"ప్రపంచంలో మహత్తర ప్రేమలు వుంటాయని నాకు నమ్మకంలేదు."
"మీకుకూడా శాంతిలాగే ప్రేమమీద నమ్మకం లేదా?"
"ప్రేమ కొంతవరకూ అంగీకరించవచ్చు కానీ ప్రేమని గురించి త్యాగాలు చెయ్యటంలో అర్థంలేదు."
"ఎందుకని?"
"అందులో ఉన్మాదం వుందికానీ ప్రయోజనం లేదు కాబట్టి."
"కానీ వీటన్నిటినీ మించినది అందులో వుంది."
"ఏమిటది?"
"ఆకర్షణ. ప్రపంచంలో అన్నిటికన్నా బలమైనది ఆకర్షణ."
మాలతి కొంచెంసేపు మౌనంగావుంది. తర్వాత 'మీరెవర్నయినా ప్రేమించారా?' అని అడిగింది.
అతనేమీ జవాబు చెప్పలేదు. ఆమెవంక అలా చూశాడు. జవాబు చెప్పనక్కరలేదు. అతని కళ్ళు, ఆ చూపులు అంతకంటే విపులంగా జవాబివ్వగలవు.
"మరి.....మిమ్మల్ని చూడ్డానికి....రారేం?"
"ఎవరు?"
"మీరు ప్రేమించిన ఆమె."
"లేదు కాబట్టి"
"చనిపోయారా?"
"లేదు"
"లేదని మీకు తెలుసా?"
"చనిపోదని తెలుసు"
"అయితే రావచ్చుగా?"
"రాలేని పరిస్థితిలో ఉండొచ్చుగా?"
"నిజమైన ప్రేమ అయితే ఎలాంటి పరిస్థితినైనా ఛేదించుకురావాలి."
"నిజమే! నేనూ అదే ఆలోచిస్తున్నాను"
"ఆమె చాలా కఠినాత్మురాలయి వుండాలి."
"ఏం?"
"మిమ్మల్నింత నిర్దాక్షిణ్యంగా ఒంటరిగా వదిలినందుకు"
"ఆమె కఠినాత్మురాలే. ఆ కఠినత్వం వెనుకవున్న సొగసు-అదే నేను మంచుశిలలా కరిగిపోయాను"
ఆమె మాట మారుస్తూ "ఈ పుస్తకం ఎవరు రాశారు?" అని అడిగింది.
అతను కవర్ పేజీ వైపు చూస్తూ "ప్రమీలాదేవి. మా సీనియర్ ప్రమీల అని ఒకరుండేవారు. నాకు గుర్తున్నంతవరకూ ఆమె కథలు రాస్తూ వుండేవారు. మరి ఆమే, ఈమే ఒకరో కాదో నాకుతెలీదు. నేననుకున్నవారే అయితే ఎప్పుడో డాక్టరై ప్రాక్టీసో, ఉద్యోగమో చేస్తూ వుండాలి" అన్నాడు సాలోచనగా.
మాలతి హఠాత్తుగా ఏదో గుర్తు వచ్చినట్లు వాచీ చూసుకుంది "ప్రమీలాదేవి అంటే జ్ఞాపకం వచ్చింది. ఎనిమిదిన్నరకు రచయిత్రి ప్రమీలాదేవితో టి.వి.లో ఇంటర్వ్యూ వుంది. ఇంకో అయిదునిముషాలే టైముంది. చూస్తారా?" అన్నది.
"ఇక్కడ టి.వి.వున్నదా?"
"పేషెంట్స్ రిలాక్స్ అవటంకోసం టి.వి. రూం ఒకటి ఏర్పాటు చెయ్యబడింది. రండి చూద్దాం."
అతను బెడ్ మీదనుంచి లేచి నిలబడ్డాడు.
"నడవగలరా? వీల్ చైర్ తీసుకురమ్మంటారా?"
"ఫర్వాలేదు, నడవగలను."
ఇద్దరూ గదిలోంచి బయటకు వచ్చారు. టెలివిజన్ రూం పై అంతస్థులో వుంది. మెట్లు ఎక్కితే అలసట అని అతన్ని ర్యాంప్ మీదుగా తీసుకువెళుతోంది. సగంవరకూ ఎక్కాక అతను ఆగాడు.
"ఏం?"
"ఏమీలేదు" అన్నాడుగానీ అతని నుదుటిమీద చిరుచెమటలు గమనించింది. అర్థం చేసుకుంది. అతని భుజంచుట్టూ చెయ్యివేసి పొదివి పట్టుకుంది.
"ఇలా నామీద అని నెమ్మదిగా అడుగులు వెయ్యండి."
కొంచెంసేపట్లో ఇద్దరూ పైకి వచ్చేశారు.
"నీరసంగా వుందా?"
"ఫర్వాలేదు."
ఇద్దరూ టి.వి.రూంలోకి నడిచివెళ్ళారు. లోపల చీకటిగా వుంది. అప్పటికి ఇంకా ఏడెనిమిదిమంది దాకా కూర్చుని గ్రామీణ అభివృద్ధిమీద వస్తున్న కార్యక్రమం తిలకిస్తున్నారు.
రాజా, మాలతి ప్రక్క ప్రక్క సీట్లలో కూర్చున్నారు.
రెండు నిముషాల తరువాత ప్రఖ్యాత నవలా రచయిత్రి ప్రమీలాదేవితో ఇంటర్వ్యూ అని ఎనౌన్సర్ ప్రకటించింది.
ప్రమీలాదేవి ముఖం క్లోజప్ లోకి వచ్చింది.
"ఆమే ఆమే!" అన్నాడు ఉత్సాహంగా రాజా.
ప్రమీలాదేవికి ఇరవైఆరు, ఇరవై ఏడేళ్ళకంటే ఎక్కువ వుండవు. కానీ ఆమే వయసుకి మించి కనిపిస్తోంది. ముఖంలో నైరాశ్యం, కళ్ళల్లో అన్వేషణ. కొంచెం లోతుకు పోయిన చెంపలు.
ఉభయ కుశలోపరి అయింది.
"చూడండి....మీరు శ్రీమతా? లేక కుమారా?" అనడిగింది ఇంటర్వ్యూ చేసే అమ్మాయి.
"నేనింకా పెళ్ళి చేసుకోలేదు."
"కారణం తెలుసుకోవచ్చా?"
"ఇంతవరకూ చేసుకోవాలనిపించలేదు కాబట్టి."
"మీరు డాక్టరు కదూ?"
"అవును."
"మీ నవలలమీదా, మీ కథలమీదా రచయిత్రిగా పేరు వేసినప్పుడు డాక్టర్ అని ముందు ప్రచురించుకోరేం?"
"నా హాస్పిటల్ బోర్డుమీద డాక్టర్ అని వుంటుంది. రచయిత్రిగా వున్నప్పుడు డాక్టర్ అని రాసుకుంటే అదేదో రచయిత్రి ఇమేజ్ కు అడ్డుపడుతున్నట్టూ, పాఠకులకూ నాకూ మధ్య ఏదో తెర వుంచుతున్నట్లూ ఫీలవుతూ వుంటాను. ప్లీడర్లు పేరుముందు ప్లీడర్ అని, ఇంజనీర్లు ఇంజనీర్ అనీ రాసుకుంటున్నారా? అలాగే సందర్భం కానప్పుడు డాక్టర్ అని రాసుకోవటమనవసరమని నా ఉద్దేశం...."
ఇలా జనరల్ గా కొన్ని ప్రశ్నలు సమాధానాలు సాగాయి.
తర్వాత....