అతను నడకవేగం తగ్గించాడు.
"మ్చ్. ఈ రాత్రి మళ్ళీ నిద్ర వుండదు".
"ఎందుకు సుమతీ?"
"మళ్ళీ స్కూలు ఎక్కడికి జరపాలా అని ఆలోచించాలి కదా"
"దాని గురించి ఆలోచించక్కర్లేదులే. నేనే ఏదైనా చేస్తాను చేతనైనంతలో. ఎక్కడ అతడి ఇల్లు!"
"అదిగో అదే".
"నేను వెళ్ళొస్తాను. రేప్పొద్దున్న మీ స్కూలుకి వస్తాను. అక్కడే కొనసాగించు".
"మళ్ళీ గొడవైతే-"
"అప్పుడు చూసుకుందాం".
అతడు తన పాకకి తిరిగి వచ్చేక "జానకి కొద్దిగా ఆయిల్ అందుకో....." అని అడిగాడు.
"దేనికి?"
"నీళ్ళల్లో తడిసినవి బాగు చెసుకొనటానికి".
జానకి మరి ప్రశ్నలు అడగలేదు. ప్రొద్దున్న బ్యాంక్ మేనేజర్ కంగారుపడుతూ డబ్బు తెచ్చి ఇచ్చినప్పటి నుంచి అతడంటే గౌరవం అమాంతంగా పెరిగిపోయింది.
"నా కొక అనుమానం" పక్కన కూర్చుంటూ అడిగాడు.
"ఏమిటి జానకీ?"
"చిన్న కాగితం ముక్క మీద వ్రాస్తే అలా డబ్బు లిచ్చేస్తారా?"
"కాగితం కూడా అక్కర్లేదు" గుడ్డ మీద నూనె చుక్కలు వేస్తూ అన్నాడు అతడు. "ఫోన్ చేస్తే చాలు. వేలూ, లక్షలూ ఇచ్చేస్తారు! బ్యాంకుల్లో జనరల్ మేనేజర్ అనీ, చైర్మన్ అనీ- అలా ఫోన్ల దగ్గర కూర్చుని వుంటారు. ఎవరైనా విక్రమ్ సింగ్ లు ఫోన్ చేస్తే బ్రీఫ్ కేసుల్లో పెట్టి మరీ పంపిస్తారు" అంటూ అతడు లేచి, "నేనొక అరగంటలో వస్తాను" అంటూ బయల్దేరాడు.
రాత్రి ఎనిమిదిన్నర కావొస్తూంది. వీధి దీపాలు లేకపోవటంవల్ల చాలా చీకటిగా వుంది. అయిదు నిముషాల్లో అక్కడికి చేరుకున్నాడు. ఎత్తు అరుగుల ఇల్లు. లోపల్నుంచి లైట్ల వెలుతురు బయటకు మసగ్గా పడుతూంది. అతడేమీ తటపటాయించకుండా మెట్లెక్కి లోపలికి వెళ్ళాడు. ముందు గదిలోనే పడక కుర్చీలో పడుకుని కళ్ళు సగం మూసుకుని చుట్టని పీల్చుతూ ఆనందిస్తున్నాడు ఇంటి యజమాని. బనీను మీద పైకండువా వుంది. అలికిడికి కళ్ళు తెరిచాడు.
అతడు వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. స్వంత ఇంట్లోకి వచ్చిన వాడిలా వచ్చిన అతడినిచూసి "ఎవర్నువ్వు? ఏం కావాలి?" అన్నాడు మొహం చిట్లిస్తూ.
అతడు వెంటనే జవాబు చెప్పలేదు. పరిశీలనగా చూస్తూ "నువ్వేనా గ్రామాధికారివి?" అన్నాడు.
"అవును. నువ్వెవరు?"
దానికి జవాబు చెప్పకుండా "ఇద్దరు బాడీగార్డుల నేసుకుని ఊళ్ళో తిరుగుతూ వుంటావట నిజమేనా" అని తిరిగి అడిగాడు. ఊహించని ఈ ప్రశ్నకి అదిరిపడి "ఎవడ్రానువ్వు?" అన్నాడు.
అతడు ఆ ప్రశ్నని పట్టించుకోలేదు. "రేపట్నుంచి నువ్వు గానీ, నీ మనుష్యులుగానీ స్కూలువైపు వెళ్ళటానికి వీల్లేదు".
"రంగా. ఒరేయ్ రంగా" పిల్చాడు, కుర్చీలోంచి తలతిప్పిలేస్తూ.
"అంతేకాదు, అచ్చోసిన ఆంబోతులా ఈ వూళ్ళో తిరగడం కూడా తగ్గించాలి".
"రంగా - రంగా"
లోపల్నుంచి నల్లటి వాడొచ్చాడు. వాడే స్కూలుదగ్గిర కనబడినవాడు. ఎత్తుగా- భారీగా వున్నాడు.
"చూడు. ఈయనెవరో వచ్చి మనకు నీతులు బోధిస్తున్నాడు" వెటకారంగా అన్నాడు మాజీ మనసబు. వాడు తలతిప్పి అతడివైపు చూశాడు. వాడిమొహంలో హీనమైన నవ్వు కదలాడింది. ఒక కొండచిలువ కుందేల్ని పూర్తిగా చుట్టుకుని, ఇక అది ఎటూ తప్పించుకోలేదని నిర్ధారించుకున్నాక తాపీగా నోరు తెరిచినట్టు వాడు అతడివైపు రెండడుగులు వేశాడు-పిడికిలి బిగించి.
అతడు వాడివైపు చూస్తున్నాడు. ఎందరో అమాయకుల్ని వీడు ఇంత క్రూరంగా నవ్వుతూనే హింసించి వుంటాడు. అలాటి హింసలో పొందే ఆనందం వాడి మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. తన అనుచరుడు చేయబోయే సాహసకృత్యాన్ని గ్రామాధికారి నవ్వుతూ చూస్తున్నాడు.
రంగా రెండడుగులు ముందుకు వేశాడు.
అతడు కుర్చీలోంచి లేవలేదు. లేవకుండా పాంటునుంచి పిస్టల్ బయటికి తీశాడు. దాన్ని తాపీగా తెరిచి ఏమీ కంగారులేనట్టు పైజేబులో వేసుకొచ్చిన మూడు బుల్లెట్స్ అందులోవేసి, హోల్ స్టర్ మూసి అతని వైపు తిప్పి టపటప మూడుసార్లు కాల్చాడు.
మొద్దుపడ్డట్టు రంగా వెనక్కి విరుచుకు పడిపోయాడు.
లోపల్నుంచి ఎవరూ రాలేదు. అనూహ్యమైన ఈ చర్యకి మాజీ మునసబు శిలాప్రతిమలా నిలబడిపోయి వున్నాడు. అతని అనుచరుని నుదుటిలోంచి ఒకటి, భుజంలోంచి ఒకటి, కడుపులోంచి ఒకటి బుల్లెట్స్ వెళ్ళిపోయాయి. పిస్తోలునుంచి వస్తూన్న పొగని నీటితో ఊది దాన్ని తిరిగి జేబులో పెట్టుకుంటూ....
"చూడూ- నువ్వెన్ని మర్డర్లు చేయించావో నాకు తెలీదు. కానీ స్వయంగా ఒకటి కూడా చేసివుండవని నమ్మకం. మరోసారి ఈ వూరిలో నీ ప్రతాపం కనపడిందంటే మళ్లీ నాకో మూడు బుల్లెట్స్ వృధా అవుతాయి. పోతే కుడిభుజాల్ని ఎక్కువగా నమ్ముకోకు. అదే నేను నీకిచ్చే సలహా-" అని గుమ్మం దాటుతూ తిరిగి అన్నాడు.... "తొందరగా ఆ శవాన్ని ఖాళీ చేయించు. మరీ ఆలస్యం అయితే గచ్చు మరింత ఎక్కువగా కడగాలి".
* * *
"ఏం చేసొచ్చావ్?"
"ఏంలేదు. అలా చల్లగాలికి బయటకు వెళ్ళొచ్చాను. అంతే" పిస్తోలు పక్కన పడేసి కూర్చుంటూ అన్నాడు.
"చల్లగాలికి వెళ్తూ దాన్ని తీసుకెళ్ళటం దేనికి? అంతభయమైతే ఎలా?"
"భయంకాదు. ఇష్టం" ఆప్యాయంగా దాన్ని చేతిలోకి తీసుకుంటూ అతడన్నాడు- "పిస్తోలు అంటే చాలా గౌరవం నాకు. దీన్ని చూడు. అరచెయ్యిపాటి కూడాలేదు, అయినా ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎన్నో పెద్ద సమస్యలనుకున్న వాటిని క్షణాల్లో పరిష్కరిస్తుంది. ఎంతో మంది పోలీసులు ఎన్నో సంవత్సరాలుగా చేయలేనిది నిముషంలో చేసింది. అసలు నన్నడిగితే మనరాజ్యాంగాన్ని తొలగించి, ఆస్థానే సింహాసనంపై దీన్ని కూర్చోపెట్టాలి. అప్పుడుగానీ ప్రజలు క్రమ శిక్షణతో మెలగరు".
"నువ్వు మాట్లాడేది నాకొక్క ముక్కా అర్థంకాలేదు".
"నీకే కాదు. చాలామందికి అర్థంకాదు. సర్లే, ఇక పడుకో...." అతడూ మేనువాలుస్తూ అన్నాడు.
మరుసటిరోజు సాయంత్రం అతడు స్కూలుకి వెళ్ళాడు. డ్రిల్లు జరుగుతూంది. తెల్లచీరలో సుమతి హంసలా వుంది.