Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 38


    పెద్దమనిషి మళ్లీ కొద్దిక్షణాలు ఆలోచించాడు.

    "ఆ! ఒక చక్కని ఉపాయం తట్టింది! రాధ ఆరునెలలు మురళీతోనూ, మరో ఆరునెలలు అవతారస్వామితోనూ సంసారం చేయవచ్చు. ఇందులో తప్పుకూడా ఏమీ లేదు. ద్రౌపతి ఇదే పద్ధతి అవలంబించింది కదా?" అన్నాడు ఓ పెద్దమనిషి.

    మురళి ఒక్క దూకు దూకి ఆ మనిషి పీక పట్టుకున్నాడు.

    "ఏమిట్రా అన్నావ్! నా రాధ ఆర్నెల్లు వాడితో కాపురం చేయాలా?"

    "అందరూ మురళిని బలవంతంగా వెనక్కు లాగి, ఆ పెద్ద మనిషిని రక్షించారు.

    "అది వట్టి సలహాయేనయ్యా! వీల్లేకపోతే వీలులేదని చెప్పు. అలా మీద పడిపోతే ఎలా?" అన్నారు మిగతా పెద్ద మనుషులు.

    మళ్ళీ తమలో తాము కలిసి చర్చ జరుపుకున్నారు. చివరికి ఒకరు అన్నారు. "అసలిందులో రెండు లాజిక్ పాయింట్లున్నాయి. మొదటిది - మురళి అనే ఈ అబ్బాయి రాధ మెడలో మొన్న మధ్యాహ్నం తాళి కట్టాడనేది నిర్వివాదాంశం!! పోతే పన్నెండు సంవత్సరాల క్రితంకూడా అతడే ... అంటే మొత్తం ఈవిడ మెడకు రెండుసార్లూ అతడే కట్టాడా లేక ముందు కట్టింది స్వామా అన్నది తేలాలి. ఈ మురళి ఆ మురళే అని ఈ మురళి చెపుతున్నది నిజమైనా కాకపోయినా, ఈ మురళికి భర్తగా రాధ మీద హక్కున్నది. కానీ స్వామి గాని మొదటి తాళి కట్టిన వాడయితే, అతడికి హక్కు ఉన్నది."

    ఈ వాదనలో మురళికి కాస్త ఆశాకిరణం కనబడ్డది.

    "ఇందు మూలముగా మేము సంయుక్తంగా నిర్ణయించిన నిర్ణయం ఏమిటంటే - మురళీకృష్ణ అనే రాధ భర్త నెంబర్ టు కి పది రోజులు గడువు ఇవ్వడమైనది. ఈ గడువు లోపల అతను పరిశోధనలు గావించి అవతారస్వామి రాధ అసలు భర్త కాడనీ, తనే రాధ అసలు భర్తననీ ఋజువు చేయవలసి యున్నది" అన్నాడు.

    పెద్దమనుషులు అందరి మొఖాల వంకా చూస్తూ, ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.

    "ఏమయ్యా! నీకీ నిర్ణయం అంగీకారమేనా?" మురళీ నడిగాడు పెద్దమనిషి.

    "ఊ !"

    "ఏమయ్యా, అవతారస్వాములూ ? నీకూ ఇష్టమేనా?"

    "ఇష్టమే!"

    "ఏమ్మా రాధా ?"

    "నా భర్తల అంగీకారమే - నా అంగీకారం" అందామె సిగ్గుపడుతూ.

    "కాని ఓ షరతు ..." అన్నాడు మురళి.

    "ఏమిటది?"

    "ఈ పది రోజుల్లోనూ వీడు నా రాధను తాకకూడదు."

    "సరే- అన్నాడు పెద్దమనిషి.

    "అంటే మీరందరూ కాపలా ఉండాలి."

    "ఇంపాజిబుల్ ..." అన్నారు పెద్ద మనుషులు ముగ్గురూ ముక్తకంఠంతో. "మాకెలా సాధ్యం అది! మీ మామ చూసుకోవాలి."

    "నా మీద నమ్మకం ఉంచి వెళ్ళిరా నాయినా!" చిరునవ్వుతో అన్నాడు అవతారస్వామి.

    "నిన్ను ఛస్తే నమ్మను."

    "అజ్ఞానం."

    పెద్ద మనిషి రాధ వేపు చూశాడు.

    "ఏమ్మా రాధా! ఆ అవతారస్వామి నిన్ను తాకకుండా చూసుకుంటానని అతనికి హామీ ఇవ్వమ్మా!"

    రాధ సిగ్గు పడింది. "ఎలా ఇవ్వనండి! భర్తను తాకవద్దని శాసించే భార్యకు పుట్టగతులుండవని మన పురాణాలు ఘోషిస్తున్నాయ్." 

    అల్లుడి పిడికిళ్ళు బిగుసుకోవటం గమనించి నరసింహం కంగారుపడి, అతడిని పక్కకు పిలుచుకెళ్ళి చెవిలో ఏదో గుసగుస లాడాడు.

    మురళి తిరిగి వచ్చి అన్నాడు _

    "రాధకు ఛేస్టిటీ బెల్టు కట్టాలి. అలాగయితే నాకే అభ్యంతరం లేదు."

    రాధ కెవ్వుమని అరిచింది. "ఛీ! పాడు! ఏమిటా పిచ్చి మాటలు ?"

    "పిచ్చివాడా !" చిరునవ్వు నవ్వాడు అవతారస్వామి. "ఏ బెల్టులూ మానవుల కోరికల నడ్డుకోలేవు నాయినా! నమ్మకం ఒక్కటే నీకు దారి!"

    అన్నపూర్ణమ్మ భర్త దగ్గరకి చేరి, "ఏమిటండీ, ఏదో బెల్ట్ అంటున్నాడు?" అంది.

    ఆవిడ్ని కసిరి, రామలింగం నెమ్మదిగా మురళి దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేశాడు.

    "చూడు బాబూ! రాధను జాగ్రత్తగా కాపాడే బాధ్యత నాది- నువ్వు నిశ్చింతగా హిమాలయాలకు వెళ్ళిరా నాయినా!"

    "నమ్మమంటారా ?"

    "మీ మామ తోడు."

    మురళి నరసింహం వంక చూశాడు. తరువాత పెద్దమనుషులవేపు చూశాడు.

    "సరే-" అన్నాడు అయిష్టంగానే.

    పెద్ద మనుషులు ఆనందంగా లేచి ఇళ్ళకు వెళ్ళిపోయారు.

    ఈ సంభాషణ జరుగుతున్నంతసేపూ నరసింహం సీరియస్ గా అటూ ఇటూ పచార్లు చేస్తూ వున్నాడు. అతడి మొహం జేగురు రంగుకి మారి వుంది. తను తెర వెనుక వుండి హరికృష్ణ ఇలా నాటక మాడిస్తాడనుకోలేదు.

 Previous Page Next Page