Previous Page Next Page 
వివాహం పేజి 36

    మళ్ళీ అనుకున్నాడు! ఆ రవణ తనకెందుకు? ఇంత కోపంవచ్చినా తనకి అనుమానం కలిగినా యెందుకు ఆ రవణని అంతగా కోరడం? విడిచి ఏ దేశాంతరమో లేచిపోతే ఎవరేమనగలరు తనని? మొగుడు పోయినాడని బాగా ఏడిపిస్తారు రవణని! ఎవరూ ప్రేమించరు. బాగా పని చేయించుకొని వెళ్ళగొట్టి పారేస్తారు. తన రవణని ఎవరన్నా ప్రేమించి లాలిస్తే? సుఖపడితే? వీల్లేదు, రవణ తనదనే భావం వదలలేదు. ఆమె ఏం చేసినా, యేమైపోయినా ఆమె బాధయత తనదేననీ, ఆమెని ప్రేమించడం తన ధర్మమనీ, అతని మనస్సు అడుగునించీ యేదో వినపడుతోంది.

    రవణకి అతను బాధపడుతున్నాడనే తెలీదు. బాధ కనబడుతోంది. కాని హృదయంలో ఎంత నరకమో తెలీదు. ఆ బాధంతా తనమీద ప్రేమవల్లనే కదా అని, పైగా ఆనందం. స్త్రీ ఎంతసేపటికి తన ఆనందాన్ని దూరంగా దాచుకుని, ప్రేమ వుంది కదా అని సంతోషిస్తుంది. పురుషుడు మీద పురకాలను కుంటాడు. అతని దగ్గిరినించి వచ్చే ఆనందాన్ని ఆమె యింకా ఎరుగదు. అతను నేర్పిందాకా తెలుసుకోలేదు. ఈ సంగతులేమీ గోపాలరావుకి తెలీవు. కావలస్తే తనని యేడిపిస్తుందనుకున్నాడు.

    కార్యం చెయ్యమని చీటీ వ్రాసి, తన దస్కత్ చేసి వెంకట్రావు గదిలో పెట్టాడు. రాత్రి భోజనం కాగానే వెంకట్రావుగారు గోపాలరావు గదిలోకి వచ్చి కూచున్నారు.

    "ఎందుకు తొందర నీకు? కోర్సు పూర్తి అయిందాకా ఆగాలనుకున్నావు కదూ?"

    "నా కట్టాంటి తొందర ఏమీ లేదు. కాని మితిమీరుతోంది. అదుపూ ఆజ్ఞ పెట్టేవాళ్ళు లేక చెడిపోతుంది, ఇంకా వుపేక్ష చేస్తే చాలా ముదురుతుంది."

    వెంకట్రావు గారు గోపాలరావు కొత్త ధైర్యానికి నవ్వుకున్నారు. ఇన్ని మాటలనడానికి ముందు ఎంత బాధపడి వుండాలో ఆయనకి తెలుస్తుంది. దిక్కులేక యితరుల మీద ఆధారపడి వుండి, తనది అనే కానీ లేని వారాల కుర్రవాడు కూడా, తనకి భార్య రాగానే, లోకువ చేసుకుని, బాధ్యతా, యోగ్యతా, మర్యాదా మాట్టాడుతాడు గదా! ఇరవై యేళ్ళు పెద్దవాడవుతాడు ఒక్కసారిగా, ఒక్కసారి గోపాలరావుతో చాలా మాట్టాడాలనుకుని అనుభవం వల్ల సంపాయించ వలసిందేగాని, తన మాటలవల్ల జ్ఞానం కలగదనుకుని వూరుకున్నాడు వెంకట్రావుగారు.

    "ఇంతకీ రవణ ఏం చేస్తుంది యిప్పుడు?"

    "అదే నేనంటోంది, ఈ ఇంటో మీ కెవరికీ విపరీతంగా కనబడ్డంలేదు."

    "మాకు విపరీతంగా కనపడితే మాత్రం, అడ్డు పెడతామనుకున్నావా? నేనూ, నా భార్యా, నీకుగానీ, నీ భార్యకుగానీ అత్త మామలం కాము. మీ యిద్దరూ మా అతిధులు, స్వతంత్రులు. ఇద్దరికీ యిష్టముంటే యివాలే కలిసి వుండండి- మా అభ్యంతరం యేమీలేదు. నన్నడగడ మెందుకు?"

 Previous Page Next Page