గుండె దిటవు చేసుకుని తండ్రి వున్న హాస్పిటల్లో అడుగుపెట్టింది నిఖిత. చల్లటి నీళ్ళతో మొహం కడుక్కుని మొహాన్ని ప్రశాంతం చేసుకుని ఆయన గదివైపు నడిచింది. కారిడార్ లో ఎదురుపడ్డాడు డాక్టర్.
"ఎక్కడికెళ్ళావమ్మా. నేను నీ కోసమే చూస్తున్నాను" అన్నాడు.
"నాన్నగారికెలా వుంది డాక్టర్?" అడిగింది.
"అయాంసారీ. నువ్వు వెళ్ళగానే ఆయనకి స్పృహ తప్పింది. కోమాలోకి వెళ్ళిపోయారు. ఎంతో ప్రయత్నించాం. లాభం లేకపోయింది. ఆ కోమాలోనే అరగంట క్రితం ఆయన ప్రాణం పోయింది-" అన్నాడతను.
ఇక ఈ వాస్తవాలతో యుద్ధం చేయలేనన్నట్టు- పక్కనే వున్న బెంచీమీద కూలబడిపోయింది. గుండెనిండా స్తబ్ధత. బ్రహ్మాండమంతా ఒక్కసారిగా అచేతనమైపోయినట్లు. అంతరిక్షంలో ఎటూ కదలలేక బందీ అయిపోయినట్లు ఫీలింగు. కొద్ది నిముషాలపాటు బొమ్మలా కూర్చుని ఆమె లేచింది. ఒక శుష్కదరహాసం విషాద వీచికలా ఆమె ముఖంమీద కదలాడింది.
తండ్రి శరీరం నిండా తెల్లటి దుప్పటి కప్పబడి వుంది. నిఖిత మెల్లిగా దగ్గరకు వెళ్ళి తలమీద నుంచి దుప్పటి నెమ్మదిగా క్రిందికి తొలగించింది. మంచి నిద్రలో వున్నట్టుందాయన ముఖం. పెదవులు బిగబట్టి దుఃఖాన్ని ఆపుకుంది.
"నాలుగు రోజులపాటు మీనాన్నగారు ఎంతటి బాధని గుండె బిగువున ఎలా అదిమి పెట్టారో నేను కళ్ళారా చూశాను. నిన్ను చూస్తుంటే ఆయన పోలికలు వారసత్వంగా నీకు చాలా సంక్రమించాయనిపిస్తుంది. ఆయనలాంటి తండ్రిని పోగొట్టుకుని నువ్వు చాలా పోగొట్టుకున్నావమ్మా" అంటున్నాడు డాక్టర్.
నిఖిత కళ్ళెత్తి అతనివైపు చూసింది. స్వరం గద్గదమైంది.
"దాదాపు పదేళ్ళక్రితం నా మూలంగానే చెట్టుమీదనించి పడి మా నాన్నగారు వెన్నెముక విరగ్గొట్టుకున్నారు డాక్టర్. ఆనాటి నించీ మా కుటుంబం పరిస్థితి అస్తవ్యస్తమైపోయింది. ఆ రోజు నించి ఈనాటి వరకు దాని ఫలితం మేము అనుభవిస్తూనే వున్నాం. కానీ ఏనాడు ప్రత్యక్షంగానే కాదు, కనీసం కలలోనైనా డానికి కారణం నేనెనన్న విషయంగా ఆయన భావించలేదు. నాన్నగారే కాదు, ఎన్ని కష్టాలు పడుతున్నా అమ్మకూడా నన్నొక్క మాట అనలేదు. అలాంటి తల్లిదండ్రుల్ని ఇద్దర్నీ ఒకేరోజు పోగొట్టుకున్న నేను దురదృష్టానికే దురదృష్టాన్ని డాక్టర్" అంది. డాక్టర్ విభ్రాంతితో నిఖితమైపు చూశాడు.
"అంటే మీ అమ్మగారు కూడా..."
"సరిగ్గా అరగంట క్రితం కళ్ళు మూసింది. వాళ్ళిద్దర్నీ ఒకేసారి పోగొట్టుకున్నందుకు విచారించాలో. ఒకరి మరణం మరొకరికి తెలిపి బాధపడే అవసరం లేకుండా పోయినందుకు సంతోషించాలో నాకు అర్థంకావటంలేదు" డాక్టర్ కి తెలియదు.
* * *
రామ్ రతన్ దుకాణం చాలా రద్దీగా వుండే సమయం అది. పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో వర్షం తగ్గగానే జనం గుంపులుగా బయటకు వస్తున్నారు.
నిఖిత సందిగ్ధంగా బయట నిలబడింది. గ్లాసు డోర్ తెరుచుకుని బయటకు వచ్చింది మహతి. "హల్లో నిక్కీ వాటె సర్ ఫ్రైజ్" అంది నవ్వుతూ. నిఖిత మొహంలో విషాదాన్ని గమనించే మూడ్ లో లేదామె.
"హలో" అంది నిఖిత మెల్లిగా.
"నీకూ తెలుసా, నాన్నగారు బెయిల్ మీద విడుదలయి వచ్చారు. నువ్వన్నట్లుగానే అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. పదిహేను రోజుల్లోనే నా పెళ్ళి".
"సంతోషం".
"మా అత్తగారు వాళ్ళు డాడీ కేసు విషయంలో గొడవ పెడతారని ఎంత భయపడ్డానో. కానీ ఒక్కమాట కూడా అనలేదు. చీరెలు కొనుక్కోమని డబ్బిచ్చి వెళ్ళారు. అందులో ఒక చీర మార్చుకుందామని వచ్చాను. ఒక్కటీ నచ్చలేదు. రెండు రోజుల్లో స్టాక్ వస్తుంది- అప్పుడు వచ్చి మార్చుకోమంటున్నాడు రామ్ తరన్. అసలే అన్నింటికి హడావుడి పడుతుంటే ఇదొక గొడవ చూడు. మళ్ళీ రావాలంటే ఎంత కష్టం".
నిఖిత నవ్వలేక నవ్వింది. "నీ సమస్యలన్నింటిలాగే ఇదీ పరిష్కారమైపోతుందిలే బాధపడకు. నాకు పనుంది వస్తాను" కదిలింది.
"ఏం, ఏమైనా కొనాలా?"
"లేదు. అప్పు తీర్చుకునే విషయంలో మాట్లాడాలి" అంటూ లోపలకు నడిచిందామె. మహతి అర్థంకానట్లు చూసి, పెదవి విరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆలోచించడానికి స్వంత సమస్యలే ఆమెకు చాలా వున్నాయి మరి. లోపలి వెళ్ళి నిఖిత శేఠ్ ని కలిసింది. "మనం అనుకున్నది అంతా ఇచ్చేశాగా అమ్మా. ఇంకా డబ్బు కావాలంటే ఎలా " అన్నాడు రామ్ రతన్.
"మీరు తప్ప నాకు సాయం చేసే వాళ్ళెవరూ లేరు శేఠ్ జీ. ఇంట్లో ఫర్నిచర్, కొంత బంగారం వున్నాయి. అవన్నీ ఎలాగూ నాకిక అవసరం లేదు. అమ్మి మీ డబ్బు తీసేసుకోవచ్చు."
నిఖిత కాకుండా మరెవరైనా అయితే నౌఖర్ని పిలిచి బయటికి పంపించేసేవాడు. "ఇప్పుడంత అవసరం ఏం వచ్చింది" రామ్ రతన్ ఎందుకో ఆ అమ్మాయితో ఒక వడ్డీ వ్యాపారిలా మాట్లాడలేకపోతున్నాడు.
"అమ్మా నాన్నల 'చివరి బిల్లులు; హాస్పిటల్లో కట్టాలి. అది కట్టకుండా వాళ్ళ శరీరాల్ని తీసుకురావడం నాకిష్టంలేదు. వారి ఆత్మలకు శాంతి కలగదు".
రామ్ రతన్ అదిరిపడ్డాడు. "ఎప్పుడు పోయారు?" అన్నాడు వణికే కంఠంతో.
"గంటక్రితం...... ఇద్దరూ" శేఠ్ నిశ్శబ్దంగా వుండిపోయాడు.
ఒకప్పుడు ఇలాంటి బిడ్డ వుంటే అదృష్టం అనుకున్నాడు. ఇప్పుడామె బిడ్డలా కాదు. గుడిలో దేవతలా కనిపిస్తోంది మాట్లాడకుండా సేఫ్ తెరిచి ఆమె అడిగినంత డబ్బు తీసి చేతిలో పెట్టాడు.
* * *
నిఖిత షాపులోంచి బయటకు వచ్చేసరికి వర్షం మొదలయింది. దరిదాపుల్లో ఖాళీ ఆటో ఒక్కటీ కనిపించడంలేదు. ఏం చెయ్యాలోనని ఆలోచిస్తున్నంతలో పక్కనే వెహికల్ ఆగింది.
"హమ్మయ్య. సమయానికి దేవతలా కనిపించావు" అంది ధాత్రి.
"దేవతలను గుర్తుచేసుకునే అవసరం ఏమొచ్చింది నీకు."
"అర్జంట్ గా రెండువందలు కావాలి. రేపు బ్యాంకులోంచి డ్రాచేసి ఇచ్చేస్తాను. చాలా అర్జెంటు."
నిఖితకు ఏం చెప్పాలో తోచలేదు. ఈ లోపులో ధాత్రి తొందర తొందరగా అన్నది- "ప్లీజ్ నిక్కీ. అవతల నాకోసం ఒకరు ఎదురుచూస్తుంటారు. వుంటే ఇవ్వవూ" అంది. పడాల్సిన డోస్ సమయానికి అందకపోవడంతో ఆమెకు పిచ్చెక్కినట్లుగా వుంది. డబ్బు తెస్తేనే సరుకు దొరుకుతుందని ప్రీతమ్ ఈసారి సీరియస్ గా చెప్పాడు. ఇంట్లో తల్లి నిఘాతో అతడికి డబ్బు అసలు అందడంలేదు.
......నిఖిత పర్స్లోంచి డబ్బు తీసి ఇచ్చింది.
"థాంక్యూ రేపు తెచ్చి ఇచ్చేస్తాను." ఎక్కడైనా డ్రాప్ చెయ్యాలా అని అడక్కుండా వెళ్ళిపోయింది ధాత్రి.
నిఖిత మనసులో అనుమానం బలపడింది.
* * *
"బంధువులందర్ని పిలిపించడం మంచిది. అడ్రసులున్నాయా?" అడిగారు కృష్ణమూర్తి.
"వాళ్ళు వచ్చి ఏంచేస్తారు?" అడిగింది నిఖిత. రుక్మిణి ఆమెవైపు ఆశ్చర్యంగా చూసింది.
"ఏదో చేస్తారని కాదు అది సాంప్రదయం. అందులో ఇద్దరూఒక్కసారే పోయారు. మీ అన్నయ్యను కూడా పిలిపించాలి. తల కొరివి కొడుకే పెట్టాలి".
"ఆ అవసరం లేదు లెండి. నేను ఎలక్ట్రికల్ క్రిమటోరియంలో క్రిమేట్ చేయిస్తున్నాను. ఎంతో దూరం వున్న బంధువుల్ని పిలిపించే అవసరం కూడా లేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టడమే అవుతుంది. కాబట్టి" అంది నిఖిత.
"ఆమెదంతా వితండవాదం. వాదించి ప్రయోజనం లేదు. ఇష్టం వచ్చినట్లుచేసుకొనివ్వండి" అన్నాడు శంకరం రిలీఫ్ గా.
"అదే నేను కోరుకుంటున్నది. దయచేసి నన్ను వదిలెయ్యండి" అంది రెండు చేతులూ జోడించి.
"ఆ మాత్రానికి ఇక్కడిదాకా తీసుకురావడం దేనికి? అట్నుంచి అటే బాడీస్ తీసుకుపోతే పోయేదిగా" విసుక్కున్నట్లుగా అంటూ వెళ్ళిపోయాడు శంకరం.
'ఆ విషయం మీకు అర్థం కాదు' అని నిఖిత పైకి అనలేదు. ఈ ఇంటికీ, తమకూ ఈ రోజుతో శాశ్వతంగా రుణం తీరిపోతుంది. తల్లిదండ్రుల ఆశ తెలిసిన మనిషిగా వాళ్ళ చివరి యాత్ర ఆ ఇంటినుంచి జరగాలని ఆమె కోరుకుంది.
అంబులెన్స్ వచ్చింది. నిఖిత చివరిసారిగా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించింది.
* * *
చాలా చిన్న గది అది. తన కొద్ది సామానునీ ముఖ్యంగా పుస్తకాలని పొందిగ్గా సర్దుకుంది నిఖిత.
ఇల్లు ఖాళీ చేసేందుకు రామ్ రతన్ ఆమెకు మరో పదిహేను రోజులు వ్యవధి యిస్తానన్నాడు. కాని ఆమె వప్పుకోలేదు. పక్కకాలనీ లోనే గది దొరకడంతో వెంటనే అతడికి ఇల్లు అప్పచెప్పేసింది.
ఆ రాత్రి ఒంటరిగా కూర్చుని రాముకి ఉత్తరం వ్రాస్తుంటే చెయ్యి వణుకుతోంది.
"అన్నయ్యా,
'జీవితం అంటేనే సుఖదుఃఖాల మేళవింపు. ఆ రెండిటిల్లో దేనికైనా ఒకే రకంగా స్పందించగలిగిన నేర్పు అలవరుచుకున్నవాడే అసలైన మనిషి' అనేవారు నాన్న.
'ముందుకు పోవడం తప్ప వెనుకడుగు వేయడం కాలానికి తెలియదు. అందుకే జరిగిపోయిన దాని గురించి విచారించకు. జరగబోయేదేమిటో ఆలోచించు' అనేది అమ్మ.
ఆ ఇద్దరూ మనకు తల్లిదండ్రులే కాదు. గురువులు, స్నేహితులు మార్గదర్శులు కూడా. వాళ్ళనించి ఎన్నో నేర్చుకున్నాం. ఇప్పటిదాకా ఆచరణలో కూడా పెడుతూనే వచ్చాం. ఇక ముందు కూడా కొనసాగిస్తామనే నమ్మకం నాకుంది. కాకపోతే ఒక చిన్న తేడా వుంది. ఇన్నాళ్ళూ మనల్ని ఇక్కణ్ణుంచే చూసి సంతోషించారు. ఇక మీదట పైలోకం నించి చూసి ఆనందిస్తారు.


