"ఎవరన్నా వచ్చారా?"
"ఎవరన్నా రావటం ఏమిటి?"
"ఆహా! రాత్రి ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నాను. నిన్న రాత్రిగ్నీ, ఈరోజుగానీ-"
"రాలేదే!"
"ఇక రార్లే"
"ఎవరి గురించి నువ్వు చెపుతున్నది?"
"ఇక్కడనుంచి స్కూలు ఖాళీ చేయమన్న వాళ్ళ గురించి...."
"ఇంకరారా- నిజంగానా" ఆమె మొహంలో సంతోషం గుప్పుమంది.
అతడు మాట్లాడలేదు. దూరంగా స్టూడెంట్స్ ని చూస్తున్నాడు. చాలా చిన్నవాళ్ళు. ఇప్పుడిప్పుడే మొగ్గల్లా వికసిస్తున్న వాళ్ళు. అతని చూపు గమనించి ఆమె వివరిస్తున్నట్టూ "ఇక్కడికి నాలుగైదుకిలోమీటర్ల దూరంలో ఇంకో వూరుంది. కొంచెం పెద్దవూరది. అక్కడ ఎలిమెంటరీ స్కూలుంది. ఒకటో క్లాసువరకూ ఇక్కడ నేను చెపుతాను. అదే ఇంగ్లీషులో చెప్పాలంటే యు.కే.జీ., ఎల్.కే.జీ. కూడా నేనే అన్నమాట" నవ్వింది.
"వీళ్ళకి యూనిఫాం కూడా కంపల్సరీ చేసినట్లున్నావే"
"అటువంటిదేమీ లేదు. ఉన్న దాంట్లో కాస్త తెల్లవి వేసుకోమని చెప్తూవుంటానంతే! చూశావుగా ఇందులో చాలామంది బీదవాళ్ళు. అందుకనే ఒకేరకం బట్టలు వేసుకుంటే అందరూ సమానస్థాయి అన్న భావం చిన్నతనం నుంచే అలవడుతుందని నా వుద్దేశ్యం. అవునా"
"అవును. ఇదేభావం పట్టణాల్లోవుంటే యెంతబావుణ్ను".
"అదేమిటి? పట్టణాల్లో ఇది మరీ కంపల్సరీ కదా!"
"కాదు. పబ్లిక్ స్కూల్లో చదువుతూ తెల్ల బ్లూ యూనిఫాం వేసుకున్న కుర్రవాడు, విద్యోదయాలో చదువుతూ తెల్లయూనిఫాం వేసుకున్న కుర్రవానికంటే తనెక్కువ అన్న ఫీలింగ్ తో వుంటాడు. నేను చెప్పేది- అన్ని స్కూళ్ళకీ ఒకే యూనిఫాం వాడటం గురించి, అన్ని స్కూలు పిల్లలంతా ఒకటే అన్న భావం నెలకొల్పటం గురించి..."
ఆమె అనుమానంగా "అది సాధ్యమవుతుందంటావా?" అంది.
"ఎందుకు కాదు? మలేసియాలో అలాగేవుంది. ఇండోనేషియాలో అలాగే వుంది. మన మంత్రులు విదేశాలకివెళ్తే విందులూ వినోదాల్లో మునిగిపోతారే తప్ప ఇంత చిన్న విషయాలు గమనించరు. ఇది మార్చటానికి చిన్న జీ.వో. చాలు. అది తెలుసుకోరు".
"జీ.వో. అంటే గుర్తొచ్చింది. ఎల్లుండే కదూ జనవరి 26. మీరిక్కడో అయిదు నిముషాలుంటారా? మా పిల్లలతో నేను చేయిస్తున్న విన్యాసం మీకు చూపిస్తాను. అలాగే మీకో ప్రోటోకాల్ కూడా" అంటూ లోపలికి నవ్వుతూ పరుగెత్తింది.
నిముషం తరువాత ఒక చిన్న పాప తెల్లగులాబీ పువ్వుని పట్టుకుని జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని దగ్గిరకొచ్చి పువ్వు అతనికి అందించి ముద్దుముద్దుగా అంది - "Tha.... Thank you uncle - for.... for giving us, our school, to continue here".
కంటిచుట్టూ నీటిపొర పేరుకోగా, అతడు నిలువెల్లాకదిలిపోయాడు. అతని చెయ్యిపట్టుకొని పాప గట్టుమీదకు తీసుకువెళ్ళింది. క్రింద మైదానంలో చిన్నపిల్లలు ఇండియా ఆకారంలో నిలబడి వున్నారు. అతడు అక్కడికి చేరుకోగానే, టీచర్ సైగనందుకుని ముక్త కంఠంతో ప్రారంభించారు. పూరించిన వాయువు మురళి నుంచి బయటకు వచ్చినట్టు ఒక్కొక్క పదమే వారి నోటినుంచి లలితంగా - రమ్యంగా బయటికి వచ్చి తీయతేనియ పాటైంది.
జయ.... జయ....జయ.... ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి...
వెళ్ళే పక్షి, పయనించే మేఘం కూడా ఆ పిల్లలకేసి చూడటం కోసం ఆగినట్టున్నాయ్. ఆ పసివాళ్ళకి మాటలు స్పష్టంగా పలకటం కూడా రాదు. అయినా ఆ కంఠాల్లో తపన వుంది 'ముందు నేను భారతీయుడిని. ఆ తరువాత ఆంధ్రుణ్ణి- పంజాబీని- మలయాళీని' అన్న నిజాయితీ వుంది.
జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి!
ఈ కుహన రాజకీయాలు నా కొద్దు. ఈ లంచగొండి వ్యవస్థ నాకొద్దు. ఒక కన్నీటి చుక్కని వేయి చేతులు తుడిచే రోజు కోసం నేను పెరుగుతాను. సమత అనే పలక మీద సమానత్వం అనే బలపంతో 'అ,ఆ'లు దిద్దుకుంటూ నేను వటవృక్ష మవుతాను. కాశ్మీరునుంచి కన్యాకుమారి వరకూ ఒక్కడినై వ్యాపిస్తాను.
జయ జయ సశ్యామల సుశ్యామచలచేలాంచల....
జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ
పిల్లలు ఇంకా పాడుతూనే వున్నారు. అతడు ఆనందంతో, తమకంతో వాళ్ళకేసి చూస్తున్నాడు.
జయ గాయక వైతాళిక గళవిశాల పదవిహరణ
జయమదీయ మధురగేయ చుంబిత సుందర చరణా||
మేమంతా పెద్దవాళ్ళ మవుతాం. కొత్త రాజ్యమొస్తుంది. దశ దిశాంతరాళములు దద్దరిల్లేలా మా భారతమాతని కీర్తిస్తాం! అప్పుడు మా పేపర్ల మొదటి పేజీల్లో పెద్దపెద్ద హెడ్ లైన్లుగా మత హత్యలు, పార్లమెంటు రద్దులు చోటు చేసుకోవు. ముఖ్యమంత్రుల గుండెపోట్లు, ముఖ్యమంత్రి వెన్నుపోట్లు వుండవు. అసలు రాజకీయాలే నాలుగో పేజికి వెళ్ళిపోతాయి. రొట్టె (బ్రెడ్) ఖరీదు పావులాకి తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మొదటి పేజీ ప్రముఖ వార్త అవుతుంది! ఒకే సంవత్సరం దేశానికి రెండు నోబెల్ బహుమతులు రావటం హెడ్ లైన్ అవుతుంది!! ఒకరోజు కరెంటు పోతే అది వార్త అవుతుంది. రైలు లేటయితే అది వార్త అవుతుంది. మా స్వంత ఖర్చుతో మేము పంపిన మా మనిషి చంద్రమండలం మీద దిగుతాడు. ఒలంపిక్స్ లో మా దేశపు స్వర్ణపతకాలు రికార్డు సృష్టిస్తాయి. దేశం వుంటుంది. మంత్రులుండరు. అడవులుంటాయి, నక్సలైట్లు ఉండవు. ట్రెడిషన్ ఉంటుంది, కులం, మతం ఉండదు. అటువంటి వాతావరణంలో మా త్రివర్ణ పతాకం రెప రెప లాడటానికి కలిసి పాడుతాం.
జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి!
"అరె - అదేమిటి"
అతడు ఆమెవైపు చూశాడు.
"నీలో-నీలో"
"ఊ ఏమిటి నాలో?"
"ఇంతవరకూ చూడలేదు. మొట్టమొదటిసారి చూస్తున్నాను".
"ఏమిటి సుమతీ?"
"నువ్వు... నువ్వు... నవ్వుతున్నావ్" ఎగ్జయిటింగ్ గా అన్నది.
"నిజమా-" అతడు నవ్వసాగాడు. హాయిగా- మరింత హాయిగా.
పంజరం నుంచి బయటపడిన పక్షి రెక్కలు కొట్టుకుంటూ ఎగిరినట్టు తెరలు తెరలుగా ఆ నవ్వు అక్కడ వ్యాపించింది.
ఊహ తెలిసిన తర్వాత జీవితంలో మొట్టమొదటిసారి నవ్వేడు. దేశం అనే చెత్తకుండీలో పెరిగిన నెత్తుటి శిశువు అప్పుడే కడుపు నిండినట్టు నవ్వేడు.