డాక్టర్ నరేంద్ర చాలా సాదరంగా లోపలకు ఆహ్వానించాడు.
నలభై-నలభై అయిదేళ్ళ మధ్య వుంటుంది వయసు.
రాడ్నీస్మిత్ లాగే తెల్లగా, పొడవుగా వున్నాడు. ముఖంలో గొప్ప ప్రశాంతత, వింత వర్చస్సు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. పెదవులపై చెరగని చిరునవ్వు.
అప్పటికే రాజా చాలా అలసిపోయి నీరసంగా వున్నాడు. అది గమనించి డాక్టర్ నరేంద్ర ఈజీ చైర్ తెప్పించి, అందులో కూర్చోబెట్టి త్వరత్వరగా ఎడ్మిట్ చేసుకున్నాడు.
"రెండు మూడు నెలలు ఇక్కడ వుండాల్సి వస్తుంది. తర్వాత ఇంకేం ఫర్వాలేదు" అన్నాడు ఆందోళనపడుతున్న సీతారామారావుగారితో, పరీక్షలన్నీ పూర్తిచేసి.
రెండు గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించాక రాజాకి నీరసం కొంతవరకూ తగ్గింది. నిముషాలు, గంటలు లెక్కబెట్టుకుంటూ సుధాకర్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు.
మాధవి ఫైనలియర్ చదువుతూ చలాకీగా హాస్పిటలంతా తిరుగుతూ వుంటుంది. ఒంటికి ఏప్రాన్, చేతిలో స్టెతస్కోప్, హాస్పిటల్ వార్డ్స్ లో, ర్యాంప్స్ మీద అందంగా, ఠీవిగా తిరుగాడుతూ వుండివుంటుంది. యాక్సిడెంట్ మీద యాక్సిడెంట్ అయి తానీ స్థితికి రాకుండావుంటే ఫైనలియర్ పూర్తిచేసి, హౌస్ సర్జన్సీ చేస్తూ వుండేవాడు. తానీ స్థితికి ఎందుకొచ్చాడు? మాధవి వల్లనా? ఆ ఆలోచన లీలామాత్రంగానైనా తాకినందుకు అతనికి తనమీద తనకే కోపమొచ్చింది. పాపం మాధవి ఏంచేసింది? తానే ఆమె జీవితంలోకి దౌర్జన్యంగా ప్రవేశించాడు. ఆమెకు ఊపిరి సలపకుండా చేశాడు. కోరి ఈ పరిస్థితిని కల్పించుకున్నాడు. ఇందులో ఆమె తప్పేముంది?
బయట అడుగుల చప్పుడయింది. ఆశగా తల త్రిప్పి చూసేసరికి హాఫ్ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని సుధాకర్ లోపలికి వస్తున్నాడు. అతని ప్రక్కన... ఆశ నిరాశగా మారింది....ఎవరూ లేరు.
"అన్నయ్యా!" అంటూ సుధాకర్ బెడ్ దగ్గరకు వచ్చాడు.
"ఏమయింది?" అన్నాడు రాజా ఆతృతగా.
"నువ్విచ్చిన ఎడ్రెస్ ప్రకారం విజయవాడలో వాళ్ళింటికి వెళ్ళానన్నయ్యా! ఆమె బావనుకుంటాను. ఒక్కడే కనిపించాడు. మాధవి గురించి అడిగితే "మాధవిలేదు, గీధవి లేదు. పో పో" అని కసురుకున్నాడు. బయటకు వచ్చి చాలాసేపు వెయిట్ చేసి, చివరకు పనమ్మాయెవరో ఇవతలికి వస్తుంటే అడిగాను. మూడేళ్ళక్రితం ఆ ఇంట్లో ఏదో గొడవ జరిగిందనీ, అప్పుడామె ఇల్లు విడిచి వెళ్ళిపోయిందనీ, తర్వాత మళ్ళీ కనబడలేదనీ చెప్పింది" అని సుధాకర్ గడగడ చెప్పేశాడు.
"మళ్లీ కనబడలేదా? గుంటూరులో మెడికల్ కాలేజికి వెళ్ళి ఎంక్వయిరీ చెయ్యలేదా?"
"అక్కడికి కూడా వెళ్ళానన్నయ్యా! మూడేళ్ళక్రితం సెలవులకని విజయవాడ వెళ్ళి, మళ్లీ తిరిగి రాలేదుట."
"అయ్యో!" అనుకున్నాడు రాజా.
"అక్కడ కళ్యాణి అని ఒక ఫైనలియర్ స్టూడెంట్ కనిపించిందన్నయ్యా!"
అతన్లో మళ్లీ జీవం వచ్చినట్లయింది "కళ్యాణి కనిపించిందా? ఏమంది? నా గురించి చెప్పావా?"
"నేను నీ తమ్ముణ్ణని తెలుసుకుని చాలా ఆసక్తిగా ఎన్నో ప్రశ్నలు వేసింది. ఆ వివరాలన్నీ చెప్పాను. నిన్ను చూడటానికి యిక్కడకు వస్తానంది."
"మాధవి గురించి ఏం చెప్పింది?"
"ఆ సెలవులకి వెళ్ళినప్పుడే ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళి కలుసుకుందిట. తర్వాత మళ్లీ చూడలేదన్నది. ఎంత ప్రయత్నించినా ఆమె జాడ తెలియలేదుట!"
"అయ్యో! అంతా అయిపోయింది" అనుకున్నాడు రాజా తనలో తను గొణుక్కుంటున్నట్లు.
"ఏమిటన్నయ్యా?"
"ఏమీలేదు" అని రాజా కనులు మూసుకుని మౌనంగా ఊరుకున్నాడు. ఒక నిముషం సుధాకర్ మెదలకుండా నిలబడి బయటకు వెళ్ళిపోయాడు.
మాధవి వాళ్లింట్లో పనిచేసే అమ్మాయి సుధాకర్ కి ఇంకా చాలా విషయాలు చెప్పింది. వాళ్ల బావ బలవంతం చేయటం, ఆమె అక్కయ్య కిరసనాయిల్ అంటించుకుని తగలబడటం, ఆమెను రక్షించటానికి వెళ్ళి మాధవికూడా తీవ్రంగా అగ్నివాత పడటం, ఆమెను హాస్పిటల్లో చేర్చటం, నాలుగయిదు రోజులు గడిచాక వున్నట్లుండి ఆమె హాస్పిటల్ నుండి అదృశ్యం కావటం.....
ఇవన్నీ అన్నయ్యకు చెప్పాలనిపించలేదు. చెబితే అన్నయ్య తట్టుకోలేడేమోనని అతని లేత గుండె సంకోచించింది.
గదిలో రాజా కళ్ళు మూసుకుని అలాగే పడుకుని వున్నాడు. క్రమంగా సాయంత్రం గడిచింది. చీకటి పడింది.
అతను నిద్రపోవటంలేదు. ఎక్కడుంది మాధవి? ఏమైవుంటుంది? ఇల్లూ, చదువూ సమస్తం వదులుకుని పారిపోయేటంత ఆపద ఏం వచ్చుంటుంది?
గది బయట అడుగుల చప్పుడయింది. ఎవరో స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలకు వస్తున్నారు. స్విచ్ వేశారు. గదంతా వెలుతురుతో నిండిపోయినట్లు తెలుస్తుంది. అయినా కళ్ళు విప్పలేదు.
"ఎక్స్ క్యూజ్ మీ సర్! మీకు ఇంజక్షన్ చెయ్యాలి"
విద్యుద్ఘాతం తగిలినట్లు ఒళ్ళంతా వణికింది. ఆ గొంతు.....ఎన్ని కోట్ల గొంతుల్లో కూడా గుర్తుపట్టగలడు.
"మాధవీ!" అంటూ కళ్ళు విప్పాడు.
తెల్లగా, పాలరాతి బొమ్మలా, నర్స్ యూనిఫారంలో, చేతిలోని సిరంజితో ఒక యువతి నిలబడింది.
"నన్ను మాలతి అంటారు సర్! నేనిక్కడ నర్స్ ని. మీకు ఇంజక్షన్ చెయ్యడానికి వచ్చాను" అన్నది చిరునవ్వు ముఖంతో.
14
రాజా ఆశ్చర్యంగా ఆమెవైపే చూస్తున్నాడు. ఒక్క క్షణంలో చిగురించిన ఆశ అంతలోనే ఎంత నిర్దాక్షిణ్యంగా కరిగిపోయింది!
"సార్! ఇంజక్షన్."
ఆ గొంతు ఏదో లోకాల్లోకి తీసుకుపోతోంది. కానీ ఈ మనిషే వేరు.
"చెయ్యండి!"
ఆమె దగ్గరకు వచ్చి, కొంచెం వంగి, భుజానికి క్రిందుగా ఇంజక్షన్ చేసింది. ఆమె మనిషెంత సుకుమారంగా వుందో, చెయ్యటంకూడా అంత సున్నితంగానూ వుంది. ఏమీ నొప్పనిపించలేదు.