అ శబ్దానికి రాధిక తలుపు కొంచంగా తెరచి తల బయటకు పెట్టి చూసింది. హిమరేఖ అలా పైట తొలగిపోతున్న సంగతి కూడా పట్టించుకోకుండా విరగబడి నవ్వటం, సురేష్ ఆమెకు అతి సమీపంగా కూర్చుని ఉండటం గమనించేసరికి హటాత్తుగా ఆమె శరీరంలో మంటలు భగ్గుమన్న ఫీలింగ్ కలిగింది.
ఈ కొద్దిపాటి పరిచయంలోనే ఇద్దరూ అంత క్లోజ్ అయిపోయారా? ఎలా సాధ్యమది? హిమరేఖ కారక్టర్ మీద తనకు మొదటి నుంచీ అనుమానంగానే ఉంది. ప్రతినెలా రెండు మూడు రోజులు భర్తతో పోట్లాడి పుట్టింటి కెళ్ళిపోతుంటుంది.
అయినా ఈ సురేష్ కే మొచ్చింది -- దాంతో పడి పడి కబుర్లు చెప్పటానికి ? తననుకున్నది కరెక్టే చిల్లర గాంగ్! అందుకే కాస్తంత ఛాతీ నడుమూ బావుండే సరికి దాని దగ్గర సెటిలయిపోయాడు.
కావాలనే తలుపు దభేలున మూసిందామే.
హిమరేఖ ఉలిక్కిపడింది.
"రాధికేనా తలుపులలా విసిరి కొట్టింది ?" ఆశ్చర్యంగా అడిగింది.
"ఇంకా అనుమానం ఎందుకు?"
"ఎందుకలా వేసింది? ఏదో కోపంలో ఉన్నట్లు "
"నా మీద కోపం"
"ఎందుకు?"
"అదే ఇందాక జోక్ చెప్పాను కదా! అది సరే గానీ మీ అయన కూడా నా బాపతేనా?"
ఆమె నవ్వేసింది.
"మా ఆయనే కాదు. మొత్తం మొగాళ్ళందరూ ఒకటే బాపతనుకుంటాను ."
"మీ సంసారంలో ఏమయినా ప్రాబ్లమ్ ఉందా?"
"అంత పెద్ద ప్రాబ్లమేం కాదు! నేను అతన్ని సిన్సియర్ గానే ప్రేమిస్తున్నాను. అతనూ నన్ను సిన్సియర్ గానే ప్రేమిస్తున్నాడు. నేను లేకుండా ఆటనుండలేడు. అతను లేకుండా నేనుండలేను. ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం! ప్రతిరోజూ ప్రణయం జరపకుండా ఉండలేము ఏ గొడవా లేకుండా , మాటా మాటా అనుకోకుండా ఇద్దరి మాటలు ఒకే మాటగా ఇద్దరి తనువులూ ఒకే తనువుగా -- రోజులు గడుపుతున్నాం."
"మరింక ప్రాబ్లం ఏముంది మీకు?" అనుమానంగా అడిగాడు.
"లేకపోవటమేమిటి? ఈ విషయాలన్నీ మా హజ్ బెండ్ కి ఎలా చెప్పాలో అర్ధం కావటం లేదు."
సురేష్ అదిరిపడ్డాడు.
"మీరిందాకటి నుంచీ చెప్పింది ఇంకెవరో గురించా?"
"ఛీ! 'ఎవరో' అంటారేమిటి ? నా స్వంత లవర్ అతను.....మేమిలా రోజూ కలుసుకుని ఏకాంతంగా గడపటం మా వారికి అనుమానం కలిగించినట్లుంది! అప్పటి నుంచి నాతొ మనసు విప్పి మాట్లాడటం లేదు. దూరం దూరంగా మసులుతున్నారు."
తలుపులు రెండోసారి ధభేలు మని మూసుకోవటం వినిపించేసరికి హిమరేఖ చటుక్కున లేచి నిలబడింది.
"మధ్యలో మీ సంసారం కూడా కూలిపోతుందేమో ...... నే వెళ్తా " అనేసి తన గది వేపు నడిచింది. సురేష్ అక్కడే పచ్చిక మీద పడుకున్నాడు.
"రాత్రంతా ఆ గదిలో గొడవ పడుతూ పడుకోవటం కంటే ఇదే బెటరనిపించిందతనికి.
కళ్ళు మూతలు పడబోతుండగా వినిపించిందామే గొంతు.
"ఇక్కడ పడుకున్నారేమిటి? త్వరగా లోపలకు రండి!" రాధిక నెమ్మదిగా అంటోంది .
"ఎందుకు ?"
"ఇప్పుడే మా స్టెనో జ్యోతి వచ్చి చెప్పింది. మా బాస్ కి నా మీదా హిమరేఖ మీద అనుమానంగా ఉందిట పెళ్ళయినట్లు మేము అబద్దాలు చెప్పామని .....అందుకని మమ్మల్నిద్దరిని అబ్జర్వ్ చేయడానికే చెరో వేపు రూమూ కేటాయించాడట ,మనకి" మళ్ళీ కాళ్ళ బేరానికి కొచ్చేసింది.
మనం గదిలో కెళ్ళాక ఇంకెలా అబ్జర్వ్ చేస్తాడు ?"
'అందుకే మన గదులకు అద్దాలు పగిలిన కిటికీలున్నాయ్"
సురేష్ లేచి లోపలకు నడిచాడు.
రాధిక తలుపులు మూసేసింది.
ఆమె కింద వేసుకున్న దుప్పటి ఇప్పుడు మంచం మీదే ఉంది.
"కింద వేసిన పక్క ఏదీ?" అడిగాడు సురేష్.
మంచం మీదే వేశాను. ఇద్దరం మంచం మీదే ఎడ్జస్టవక తప్పదు...... ఎండి గారు ఏ వెంటిలేటర్ లో నుంచో కిటికిలో నుంచో చూడవచ్చని జ్యోతి చెప్పింది. ఆ సమయంలో మనం మంచం మీద ఒకళ్ళు కింద ఒకరు పడుకుని వుంటే ఆయనకు అనుమానం రాదూ?"
"ఓహో ఇందుకా కాళ్ళ బెరానికొచ్చారు. నాకు తెలుసులెండి మీ మెంటాలిటీ! అందితే జుట్టు అందకపోతే కాళ్ళు."
"నేను జుట్టు పట్టుకున్నట్లేప్పుడూ ప్రవర్తించలేదు.
"పోనీ ........అవసరం తీరాక అల్లుడుగారు మల్లిగాడయ్యడంట...... అది సరిపోతుందా మీకు?"
"ప్లీజ్! నెమ్మదిగా మాట్లాడండీ! మన మాటలు పక్క గదిలోకి వినబడినా వినబడవచ్చు. చూశారా రెండు గదులకూ మధ్యలో కూడా వెంటిలేటరుంది."
"సరే పడుకోండి మరి ....."
"ముందు మీరు ....."
ఆమె లైటార్పి మంచం మీద ఓ కొనకు పడుకుంది.
అతను నీడలా కదిలి మంచం చుట్టూ తిరిగి వస్తుంటే ఆమెకు భయం వేసింది. చీకటిని ఆసరాగా తీసుకుని "తననేమీ చేయదు కదా? అతనేమయినా చేసినా ఎదురు మాట్లాడ్డానికి వీల్లేని పరిస్థితిలో ఉంది తను. అతను తనను బలవంతం చేసినా తన నోరు విప్పడానికి వీల్లేని స్థితి --" అందరి దృష్టిలో అతను తన భర్త !
అతను తనకు సమీపంగా వచ్చినట్లనిపిస్తోంది.
హటాత్తుగా అతను బట్టలు విప్పుతున్న శబ్దం ------
రాధిక గుండెలవిశిపోయినయ్.
ఒక్క ఉదుటున లేచి లైట్ స్విచ్ వేసింది.
వెలుగులో అతను లుంగీ కట్టుకుంటున్న దృశ్యం చూసి కెవ్వున కేకవేసి తల పక్కకు తిప్పుకుంది.
"ఏమిటా కేకలు? లైట్ స్విచ్ ఎందుకేశావు? నేను డ్రస్ మార్చుకుంటున్నాను.
"అయినా మీరేదెంపని? ఎదురుగా ఓ అమ్మాయి వుండగా బట్టలు మార్చుకుంటారా?"
"మీరు లైట్లేసుకు చూస్తారని నేను కలగన్నానా?"
ఆమె మళ్ళీ మంచం మీద పడుకుని గోడ వేపు తిరిగింది.
సురేష్ కూడా మంచం మీద పడుకుని లైట్ తీసేశాడు.
రాధికకు అనుమానం వచ్చింది. చీకట్లో మగాడిని చస్తే నమ్మడానికి వీల్లేదు. ఎన్నో త=ఎగ్జాంపుల్స్ తెలుసు తనకు.
"నాకు చీకటంటే భయం! నైట్ బల్బ్ అన్ చేయండి."
సురేష్ లేచి స్విచ్ వేశాడు.
నైట్ బల్బ్ అన్న మాటే గానీ చాలా వెల్తురు వస్తోంది.
రాధికకు నిద్ర పడుతుండగా వెంటిలేటర్ కిటికీ రెక్క కిర్రుమన్న శబ్దంతో కదిలినట్లనిపించింది.
రాధిక నిద్ర కాస్తా ఎగిరిపోయింది.
చటుక్కున లేచి వెంటిలేటర్ వేపు చూసింది. అద్దం వెనుక ఎవరిదో తల ఉన్నట్లు కనబడుతోంది లీలగా ---
నిజంగా ఎండి నిలబడి తమను కనిపెడుతున్నాడా? కనిపెడితే ఏమవుతుంది ?
మంచానికి ఓ మూల తనూ మరో మూల సురేష్ ఒకరి కొకరు సంబంధం లేనట్లు పడుకుని ఉండటం అతని కంటపడుతుంది.
వయసులో ఉన్న భార్యా భర్తలు అలా శత్రువుల్లా దూరంగా మొఖాలు చూసుకోకుండా పడుకుంటారా ఎక్కడయినా?
ఏమో ! తనకు తెలీదు.