Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 39


    "మురళీ - ఇలారా" అన్నాడు. కొద్దిసేపాగి - ఏదో ఆలోచన స్పురించినట్టు.

    ఇద్దరూ పక్కగదిలోకి నడిచారు.

    "నువ్వు కూడా రావయ్యా" రామలింగాన్ని కూడా పిలిచాడతను.

    "ఏమిటి?" అడిగాడు రామలింగం ముగ్గురూ గదిలోకి వెళ్ళాక.

    "నీకేం మతిపోయిందేమిటయ్యా ! తెలిసో తెలీకో అబ్బాయి హిమాలయాల కెళ్తానంటే, నువ్వు కూడా 'తందానా' అని తలూపుతున్నావ్- ఆ హిమాలయాల్లో ఏ ఋజువూ దొరక్కపోతే ఎవడో అనామకుడికి కూతుర్నిచ్చేస్తానా ఏమిటి?"

    రామలింగం గతుక్కుమన్నాడు. "లేకపోతే మరీ సమస్య తేలేదెట్లా?"

    "ఇదో పెద్ద సమస్యేమిటయ్యా - చిన్నప్పుడు ఆ కృష్ణగాడికి-పుట్టుమచ్చలాంటి వేమయినా వున్నాయేమో గుర్తుతెచ్చుకుంటే సరి! గడ్డాలూ మీసాలూ మొలిచినా మనిషికి పుట్టుమచ్చలు చెరగవుగా!" రామలింగం మొఖం కళకళలాడింది.

    "అవునండోయ్! గుర్తుకొచ్చింది. కృష్ణ నడుము వెనుక పెద్ద పుట్టుమచ్చ ఉండాలి!" అన్నాడు గుర్తు తెచ్చుకుంటూ.

    "అవును బాబాయ్ ? నాకూ గుర్తుంది. వాడు నిజంగా కృష్ణ కాదన్న విషయం పుట్టుమచ్చ చూస్తే తెలిసిపోతుంది."

    రామలింగానికి మురళి మొహం  చూస్తే అతడు నిజమే చెపుతున్నాడని అనిపించింది. అదీగాక పన్నెండు సంవత్సరాలక్రితం రాధ మెళ్ళో తాళి కట్టిన కుర్రవాడి పోలికలు మురళిలోనే ఎక్కువ కనబడుతున్నాయి.

    "కానీ ఈ పరీక్షల కన్నిటికీ అతనొప్పుకోడు గదా! పెద్ద మనుషులు చేసిన నిర్ణయం ప్రకారం హిమాలయాల్లోనే ఋజూ చేసుకోమంటాడు." అనుమానంగా అన్నాడు రామలింగం. అతడు ఇప్పుడు మురళీకి సాయపడాలనే నిర్ణయానికొచ్చాడు.

    "వాడికి తెలీకుండా డిటెక్టివ్ పనిచేసి కనుక్కుంటే సరి! రెండు రోజుల్లో దొరికిపోతాడు__"

    "అవును! ఒండర్ ఫుల్ అయిడియా బాబాయ్! మా అమితాబ్ గాడిని తీసుకొస్తాను. వాడు బోలెడు డిటెక్టివ్ పుస్తకాలు చదివాడు."

    నరసింహం చిరాకుపడ్డాడు "మనక్కావలసింది పుస్తకాలు చదివేవాడు కాదురా; ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవాడు."

    "వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వుంది బాబాయ్! మా లెక్చరర్ ఒకామెకి ఇద్దరు ప్రియులున్నారన్న విషయం వాడే పరిశోధించాడు."

    "అప్రాచ్యుడు" అన్నాడు రామలింగం మండిపడుతూ.

    నరసింహం రామలింగం భుజం తట్టాడు. "మన కాట్టే టైం లేదు రామలింగం! అమితాబ్ ని ఇవాళ రాత్రికే మీ ఇంట్లో ప్రవేశపెడదాం! వాడు నీ స్నేహితుని కొడుకనో, బంధువుల కుర్రాడనో చెప్పు ఇంట్లో-రెండు రోజుల్లో వాడి రహస్యం కాస్తా బయటపెట్టవచ్చు."

    రామలింగం ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. "సరే! అలాగే కానీండి" అన్నాడు అయిష్టంగానే.

    మురళీ అప్పటికప్పుడే అమితాబ్ కోసం బయల్దేరేడు. ఆ రాత్రికి అనుకున్నట్లుగానే సూట్ కేస్ తీసుకుని దిగాడు అమితాబ్.

    "హల్లో అంకుల్_ హౌ ఆర్ యూ _ హల్లో అన్నపూర్ణా ఆంటీ, హల్లో రాధా!" అంటూ అందరినీ పలకరించి అవతార స్వామిని చూశాడతను.

    "వీరెవరు అంకుల్ ?"

    "మా మేనల్లుడు మురళీకృష్ణరా! చిన్నప్పుడు హిమాలయాలకి పోయాడు."

    "ఓ గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చింది. హలో కృష్ణా! మనిద్దరం గోలీలాడుకున్నాం! కదూ?" అని అడిగాడు. 

    అవతారస్వామి అతనివంక అనుమానంగా చూశాడు. "నాకు గుర్తులేదు."

    "ఏం ఫరవాలేదు. బైదిబై హిమాలయాల్లో ఏం ఉద్యోగం చేస్తున్నారు?"

    "తపస్సు__" అని. మరి ప్రశ్నలడిగే ఆవకాశం ఇవ్వకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు స్వామి.

    రాత్రి తొమ్మిదవుతుండగా స్వామి గది కిటికీ బయట చేరారు. అమితాబ్, రామలింగం, నరసింహం. అమితాబ్ తన భుజానికున్న బాగ్ లో నుంచి బైనాక్యూలర్స్ తీసి గదిలోకి చూశాడు.

    "ఊహు! ఇంకా బట్టలు మార్చుకోవటం లేదు" అన్నాడు నిట్టూరుస్తూ.

    "ఆ సిల్కు లాల్చీ, ధోవతీతోనే పడుకుంటాడా ఏమిటి ఖర్మ?" విసుగ్గా అడిగాడు రామలింగం.

    మరో అరగంట గడిచింది. అవతారస్వామి అట్లాగే మంచంమీద పడుకున్నాడు.

    "ఇడియట్! బట్టలు మార్చుకోకుండానే పడుకుంటున్నాడు" అన్నాడు నరసింహం కోపంగా.

    రామలింగం, నరసింహం నీరసంగా అమితాబ్ దగ్గరకు వచ్చారు. పోనీలే! రేపు వాడు స్నానం చేసేప్పుడు ప్రయత్నించు" అన్నాడు నరసింహం.

    "బెస్ట్ అయిడియా" అన్నాడు అమితాబ్. అక్కడినుంచీ బయలుదేరి తన ఇంటికి చేరుకున్నాడు. మరుసటిరోజు ప్రొద్దున్నే ఒక కొత్త ఎక్విప్ మెంట్ తో బయలుదేరి వచ్చాడు. రామలింగం, నరసింహం అతని చుట్టూ చేరారు.

    "మేడ్ ఇన్ జపాన్" అన్నాడు అమితాబ్. ఆ పరికరాన్ని వాళ్ళకి చూపిస్తూ. "చిన్న రంధ్రంలోంచి చూసినా లోపలి దృశ్యాన్ని త్రి-డి.అఫెక్టుతో చూపిస్తుంది" గర్వంగా చెప్పయు. రామలింగానికి అతడి పత్తేదారు సామర్ధ్యం మీద కొద్దికొద్దిగా నమ్మకం కుదురుతోంది.

 Previous Page Next Page