Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 37


    "నేనెందుకు వెళ్ళాలి?" అన్నాడు మురళి.

    "అమాయకుడు!" అన్నాడు అవతారస్వామి.

    "ఇద్దరూ ఓసారి బయటకు రండీ!" బ్రతిమాలుతున్నట్టు అందావిడ.

    "ఎందుకు ?" చిరాకుగా అడిగాడు మురళి.

    "పెద్ద మనుషులంతా మన కోసం ఎదురుచూస్తున్నారు!"

    "పెద్ద మనుషులా? వాళ్ళెక్కడ వున్నారు మనదేశంలో?"

    "ముందు త్వరగా పదండీ."

    "వాళ్ళేం చేస్తారుట ?"

    "మన సమస్యను పరిష్కరిస్తారుట."

    "ఓ.కే ! నేను రడీ" అన్నాడు మురళి.

    "నేనూ రడీయే!" అన్నాడు అవతారస్వామి.

    ముగ్గురూ హాల్లో కొచ్చేసరికి అక్కడ ఇరుగు పొరుగు పెద్దలు ఓ అరడజను మంది కూర్చుని తమలో తాము డిస్కషన్స్ చేసుకుంటూ కనిపించారు.

    "ఇందులో పరిష్కరించాల్సిందేమీ లేదు. నేనే రాధ భర్తను, ప్రేమికుడిని!" అన్నాడు మురళి మధ్యలోకెళ్ళి నిలబడి.

    "కాదు. నేనే రాధ భర్తనూ, ప్రేమికుడినీ ! నా కోసమే రాధ ఇన్నేళ్ళు పూజలూ, వ్రతాలూ చేసింది. తులసి మొక్క చుట్టూ తిరిగింది" అన్నాడు అవతారస్వామి.

    "రాధ మెళ్ళో అందరి సమక్షంలో మూడుముళ్ళు వేసింది నేను."

    "చిన్నప్పుడే తాళి కట్టిన వాడిని నేను గనుక - నేనే సీనియర్ ని !"

    "చిన్నప్పుడు తాళి కట్టింది నేను."

    "కాదు! నేను !"

    "అసలు చిన్నప్పుడు కట్టిన తాళి చెల్లదు."

    "ఏం? ఎందుకు చెల్లదు?" కోపంగా అడిగాడు అవతారస్వామి.

    "ఎందుకంటే అప్పుడు రాధకు మైనారిటీ తీరలేదు గనుక! బాల్యవివాహాలు చట్ట విరుద్దాలు."

    "చట్టాలు మా బంధాన్ని అడ్డుకోలేవు నాయినా."

    "ష్ ష్" అన్నాడు ఒక పెద్దమనిషి. "అలా గొడవ చేయకండి, అయ్యా! అసలు సమస్య ఏమిటంటే..."

    "నాకు బాగా తెలుసు- వీడెవడో దొంగసన్యాసి" ఆయన మాటల్ని మధ్యలో ఆపుచేస్తూ మురళి అరిచాడు.

    "మాటలు తిన్నగా రానీ!" అన్నాడు అవతారస్వామి గెడ్డం దువ్వుకుంటూ.

    "ష్ ష్" అన్నాడు ఇంకో పెద్దమనిషి.

    ఇద్దరూ నిశ్శబ్దం అయిపోయారు.

    పెద్దమనుష్యులు మురళీవేపూ, అవతారస్వామివేపూ కొద్దిక్షణాలు పరీక్షగా చూశాడు. "అయితే ఈ సన్యాసి రాధ ఒరిజినల్ బావ కాదంటావ్! అంతేనా?" మురళీనడిగాడు.

    "అవును సార్!"

    "అలా అని ఋజువు చేయగలవా ?"

    "నాకు పదిరోజులు గడువిస్తే - హిమాలయ పర్వతాలకెళ్ళి, ఋషికేశ్ కాటేజ్ నెంబర్ ఫోర్ వ్యవహారం తేల్చుకొచ్చి వీడి బండారం బయటపెడతాను."

    పెద్దమనిషి అవతారస్వామి వేపు తిరిగాడు.

    "ఏమయ్యా! నువ్వే రాధ బావనడానికి నీ దగ్గర ఏమయినా ఋజువులున్నాయా?"

    "సన్యాసుల దగ్గర ఋజువులేముంటాయండీ! అదీ పన్నెండేళ్ళ క్రితం సంగతాయె."

    "అయ్యా! ఋజువులేమీ లేకుండా మిమ్మల్ని రాధ బావ అని ఎలా గుర్తించాలి?" అని ప్రశ్నించాడు పెద్దమనిషి.

    అవతారస్వామి కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

    "చూడండి! ఇక్కడ నా కోసం అహర్నిశలూ పూజలు చేస్తూన్న రాధ - నేను ఇంటికి తిరిగి రావాలని శాంతులు చేయిస్తున్న మా బంధువులు - వీళ్ళకోసమే సన్యాసాశ్రమం వదిలి సంసారాశ్రమం స్వీకరించాను. మీరిప్పుడు ఋజువులు, ఆధారాలు, అంటే మళ్లీ సన్యాసాశ్రమం స్వీకరించి ఋషికేశ్ లోని నా కాటేజ్ నెంబర్ ఫోర్ కెళ్ళిపోతాను."

    అతనా మాట అనగానే అన్నపూర్ణ దబ్బుమని కింద పడిపోయింది. అందరూ హడావుడిగా లోపలకు పరుగెత్తి ఆవిడ ముఖంమీద నీళ్ళు కొట్టి లేపి కూర్చోబెట్టారు.

    "ఇదిలా తేలదుగాని అమ్మాయిని పిలవండి" అన్నాడు పెద్దమనిషి.

    రాధ తలుపు వెనుకనుంచి ముందుకొచ్చి నిలుచుంది.

    "చూడమ్మా! ఈ ఇద్దరిలో ఎ భర్తను ఎన్నుకుంటావో చెపుతావా?"

    రాధ ఇద్దరివంకా మార్చి మార్చి చూసింది.

    "ఇద్దరూ నాకు రెండు కళ్ళవంటి వారండీ! ఏ కన్ను నొదులుకోగలను?" అంది రెండు కళ్ళనుంచీ జరుతోన్న కన్నీటిని తుడుచుకుంటూ.

    "ఆ మాట నిజమేనమ్మా! కాని ఈ రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలీ అంటే ఏం చేస్తావ్?"

    ఈ లోపులో మురళి పేట్రేగిపోయి, "ఈ కళ్ళ సెంటిమెంటునిక ఆపు చేయకపోతే అందరి కళ్ళూ పీకిపారేస్తాను" అరిచాడు.

    "అప్పుడు నా మంత్రజాలంతో వాటిని తిరిగి అతికిస్తాను" అన్నాడు స్వామి.

 Previous Page Next Page