"యస్సార్"
"డాక్టర్ మైత్రేయి మేడ మీద రూమ్ లో వుంది. నిన్ను ఓసారి ఎగ్జామిన్ చేస్తానంటోంది . వై డోంట్ యూ గో-"
"షూర్! వెళతాను సర్"
"హరియప్ -- వెళ్ళండి మరి!"
ఇద్దరూ మేడ మెట్లెక్కసాగారు .
"మనం చెప్పింది అబద్దమని ఇప్పుడు తెలిసిపోతుందనుకుంటాను " అన్నాడు సురేష్ మధ్యలో ఆగిపోయి . రాధిక మొఖంలో భయం కనబడింది.
"అలా ఎలా తెలుస్తుంది? లాబ్ లో టెస్టులు చేయాలి కదా!"
"డాక్టర్లు మనిషిని చూడగానే పట్టేస్తారు"
"ఇప్పుడేమిటి చేయటం?" బెదురుగా అడిగింది.
"డాక్టర్ నన్ను ఎగ్జామినేషన్ కోసం లోపలకు తీసుకెళ్ళిన రెండు నిమిషాలకు- నువ్ కొంపలు మునిగిపోయినట్లు తలుపు కొట్టు- నేను ఏదొక వంక చెప్పి బయటపడతాను ."
"తలుపెందుకలా కొట్టారని డాక్టర్ అడిగితె ?"
"అదంతా నేను చూసుకుంటాను కదా!"
"సరే -"
ఇద్దరూ మైత్రేయి గదికి చేరుకున్నారు.
డోర్ బెల్ మోగించిన అయిదు నిమిషాలకు రేగిపోయిన జుత్తుతో మాక్సీ డ్రస్ లో తలుపు తీసిందామే. నల్లగా, లావుగా లావుకి తగ్గ పొడుగ్గా - విపరీతమయిన సెక్సీగా ఉందామె.వయసు ముప్పయ్ అయిదున్నా చక్కని నిష్పత్తితో ఉన్న శరీరం వయసుని సైక్లోన్ బలంతో వెనక్కు నెట్టేస్తోంది.
"అయాం సురేష్" అన్నాడు సురేష్ చిరునవ్వుతో .
"సోవాట్?" కోపంతో అంది.
"ఈ రాత్రికి నేను కావాలని అడిగారట"
"వాట్ నాన్సెన్స్ యూ ఆర్ స్పీకింగ్ ? ఎవర్నడిగాను?"
"ఎండి శివరావ్ గారిని! నన్ను ఇప్పుడే ఎగ్జామిన్ చేస్తానన్నారని-------"
ఆమెకు హటాత్తుగా గుర్తుకొచ్చేసింది.
"ఓ! యూ ఆర్ దట్ సురేష్" చిరునవ్వుతోంది.
"అయాం సేమ్ సురేష్."
"ప్లీజ్ కమిన్"
ఇద్దరూ లోపలకు నడిచారు.
విజిటర్స్ గదిలో మరో యువకుడు కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. అతని కాళ్ళకు ఆడాళ్ళ చెప్పులున్నాయి.
ఇద్దరూ అతని కేదురుగ్గా సోఫాలో కూర్చున్నారు.
"ఈయన డాక్టర్ గోపాల్! సెక్స్ స్పెషలిస్ట్! మా హజ్ బెండ్ కి అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. చాలాకాలం సింగపూర్ లో వున్నారు"
"నేనాయన్ను చూడగానే అనుకున్నాను. విదేశాల్లో వుండి వుంటారని."
అతను ఆశ్చర్యంగా చూశాడు.
"ఎలా అనుకున్నారు?" అడిగాడు కంగారుగా.
"మీ చెప్పులు చూసి! అచ్చం ఆడాళ్ళ చెప్పులు లాగుతున్నారు. విదేశాల్లోనే అలాంటివి దొరుకుతా యనుకుంటాను -- ఆడవాళ్ళ చెప్పుల్లాంటి మోగాళ్ళ చెప్పులు ."
ఇద్దరూ వాళ్ళ చెప్పులు చూసుకుని ఉలిక్కి'పడ్డారు.
ఆమె కాళ్ళకు మగాళ్ళ చెప్పులున్నాయ్. చప్పున చెప్పులు కనబడకుండా తనూ సోఫాలో కూర్చుని మాక్సీతో పాదాలు కప్పేసుకుందీ మైత్రేయి .
"మనం ఇంతవరకూ లోపల డిస్కస్ చేస్తోంది. ఈ పేషెంట్ గురించే డాక్టర్! పాపం! వీళ్ళు ఎంత ట్రై చేసినా పిల్లలు పుట్టటం లేదు --"
"ఓ ఎవరు రెస్పన్సిబుల్ దీనికి?" అడిగాడతను.
"హజ్ బెండ్ "
అతను సురేష్ వేపు ఓ క్రిమినల్ ని చూసినట్లు చూశాడు.
రాధికకు ఆనందంగా వుంది.
తన దగ్గర మాట్లాడితే పది రూపాయలు గుంజుకున్నందుకు తగిన శాస్తే జరుగుతోంది.
ఇద్దరూ కొద్ది నిమిషాలు అర్ధం కాని మెడికల్ లాంగ్వెంజ్ లో మాట్లాడుకున్నారు.
"కమ్ విత్ మీ" అంటూ సురేష్ కి సైగ జేసి వెలుపలి గదిలోకి నడిచింది మైతేయి.
సురేష్ గుండె జల్లుమంది.
రాధికకు సైగజేసి లోపలకు నడిచాడు.
రెండు సింగిల్ కాట్స్ దూరం దూరంగా వున్నాయి.
"క్విక్! బట్టలు తీసేసి పడుకోండి!"
సురేష్ కంగారుపడ్డాడు.
"నేనా?"
"పేషెంట్ తీయకపోతే డాక్టర్ బట్టలు తీస్తుందా ఎక్కడయినా?"
"నా ఉద్దేశ్యం అది కాదు. పోనీ అదంతా మనం మీ డిస్పేన్సరీలో చేస్తే ఎలా ఉంటుంది ?"
"ఇక్కడయితే ఏమిటి నష్టం?"
"నిజం చెప్పాలంటే చాలా పెద్ద కంప్లికేషన్ ఒకటుంది ."
"ఏమిటది?"
"మా మిసెస్ కొంచెం సైకో టైప్! నా మీద అనుమానం ఎక్కువ ! ఒకసారి వాళ్ళ సిస్టరే అర్ధరాత్రి నా గదిలో కూర్చుని మాట్లాడుతొంటే హటాత్తుగా మా ఇద్దరినీ పట్టుకుని కిందకు లాగేసి , మా ఇద్దరి మీద పడి రక్కేసింది. వాళ్ళిద్దరినీ విడదీయటానికి అరగంట పట్టింది నాకు,"
డాక్టర్ మైత్రేయి కళ్ళల్లో భయం కనిపించింది.
"అయినా గానీ డాక్టర్ దగ్గర అలాంటి చేష్టలు ఎవరూ చేయరు మీరేం వర్రీ అవకండి! ముందు ఫాంటు విప్పండి - క్విక్ ! ఇంత స్లో వ్యవహారాలు నాకు నచ్చవ్."
సురేష్ కేం చేయాలో తోచటం లేదు. రాధిక తలుపు తడుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు.
పాంటు గుండీలు విప్పుతున్నట్లు నటించాడు.
"గుండీ చాలా టైట్ గా ఉంది. పోనీ రేపు -"
"ఇలాంటి గుండీల వల్లే మీ మిసెస్ సైకో అయిపోయి ఉంటుంది."
"టైలర్ ని మార్చేయాలని డిసిషన్ తీసుకున్నాను లెండి ఫ్యూచర్ లో ఇంకా ఈ ప్రాబ్లం ఉండదు ---"
"మీకు చేతకాకపోతే ఇలా రండి ! నేను తీస్తాను "
సురేష్ గుండె లవిశిపోయినాయ్.
సరిగ్గా అప్పుడే తలుపు తీసుకుని రాధిక లోపలికి వచ్చి నిలబడింది.
ఆమెను చూసేసరికి ప్రాణం లేచి వచ్చినట్లయిందతనికి.
మైత్రేయి మొఖంలో కొంచెం కంగారు, భయం.
'చూశారా! నేను చెప్పలేదూ? పిచ్చి వచ్చేసింది. మనిద్దరినీ కింద పడేసి రక్కేస్తుందిప్పుడు " నెమ్మదిగా అన్నాడు సురేష్.
మైత్రేయి చప్పున సురేష్ వెనుకకు వచ్చి నిలబడింది.
"మైగాడ్! ఆమె మొఖం చూస్తుంటేనే భయంగా ఉంది నాకు! సైకోలాజికల్ ఫిట్స్ వచ్చేముందు అచ్చం ఆలాగే కామ్ గా నిలబడతారు" అంది రాధిక వంకే భయంగా చూస్తూ.
రాధికకు కోపం ముంచు కొచ్చింది.
"వాట్? నాకు సైకోలాజికల్ ఫిట్సా?' కోపంగా అంది.
"మీరు భయపడకండి డాక్టర్! పిచ్చి వచ్చినప్పుడు దాన్నెలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు."
రాధిక కోపం పెరిగిపోయింది.
"ఏమిటి? నా పిచ్చిని మీరు కంట్రోల్ చేస్తారా?" మండిపడుతూనే సురేష్ వేపు నడిచింది.