Previous Page Next Page 
రాక్షసుడు పేజి 40


    అతడి నవ్వు పూర్తిగా ఇంకక ముందే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది.

 

    అందులోంచి సింహం దిగాడు.

 

                                          12

 

    "ఎక్కడికి వెళ్ళిపోయావో తెలీదు. మేమంతా చాలా కంగారుపడ్డాం. బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి, పాతిక వేలకి చెక్కు కావాలన్నాడు. దాంతో ఎంక్వయిరీ ప్రారంభించి పట్టుకున్నాం. అబ్బ ఇంత పెద్ద వల ఈ మధ్యకాలంలో వేయలేదు. నీకోసం వేయవలసి వచ్చింది".

 

    "నాకు తెలుసు ఎక్కడున్నా నువ్వు పట్టుకుంటావని".

 

    "పద వెళదాం"

 

    "ఎక్కడికి?"

 

    "అదేమిటి- అక్కడ నువ్వు లేక పరిస్థితులు అన్నీ అస్తవ్యస్థంగా తయారయినాయి".

 

    "నా కిక్కడే వుండిపోవాలనిపిస్తూంది".

 

    "నీకేమయినా మతి పోయిందా!" పక్కన కూర్చుంటూ అడిగాడు సింహం. "అసలు నువ్వు నువ్వేనా అని అనుమానం వస్తూంది నాకు. దానికేం గానీ నీకు తెలుసా? ప్రెసిడెంటు పదవికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య చాలా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమయింది".

 

    "నాకెలా తెలుస్తుంది? చాలా రోజులనుంచి పేపర్ కి దూరంగా వుంటున్నాగా".

 

    "మనం ఎవర్ని సపోర్ట్ చెయ్యాలా అన్నది తేల్చుకోవాలి. వంకచెక్కా రామ్మూర్తి, మీ నాన్న ఇద్దరూ ప్రధానమంత్రిని సపోర్ట్ చేస్తున్నారు".

 

    "లోహియా?"

 

    "నిజానికి లోహియా ముఖ్యమంత్రిని చేయాలి. కాని నువ్వు చేస్తే తనూ అది చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నీ అవసరం వెంటనే వుంటుందంటున్నాను. నువ్వు ఏదో నిర్ణయం తీసుకోవాలి".

 

    "మనమే మన తరఫున ఒక కాండిడేట్ ని నిలబెడితే" అప్పటి వరకూ ప్రవాహంలా మాట్లాడుతున్న సింహం హఠాత్తుగా మిన్ను విరిగి మీద పడ్డట్టు కదిలి "ఏమిటి" అని అరిచాడు తన చెవుల్ని తానే నమ్మలేనట్టు.

 

    "అవును. మనమే నిలబెడతాం".

 

    "ఇంతవరకూ రంగం సిద్ధం చేసుకోలేదు. రాజకీయంలో పెద్ద ప్రవేశం లేదు. ఎలక్షన్సు చూస్తే సరిగ్గా రెండు నెలలు లేవు".

 

    "అయినా పర్వాలేదు. మన కేండిడేట్ గెలుస్తాడు".

 

    అతడు హాస్యాలాడటం లేదని గ్రహించాడు సింహం. అప్పటికి ప్రారంభంలో కలిగిన షాకు కాస్త సర్దుకుంది. "సరే చెప్పు మన కాండిడేట్ ఎవరు?" అని అడిగాడు.

 

    "జానకి రాముడు"

 

    "వ్వాట్" సింహం గొంతు కీచుమంది. అతడు దాన్ని పట్టించుకోనట్టు "జానకిని ఈ రోజే నీతోపాటు తీసుకెళ్ళి నామినేషన్ వేయించు. మనం రంగంలోకి దూకుతున్నాం! ఈ దేశపు అత్యున్నత పదవిని అలంకరింపచేయటానికి జానకిరాముడికన్నా అర్హమైన వ్యక్తి ఇంకెవరూ ఉండరని నా ఉద్దేశ్యం. ఈ ప్రజల్ని పాలించటానికి ఏ అర్హతా అవసరం లేదని నా విశ్వాసం. నా విశ్వాసాన్ని నేను నిరూపిస్తాను. పది రోజులు రెస్టు తీసుకుని వస్తాను. అప్పటికి ముందు రంగం సిద్ధం కావించు. లోహియా అవసరం మనకు చాలా వుంది. వెళ్ళు సింహం. పోతే నామినేషన్ పత్రంలో అభ్యర్థి స్త్రీయా పురుషుడా అన్న చోట పూర్తిచేయటానికి మాత్రం నీకు కాస్త ఇబ్బంది రావొచ్చు. నపుంసకులు దేశపు ప్రెసిడెంటులు అవకూడదని ఎక్కడా మన రాజ్యాంగంలో లేదు కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ దీన్ని తిరస్కరించడు. వెళ్ళు సింహం.... వెళ్ళు".

 

    "ఇదంతా... ఇదంతా నువ్వు ఎగతాళికీ, హాస్యానికీ అనటంలేదు గదా" అనుమానంగా అడిగాడు సింహం.

 

    "లేదు. ఈ ఎన్నికలూ, ఈ సిస్టమూ ఎంత బోగస్ వో నిరూపిస్తాను. జానకిరాముడు ఈ దేశపు అత్యున్నతాధికారి అవుతాడు. అతడి ద్వారా నేను ఈ దేశాన్ని ఒక ఆట ఆడిస్తాను. ఈ దెబ్బతోనయినా ఈ దేశ ప్రజల కళ్ళు తెరుచుకుంటే సరే- లేదా దేవుడు కూడా వీళ్ళని రక్షించలేడు".

 

    "కానీ చూస్తూ చూస్తూ 70 కోట్లమంది దేశ ప్రజలు ఒక నపుంసకుడికి వోటు వేస్తారా?"

 

    "వేస్తారు. ఈ దేశ ప్రజల మూర్ఖత్వం మీద నాకు నమ్మకం వుంది".

 

                                                        *    *    *

 

    "నేనా? ఎలక్షన్ లోనా?" జానకి కంఠం భయంగా ధ్వనించింది.

 

    "నువ్వే... ఎలక్షన్ లోనే. ఏం?" అతడి కంఠమూ నవ్వుతూ సమాధానం పలికింది.

 

    "ఈ వూళ్ళోనే నాకొక్క ఓటూ పడదు. అటువంటిది దేశంలో ఎవరిస్తారు నాకు?"

 

    "అధికార పక్షంవాడు శుంఠ! ప్రతిపక్షం వాడు పరమశుంఠ!! అందుకని నీకే వేస్తారు, కనీసం నీవెవరివో తెలియదు కాబట్టి".

 

    "నాకేమీ అర్థం కావటంలేదు. అసలు ఒక దేశాధినేత అవటానికి నాకేం అర్హత వుందని?"

 

    "అధినేత అవటానికి ఏ అర్హత అవసరంలేదని మన అధినేతలు ఇంతకుముందే నిరూపించారు. ఆ పంధాలోనే నువ్వూ అవుతావు".

 

    "నేనేం చెయ్యను?"

 

    "ఏం చేస్తావురా పిచ్చివాడా! చెయ్యడానికి ఏముంది ఇక్కడ? ఏమీలేదు. నువ్వేమీ చేయకుండా వున్నా ఈ దేశం ఇలాగే సాగిపోతోంది. ఏదో ఒకటి చేయటం కన్నా, ఏమీ చెయ్యకుండా వుంటే ప్రగతి సాధిస్తుంది కూడా...."

 

    "నిజంగా నేను దేశాధినేత నవుతానంటావా? ఊరూ పేరూ లేని ఒక నపుంసకుడికి ఇన్ని కోట్లమంది ప్రజలు ఓట్లు వేస్తారంటావా?"

 

    "ప్రయత్నించటంలో తప్పులేదుగాయా".

 

    జానకిరాముడు తన్మయత్వంతో కూడిన ఆలోచనలో పడ్డాడు. ఐదు నిముషాలు అయ్యాయి. తనలో తాను అనుకుంటున్నట్లు అన్నాడు.

 

    "నేను ఈ దేశపు ప్రెసిడెంటుని అయితే ఏంచేస్తానో తెలుసా?"

 

    "ఏం చేస్తావు జానకీ!" నవ్వుతూ అడిగాడు.

 

    "కొజ్జాలతో సహా ఎవరూ బిచ్చమెత్తుకునే అవసరం లేకుండా అంగవైకల్యం వున్న వారందరికీ ప్రభుత్వమే వసతి ఇచ్చి పోషించేలా ఏర్పాటు చేస్తాను. అప్పుడు మేము ఇలా డాన్సులు చెయ్యక్కరలేదు".

 

    "అలా చేస్తే దేశంలో సగంమంది పైగా ఆ వసతి గృహాలలో చేరతారు".

 

    జానకిరాముడు కాస్త ఆలోచించి అన్నాడు-

 

    "మనదేశంలో అన్ని సమస్యలకి జనాభాయే కారణం".

 

    "పర్వాలేదు. నీకూ ఆలోచించే అలవాటు అబ్బుతోంది".

 Previous Page Next Page