Previous Page Next Page 
రాక్షసుడు పేజి 37


    "రేపటికల్లా వెళ్ళిపోవాలి. అర్థమైందా" అంటూ ఆ తుమ్మ మొద్దులాంటి వ్యక్తి అక్కడ నుంచి కదిలాడు.

 

    అతడు ఆమె దగ్గిరగా వెళ్ళి "ఏమిటి గొడవ" అని అడిగాడు. ఏదో లోకంలో వున్నది, ఈ మాటలకి ఉలిక్కిపడి తేరుకొని అతడిని చూసి "మీరా? ఇలా వచ్చారేమిటి? ఇంత దూరం నడిచే వచ్చారా?" అని అడిగింది సంభ్రమంతో.

 

    ఇంతలో ఒక కుర్రవాడు పాకలోంచి విరిగిన కుర్చీ తెచ్చి వేశాడు.

 

    "కూర్చోండి" అతడు కూర్చున్నాడు. "ఎలా వుంది మీ కాలు?"

 

    "తగ్గిపోయినట్టే. పడుకునీ పడుకునీ బోరుకొట్టి ఇలాబయల్దేరాను. ఇంతకీ ఏమిటి గొడవ?"

 

    "ఇక్కడ పాకవేసుకున్నందుకూ, ఇలా స్కూలు నడుపుతున్నందుకూ ముడుపు చెల్లించాలట. అదీ గొడవ"

 

    "ఎవరికి? ఈ రౌడీకా?"

 

    "కాదు. ఇతడు కేవలం సేవకుడే. పైన ఇంకొకరున్నారు".

 

    "ఎవరు మునసబా?"

 

    "ఇప్పుడు మునసబుల్నీ, కరణాల్నీ తీసేశారుగా. ఇతడు మండలాధికారి".

 

    "పొజిషను మారినా మనస్తత్వాలు మారలేదన్నమాట. మున్సీపులు పోయి మండలాలు వచ్చినా సగటు మనిషి మనుగడలో మార్పు రాకపోవటం ఎంత సహజం. వస్తుందనుకోవటం ఎంత అజ్ఞానం!"

 

    అతని మాటలు ఆమెకి అర్థమయ్యాయో లేదోగానీ, ఆమె తన ధోరణిలో అంది- "ముందు ఊరికి కాస్త దూరంగా వుండేవాళ్ళం. కప్పం కట్టాలన్నారు. పిల్లలు అంతంత జీతాలు ఇచ్చుకోలేరు. మరింత దూరం వచ్చి, ఇదిగో ఇక్కడ స్కూలుకు పాక వేసుకుంటే ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చి అడుగుతున్నారు. వీళ్ళు మమ్మల్ని వదిలేలా లేరు".

 

    అతడామె వైపు జాలిగా చూశాడు. రెక్కల్లో పూర్తి సత్తువకూడా రాని ఒక చిన్నారి పక్షి తనకున్న జ్ఞానాన్ని నలుగురికీ పంచాలన్న ఆశతో చిన్న గూడు కట్టి, కాబోయే గొర్రెల కాపర్లని, గోళీలాడుకునే భావిభారత పౌరుల్ని కాసింత సరిదిద్దాలని ప్రయత్నిస్తూంటే, ఆ గుడి గోపురాన్నీ ఆ విద్యామందిరాన్నీ కూడా కూలగొట్టాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడున్నారు.

 

    "ఎంత కావాల్ట వాళ్ళకి".

 

    "డబ్బు కాదు, నేను వెళ్ళాలి. వాళ్ళ ఆశ్రితజనంలో చేరాలి. అదీ ఆయనకి కావల్సింది..." ఆ తరువాత ఆమె చెప్పలేదు.

 

    "ఎవరతను? బాగా పలుకుబడి వున్నవాడా?"

 

    "ఆ వున్నట్టే వుంది. అతడి క్రింద ఇద్దరు ముగ్గురు రౌడీలు వున్నారు. అందులో ఒకడిని చూశారుగా. వాళ్ళని వేసుకొని సినిమాలో విలన్లా తిరుగుతూ వుంటాడు"- నవ్వింది. అయితే ఆ నవ్వులో జీవంలేదు.

 

    "మీరంతా అతడంటే చాలా భయపడతారనుకుంటానే..."

 

    "సాధారణంగా ఆడవాళ్ళు అతని కంటపడరు. చిత్రమేమిటంటే వాళ్ళ మొగుళ్ళు కూడా వాడిని కాదనరు. కరుణాకటాక్షంకోసమా అన్నట్టు గుమ్మం దగ్గిరే వేచికుంటారు. ఊరు ఊరంతా అంతే. పంట నీళ్ళు ముందు వాడి పొలాలు తడపాలి. వాడు గుడికివెళ్తే పూజ తిరిగి మొదలు పెట్టాలి. ఒకరకంగా అతడీ వూరికే రాజు.... అయినా అతడంత భయంకరమేం కాదు. ఇప్పుడొచ్చాడు చూడు! వాడూ అన్నీ చేసేది- వాడు కర్కోటకుడు- పేరు రంగా. చాలాసార్లు పోలీసులు కేసు పెట్టారు. కానీ ఎలా వచ్చేస్తాడో మూడ్రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు".

 

    అంతలో దగ్గర కొచ్చిన పిల్లలు "వెళ్ళొస్తాం టీచర్" అన్నారు. ఆమె తలూపింది.

 

    "నేను కూడా వెళ్ళొస్తాను".

 

    "ఉండు. కాస్త మజ్జిగ తాగి వెళ్దూగాని, అత్తయ్యా కూడా వచ్చేస్తుంది".

 

    "ఉహూ.వద్దు-" అతడు వెనుదిరిగాడు.

 

    "ఇంకొన్నాళ్ళుంటావా?" అతడితోపాటూ నడుస్తూ అడిగింది.

 

    "ఉండమంటావా?"

 

    "మీ విక్రమ్ సింగ్ కి తెలుస్తే?"

 

    "ఏమనుకోడు. శలవు పుచ్చుకుంటున్నానని చెప్తాను".

 

    జలంధర్ వుండగా ఏదో సినిమా చూశాను. గంగాకి కసమ్ ... ఉహూ కాదు-పత్తర్ అవుర్ పాయల్ అనుకుంటా. అందులో ఠాకూర్ లా వుంటాడా మీ విక్రమ్ సింగ్?"

 

    "అంటే?"

 

    "అంటే- తోలుపట్కా గుబురు మీసాలు, ఎత్తయిన గుర్రం, భుజం వెనుక తుపాకి".

 

    "ఉహు అలా వుండడు. ఖద్దరు వేసుకుంటాడు. సన్నగా బలహీనంగా వుంటాడు. తరచు అసెంబ్లీలోనూ, పార్లమెంటులోనూ కనబడుతూ వుంటాడు".

 

    "నిజం!" అనబోయి ఆగి, ఏదో అనుమానం వచ్చినట్టు చూస్తూ "నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావ్ కదూ" అంది.

 

    "నా కప్పుడప్పుడూ అనుమానం వస్తూ వుంటుంది".

 

    "ఏమని?"

 

    "నువ్వు నిజంగా ఎమ్.బి.బి.యస్. చదువుతూ మానేశావా అని".

 

    ఆమె రోషంగా "అలాగే చూస్తూ వుండు. ఏదో ఒక అత్యవసర పరిస్థితి వచ్చి నేనే నీకు నీకు ఆపరేషన్ చేసి నిరూపిస్తాను" అంది.

 

    "అంత స్థితి అంటూ నిజంగా వస్తే ఆపరేషన్ టేబుల్ మీదే నేను చచ్చిపోతాను. గాయాల వల్ల కాదు. నువ్వు కత్తిపట్టుకున్న భంగిమచూసి".

 

    "ఛా. అలా అనకు. తధాస్తు దేవతలుంటారట".

 

    "అంటే?"

 

    "వాళ్ళు ఆకాశంలో వుండి మనని గమనిస్తూ వుంటారట. మా మేనత్త చెప్పింది. మనం ఏదైనా అన్నా అనుకున్నా పైనుండి తధాస్తు అంటారట".

 

    అతడు ఆగి, చప్పున తలెత్తి ఆకాశం వంక చూస్తూ కళ్ళు మూసుకున్నాడు.

 

    "ఏమిటిది" నవ్వు బిగపట్టి అడిగింది.

 

    "నీకు చెప్పకూడదు. కేవలం తథాస్తు దేవతలకే చెప్పాను".

 

    "నువ్వు ఏం కోరుకున్నావో నాకు తెలుసులే"

 

    "ఏం కోరుకున్నాను?"

 

    "అమ్మ ఆశ, నువ్వు చెప్పనప్పుడు నేనెందుకు చెప్తాను".

 

    "చెప్పనా?"

 

    "ఊ-"

 

    "విక్రమసింగ్ లను పార్లమెంటులోకి ప్రవేశించకుండా ఆపు చెయ్యండి అని కోరుకున్నాను".

 

    ఆమె తల తిప్పి అతడివైపు చూసింది. అతడు ఆమెవైపు చూడటం లేదు. నడుస్తూ ఎటో చూస్తున్నాడు. పచ్చటి పొలాల చివర ఎర్రటి ఆకాశంలో తెల్లటి కొంగల బారు...

 

    "అబ్బ-అంత తొందరగా నడుస్తే ఎలా బాబూ. నేనేమన్నా నీ అంత పొడుగ్గా వున్నానా?"

 Previous Page Next Page