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం? తెలిసిన వాళ్ళందరూ తప్పించుకో గలుగుతున్నారా?

    "అందరూ యామంటారు?"

    "ఎవరేమంటే మనకేం?"

    రవణకంటే తానెక్కువగా యితరుల అభిప్రాయాలకు జంకుతానని అతనికి తెలీదు, తెలుసుకోలేడు.

    "ఎందుకు నన్ను రమ్మన్నారో చెప్పనేలేదు."

    "ఇక్కడా? బైటికిరా."

    "బైటికా? ఎందుకు? ఇక్కడ చెప్పండి."

    ఏమన్నా వుంటే అక్కడే చెప్పును. రవణ కావాలి.

    "ఇక్కడకాదు. రా"

    "ఈవాళకాదు. రేపు"

    ఎంత బతిమాలినా రాలేదు, వంటావిడ ఒస్తూన్న చప్పుడయిందాకా తగాదా జరుగుతూనే వుంది.

    రాత్రంతా ఒంటరిగా పక్కమీద పడుకుని యోచించుకున్నాడు, రవణ యెందుకురాదా? అని. అంతమాత్రం పెంకితనం లేక భర్తకి జడిసి ఎట్లా చెబితే అట్లా వినే భార్య వుత్త అవివేకి అనీ, అటువంటి నిస్సత్తువ మనిషిమీద భర్తకి త్వరలో విసుకు వస్తుందనీ తెలుసుకోగలడా? ఎన్నేళ్ళకో గానిరాదు ఆ జ్ఞానం ఎంతో అనుభవంమీదగానీ. అప్పుడు ఆ జ్ఞానం అనవసరం. టూలేట్. ఈలోపల ఎన్ని తప్పులో! యెంత విచారమో! ఎంత వేస్టు! అనుభవం కలవాళ్ళు చెప్పరు. చెప్పినా తెలుసుకునే స్థితిలో వుండరు, చిన్నవాళ్ళు.

    రవణకి యీ పెంకితనమంతా కూడా అతనికి చవకగా లోబడ కూడదని! అతని హృదయాన్ని కట్టివెయ్యాలనీ, తన వ్యక్తిత్వం నిలుపుకోవాలనీ, తన చాతుర్యం, స్వంతబుద్ధి నశిస్తే తనే నశిస్తుంది. ఆ జ్ఞానం "యిన్ స్టింక్టు" రూపాన సృష్టే యిస్తుంది. అమెరికా ఆలోచనలు లేవు. కాని గుడ్డిగా సృష్టి ఆజ్ఞలకు, తన స్వరోక్షణోపాయాలకు లోబడి వర్తిస్తోంది. మూర్ఖులైనవారు అధికారం చూపి, నలిపి, చంపి శవాల్నిచేసి, స్త్రీలను అవతల పారేస్తారు. యింతమాత్రం తెలీక వాళ్ళు తన ఆజ్ఞలకు తిరగబడుతున్నారని అనుకుంటారు.

 Previous Page Next Page