Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 38

 

    మైత్రేయి మరింత భయంతో సురేష్ ని వెనుక నుంచి కౌగలించుకుంది.
    "సురేష్! ప్లీజ్! ఆమె నా మీదికి రాకుండా చూడు" భయంగా అంటోంది.
    సురేష్ రాధిక చేయి పట్టుకుని కన్ను గీటాడు.
    "రాధికా! పద వెళ్ళిపోదాం!" అంటూ బలవంతంగా ఆమెను గది బయటకు లాక్కొచ్చేశాడు.
    ఇద్దరూ తలుపు బయటకు రాగానే తలుపులు దభేల్ మని మూసేసింది మైత్రేయి.
    "థాంక్ గాడ్! ఈ రాత్రికి తప్పించుకున్నాం" మెట్లు దిగుతుండగా అన్నాడు.
    రాధిక అతని చేయి విదిలించి కొట్టింది.
    "ఆ డాక్టర్ కి నేను మెంటల్ నని అబద్దం చెప్పారు కదూ?" సీరియస్ గ అడిగింది.
    "ఆ మాట నిజమే కదా!"
    "మెంటల్ కేస్ ని నేను కాదు మీరు!" మండిపడుతూ అంది.
    "నిమిషాని కోసారి కోపం తెచ్చుకునే వాళ్ళనే మెంటల్ అంటారు."
    "షటప్!"
    "హల్లో" శివరావ్ గొంతు విని ఇద్దరూ వెనక్కి తిరిగారు.
    కింద మెట్లు దగ్గర నిలబడి ఉన్నాడతను.
    "కమాన్! మీ కోసమే వెయిట్ చేస్తున్నాను."
    ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ అమాంతం ప్రేమగా చేతులు పట్టుకుని కిందకు దిగారు.
    "ఏమిటి ఏదో పేచీ పడుతున్నట్లున్నారు?"
    రాధిక కలవరపడిపోయింది. ఏం చెప్పాలో తెలీలేదు.
    "అదే సార్'! డాక్టర్ మైత్రేయి మాతో చేయిస్తున్న ఎక్స్ పెరిమెంట్ సక్సెస్ అయితే ఆడపిల్లే పుట్టాలని రాధిక అంటోంది. నేను దానికి వ్యతిరేకం."
    "ఇంతకూ డాక్టర్ ఏమంది?"
    "రేపు అంటే -- ఎల్లుండి వాళ్ళ డిప్సేన్సరీ కి రమ్మంది "
    "ఇక్కడ ఎగ్జామినేషన్ అయిపోయిందా?"
    "చాలావరకూ అయిపోయినట్లే"
    "వెరీ గుడ్! రిజల్ట్ రేపు వస్తుందా?"
    "ఈ రాత్రికే ఏదొక టైం లో రావచ్చు"
    "అయితే కెరీ అన్ -- కెరీ అన్"
    "గుడ్ నైట్ సార్" ఇద్దరూ ఒకేసారి చెప్పి తమ గదిలోకి నడిచారు. లోపలకు అడుగు పెట్టగానే గది తలుపు అమాంతం మూసి వేసింది రాధిక.
    "ఇదేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "లేకపోతే మళ్ళీ లోపలికొస్తారేమో"
    "వస్తే రానీ! భయమెందుకు ?"
    "రాధిక కుర్చీలో కూర్చుంది. సురేష్ కిటికీ దగ్గర కెళ్ళి నిలబడ్డాడు. వెన్నెల కిటికీలో నుంచి లోపలకు ప్రవహిస్తోంది మత్తుగా.
    "ఈ రాత్రికి ఇద్దరం ఈ గదిలోనే గడపాలా?" అడిగాడు.
    "అవును! అంతకంటే గత్యంతరం లేదు. కానీ గదిలో ఒంటరిగా ఉన్నాను కదా అని పిచ్చి వేషాలేస్తే మాత్రం బుద్ది చెప్పగలను జాగ్రత్త!" అనుమానంగా అంది.
    సురేష్ చిరాగ్గా చూశాడు.
    "మీ అందాల మీద అంత ఎక్కువ ఆశలు పెట్టుకోకండి! నిరాశ పడతారు"
    తనుహించినట్లే బాణంలా గుచ్చుకుందా డైలాగ్.
    రోషంగా, పౌరుషంగా , ద్వేషంగా చూసింది.
    "నేను నా అందాల మీద ఆశతో కాదు మాట్లాడింది! మీలాంటి వాళ్ళ చీఫ్ కారెక్టర్ మీద నమ్మకంతో ---"
    "గంతకు తగ్గ బొంతను! దాని కేవరేం చేస్తారు?"
    ఆమె ఇంక మాట్లాడలేకపోయింది.
    "హు! మీతో మాట్లాడటం నాదీ బుద్ది తక్కువ"
    సురేష్ బెడ్ మీద పాడుకుంటూ లైటార్పి వేశాడు.
    రాధిక చటుక్కున వచ్చి మళ్ళీ లైట్ వేసింది.
    "మీరు బెడ్ మీద పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి?' అడిగింది చిరాకుగా.
    "కింద!"
    "నాకెప్పుడూ కింద పడుకోవడం అలవాటు లేదు."
    "ఇప్పుడలవాటవుతుందిలెండి !"
    ఆమె కోపంగా అతని కాళ్ళ దగ్గరున్న బెడ్ షీట్ లాక్కుని కింద వేసి దాని మీద అతని తల కింద నుంచి ఓ దిండు లాగేసి వేసుకుంది.
    "నాకు తెలుసు! మీ కల్చర్ ఇంతకంటే గొప్పగా ఉండదని --"
    సురేష్ నవ్వాడు.
    "మొగుడిని నేల మీద పడుకోబెట్టే కల్చర్ మాటేమిటో."
    రాధికకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయ్. "యూ కెన్ నెవర్ బి మై హజ్ బెండ్! మైండిట్ - అంత హీన దశకు నేనెప్పుడూ చేరుకొను."
    "ఇవాళ తప్ప " ఇంకా నవ్వుతూనే అన్నాడు.
    "మీరు కాసేపు బయటకి వెళ్ళండి !"
    "ఎందుకు ?"
    "నేను చీర మార్చుకోవాలి !"
    "లైటార్పి మార్చుకోండి !"
    "షటప్! ఇంకోసారలా మాట్లాడితే మర్యాదగా ఉండదు మీ వేషాలన్నీ నాకు తెలుసు !"
    "ఇందులో వేషాలెం ఉన్నాయ్? నేనేం పెద్ద పులిననుకున్నారా? చీకట్లో కూడా చూడ్డానికి?"
    "మీరు వెళతారా. వెళ్ళరా?"
    సురేష్ లేచి కూర్చున్నాడు. "అల్ రైట్! వెళతాను! ఎడ్చేయకండి!"
    బయటకు నడిచాడు.
    గార్డెన్ లో వెన్నెల కాంతిలో పచ్చిక మీద పడుకున్న ఆకారం కనిపించి దగ్గరకు నడిచాడు. మొఖంలో మొఖం పెట్టి చూడబోతుంటే ఆమె మాట్లాడింది.
    "నేనేలెండి, హిమరేఖను!"
    "ఓ ! మీరా! మీవారింకా అంటార్కిటికా నుంచి రాలేదా?"
    "లేదు -- మీరిలా వచ్చారేమిటి ? నిద్ర పట్టటం లేదా?"
    "పడుతుందేమో అన్న భయంతోనే బయటికొచ్చాను ."
    ఆమె నవ్వేసింది.
    "అంత అందమయిన పెళ్ళాం పక్కనుంటే ఎలా పడుతుంది ?"
    "ఎంత అందంగా ఉన్నా ఇంట్లో పెళ్ళాం -- ఇంట్లో పెళ్ళామే" ఆమె పక్కనే కూర్చుంటూ అన్నాడు.
    "అంటే?"
    "భార్యంటే మొఖం కొట్టిన ఓ పెద్ద మనిషి భార్యతో పశువుల సంత కెళ్ళాడు.
    "ఈ ఎద్దు కొనండి సార్! సంవత్సరంలో అరవై పిల్లలు పుట్టాయ్ దీనికి" అన్నాడు ఒకడు.
    పెద్దమనిషి భార్య ఆ ఎద్దుని ముచ్చటగా చూసింది.
    "చూశారా! అలా ఉండాలి.' అంది ఈసడింపుగా భర్త వంక చూస్తూ.
    "కానీ ఆ అరవై పిల్లలు ఒక అవుకే పుట్టాయా?' అడిగాడు పెద్ద మనిషి ఎద్దు అసామీని!"
    "కాదు సార్! అరవై అవులకు పుట్టాయ్."
    "చూశావా ! అలా ఉండాలి " అన్నాడా పెద్ద మనిషి భార్య వంక ఈసడింపుగా చూస్తూ -- ఇప్పుడర్ధమయిందనుకుంటాను."
    హిమరేఖ లేచి కూర్చుని మరీ తుళ్ళి తుళ్ళి నవ్వసాగింది.

 Previous Page Next Page