ఈనాటికి నాకేమీ డబ్బు లేదనే రహస్యం బయటపడేసరికి భరించలేకపోయాను. ఇన్నాళ్ళుగా డబ్బున్న వాడిననే భ్రమతో నన్ను గౌరవించి నాకు అగ్గగ్గలాడిన సమాజం ఈనాడు డబ్బులేదని చులకనగా చూస్తుందనుకొంటే భరించలేకపోయాను. ఎక్కడికైనా దూరంగా పారిపోవటానికి నిశ్చయించుకున్నాను.
అలా వెళ్ళిపోబోయే ముందు చివరిసారిగా మిమ్మల్నందర్నీ చూడాలని అక్కడికి వచ్చాను. అప్పుడు నువ్వు ఇంట్లో లేవు, జ్యోత్స్నని చూడాలని జ్యోత్స్న ఇంటికి వెళ్ళాను.
నాకు డబ్బు ఉన్నదని అనుకున్నప్పుడూ, లేదని అనుకున్నప్పుడూ, ఒక్కలాగే మాట్లాడిన వ్యక్తి జ్యోత్స్న ఒక్కర్తే.... అంతేకాదు - నా పరిస్థితికి సానుభూతి ప్రకటిస్తూ నేను బాధపడుతోంటే చూసి ఆనందించాలని ప్రయత్నించనిది కూడా జ్యోత్స్న ఒక్కర్తే! నా డబ్బు విషయం - ఇన్ కంటేక్స్ ఆఫీసర్స్ చేసిన రెయ్ డ్స్ - ఇవేమీ మాట్లాడకుండా, కాఫీ ఇచ్చి మామూలు లోకాభిరామాయణం మాట్లాడింది.
అప్పటివరకూ ప్రశ్నలతో నన్ను వేధించిన వాళ్ళకి సమాధానాలు చెప్పి చెప్పి విసిగిపోయిన నాకు జ్యోత్స్న ఒక దేవతలాగ కనిపించింది.
"జ్యోత్స్నా! నన్ను పెళ్ళిచేసుకోగలవా?" అని అడిగాను - తెల్లబోయింది జ్యోత్స్న.
"ఇది నా ప్రార్థన. ఇంతవరకూ అందర్నీ నాకు డబ్బుందనే భ్రమలో దించి ఆ గొప్పతనమే ఆధారంగా బ్రతికాను. ఇప్పుడది కదిలిపోయింది. మళ్ళీ అలాంటి ఆధారం నిర్మించుకోవటానికి నువ్వే నాకు శరణ్యం. నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటే లోకానికి నీమీద ఉన్న అపోహల్ని బట్టి నువ్వు నన్ను డబ్బు కోసమే పెళ్ళి చేసుకున్నావనీ, నేను ఇన్ కంటేక్స్ అధికారుల కళ్ళు గప్పి నల్లధనం ఎక్కడో ఎలాగో దాచాననీ ఊహాగానాలు ప్రారంభిస్తుంది లోకం.... అంతే కావాలి నాకు. నువ్వు బి.ఏ. పాసయ్యావు. నాకు తెలిసినవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు మంచి ఉద్యోగం ఇప్పించగలను.... నిన్ను అన్యాయం చెయ్యాలనుకుంటున్నానని అనుకోకు. నువ్వు ఇప్పటికీ ఎవరినైనా పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటే నిన్ను బలవంతపెట్టను. కానీ, నన్ను క్షమించు.... నేను విన్నదాన్ని బట్టి నీకు అనుకూలమైన సంబంధంతో నీకు పెళ్ళి జరిగే అవకాశం లేదని అనుకుంటున్నాను. నేను నీకు తగినవాణ్ణి కాదు. కానీ, సర్వ విధాలా నీకు సుఖశాంతులు కల్పించటానికి ప్రయత్నించగలను."
నా మాటలు విన్న జ్యోత్స్న కొంచెం సేపు ఆలోచించి నన్ను పెళ్ళిచేసుకోటానికి ఒప్పుకుంది.
"ఈ రోజే నన్ను మీతో తీసుకుపొండి" అంది.
నేను సంతోషంగా ఒప్పుకున్నాను. గురువారంనాడు ఇద్దరమూ అక్కడ నుండి వచ్చేశాము, శుక్రవారంనాడు ఇక్కడ పెళ్ళిచేసుకున్నాము. జ్యోత్స్నకి బొంబాయిలోనే ఉద్యోగం దొరికింది. రెండు మూడు రోజుల్లో బయలుదేరి మీ దగ్గిరికి వచ్చి మిమ్మల్ని చూసి మేమిద్దరమూ బొంబాయి వెళ్ళిపోతున్నాము.
సుశీలకు ఈ ఉత్తరం చదివి వినిపించు - దానికి వేరే ఉత్తరం రాయలేదు నేను -
"ఆశీస్సులతో
వెంకట్రావు-"
ఆ ఉత్తరం పక్కకు పెట్టి జ్యోత్స్న ఉత్తరం తెరిచాడు భాస్కర్.
"భాస్కర్ గారూ!
వెంకట్రావుగారి ఉత్తరం చదివితే అన్ని సంగతులూ తెలుస్తాయి. వెంకట్రావుగారిని పెళ్ళిచేసుకోవడంలో నేనే విధమయిన త్యాగమూ చెయ్యలేదు - మీకు చాలాసార్లు చెప్పాను. నేను కోరుకొనేది అతి సామాన్యమైన చల్లని సంసారం - అని. నా సంసారిక జీవితంలో శాంతి భద్రతలుండాలి - అశాంతి, ఆరాటమూ, అపశ్రుతులూ నేను భరించలేను-
మీ ప్రేమని నేను శంకించను - కానీ, ఒక్క విషయం ఆలోచించండి - ఈ క్షణంలో మనం చేస్తున్నది న్యాయమే కావచ్చు - కానీ, ముందు ముందు ఎలా ఉంటుందో? సుశీలగారు పశ్చాత్తాపపడితే - మీరే కావాలనుకొంటే.... నా స్థానమెక్కడ? మీరు నన్ను వదలకపోవచ్చు - కానీ, ఒక అభాగ్యురాలు నన్ను శపిస్తూ వేదనాశ్రువులు గుమ్మరిస్తూంటే నాకు సుఖమెక్కడుంటుందీ?.... అందుకే మీతో రావటం కంటె వెంకట్రావు గారిని పెళ్ళిచేసుకోవటమే మేలని నిశ్చయించుకున్నాను.
నవ్వకండి - నేను ప్రార్థించిన దైవం నా జీవితాన్ని ఈ విధంగా నడిపిస్తోంది - అనుకున్నాను.
నన్ను ఒకరిద్దరు పెళ్ళిచేసుకుంటామని అనకపోలేదు. కానీ వాళ్ళందరూ, నాకోసం ఏదో త్యాగం చేస్తున్నట్లూ,.... నన్ను ఉద్ధరిస్తున్నట్లూ మాట్లాడినవారే! చివరకు ఏకాంబరంగారి దగ్గిరనుంచీ అదే ధోరణి.