"కాని అది వొప్పుకోదు. నాతో మాట్టాడదు."
"మరి నేనేం చెయ్యను?..... చూడు, రవణ చాలా అమూల్యమైన పిల్ల. జీవితమంతా కూడా నీకు నిక్షేపం వంటిది. స్వతంత్రపు టాలోచనలు గలది.
ఉపయోగపరుచుకున్నావా, స్వర్గమనుభవిస్తావు. చెరుపుకున్నావా, నీ అంత దౌర్భాగ్యుడుండడు. రవణ ఏమవుతుందో అని నీకేమీ భయం వద్దు. అవసరం యేమీ లేదు. దాన్ని బంధించావా, చస్తుందో, ఎగిరిపోతుందో జాగ్రత్త!" అని లేచి వెళ్ళిపోయాడు.
మర్నాడు మధ్యాహ్నం రవణ స్నానంచేసి యింటోకి వచ్చేప్పుడు దోవకాసాడు చివరలనించి నీళ్ళబొట్లు పడుతున్న జుట్టుతో, చీరె మాత్రం చుట్టబెట్టుకున్న తడి వొంటితో వెడుతోంది. చుట్టూ యెవరూ లేరు. ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఆకస్మికంగా. దడిసి, అరవబోయి, అతన్ని చూసి, ఆగి, చెయ్యి లాక్కుంది.
చెయ్యి వదలక "ఒక్కమాట విను.... లాభంలేదు. వొదలను, ఆగు, నీతో మాట్టాడాలి, మాట్టాడితీరాలి. ఈ వాళ సాయంత్రం చిలకలపూడి రోడ్డుమీద అట్లారా. నేను అడవి దగ్గర కలుసుకుంటాను. తప్పకుండా రావాలి, ఏం?
రవణ మాట్టాడలేదు. ఆ మధ్యాన్నపు మెత్తని కాంతిలో, ఒక చేత్తో అస్ప్రుశ్యమైన తన లేత రొమ్ముమీదికి చీర పట్టుకుని, యింకో చేతిని అతను కైదుచేస్తే, సిగ్గుతో భయంతో అటూ యిటూ బెదిరి బెదిరి చూసే, రవణ అందాన్ని అతను చూడనేలేదు. ఇతర స్త్రీలను యెరక్కపోవడం చేత, తనమీద యిష్టమే లేనిదైతే, రవణ యెట్లా ప్రవర్తించి వుండేదో, అతనికి తెలీలేదు.
"చెప్పు, రావాలి నువ్వు."
"వొదలండి."
"వొస్తానను, వొదులుతా."
"పియర్సు" సబ్బువాసన వేసింది అతనికి. సన్నని చర్మంమీద నీళ్ళ బొట్టుమీద ఎండపడి మెరుస్తున్నాయి. రెండు జుట్టుపాయలు వస్త్రం లేని భుజంమీద తడిగా జీరాడుతున్నాయి.
"ఎక్కడికి?"
"చెప్పలా? చిలకల...."
"ఎందుకు?"
"మాట్టాడాలి."
"ఎవరో వొస్తున్నారు. వొదలండి."
ఆమె కంఠంలోని మాధుర్యం, మార్దవం అతనికప్పుడు గోచరించడం లేదు. కాని మనసు అడుగున వుండిపోయి, రెండురోజులు అర్ధంకాని ప్రేమ బాధని కలిగించాయి.
చెయ్యి లాక్కుని వెళ్ళిపోతోంది. చప్పున మళ్ళీ అందుకున్నాడు. జుట్టులో ఒక పాయా, సగంచీర చెంగూ చేతికి దొరికాయి. తలదూరంగా లాక్కుంది. తడిజుట్టు జారిపోయింది. చీరచెరుగు వొంటిమీద నుంచి అతని వేపు వొచ్చేసింది. అతనికి మొదటిసారి కనపడ్డ ఆమె శరీరాన్ని చూసి సిగ్గుపడి చెరుగు వొదిలేశాడు. రవణ వెళ్ళిపోయింది.