Previous Page Next Page 
ధ్యేయం పేజి 35


    అతడు ప్రీతమ్ రాక గురించి ఎక్కువ ఆసక్తి చూపకుండా తన సంగతి బయటికి తెలిసిందేమో అన్న విషయంపట్ల ఎక్కువ భయపడటం సునీతకి చిరాకేసింది. "లేదు" అంది నిర్లిప్తంగా.

    "అమ్మయ్యా! ఎటువంటి పరిస్థితుల్లోనూ మన విషయం బయటికి రానీయకు నా భార్య రాక్షసి. ఇల్లు నరకం చేస్తుంది" అన్నాడు తేలిగ్గా.

    సునీత అదాటున ఫోన్ పెట్టేసింది. కృష్ణమూర్తి తన భార్య గురించి ఆలోచిస్తున్నాడు తప్ప అవతలవాళ్ళ సంసారం కూడా అంతే రిస్కులో వున్నదన్న విషయం పట్టించుకోకపోవటం ఆమెకి కోపం వచ్చింది.

    ఆ తరవాత ఎప్పుడూ ఆమె తన నగలు పోయిన విషయం ఎవరికీ చెప్పలేదు.

    ......ఇక్కడ ప్రీతమ్ మాత్రం మొట్టమొదట దొంగతనం తాలూకు షాక్  నుంచి  క్రమక్రమంగా తేరుకున్నాడు. సునీత ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదని నమ్మకం కలిగిన తర్వాత అతడా నగలని చౌక ధరకి ఫ్రెండ్స్ సహాయంతో అమ్మేశాడు. ఆ సాయంత్రమే ఫ్రెండ్సందరికీ పార్టీ ఇస్తూ "డబ్బు సంపాదించే మార్గం ఒకటి  తెలిసింది" అని పూర్తి డ్రింక్ లో వుండగా చెప్పాడు.

    అప్పటికీ అతడు ధాత్రిని మర్చిపోలేదు. ఎంతైనా ఆమె పెద్ద  ఆస్తికి వారసురాలు. భవిష్యత్తులో బంగారు గుడ్లు పెట్టే బాతేనన్న విషయం అతడికి బాగా  తెలుసు. పోలీస్  రైడింగ్ లు ఎక్కువవటంతో 'కిళ్ళీలు' అంత సులభంగా దొరకటంలేదు. ఎక్కువ డబ్బిచ్చి కొనవలసి వస్తోంది.

    ఇద్దరి కోసం ఖర్చు పెట్టటంతో- పదిరోజులకల్లా డబ్బు మొత్తం అయిపోయింది.

    ఆ మరుసటిరోజు సాయంత్రం అతడు అదే కాలనీలో వున్న మహతి  వాళ్ళింటి కెళ్ళాడు. సుకుమార్ అప్పుడు 'ఎంసెట్ లో' సీటు వచ్చిన సంతోషంతో వున్నాడు. ఆ కుటుంబంతో కొంచెంసేపు మాట్లాడి వెనక్కీ వచ్చేశాడు ప్రీతమ్ రేడియో ప్రక్కనున్న ఖరీదైన రిస్ట్ వాచ్ ఇప్పుడతని జేబులో వుంది.


                                                   *    *    *

    సుకుమార్ కి ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సందర్భంగా ఇంటిల్లిపాదీ ఆనందంతో కోలాహలం జరుపుకుంటూంటే, మరోవైపు నిఖిత స్నేహితురాలు సాధన తన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. సుకుమార్ ఫోటో ప్రతి పేపర్ లోనూ ప్రముఖంగా  ప్రకటించబడింది. అతడు ఏ ఇన్ స్టిట్యూట్ లో చదువుతున్నాడో వాటి ఫోటోలు, అడ్వర్టయిజ్ మెంట్లు, తరవాతి బ్యాచ్ కోసం ఆహ్వానాలు వీటితో పేపర్లన్నీ నిండిపోయాయి.

    పొద్దున్నే పేపర్ తెరిస్తే ప్రతి పేపర్ నిండా కోచింగ్ సెంటర్ల అడ్వర్టయిజ్ మెంట్లే కనిపించేవి సాధనకి. ప్రతి విషయాన్నీ స్థూలంగా, లోతుగా గమనించటం సాధన అలవాటు. ఒక సంస్థ ఇచ్చిన ప్రకటనలో, తమ దగ్గర చదివిన వాళ్ళలో ఐదువందలమందికి ఎంసెట్ లో సీట్లు వచ్చాయని చూసి సాధన ఆశ్చర్యపోయింది. వరసగా ప్రతి ఫోటో, ర్యాంకు చూడటం ప్రారంభించింది. అయిదో వరసలో వున్న  ఫోటోలకి మొదటి వరసలో వున్న ఫోటోలకి పోలిక కనపడటంతో వాటి క్రిందవున్న పేర్లు, ర్యాంకులు చూసింది. మొదటి వరుసే మళ్ళీ అయిదో వరసలో రిపీట్ చేశారు.

    అంతేకాకుండా ఒక కాలేజీ ప్రకటించిన ర్యాంకుల విద్యార్థులే మరొక కాలేజీ ప్రకటనలో కనిపించటంతో ఆమెకి మతిపోయిననట్లు అనిపించింది. యాభై మెడిసిన్ సీట్లు వచ్చినట్లు ప్రకటించిన సంస్థ "మూడు వేల ర్యాంకు" వచ్చిన విద్యార్థి ఫోటో ప్రచురించింది. మిగిలిన ర్యాంకులన్నీ గమనిస్తే అన్నీ వెయిటెడ్ గా వున్నవే. అంటే  కేవలం యం.బి.బి.యస్. కాకుండా అగ్రికల్చర్, వెటర్నరీ, ఆయుర్వేదం వంటి కోర్సుల సీట్లనికూడా ఈ కేటగిరిలో కలిపి ప్రకటన లిచ్చారని అర్థమైపోయింది.

    సాధనకి భరించలేనంత నిస్సత్తువ ఆవరించింది. పిల్లల్ని ఏదో రకంగా ఇంజనీర్నో, డాక్టర్ నో చేయాలనుకునే తల్లిదండ్రుల అభిలాషని కోచింగ్ సెంటర్లు ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నాయన్న మాట! మనిషి ఇంత సులభంగా మోసపోతాడని ఎవరన్నా చెప్తే ఆమె నమ్మేదికాదు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది. ఇక సుకుమార్ విషయానికొస్తే, ఇంటర్మీడియట్ వరకు ఏమీ మార్కులు రాని కుర్రవాడు కేవలం మూడు నాలుగు నెలల్లో కోచింగ్ తీసుకుని ఫస్ట్ ర్యాంక్ పొందటం ఎలా సాధ్యమో ఆమెకర్థంకాలేదు. విషయం మరింత లోతుగా పరిశోధించాలని ఆ క్షణమే ఆమె నిర్ణయించుకుంది.

    మొదటిరోజు ఎంక్వైరీలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. కొన్ని కాలేజీల్లో ర్యాంకర్లని 'కొంటారని' తెలుసుకుని ఆమె విస్తుపోయింది. ఆ విద్యార్థి తమ కాలేజీలో చదవకపోయినా చదివినట్లుగా ప్రకటన ఇప్పించడమనేది ఆమె కలలో కూడా ఊహించని విషయం. ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి అసలు నిజం తెలుసుకోకుండా తమ పిల్లల్ని ఈ కోచింగ్ సెంటర్లలో చేర్పించే తల్లిదండ్రుల విచక్షణా జ్ఞానంమీద ఆమెకి అనుమానం కలిగింది. జాలి వేసింది.

    ఇదంతా తెలుసుకున్న సాధనకి మొట్టమొదటి అనుమానం సుకుమార్ కోచింగ్ తీసుకున్న ఇన్ స్టిట్యూట్ మీదకి వెళ్ళింది. ఆమె స్వయంగావెళ్ళి ఎంక్వైరీ  చేసింది. అక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలుసుకోవటాని కామెకి ఒక్కరోజు కూడా పట్టలేదు. ఆ ఇన్ స్టిట్యూట్ ద్వారా ఇంటర్ నుంచి పరీక్షకి వెళ్ళిన  విద్యార్థుల్లో పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. బాగా చదువుతారన్న బ్యాక్ గ్రౌండ్ వున్న విద్యార్థులకి ర్యాంకులు వచ్చాయి. కానీ అవి మంచి ర్యాంకులు వచ్చాయి. కానీ అవి మంచి ర్యాంకులు కాదు. సుకుమార్ కి ఫస్ట్ ర్యాంక్ రావటం ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళకే ఆశ్చర్యం కలిగించిందన్న విషయం ఆమె తెలుసుకుంది. క్లాసులో అతడు ఏ పరీక్షలోను నలభై అయిదు  మార్కులకన్నా ఎక్కువ సంపాదించలేదు అన్న విషయం కూడా  నిర్థారణ అయ్యింది. తరవాత ఆమె అనుమానం  సుకుమార్ తండ్రి విశ్వేశర్ మీదకి వెళ్ళింది. విశ్వేశ్వర్ కి రాజకీయాల్లో చాలా పలుకుబడి వుంది. పైరవీల ద్వారా బాగా డబ్బు సంపాదించాడు.

    పరీక్ష జరిగినరోజు విశ్వేశ్వర్ ఆ వూళ్ళోనే వున్నాడన్న విషయం ఆమెకి సులభంగానే తెలిసింది. అక్కడినుంచి ఆమె పరిశోధన చాలా వేగంగా జరిగింది.

    ఆమె ఆ రాత్రి తను బసచేసిన వూరినుంచి పత్రికాఫీసుకి ట్రంక్ కాల్ చేసి మేనేజ్ మెంటు నుంచి కొంత డబ్బు ఖర్చు పెట్టటానికి అనుమతి అడిగింది. ఆమె  పరిశోధనా సారాంశాన్ని తెలుసుకున్న మేనేజ్ మెంట్ "ఎంత డబ్బు ఖర్చయినా ఫరవాలేదు. మొత్తం విషయం కనుక్కొనిరా" అని ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చారు.

    మరుసటిరోజు ప్రొద్దున్నే ఆమె సుకుమార్ బసచేసిన లాడ్జింగ్ రూం దగ్గరికి వెళ్ళి వివరాలు కనుక్కొంది. నెలరోజులపాటు ఒక కుర్రవాడు సుకుమార్ కింద  పనిచేయటానికి నియమింపబడ్డాడని తెలిసింది. అయిదువేల రూపాయలు చేతులు మారేసరికి అతడు మొత్తం విషయమంతా చెప్పాడు. అంతకుముందు రోజే  సుకుమార్ తండ్రి విశ్వేశ్వర్ ఆ ఊరు వచ్చినట్టు, అక్కడినుంచి అతడు హడావుడిగా నాలుగైదు ప్రదేశాలకి తిరిగినట్టు ఆ రోజంతా టెన్షన్ తో వున్నట్టు ఆ యువకుడు చెప్పాడు.

    విశ్వేశ్వర్ ఆ రోజు ఎవరెవర్ని కలుసుకున్నారో ఎంక్వైరీ చేయటానికి బయలుదేరిన సాధనకి విషయాలు కొన్ని తెలిశాయి.

    ఆమె వారిద్వారా అతడు వాళ్ళ దగ్గరికి ఎండుకొచ్చాడో వివరాలు సేకరించింది. వాళ్ళందరూ కూడా విశ్వేశ్వర్ పట్ల ఒక రకమైన వైరీ భావంతో వున్నారు. అతడియొక్క అధికారాన్ని చూసి ఆ రోజు భయపడినా, ఒక పత్రికా విలేఖరికి వాళ్ళు  మొత్తం విషయమంతా చెప్పేశారు.

    వాళ్ళు చెప్పిన సంగతులన్నీ విని ఆమె స్థాణువైపోయింది. సరిగ్గా పరీక్ష ప్రారంభమవటానికి ఆరుగంటల ముందే విశ్వేశ్వర్ మొత్తం ఒక్క ప్రశ్నకూడా వదిలి పెట్టకుండా అన్ని ప్రశ్నలకి సమాధానాలు సేకరించాడు.


                         *    *    *

    సుకుమార్ ఫోటో మొదటి పేజీలో ప్రచురించి ఫస్ట్ ర్యాంకర్ గా అభినందించిన పత్రికే, సరిగ్గా నాలుగోరోజు.....మొత్తం జరిగినదంతా బాక్సులు ప్రముఖంగా ప్రచురించింది.

    దాంతో ఒక్కసారిగా రాష్ట్రం గగ్గోలెత్తిపోయింది.

    ఎక్కడా మరో వాదనకి తావీయకుండా వున్నది వున్నట్టు పూసగ్రుచ్చి వ్రాసింది సాధన. అసెంబ్లీ సెషన్ కూడా అప్పుడే జరుగుతూ వుండటంతో ఆ మరుసటిరోజే ఈ వార్త అసెంబ్లీ కొచ్చింది. ఎంతో కష్టపడి చదివి చిన్నప్పటినుంచీ చదువునే తమ ధ్యేయం చేసుకుని జీవితంలో పైకి రావాలనుకున్న విద్యార్థులు, పేపర్లో వచ్చిన ఈ  వార్త చూసి కుతకుత వుడికిపోయారు. తమకున్నదంతా తమ పిల్లల మీదే పెట్టుబడిగా పెట్టి వాళ్ళని చదివించి, నిజాయితీగా, నిర్దుష్టమైనా ప్రణాళిక వేసుకున్న తల్లిదండ్రులు జరిగినదంతా చూసి తమలో తామే కుమిలిపోయారు.

    లంచాలు రెండు రకాలు. ఒక ఫైలు తొందరగా కదలటానికి ఒక గుమాస్తాకి డబ్బిచ్చి తమ పని చేయించుకుంటే దానివల్ల సామాజికంగా కానీ, దేశానికిగాని జరిగే నష్టం వుండదు. లంచం నైతికంగా తప్పుకానీ ఈ రెండోరకం సంఘటనలో మాత్రం అంతకన్నా ఘోరం జరిగిపోయింది. అయిదువందల మంది పలుకుబడి వున్న తండ్రులు తమ కొడుకులకి ఇంజనీరింగ్ లోనూ, మెడిసన్ లోనూ సీట్లు సంపాదించటం కోసం ఉత్సాహవంతులైన, తెలివితేటలున్న.....చిన్నప్పటినుంచీ దీక్షతో చదువుకున్న విద్యార్థుల్ని, తమకి న్యాయబద్ధంగా రావలసిన విద్యార్హతనుంచి క్రిందకి తోసేస్తున్నారన్న చేదునిజం సాధన గుండెలని కలచివేసింది. అంతేకాదు, ఈ అయిదువందల మంది కల్తీ విద్యార్థులు రేపొద్దున డాక్టర్లు, ఇంజనీర్లు అయి  దేశాన్ని ఏ విధంగా నాశనం చేస్తారో తలుచుకుంటే ఆమె కన్నీళ్ళ పర్యంత మయ్యింది. ఆమె అనుకొంది. "ఎవరికీ తెలియని పెద్ద మారణకాండ జరిగిపోతున్నా కూడా ఇక్కడి మనుషులు నిర్లప్తంగా వూరుకుంటారు. ఇక్కడ హంతకులు బయటివారు కాదు. ఎవరికి వారే అంతరాత్మల్ని దారుణంగా హత్యా చేసుకుంటున్నారు".

    ఆ సాయంత్రమే మహతి తండ్రిని పోలీసులు అరెస్టుచేశారు.

   
                               7

    "నాకు కాస్త నయంగానే వుంది కదమ్మా. నువ్వు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో. నాన్నగారు కూడా  ఒంటరిగా వుంటారు" అంది కౌసల్య కూతురితో. భర్త  మరో ఆస్పత్రిలో వున్నాడని ఆమెకి తెలీదు. అక్కడికి వెళ్తే తండ్రి ఏమంటాడో నిఖితకి తెలుసు. "అమ్మని వదిలేసి ఎందుకొచ్చావమ్మా? నాకేం ఫరవాలేదు. నువ్వు అమ్మ దగ్గరుంటేనే మంచిది" అంటాడు.

    ఇటు హాస్పిటల్స్, అటు ఇల్లు, మూడిటి మధ్యా ఆమె నలిగిపోతోంది. నిజం చెప్పాలంటే తండ్రి పరిస్థితి ఆమెకి భయం కలిగిస్తోంది. తల్లిని హస్పిటల్ లో చేర్చినప్పటినుంచీ ఆయనలో భయమూ, టెన్షనూ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. దాదాపు ముప్పయ్ సంవత్సరాల అనుబంధం వాళ్ళది. భార్య అనారోగ్యంతో హాస్పిటల్ లో వుంటే తను స్వయంగా శుశ్రూష చెయ్యలేకపోవటం ఆయన్ని మరింత బాధిస్తోంది. అక్కడ తల్లి పరిస్థితి కూడా అదే.

    కొద్దిగా తలనొప్పి వస్తే ఎంతో హడావుడిచేసి అందరి సానుభూతి, అటెన్షన్  తమవైపే వుండాలని కోరుకునే మనుషులున్న ఈ రోజుల్లో, తన తల్లి లాంటి వాళ్ళు  అరుదు. పదిరోజులు శుశ్రూష చేసి ఎలా తప్పించుకుందామా అని ఆలోచించే మనుషులున్న ఈ రోజుల్లో తన తండ్రిలాంటి వాళ్ళు కూడా అరుదే.

    తండ్రిని చూసినప్పుడల్లా ఆమెకి ఆనాడు తన గురించి ఆయన చెట్టుమీదనుంచి పడిపోయిన దృశ్యం కళ్ళముందు మెదులుతూ  వుంటుంది. ఆమెకి తండ్రిలో నచ్చే గుణం ఏమిటంటే, చాలామందిలో కనబడే సెల్ఫ్  పిటీ ఆయనలో లేదు.

    నిఖిత హాస్పిటల్ కారిడార్ లో కూర్చుని వుంది. గత రెండు రోజులుగా దశరధ్ ఇంటెన్సివ్ కేర్ లోనే వున్నాడు. ఈ రోజు పరిస్థితి మెరుగుపడటంతో డయాలిసిస్  చేస్తున్నారు. అది మొదలయి దాదాపు రెండు గంటలవుతోంది. లోపలేం జరుగుతుందో ఆమెకు అర్థం కావడంలేదు.

    ధియేటర్ తలుపు తెరుచుకుంది. ఒక నర్స్ బయటకు వచ్చింది. "పేషెంటు ఎలా వున్నారు, ఇంకెంతసేపు అవుతుంది సిస్టర్" అడిగింది నిఖిత.

 Previous Page Next Page