"హిమాలయాల్లో అవతార స్వామిని! రాధకు బావను! చిన్నప్పుడే ఆమె మెడలో మూడు ముళ్ళు వేసినవాడిని!" చిరునవ్వుతో చెప్పాడు అవతారస్వామి.
"అంతా అబద్ధం! అసలు వీడు జన్మలో హిమాలయ పర్వతాలు చూసివుండడు!"
"నీ అనుమానానికి నా సమాధానం కాటేజ్ నెంబర్ ఫోర్ నాయనా!"
నరసింహానికేమీ అర్ధం కాలేదు. "కాటేజ్ నెంబర్ ఫోర్ ఏమిటి?"
"ఋషీకేశ్ దగ్గర నేను గడిపిన ఆశ్రమం తాలూకూ కాటేజ్ నెంబర్ నాయనా అది!"
"నేను నమ్మను" మళ్లీ అరిచాడు మురళి.
"నమ్మవలసింది నువ్వు కాదు నాయనా! ఇందాకటినుండి వృధాగా పొరబాటు పడుతున్నావ్."
"ఇంకెవరు నమ్మాలి మరి?"
"నా భార్య రాధ? నా మామ నర్సింహం! మిగతా ప్రపంచం అంతా నమ్మినా, నమ్మకపోయినా మాకు నిమిత్తం లేదు."
మురళీ వాళ్ళవేపు గాబరాగా చూశాడు.
"మావయ్యా! మీరిద్దరూ వీడి మాటలు నమ్ముతున్నారా?" అని కంగారుగా అడిగాడు.
నరసింహం రామలింగం వైపు చూశాడు. రామలింగం అన్నపూర్ణ వేపు చూశాడు. అన్నపూర్ణ నరసింహంవేపు చూసింది. నరసింహం మురళివేపు చూశాడు. మురళి రామలింగం వేపు చూస్తున్నాడు. రామలింగం అన్నపూర్ణవేపు చూడబోయి తనిక మాట్లాడకపోతే ఈ చూపుల ప్రహసనం ఆగదని గ్రహించి, "నమ్మాలో నమ్మకపోవాలో తెలియటం లేదు నాయనా! మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళలాగా కనబడుతున్నారు" అన్నాడు.
మురళికి మతిపోయింది. ఎలుగెత్తి గట్టిగా, ఆఖరి ఆశతో "రాధా" అని అరిచాడు. దానికి సమాధానంగా పూజ గదిలోంచి శ్రావ్యంగా వినిపించ సాగింది __
"ఎన్ని నోముల పుణ్యఫలమో __
ఇద్దరు భర్తల భార్యనైతిని.
ఓ తులసీ - ఓ నాగదేవతా
రారా - దిగి రారా - దిగివచ్చి దిగివచ్చి
చెప్పరా - నా అసలు పతిదేవుని గుర్తించరా" అని.
మురళికి జుట్టు పీకేసుకోవాలని అనిపించింది. అంతలోనే అది రేడియోలో సుశీల గొంతుగా గుర్తించి కొంతలో కొంత శాంతించి పూజ గదిలోకి ప్రవేశించాడు.
రాధ హారతి వెలిగించి దేముడి చుట్టూ తిప్పేస్తూంది. మురళికి అది చూసి వళ్ళు మండిపోయింది. "ఇలా తిప్పటంలో ఏమిటి నీ ఉద్దేశ్యం?" అని అడిగాడు కోపంగా.
"ఏమోనండి. ఆయనే నా మెళ్ళో పదీ, పదిహేను సంవత్సరాలక్రితం తాళికట్టిన భర్త అయివుంటే, ఇప్పుడు ఆయనకి ద్రోహం చేయలేనండి, మిమ్మల్ని ఎంత ప్రేమించినా - ఒక పవిత్ర భారత స్త్రీ తులసి చెట్టు సాక్షిగా జీవితంలో ఒకసారే..."
"ఆపూ" అరిచాడు మురళి ముక్కుపుటాలు ఎర్రబడగా.
"అలా అనకు నాయినా" వెనుకనుంచి వినబడింది. మురళి చివాలున వెనుదిరిగాడు. అవతారస్వామి, వెనుకే గుంపుగా జనం నిలబడి చూస్తున్నారు. దాంతో మరింత వళ్ళు మండి, పిడికిళ్ళు బిగించి, "ముందిక్కడ నుండి పోతావా పోవా?" అని గద్దించాడు.
అవతారస్వామి చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వడివడిగా నడిచి మళ్లీ శోభనం గదిలోకెళ్ళి కూర్చున్నాడు. అతని వెనుకే అందరూ మళ్ళా ఊరేగింపుగా శోభనం గదిలోకి నడిచారు. వారితోపాటు రాధ కూడా ఆ గదిలోకి వెళ్ళటం చూసి, కసిగా లోపలికి ప్రవేశించి "మళ్ళీ ఇక్కడెందుకు కూర్చున్నావ్?" అంటూ అతడిమీదకు వెళ్ళాడు.
"అలా బల ప్రదర్శనకు ప్రయత్నించకు నాయినా! నాకు కరాటే వచ్చు!" స్వామి లేవకుండా చిరునవ్వుతో చెప్పాడు. మురళి మెదడులో ఏదో తళుక్కుమంది. చేతులుగాలిలోకి సాచి ఆనందంతో గట్టిగా అరిచాడు.
అందరూ అతడిని పిచ్చివాడిని చూసినట్టు చూశారు.
అది పట్టించుకోకుండా, "చూశారా! దొరికిపోయాడు. వీడు దొంగ సన్యాసే! లేకపోతే కరాటే ఎలా వస్తుంది వీడికి?" అని అరిచాడు మళ్ళీ.
అవతారస్వామి నవ్వాడు. "అజ్ఞానీ! మా ఆశ్రమంలో బౌద్ధసన్యాసులు కూడా వున్నారు. వారే మా అందరికీ కరాటే నేర్పించారు నాయినా! యోగాసనాల్లో కరాటే కూడా అంతర్భాగం! నేనున్న కాటేజ్ కవతలే టిబెట్టుంది."
"నేను నమ్మను."
"మళ్ళీ అజ్ఞానం! నమ్మవలసిన వారు వేరు ఉన్నారు నాయినా! నువ్వు కాదు."
మురళి కోపం పట్టలేక అతని మీదకు దూకాడు కాని - అవతార స్వామి చెంగున వెనక్కు ఎగిరి కరాటే ఫోజ్ లో కొచ్చేశాడు. ఇద్దరూ గదంతా తిరుగుతూండగా ఈసారి అన్నపూర్ణమ్మ హారతి పళ్ళెంతో గదిలో కొచ్చేసింది.