Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 37


    "అన్నీ!" అన్నాడు రాజా కూడా నవ్వి.

 

    "మిస్టర్ రాజా! మీరు మానసికంగా చాలా వ్యధకు గురవుతున్నట్లుగా వున్నారు. అసలు మీరు అందరికన్నా సంతోషంగా వుండాలి. ఎందుకంటే, బ్రెయిన్ కు అంత యాక్సిడెంట్ అయి బయటపడి జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి ఏమీ పోగొట్టుకోకుండా వున్నందుకు."

 

    "కానీ అదే బాగుండేది."

 

    "ఏమిటి మీరనేది?"

 

    "అవన్నీ పోయివుంటే!"

 

    "ఎందుకని?"

 

    "ఏమీ లేదులెండి."

 

    "దట్సాల్ రైట్! బీ ఛీర్ ఫుల్!" అని అతని భుజంతట్టి డాక్టర్ నరేంద్ర బయటకు వెళ్ళిపోయాడు.

 

    తన ఆఫీస్ రూంలోకి వెళుతూంటే మాలతి ఎదురుగా వచ్చింది.

 

    "మాలతీ!" అని పిలిచాడు.

 

    ఆమె ఆగింది.

 

    "కమిన్!"

 

    రూంలోకి వెళ్లాక, తన కుర్చీలో కూర్చుని "టేక్ యువర్ సీట్!" అన్నాడు.

 

    "ఫర్వాలేదులెండి" అన్నది మాలతి నిలబడే.

 

    "రూం నెంబర్ టెన్ లో రాజాని నువ్వు అటెండ్ అవుతున్నావు కదూ?"

 

    ఆమె తల ఊపింది.

 

    "చాలా ఇంట్రెస్టింగ్ కేస్! మూడేళ్ళ కోమా తరువాత అతను బ్రతికి బయట పడ్డాడు. అంతేకాదు, అతని సెన్సెస్ అన్నీ నార్మల్ గా వున్నాయి. రాడ్నీ స్మిత్ అనే డాక్టర్ అతని కేసు వివరాలన్నీ నాకు వ్రాశాడు. మానసికంగా అతనేదో తీవ్రమైన వ్యధకి లోనవుతున్నట్లుగా వుంది. అతని బ్రెయిన్ ఒత్తిడికి తట్టుకోలేక తిరిగి అతను కోమాలోకి వెళ్ళినట్లయితే ప్రపంచంలోని ఏ శక్తీ అతన్ని రక్షించలేదు


    ఆమె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా నిలబడి వుంది.

 

    "మన హాస్పిటల్ మీద ఎంతో నమ్మకముంచి ఈ కేసు మనకు పంపించాడు రాడ్నీ స్మిత్. అతని నమ్మకాన్ని వమ్ము చెయ్యకూడదు."

 

    "అందుకని ఏం చెయ్యాలి?" ఆమె మృదువుగా అడిగింది.

 

    "అతని మెదడులోని తరంగాలు ఎక్కువ ఒత్తిడికి లోనుగాకుండా, తీవ్రంగా ప్రకంపించకుండా మనం శాయశక్తులా కృషి చెయ్యాలి. ఐ మీన్ మనం అంటే ఎక్కువగా నువ్వు. ఇది చాలా సరళంగా ట్రీట్ చెయ్యవలసిన కేసు. దీని జయాపజయాలు ఎక్కువగా నీ మీదనే ఆధారపడి వున్నాయి."

 

    "నో-ప్లీజ్! నాకంత శక్తిలేదు" అన్నదామె ఖంగారుగా.

 

    "నో! ఆ శక్తి నీకే వుంది. యు హేవ్ టు యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్!"

 

    ఆమె నిరుత్తరురాలైనట్లు నిశ్శబ్దంగా నిలబడిపోయింది.

 

    "మాలతీ! ఇంకా నువ్వెళ్ళు."

 

    ఆమె అక్కడినుంచి నిష్క్రమించాక ఒక్క నిముషం అలాగే కూర్చుని, తరువాత డ్రాయర్ సొరుగుతీసి, అందులోనుంచి ఒక చిన్న ఫోటోను బయటకు తీసి, చేతిలో పట్టుకుని దానివంక తదేకంగా చూడసాగాడు.

 

    ఆ ఫోటోలోని స్త్రీ చాలా అందంగా, అపురూపంగా వుంది. విశాలమైన ఆమె కన్నుల్లో ప్రేమ వెల్లివిరుస్తోంది. ప్రేమవర్షం కురుస్తోంది.

 

    జాగ్రత్తగా చూస్తే మాలతికీ, ఆమెకూ చాలా పోలికలు కనిపిస్తాయి. ఫోటోలోని ఆ స్త్రీ ఎంత అందంగా వుందో, మాలతికూడా అంత అమ్ద్మగా సుకుమారంగానూ వుంది.

 

    "మధూ! ఎక్కడున్నావ్ నువ్వు?"

 

    ".........."

 

    "నాకు కనిపించనంత దూరాలకు అంత నిర్దయగా ఎలా వెళ్ళిపోయావు?"

 

    గుండెల్లో ఎంత బరువు? ఒక్కో మనిషిని చూస్తే, దగ్గరగా వచ్చి దూరంగా జరిగితే, దూరంగా జరిగాక మళ్ళీ దగ్గరగా వచ్చినా ఎంత బావురుమనే శూన్యం! అర్థంకాకుండా అణువణువునా తొలిచేసే, చీల్చేసే, పీల్చేసే నిర్దాక్షిణ్యమైన ఏకాంతం.

 

    "మధూ! అవర్ లవ్ ఈజ్ ఎటర్నల్."

 

    ఫోటో పెదవులదాకా తీసుకున్నాడు. అనీ ఆననట్లు చిన్న ముద్దు.

 

    "డాక్టర్!" బయటినుంచి ఎవరో పిలిచారు.

 

    ఫోటో డ్రాయర్ లో పెట్టేసి, కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుని "యస్!" అన్నాడు.   


                                                                     15


    మాలతి గదిలోకి అడుగుపెట్టింది.

 

    "రండి" అన్నాడు రాజా సాదరంగా.

 

    అతని చేతిలో ఓ నవల ఉంది. వాలకం చూస్తే చాలా శ్రద్ధగా ఆ నవల చదువుతూన్నట్లుగా వుంది.

 

    "సారీ! డిస్టర్బ్ చేశానా?" అంది మాలతి.

 

    "చేశారు."

 

    "అయితే వెళ్ళిపోతాను" అంది వెనుతిరిగబోతూ.

 

    "కానీ కోపం రాలేదుగా. కొంతమంది డిస్టర్బ్ చేస్తే కోపం రాదు, పైపెచ్చు అందంగా వుంటుంది.'

 

    "ఏమిటి చదువుతున్నారు?"

 

    "నవల."

 

    "మీరు నవలలు చదువుతుంటారా?"

 

    "ఇదివరకు చదివేవాణ్ణి కాదు. కానీ ఈమధ్య గదిలో కూర్చునీ కూర్చునీ విసుగు భరించలేక చదువుతున్నాను."

 

    "ఏమిటా నవల?"

 

    అతను కవర్ పేజీ ఆమెకు కనిపించేలా చూపించాడు "ప్రేమకు శాంతి లేదు" రచయిత్రి పేరు ప్రమీలాదేవి అని వుంది.

 

    "ప్రేమకు శాంతి లేదా? ఆ పేరేమిటండీ?"

 

    "ఇందులో ప్రేమ, శాంతి అనే ఇద్దరమ్మాయిలు వుంటారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ప్రేమ ఒకవ్యక్తి పరిచయంలో పడి అతనితో ప్రేమ పెంపొందించు కుంటుంది. శాంతికి ప్రేమ అంటే నమ్మకంలేదు. ఆమె ప్రేమరాహిత్యంతో జీవిస్తుంది. ఇద్దరిలో ప్రేమను గురించిన అభిప్రాయాలు వేరయినా స్నేహపరంగా ఒకర్నొకరు విడవలేకుండా వుంటారు. చివరకు తను కోరుకున్న వ్యక్తికోసం శాంతిని కోల్పోవలసి వస్తుంది ప్రేమ. శాంతినీ, శాంతినీ రెంటినీ శాశ్వతంగా పోగొట్టుకుంటుంది."

 

    "కథ బాగానే వుందిగానీ కృత్రిమంగా వుంది."

 

    "ఏం?"

 Previous Page Next Page