"బాగానే వుంది. ఇప్పుడే అవదు చాలా టైం పడుతుంది. అవును గాని రెండు రోజుల్నుంచి చూస్తున్నాను. నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు మీ వాళ్ళెవరూ లేరా?" అడిగింది వాష్ బేసిన్ లో చేతులు కడుక్కుంటూ.
"ఉన్నారు. వచ్చేస్థితిలో లేరు."
"మీ అమ్మగారు?" అడిగిందామె.
"క్యాన్సర్ హాస్పిటల్లోనా మైగాడ్! అంటే అమ్మా, నాన్న ఇద్దరిదీ సీరియస్ కండిషనేనా. నీకింకా ఎవరూ లేరా?"
"అన్నయ్య వున్నాడు. ఈ మధ్యే స్టేట్స్ కి వెళ్ళాడు" ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలివ్వడం చిరాకు. అయినా ఈ మధ్య తప్పడంలేదు.
"అయితే పూర్తిగా ఒంటరిదానివై పోయావన్నమాట. ఎలా మోస్తున్నావమ్మా ఇన్ని కష్టాలు" అందామె జాలిగా.
ఆమె తెలుగు నవలలు తెగ చదువుతుందని, ఆ పుస్తకాల భాష మాట్లాడటం గొప్పగా అనుకుంటుందని నిఖితకు అర్థమయింది. చిన్నగా నవ్వింది. "వదిలించుకోలేనిదాన్ని అలవాటు చేసుకొమ్మని ఇంగ్లీషులో ఓ సామెతుంది. కష్టాలకి అలవాటు పడిపోగలిగితే ప్రతి చిన్న సుఖమూ గొప్ప ఆనందాన్నిస్తుంది. నెల రోజులుగా మంచం మీదనుంచి కదలలేకపోయిన మా అమ్మగారు నిన్న తనంతట తానుగా లేచి నాలుగడుగులు వేసేసరికి ఎంతో సంబరంగా అనిపించింది. నెలరోజులుగా ఆవిడపడ్డ వేదన అంతా మర్చిపోగలిగాం. జీవితమంటేనే వెలుగు నీడల సమ్మిళతం కదా" అంది నిఖిత.
నర్స్ ఆమెవైపు చిత్రంగా చూసింది. "నువ్వు మాట్లాడేది వైరాగ్యమా, వేదంతమా?" అడిగింది.
"రెండూ కలసిన జీవితసత్యం. అందుకే ఫ్రాంక్ గా చేప్తే అర్థంకాకుండా పోతుంది, నేనొకసారి అక్కడకి వెళ్ళి మా అమ్మను చూసివస్తాను. ఈ లోపల కనిపెట్టుకుని వుంటావా సిస్టర్".
"నిన్ను చూస్తే మొదట జాలేసింది. ఇప్పుడు భయం వేస్తోంది. వెళ్ళిరామ్మా, నీకు నేనున్నాను" అందామె.
ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయటపడింది నిఖిత. "రేపు అమ్మగాని, నాన్నగాని ఆరోగ్యవంతులయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయితే వాళ్ళను తీసుకెళ్ళడానికి ఇల్లుకూడా లేదు. ఆ మార్వాడీ దయదలచి నెలరోజులు టైమిచ్చాడు. పర్స్ లో కేవలం అయిదు వందల రూపాయలున్నాయి అని చేప్తేఆ నర్స్ ముఖం ఎలా వుంటుందో" వూహించుకుంటూ ఆమె కౌసల్యవున్న హాస్పిటల్ కి బయలుదేరింది.
గంట తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి డాక్టర్ కంగారుగా ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు.
"సారీ నిఖితా. మీ నాన్నగారి పరిస్థితేం బాగోలేదు. నీ కోసం మరీ మరీ అడుగుతున్నారు" అన్నాడు.
నిఖిత కంగారుగా లోపలకు వెళ్ళింది.
దశరధ్ శరీరం చుట్టూ ట్యూబులు మాత్రం కనిపిస్తున్నాయి. ఆమె దగ్గరకు వెళ్ళింది. అలికిడికి మెల్లగా తలతిప్పి చూశాడాయన.
'అమ్మ దగ్గరుండకుండా ఎందుకు వచ్చావమ్మా' అనలేదు. "ఒకసారి మీ అమ్మని చూడాలని వుంది నిక్కీ తీసుకురాగలవా?" అన్నాడు హీనస్వరంతో. ఆయన కళ్ళలో నీళ్ళు తిరగడం మొదటిసారి చూసింది నిఖిత.
తల్లీ తండ్రి చెరో హాస్పిటల్ లో వుండటంతో తల్లి దగ్గరకు బయల్దేరటం కోసం దశరధ్ వున్న హాస్పిటల్లోనించి బయటకు వచ్చింది నిఖిత.
ఆకాశం నిండా నల్లటి మేఘం తేలిక పడుతుంది. రోదిస్తే బరువు తగ్గి మనసు తెరిపిన పడుతుంది.
స్త్రీకి, కన్నీటికి అవినాభావ సంబంధం ఏర్పరచి దేవుడు మగవాడి ననిపించుకున్నాడు. దేవుడి ధైర్యాన్ని అబద్ధం చెయ్యాలన్న పట్టుదలతో కన్నీటి రాక్షసిని చిరునవ్వు ఆయుధంతో ఎదిరించి విజయం సాధించే ప్రయత్నంలో వుందామె. కానీ గిల్టీ ఫీలింగ్ ఆమె మనసుని బాధిస్తోంది.
తండ్రిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్ మెంట్ యిస్తున్న విషయం గురించి తల్లికి తెలియకుండా ఇన్నాళ్ళూ జాగ్రత్తపడుతూ వస్తోంది. డయాలసిస్ తో ఆయన కోలుకుంటాడని, ఆవిడ ఇంటికి వచ్చేసరికి ఆయన ఆరోగ్యంగా కనిపిస్తే చాలని భావించింది.
'అబద్ధం చెప్పడం వేరు. ఎదురివారి మనసు నొప్పించకుండా వుండటం కోసం నిజాన్ని దాచడం వేరు' అనుకుందిన్నాళ్ళూ. కాని రెండింటి ఫలితం ఒకటిగానే అనిపిస్తుందిప్పుడు.
తండ్రి ఆరోగ్యం క్షీణించిందన్న విషయం ముందుగానే చెప్పి ఆవిడని మానసికంగా ప్రిపేర్ చేసి వుంటే, ఈ రోజు పరిస్థితి ఇంత ప్రమాదకరంగా వుందన్న షాకింగ్ న్యూస్ చెప్పి భయపెట్టాల్సిన అవసరం వుండేదికాదు. పైనుంచి పెద్ద వర్షపు చినుకు తలమీద బరువుగా పడి ఆమె కర్తవ్యాన్ని గుర్తుచేసింది. ఎదురుగా కనిపిస్తున్న ఆటో పిలిచి ఎక్కింది.
హాస్పిటల్లో తల్లి గదిలోకి వెళుతుంటే ఆమె కాళ్ళు వణికాయి. గొంతు ఎండిపోయినట్లనిపించింది. 'అమ్మా, నాన్నగారి పరిస్థితి ప్రమాదకరంగా వుంది' అని చెప్పేకంటే 'అమ్మా నేనొక హత్య చేశాను' అని చెప్పడం సులభంగా వుంటుందనిపిస్తుంది. కూతుర్ని చూడగానే కౌసల్య చేయి సాచి, "వచ్చావా నిక్కీ, ఎందుకో నువ్వు వెళ్ళినప్పటినుంచీ నిన్న మరోసారి చూడాలని, మాట్లాడాలని ఆరాటంగా వుంటుంది. ఇంటికీ హాస్పిటల్ కీ మధ్య నిన్ను ఫుట్ బాల ఆడిస్తున్నామన్న బాధ తప్పడం లేదు. వచ్చి ఇలా నా దగ్గరగా కూర్చో" అంది. నిఖిత వెళ్ళి ఆమె ప్రక్కనే కూర్చుంది.
చాలా రోజుల తర్వాత ఆవిడ ముఖం తేటగా అనిపిస్తుంది. ఆరోగ్యం కొద్దిగా పుంజుకుంటుందేమో బాధ స్థానే చిరునవ్వు ప్రస్తుతం చోటు చేసుకొంటూంది. ఈ పరిస్థితుల్లో "నాన్న సంగతి చెప్పి ఆ నవ్వుని నేనెలా హత్య చెయ్యగలను?" ఆక్రోశిస్తుంది నిఖిత మనసు. ఈ లోపులో కౌసల్య అంది.
"ఈ రోజు నాకు మనశ్శాంతిగా వుందమ్మా, ఇంకో రెండు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని డాక్టర్ వచ్చి చెప్పింది. రెండురోజులు..... అంటే నలభై ఎనిమిది గంటలు..... త్వరగా గడిచిపోతే ఎంత బావుణ్ను" ఆవిడ ఏదో ట్రాన్స్ లో వున్నట్లు మాట్లాడుతోంది.
నిఖిత ఉలిక్కిపడింది. 'మరొక్క నలభయి ఎనిమిదిగంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేను' తండ్రి విషయంలో డాక్టర్ అన్న మాటలు గుర్తొచ్చాయి. దాంతోపాటు శేఠ్ రామరతన్ మాటలు....." నెలరోజులు గడువు అయిపోవస్తుందమ్మా, ఇంకో రెండు రోజులు (అంటే నలభై ఎనిమిది గంటలు) మాత్రమే వుంది. ఈ లోపల మీరు వేరే ఇల్లు చూసుకోవాలి".
".....ఈ నలభై ఎనిమిది గంటల పరిమితి తమ జీవితాలను ఎటుమళ్ళిస్తుందో నిఖితకు అర్థంకావడంలేదు. తల్లి అంటోంది. "ఏమిటి నిక్కీ అంతగా ఆలోచిస్తున్నావు? ఈ కష్టాలింకా ఎంతకాలం అనా? తీరిపోతాయిలే. ఈ ట్రీట్ మెంట్ తో నాకు నమ్మకం కలుగుతోంది. నీకు తెలుసా నిక్కీ? నా బాధని మర్చిపోవడానికి ప్రతి క్షణమూ మన యింటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంటాను. ఆ తీపి జ్ఞాపకాలే నన్నింకా బ్రతికిస్తున్నాయనిపిస్తోంది. మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తున్నాయంటే ఆ ఆలోచనే నాకెంతో బలాన్నిస్తుంది. నువ్వూ, నేను మీ నాన్నగారికి చెరోపక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకుంటూ రోజులు గడిపేస్తే రెండేళ్ళు ఎంతలో వెళ్ళిపోతాయి. రాము తిరిగి వచ్చేస్తాడు. అప్పడిక ఏ బాధలూ మనల్ని అంటవు" ఆయాసంతో ఆగిందామె. తల్లి కళ్ళలో మెరుపు చూస్తూ వచ్చిన పని మర్చిపోయింది నిఖిత . తల్లి చాలాకాలం తర్వాత ఆశాజనకంగా మాట్లాడుతోంది 'ఇదివరకటి అమ్మలా'.
"ఇంకొక్క రెండురోజులు, అంటే నలభై ఎనిమిది గంటలు ఎంతలో గడిచిపోతాయి. న.ల.భై.ఎ.ని.మి.ది.గం.ట.లు" ఆమె స్వరం కలల్లోంచి నిద్రలోకి జారుతున్నట్లుగా సాగి.....ఆగిపోయింది.
నిఖిత ఉలిక్కిపడి తలెత్తి చూసింది. కౌసల్య ఇంకా నవ్వుతున్నట్టే వుంది. ఆమె ఊహించుకుంటున్న సుందర దృశ్యం ఆ కళ్ళల్లో రెప్పలమాటున ఇంకా రెపరెపలాడుతున్నట్టే వుంది. నిండు చంద్రుడు మబ్బు చాటుకి మెల్లమెల్లగా కదిలిపోతున్నట్లు ఆ పెదవుల మీద నవ్వూ, కళ్ళల్లో కాంతీ, సజీవాకృతినించి క్రమక్రమంగా నిర్జీవమైపోవడం నిఖిత స్పష్టంగా చూడగలిగింది.
స్విచ్చి నొక్కితే కరెంటు ప్రవాహం ఆగిపోయినట్లు, శరీరంలో రక్తప్రసరణ ఒక్కసారిగా నిలిచిపోయినట్లు- పంచేంద్రియాలు తమ బాధ్యతలను వదిలేసి సమ్మెలో దిగినట్లు- కళ్ళముందు జరిగింది కలో, నిజమో తెలియని అచేతనావస్థలో కదలిక తాలూకు ఆఖరి దృశ్యం స్టిల్ ఫోటో గ్రఫీలా లా నిలిచిపోయి- ఇంద్రియాలు ఒకటొక్కటిగా సమ్మె విరమిస్తుంటే- కంటినుంచి మెదడులోకి- మెదడునించి గుండెపైకి వాలిన వాస్తవం ఆమెను మేల్కొలిపింది.
సంతోషానికీ, దుఃఖానికీ, ఆప్యాయతకీ, కృతజ్ఞతకీ స్పందించేవి, వర్షించేవి కూడా 'కళ్ళు'. ఇన్నాళ్ళూ ఆ కన్నీళ్ళను తన ఆధీనంలో వుంచుకోగలిగిందామె. కానీ ఊహించని విధంగా కళ్ళముందే తల్లి విడిచిన ఆఖరి ఊపిరి - ఒక అస్త్రంలా తాకి గడ్డకట్టిన కన్నీటిని ఛిద్రంచేసి వరదలైన ప్రవహించేలా చేసింది.
కౌసల్యకు మందు వేయడానికి గదిలోకి వచ్చిన నర్స్, అచేతనంగా పడివున్న ఆమె శరీరాన్ని, పక్కనే కూర్చొని నిశ్శబ్దంగా రోదిస్తున్న నిఖితని చూసి నిర్దాంతపోయింది. కౌసల్యలో ప్రాణంలేదని తెలిసిన మరుక్షణం ఆమె పరుగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ ని పిలుచుకు వచ్చింది.
తన సర్వీసులో ఎన్నో చావుల్ని ఆ డాక్టరు చూసింది. 'పేషెంటు సీరియస్' అనగానే బంధువులు గుండెలు బాదుకుని ఏడుస్తూ, ఇతర పేషెంట్లని బెదరగొట్టడమే ఆమె చూసింది. మరణించిన తల్లి శరీరం దగ్గర అలా నిశ్శబ్దంగా కూర్చుని, దుఃఖాన్ని సాహిస్తున్న నిఖితను చూసి 'వయసుకి మించిన మెచ్యూరిటీ వస్తే తప్ప అంత గుండెనిబ్బరం కలగదు' అనుకుంది.
మొదటిసారి ఒక పేషెంటుకి సంబంధించిన మనిషిని సానుభూతితో కాక గౌరవభావంతో చూసిందామె. వచ్చి నిఖిత భుజంమీద చెయ్యి వేసింది. ఆ రకమైన ఊరడింపు ఎవరికైనా దుఃఖాన్ని రెట్టింపు చేస్తుంది! కాని నిఖితకి రక్తవ్యం గుర్తొచ్చింది. తనని తాను తమాయించుకొని లేచి నిలబడింది.
"నేను మళ్ళీ వస్తాను డాక్టర్. ఈ లోపల మీ ఫార్మాలిటీస్ అన్నీ ముగించి పెట్టండి......ప్లీజ్ ' అంటూ లేచిన నిఖిత ఆ డాక్టర్ కళ్ళకి ఒక అద్భుతమైన వ్యక్తిగా తోచింది. అప్రయత్నంగా 'అలాగే' నన్నట్టు తలూపింది.
హాస్పిటల్ లో అడుగుపెట్టే ముందున్న సమస్య ఇప్పుడు మరో కోణంలో మరింత జటిలంగా మారి నిఖితని భయ పెడుతోంది. ప్రమాదకర పరిస్థితిలో వుండి భార్య కోసం ఆశగా ఎదురు చూస్తున్న తండ్రికి 'అమ్మ ఇక ఎప్పటికీ రాలేదు నాన్నా' అని ఎలా చెప్పడం?