Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 36


    "వెళ్తాను సర్!"

 

    అతను తల ఊపాడు. ఆమె నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది.

 

    ఎన్నడూ అనుకోలేదు- జీవితంలో ఒంటరిగా మిగిలిపోతానని. గుండె ఎంత బరువు! మనసులో ఎంత శూన్యం! ఒంట్లోకి ఓపిక రానీ, ఈ భూమ్మీద ఆమె ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాడు. ఒకవేళ ఈ భూమ్మీద ఆమె లేకపోతే...?

 

    శరీరం అణువణువునా వణికింది.


                                                            * * *


    మర్నాడు అతన్ని చూడటానికి కళ్యాణి వచ్చింది.  ఆమెకు మునుపటికన్నా కొంచెం ఒళ్ళు వచ్చింది. అందంగా, పొంకంగా వుంది. మూడేళ్ళ కాలం ఆమెలో తెచ్చిన మార్పు గుర్తు పట్టటానికి కొంచెం కష్టమయేలా చేశాయి.

 

    కానీ అతని ఆశ్చర్యం అదికాదు. ఆమె ప్రక్కనున్న వ్యక్తిని చూసి.

 

    అతను దివాకర్!

 

    "డాక్టర్ దివాకర్!" అన్నాడు రాజా కొంచెంగా నవ్వుతూ.

 

    అతనుకూడా నవ్వాడు. ఆ నవ్వులో కల్మషం లేదు. ఎంతో ఆప్యాయతా అనురాగం వున్నాయి.

 

    దగ్గరకు వచ్చి రాజా ప్రక్కన కూర్చుని అతని చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ "రాజా! ఎలా వున్నారు?" అని అడిగాడు.

 

    "చూస్తూనే వున్నారుగా...." అని రాజా మళ్ళీ నవ్వి "మీరిప్పుడేం చేస్తున్నారు?" అని అడిగాడు.

 

    "యం.యస్. జనరల్ చేస్తున్నాను. ఈ ఏటితో అయిపోతుంది"

 

    రాజా వాళ్ళిద్దరివంకా మార్చి మార్చి చూశాడు.

 

    "ఏమిటలా చూస్తున్నారు?"

 

    "మీరిద్దరూ కలిసి రావటం నాకు చాలా ఆశ్చర్యంగా వుంది."

 

    "అవును. ఆశ్చర్యంగానే వుంటుంది. కానీ మీరు నమ్మలేని నిజమొకటి జరిగింది."

 

    "ఏమిటి?"

 

    "మేమిద్దరం పెళ్ళి చేసుకున్నాం."

 

    ఒక్క నిముషంపాటు అతను అప్రతిభుడయ్యాడు. జరిగిపోయిన సంఘటనలన్నీ అతని మస్తిష్కంలో గిరగిరా తిరిగాయి. కానీ అతనికి చాలా సంతోషమనిపించింది.

 

    "అయామ్ వెరీ వెరీ హ్యాపీ!"

 

    "రాజా! మీరు నన్ను క్షమించాలి. ఆరోజు కళ్యాణిమీద దురాగతం చేయించింది నేను. కేవలం మీమీద అనుమానం రేకెత్తించటానికే ఆ పని చేశాను."

 

    "పోనీలెండి. అవన్నీ చిన్నపిల్లలా చేష్టలు. ఆవేశంలో ఏమేమో చేశారు."

 

    "మీ తలకి దెబ్బ తగలడానికి కూడా నేనే కారణం."

 

    "నిజంగా అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదండీ. ఈ క్షణంలో నాకెవరిమీదా కోపంలేదు. కానీ నేనెవరికోసం తపించానో, ఆ వ్యక్తిని పోగొట్టుకున్నానే అన్న అశాంతే నన్ను నమిలేస్తోంది."

 

    ఇప్పటికి కళ్యాణి మాట్లాడింది. "ఆశ్చర్యం! మాధవి ఏమయివుంటుందో నాకర్థం కావటంలేదు. పర్సనల్ గా ఆమె జాడ తెలుసుకుందామని ఎంతో ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాలన్నీ విఫలమైనాయి" అన్నది చాలా ఖేదంగా.

 

    "ఏమై వుంటుంది? సూసైడ్ చేసుకుని వుంటుందా?" అన్నాడు దివాకర్.

 

    "నో! నా మాధవి అలా ఎన్నటికీ చెయ్యదు. ఆమె పిరికిది కాదు, చాలా డేరింగ్ టైప్" అన్నాడు రాజా ఆవేశంగా.

 

    ఆ సమయానికి మాలతి లోపలికి వచ్చింది. ఆమె చేతిలో రెండుమూడు మందు సీసాలు వున్నాయి.

 

    "సిస్టర్!" అన్నాడు రాజా. "మీట్ మై ఫ్రెండ్స్ డాక్టర్ దివాకర్, ఎండ్ షి ఈజ్ మిసెస్ కళ్యాణి. ఫైనలియర్ మెడికల్ స్టూడెంట్."

 

    "గ్లాడ్ టు మీట్ యు!" అన్నది మాలతి.

 

    కళ్యాణి ఒక్కక్షణంపాటు ఉలికిపడి మాలతి ముఖంలోకి చూసింది. ఆమెను ఇదివరకెప్పుడూ చూసినట్లులేదు. అంతేకాదు ఆమె ముఖంలో ఏ భావమూ లేదు.

 

    "మిస్టర్ రాజా చాలా లోన్లీగా ఫీలవుతున్నారు. మీలాంటి ఫ్రెండ్స్ తరచూ వచ్చి చూస్తుంటే మంచింది."

 

    "కానీ...మేము ఇక్కడ ఉండటంలేదు సిస్టర్! గుంటూరులో మా స్టడీస్" అంది కళ్యాణి.    

 

    "అలాగా!" అన్నట్లు ఊరుకుంది మాలతి. ఇంకేమీ మాట్లాడలేదు. తర్వాత బయటికి వెళ్ళిపోయింది.

 

    దివాకర్, కళ్యాణి గంటకు పైగా కూర్చున్నారు. అందరి మనసుల్లో విషాదం అలుముకుని వున్నా స్వచ్చంగా, సరళంగా వున్నాయి. కళ్యాణి హృదయం అతనిపట్ల దయనీయమై, ఆర్ధ్రపూరితమై వుంది. ప్రపంచంలో మాధవి ఎక్కడున్నా తీసుకొచ్చి అతని చేతికి అప్పగించాలనిపించింది. మాధవి కనిపించకుండా పోయాక ఆమె జీవితం ఒంటరిదైపోయింది. మనసువిప్పి మాట్లాడుకునే స్నేహితులే కరువైపోయారు. రాజా కూడాలేడు. ఆ పరిస్థితుల్లో దివాకర్ దగ్గరగా వచ్చాడు. అతన్లోని నిజమైన పశ్చాత్తాపం, అందులోంచి ఆవిర్భవించిన పశ్చాత్తాపం ఇద్దర్నీ ఒకరినొకరు సన్నిహితుల్ని చేశాయి. క్రమంగా సాన్నిహిత్యం ప్రేమగా మారింది. తర్వాత అది బంధంగా రూపురేఖలు దిద్దుకుంది.

 

    తర్వాత వాళ్ళు వెళ్ళడానికి లేచారు.

 

    "మీరు కనీసం నెలకోసారయినా వస్తూ వుండాలి. వారానికో ఉత్తరమైన వ్రాస్తూ వుండాలి" అన్నాడు రాజా ప్రాధేయపూర్వకంగా.

 

    వాళ్ళు వెళ్ళిపోయిన ఓ అరగంటకు దాక్తర్ఫ్ నరేంద్ర అతన్ని చూడటానికి వచ్చాడు.

 

    తెల్లటి పొడవైన శరీరాకృతి, నిర్మలంగా మెరిసే కళ్ళు, చెంపలదగ్గర హుందాగా నెరిసిన జుట్టు. ఆయన్ను చూస్తుంటే చాలా గౌరవమైన భావాలు కలుగుతాయతనిలో.

 

    లేచి కూర్చోబోయాడు.

 

    "నో నో!" అని వారించి "ఎలా వుంది?" అని అడిగాడు నరేంద్ర.

 

    "బాగుంది."

 

    "ఏం బాగుంది?" అన్నాడు డాక్టర్ నరేంద్ర చిరునవ్వుతో.

 Previous Page Next Page