Previous Page Next Page 
వివాహం పేజి 35

   
    రవణ స్కూలు కుర్రాళ్ళతో చాలా చనువుగా వుంటోంది." కింద దస్కతు యేం చెయ్యాలా అని, "శ్రేయోభిలాషి చిత్రగుప్తుడు," మొదలనవి యోచించి, యేమీ దస్కత్ లేకుండా వెంకట్రావుగారు యేం మాట్లాడలేదుగాని, రవణ మొహం చిన్నపోయింది. భోజనం దగ్గర మొహం వేళ్ళాడేసుకుని, ధుమ ధుమ లాడుతో రావటంతోటే, వెంకట్రావుగారూ రవణా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకోడం చూశాడు. కాళ్ళు వొణికాయి. తల తిరిగింది. తనకి అర్ధంకాని నడమంత్రపు ప్రపంచంలో పడ్డట్టయింది. బిగ్గరగా యేదో అరవాలని వుంది. విస్తరించి నేలకేసి కొట్టి లేచిపోవాలని వుంది. వీళ్ళందరూ కలసి తనని "పూల్" చేస్తున్నారు. ఎట్లా, తనాయింటో వీళ్ళ మొహాలు చూస్తూ తిరగడం? చెప్పకుండా వెళ్ళిపోతే? కాని రవణని వొదిలి పోవాలే! ఇంకా ఆ రవణ మీద బాధ్యత యేమిటి? ప్రేమా? ప్రేమేనేమో!

    మళ్ళీ సాయంత్రం కుర్రాళ్ళు రావడం దూరాన్నుంచే చూశాడు. మళ్ళీ నవ్వుతారు. చప్పున కండువా వేసుకుని చిలకలపూడి వేపు షికారు బయలుదేరాడు.

    ఈ వెంకట్రావుగారూ మొన్నటిదాకా అంతదయగా కనపడ్డవాడు ఇప్పుడిట్లా ఐనాడేం? తన బాధ చూస్తో వూరుకుంటాడేం? మారింది తనుగాని, ఆయన కాదని తెలుసుకునే స్థితిలోలేడు గోపాలరావు. అంతకన్న వయస్సూ జ్ఞానమూ కలవాళ్ళు కూడా తెలుసుకోలేరు? తనకెందుకు యీ బాధ! అందరు భర్తలూ యిల్లాంటి అవస్త పడతారా? అనుమానం తోస్తే రెండు తంతారు, తను తన్నాలంటే రవణ చిక్కదు. ఇంకా కార్యం కాకపోవడం వచ్చింది ఇబ్బంది. కార్యమే ఐతేనా పగలు ఎక్కుడున్నా రవణని రాత్రికి తన గదిలోకి పంపుతారు గదా? ఆ కుర్రాళ్ళతో మాట్లాడవద్దనీ, వాళ్ళని తిట్టమనీ తన దగ్గిర్నించి కదలవొద్దనీ ఆజ్ఞాపించవచ్చు. వెంకట్రావుగారిని అడిగితే! కార్యం చెయ్యమని! ఆ బాధ్యత అంతా వెంకన్న పంతులిది అంటాడేమో!

 Previous Page Next Page