Previous Page
నిశాగీతం పేజి 36


    అతనిగొంతు ఆర్ధ్రతతో నిండిపోయింది.
    "దైర్యంగా వుండాలి బ్రదర్. గుండె జారిపోతే  మనిషి చెయ్యగలిగిందేమీ లేదు. ఆ రాంబాబుగాడ్ని పట్టుకుతీర్తాను. మీ మాధవిని మీకు అప్పగిస్తాను సరా!"
    ఎదురుగా వస్తున్నా లారీని తప్పుకొనే ప్రయత్నంలో కారు రోడ్డు దిగి సర్రున మళ్ళీ మధ్యకు వచ్చింది. కార్లో వున్నవాళ్ళు పక్కకు వరిగి మళ్ళీ సర్దుకు కూర్చున్నారు.
    "మిస్టర్ విల్సన్ రావుగారూ! జాగ్రత్త! రాంబాబుగాడ్ని పట్టుకోనేంతవరకయినా మనం బ్రతికివుండాలి." తమాషాగా అన్నాడు డాక్టర్ జయంత్.
    "మనం ఎక్కడికి పోతాం బ్రదర్! ఆ లారీవాడు చూశారుగా? రోడ్డు దిగడు. నదిరోడ్డుమీద పోతున్నాడు. అదే మా పోలీసుజీప్ చూస్తే  చచ్చినట్టు సైడుకు దిగుతాడు. ఈ లారీ డ్రైవర్లు...."అంటూ ఆగి రోడ్డు మీదకు దూరంగా చూస్తూ దృష్టి నిలిపాడు విల్సన్ . "అదుగో ఇటు కుడి వైపుకు చూడండి! మెటల్  రోడ్దు కన్పడుతున్నదికదూ! ఆ రోడ్దునే వాళ్ళు రావల్సింది. ఆ వైపు హెడ్ లైట్స్  ఎమీ కనిపించడంలేదు. బహుశా ఈ పాటికి వాళ్ళు  ఈ రోడ్డెక్కే వుంటారు. అంటే  వాళ్ళు మనకు రైల్వే గేటు లోపలే దొరికిపోవాలి. మరో విషయం డాక్టర్ జయంత్ . మన విక్టర్ జీప్ లో రాంబాబుగాడి కారును ఛేజ్ చేస్తూ వుండి వుండాలి. మిస్సయివుంటే ఈ అడ్డరోడ్డు దగ్గర మనకోసం వెయిట్ చేస్తూ వుండేవాడు. డాక్టర్ బాబులూ! కొంచెం జాగ్రత్తగా కూర్చోండి" కార్లో వున్నవాళ్ళను హెచ్చరించి కారువేగాన్ని పెంచాడు విల్సన్.
    కారు శరవేగంతో పోతూంటే, డాక్టర్ జయంత్, ఉదయ్ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నారు.
    కొండచిలువలా రోడ్దు మెలికలు తిరిగి కారు కారుకిందనుంచి దూరిపరిగెత్తుతున్నదేమో నన్న భ్రమలో పడిపోయి చూస్తున్నాడు ఉదయ్.
    క్షణక్షణానికి కారు వేగం పెరుగుతోంది. రోడ్దుపక్క చెట్లు తలలు  విరబోసుకున్న భూతాల్లా వెనక్కు పరుగులు తీస్తున్నాయి. ఆ అమావాస్య చీకట్లో.
    రోడ్దు బెండ్ తిరిగిన కారు "కీచ్" మని శబ్దంచేస్తూ ఒక్కసారిగా ఆగిపోయింది.
    విల్సన్ కారు డోర్  తెరుచుకొని బయటికి దూకాడు గబ గబా ముందు నడిచాడు.
    రోడ్దు పక్కన చెట్ల క్రీనీడలో జీప్ ముందుకు నడిచాడు.
    ఇన్ స్పెక్టర్ విక్టర్ పరుగెత్తుకొచ్చి శాల్యూట్ చేసి విల్సన్ ముందు నిలబడ్డాడు.
    డాక్టర్ జయంత్ , ఉంది చంద్రా, కానిస్టేబుల్సు ముందు పరిగెత్తి జీప్ దగ్గిరకెళ్ళారు.
    "సార యాక్సిడెంట్ అయిపోయింది, చెయ్యెత్తి రోడ్డుకు ఏభైగజాల దూరంలో పొలాల్లో తల క్రిందులుగా పడివున్న తెల్ల ఎంబాసిడర్ కారును చూపిస్తూ చెప్పాడు ఇన్ స్పెక్టర్.
    "ఎంతసేపయింది?"
    "ఇప్పుడే! ఇంతకుముందే అయిదునిముషాలుకూడా కాలేదు మేము జీప్ ఆపి కారుదగ్గరకు వెళ్ళబోతూ ఉన్నాం మీరోచ్చేశారు.
    "హెడ్ లైట్స్ వెలుతురు యాక్సిడెంటు అయినకారు మీదపడేట్టు జీప్ తీసి పెట్టు. ఊఁ కిక్!"
    ఇన్ స్పెక్టర్ కు వెలుతురులో కన్పించిన దృశ్యానికి అందరూ కొద్దిక్షణాలు అచేతనులయ్యారు.
    "ఏమిటలా నిలబడి పోయారూ?" విల్సన్ తెప్పరిల్లుకొని కానిస్టేబుల్స్ ను చూసి అరిచాడు.
    కారు సుత్తితో అణగగొట్టిన డబ్బాలా అయిపోయింది.
    ఇంజన్ నజ్జు నజ్జు అయిపోయింది. రెండు డోర్లు విరిగి దూరంగా పడివున్నాయి.
    కార్లో వున్నవాళ్ళు  బ్రతికివుంటారనే నమ్మకం ఎవరికీ లేదు.
    ఆ దృశ్యం చూసిన ఉదయ్ గుండెలు చిక్కబట్టాయి. మెదడు బ్లాంక్ అయిపోయింది.
    ఊడిన డోర్ పక్కగా మాధవి పడివుంది. తలకు తగిలిన గాయం నుంచి ఇంకా వెచ్చని రక్తం చిమ్ముతూనే వుంది. జయంత్ మెరుపులా పరిగెత్తి మాధవి దగ్గిర కొచ్చాడు. వంగి  ఆమెను రెండుచేతుల్లోకి తీసుకొన్నాడు.
    "ఉదయ్! స్టిల్ దెరీజ్ హొప్. కమాన్ లెటజ్ ట్రై" బిగ్గరగా అన్నాడు జయంత్.
    ఉదయ్ స్పృహలోకి వచ్చాడు! హృదయంలో ఆశలు మొలకెత్తాయి. పరుగు పరుగున వచ్చాడు. షర్టు విప్పి చింపి మాధవి తలకు  కట్టుకట్టాడు. రక్తప్రవాహం కొంతవరకు ఆగింది.
    జయంత్ సాయం పట్టగా, ఉదయ్ మాధవిని ఎత్తుకొని రోడ్దుమీద ఆగివున్న కారు దగ్గరకు తీసుకొచ్చాడు. వెనకసీట్లో మాధవిని పడుకోబెట్టి  ఉదయ్ కారేక్కాడు. మాధవి తలను  తన ఒడిలోకి తీసుకొని సర్దుకొని కూర్చున్నాడు.
    "మనం త్వరగా వెళ్ళాలి. మాధవికి వెంటనే రక్తం ఎక్కించాలి. ఆలస్యం అయితే ఆమె బ్రతికే అవకాశం లేదు కండిషన్  చాలా క్రిటికల్ గా వుంది. ముందు మనం వెళ్దాం" ఆదుర్దాగా అన్నాడు ఉదయ్.
    "అలాగే! విల్సన్ కు ఓ మాట చెప్పివస్తా." అంటూ జయంత్ విల్సన్  దగ్గరకు  పరుగుతీశాడు.
    రెండు నిముషాల్లో తిరిగివచ్చి జయంత్ కారు స్టార్ట్ చేశాడు. రివర్స్ చేసి రోడ్డెక్కించాడు. వేగంగా కారు నడుపుతూ "హౌ ఈజ్ షీ?" అని అడిగాడు.
    "షి విల్బీ ఆల్ రైట్  లెటజ్ హొప్" ఉదయ్ మాటల్లో  ఆత్మస్దేయిర్యం స్ఫురించింది.
    జయంత్ మనసు కుదుటపడింది.
    "చూశావా జయంత్? వాళ్ళ సంగతే మార్చిపోయాను. ఏమైంది? రాంబాబూ, వీరభద్రుడూ ఏమైపోయారు?" అడిగాడు ఉదయ్.
    "రాంబాబు స్పృహతప్పి పడివున్నాడు. స్టీరింగ్ ఛాతీలోకి దిగబడి పోయింది. సీటు విరగొట్టి రాంబాబును బయటికిలాగారు. వీరభద్రుడి ముఖం గుర్తించడానికి వీల్లేనంతగా చితికిపోయింది. బతికి ఉన్నాడో లేడో అనుమానం. వాళ్ళను తీసుకొని జీప్ లో  వస్తానన్నాడు విల్సన్. మనల్ని మాధవి సంగతి  చూసుకొమన్నాడు. ఆఫరేషన్ సక్సెస్  ఫేపెంటు డైడ్ అన్నట్టుగా వుంది మన విల్సన్ గారి ఆపరేషన్ అమావాస్య" అన్నాడు జయంత్.
    "ఓ రకంగా చూస్తే విల్సన్  వ్యాజ్యం సాధించాడనే అనుకోవాలి. ప్రాణాలతో కాకపోయినా, వీరభద్రుడి శవాన్నయినా సాధించాడు. రాంబాబు  బతికితే, విల్సన్ విజయభేరి మోగించినట్టే. అతని ప్రయత్నంచాలా వరకు ఫలించినట్టే గదా? వీరభద్రుడి దేముంది? వాడు రాంబాబు పెంపుడు కుక్కలాంటివాడు. రాంబాబు బ్రతుకుతాడనే ఆశిద్దాం. వాడిక్కూడా మంచి ట్రీట్ మెంట్ జరిగేట్టు మనం చూడాలి." 
    "అవును ఉదయ్ వాడు ప్రాణాలతో వుంటేగదా శివరామయ్యసంగతి తేలేది? అసలు విల్సన్ శివరామయ్యేగదా?"
    "జయంత్ అంత రాష్ గా  పోనక్కర్లేదు. జాగ్రత్తగానే  పోనియ్ మాధవి  పల్స్  బాగానేవుంది. ఓ గంటలోపు మాధవిని ఆస్పత్రికి చేర్చగలిగితే చాలు" ఉదయ్ మెల్లగా నింపాదిగా అన్నాడు.
                                                                   20
    ప్రశాంతి నర్సింగ్ హొమ్.
    డాక్టర్ జయంత్ ఉత్సాహంగా లోపలకొచ్చాడు.
    "ఉదయ్! శివరామయ్య దొరికాడట. విల్సన్ రావు  వస్తానన్నాడు ఇంకా రాలేదు."
    డాక్టర్ ఉదయ్ చంద్ర తలెత్తి మౌనంగా డాక్టర్ జయంత్ ను చూశాడు.
    "ఏమిటలా ఉన్నావ్? ఏమైంది? మాధవిఎలావుంది?" ఆదుర్దాగా అడిగాడు జయంత్.
    "సర్! మీరొకసారి రండి" మాధవి ఉన్న గదిలోనుంచి నర్సు హడావిడిగా  బయటికొచ్చింది.
    ఉదయ్ లేచి మాధవి గదిలోకి వెళ్ళాడు. అతడి వెనకే  వెళ్తున్నమాధవిని ప్రశ్నార్థకంగా చూశాడు డాక్టర్ జయంత్.
    "హల్లో! డాక్టర్ ఉదయ్ చంద్ర ఎక్కడ?" అంటూ విల్సన్ రావు బూట్లు టక టక లాడించుకొంటూ ప్రవేశించాడు.
    "ఉదయ్ వస్తాడు కూర్చోండి." జయంత్ పక్కనే ఉన్న కుర్చీ చూపించాడు.
    "టైంలేదు బ్రదర్ త్వరగా వెళ్ళాలి." అంటూనే భారి శరీరాన్ని కుర్చీలోకి చేర్చి దర్పంగా కూర్చున్నాడు విల్సన్ రావు.
    "రాంబాబు ఎలా ఉన్నాడు?" జయంత్ ముందుకు వంగి విల్సన్  రావు ముఖంలోకి చూస్తూ అడిగాడు.
    "వాడికేం బాగానే ఉన్నాడు. మూడు రోజులపాటు మనిషి తొణకలేదు. మెటల్ డిటెక్టర్లుకూడా వాడిమీద పనిచెయ్యలేదు. లాకప్ లో  చస్తే  అదొక గొడవ అవుతుందని ఇంతవరకు ఓపికపట్టాను. విసుగు పుట్టింది. చస్తే చచ్చాడ్లే అని రోకలెక్కించి  నైల్ పాలిష్  చేశాం. నాలుగో రోజుకు మాజిక్కుల శివరామయ్యను పట్టుకోగలిగాం.
    "కంగ్రాచ్యులేషన్స్ మిష్టర్ విల్సన్ రావు. త్వరలో యస్పీ అయిపోతారు.
    "ప్రమోషన్ దేముంది బ్రదర్. అదే వస్తుంది. మీరంతా సహకరిస్తే ప్రెసిడెంటు మెడలే రావాలి. ఈ కేసు నెగ్గి  శివరామయ్యకు, రాంబాబుకు శిక్షలు పడితే మనకెంత  క్రెడిట్ వస్తుందో తెలుసా? డి.జి.పి. ప్రెసిడెంట్ మెడల్ కు రికమెండ్ చేస్తాడు. ఆఁ అన్నట్టు ఆ నాటకాల అమ్మాయి ఏదీ?"
    "నాటకాలమ్మాయా?"
    "ఆఁఅదే! ఐయామ్ సారి! మాధవి! మన కేసంతా ఆ అమ్మాయి సాక్ష్యంమీదనే  ఆధారపడివుంది. ప్రథమ సాక్షి  కీ విట్నెస్ ఈ రోజే  మేజిస్ట్రేట్ కోర్టుముందు  ఆమె స్టేట్ మెంటును రికార్డు చేయించేందుకు ఏర్పాటు చేయించాను."
    అంత తొందరేమొచ్చింది? హంతకులు మీ అధీనంలోనే ఉన్నారుగా.
    "ఒక్కరోజుకూడా ఆలస్యం చెయ్యడానికి వీల్లేదు. ఈ లోపల పత్రికలవాళ్ళు రకరకాల కథలు అల్లేస్తారు. అందుకే ఈ రోజే మాధవి స్టేట్ మెంటును రికార్డు చేయించాలి. ఇంతకీ మాధవి ఎలా వుందేమిటి? ఆమె మేజిస్ట్రేట్ కోర్టుకి వచ్చే స్థితిలో లేకపోతే, మేజిస్ట్రేట్ నే ఇక్కడికి పిలిపిస్తాను. ఆ విషయం ఉదయ్ చంద్రను అడుగుదామనే వచ్చాను. డాక్టర్ గారెక్కడా?" అంటూ లేచినిలబడ్డాడు విల్సన్ రావు.
    "అదుగో! ఆ గదిలో వున్నాడు!" మాధవి ఉన్నగది  చూపిస్తూ చెప్పాడు జయంత్.
    గదివైపు నడుస్తున్న విల్సన్ చెయ్యిపట్టుకొని ఆపాడు జయంత్.
    "ఐదు నిముషాలాగండి. మాధవి గదిలోనే వుంది. "ఇంతకుముందే నర్సు హడావిడిగా వచ్చి ఉదయ్ చంద్రను తీసుకెళ్ళింది.
    "అరె!మళ్ళీ ఆమెకేమయింది ఇప్పుడు? నిన్ననేగా అఆమే బాగా రికవర్ అయిందని చెప్పారు?" విల్సన్ కనుబొమలేగరేస్తూ అడిగాడు.
    "అదే నాకూ ఆశ్చర్యంగా వుంది. ఎనివే లెటజ్ వైట్" సాలోచనగా అన్నాడు జయంత్.
    మూడు  నిముషాలు మౌనంగా కూర్చోవడానికి మహా ఇబ్బంది పడిపోయాడు విల్సన్.
    గదిలోనుంచి నర్సు బయటికి వచ్చింది.
    "డాక్టర్ జయంత్! మిమ్మల్ని  డాక్టర్ గారు  పిలుస్తున్నారు." అని చెప్పి గిర్రున తిరిగిపోయింది.
    జయంత్  తో పాటు విల్సన్ రావు కదిలాడు. జయంత్ ఇబ్బంది పడిపోయాడు విల్సన్ కేసి చూశాడు. అదేమీపట్టించుకోకుండా విల్సన్  జయంత్ తో పాటు గదిలో ప్రవేశించాడు.
    డాక్టర్ జయంత్, విల్సన్ రావు కళ్ళఎదుటే దృశ్యం చూస్తూ శిలా ప్రతిమల్లా నిలబడిపోయారు.
    బెడ్ మీదినుంచి దిగిపారిపోవడానికి ప్రయత్నిస్తున్న మాధవిని ఇద్దరు నర్సులు గట్టిగా పట్టుకొని మళ్ళీ  బెడ్ మీదకు చేర్చాడానికి ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ ఉదయచంద్ర ఆమెను  అనునయిస్తూ చెపుతున్నాడు. మాధవి నర్సులను విదిలించి కొడ్తూ ఉంది.
    "డాక్టర్! డాక్టర్!వాడు !వాడు! నన్ను చంపడానికి వస్తున్నాడు. నన్ను వెంబడిస్తున్నాడు."
    "మాధవి! వాడు వెళ్ళిపోయాడు. నీకేం భయంలేదు."
    "వాడెక్కడికీ వెళ్ళలేడండీ బాబు! బాత్ రూంలోకి పరిగెత్తాడు. ఇప్పటిదాకా నా మంచంకింద దాక్కుని మీరు రావడంచూసి పారిపోయి బాత్ రూంలో దాక్కున్నాడు.
    "జయా? నువ్వెళ్ళి బాత్ రూం తలుపులు తీసిచూడు" నర్సుకు సౌంజ్ఞఇస్తూ చెప్పాడు ఉదయ్.
    "అమ్మో! వద్దు!వద్దు! వాడు బయటికొచ్చేస్తాడు. నన్ను వదలండి." మాధవి నర్సును తోసేసి కిందకు దూకింది.
    గదిలోనుంచి ద్వారంవైపుకు పరుగుతీస్తున్న మాధవిని ఉదయ్ చంద్ర గట్టిగా పట్టుకొన్నాడు.
    "మాధవీ! నీకేం భయంలేదు. వాడు నిన్నేంచేయలేడు. నేనున్నాను. నీ దగ్గరేవుంటాను" ఉదయ్ మాధవిని బుజ్జగిస్తూ బెడ్ దగ్గరకు తీసుకొచ్చాడు.
    అంతలో నర్సు జయ సిరంజి నింపుకొని తీసుకొచ్చింది. ఉదయ్ కి అందించి మాధవిని పట్టుకొంది. ఇంజక్షన్ ఇచ్చిన అయిదు నిముషాలకు మాధవి కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. మరిరెండు నిముషాల్లో గాఢ నిద్రలోకి జారిపోయింది.
    "జయా! మీరిక్కడే ఉండండి. ఆమెకు తెలివివచ్చేసరికి ఎవరో ఒకరు దగ్గరే ఉండాలి. జాగ్రత్తగా చూడండి. మాధవికి తెలివిగానేనాకు కబురు చెయ్యండి" డాక్టర్ ఉదయ్ చంద్ర నర్సుకు సూచనలిచ్చి బయటికి వచ్చాడు.
    డాక్టర్ జయంత్, విల్సన్ రావూ అతడ్ని అనుసరించారు.
    డాక్టర్ ఉదయ్ చంద్ర ప్రైవేట్ చాంబర్ లో అతడి కెదురుగా డాక్టరు జయంత్, విల్సన్, తలలు వేలాడేసుకొని డీలాపడి కూర్చున్నారు. కళ్ళెత్తి ఉదయ్ ముఖంలోకి చూడలేక పక్కచూపులు చూస్తున్నారు.
    "మిస్టర్ విల్సన్! ఏది జరగకూడదో అదే జరిగిపోయింది. నటనే నిజమైంది. మాధవి ఏ నటనతో తారాపథం అందుకోవాలని ప్రయత్నించిందో, ఆ నటనే ఆమెపట్ల శాపంగా పరిణమించింది. అతి దారుణమైన ఈ పరిణామానికి బాధ్యత నాదే. హంతకులకు ఆమెను ఎరగా చూపించి పట్టుకోవాలని మీరు రూపొందించిన పథకానికి అనుమతించడం ణ పొరపాటు. పులికి మేకను  ఎరవేసినట్టు మాధవిని, రాంబాబుకూ, వీరభద్రుడికీ ఎరగా వేశాము. మాధవి వాళ్ళచేతుల్లో పడి ఎంత మానసిక క్షోభ అనుభవించివుంటుందో మీరు అర్థంచేసుకోగలరానుకుంటాను. యాక్సిడెంటుకు గురి అయ్యేముందు మాధవి ఏ మానసిక స్థితిలో వుందో, అదే స్థితిలో స్పృహ వచ్చాక కూడా వుండిపోయింది."
    "డాక్టర్ ఉదయ్! మీరు అనుభవజ్ఞులైన సైకియాట్రిస్టుగదా? ఆమెను మామూలు స్థితిలోకి తీసుకురావడం మీ చేతిలో పని. మొత్తం  కేసంతా ఆమె సాక్ష్యంమీద ఆధారపడివుంది." విల్సన్ నీరసించిపోయాడు. దిగులుగా అన్నాడు.
    "మాధవి మీ కేసుకు ప్రథమసాక్షి కావచ్చు కాని...."
    "డాక్టర్! ఈ కేసు గెలవడంమీదే నా కెరియర్ ఆధారపడివుంది. ప్రమోషన్__ప్రెసిడెంట్ మెడల్.....అన్నీ....?"
    "మిస్టర్ విల్సన్ రావ్?" డాక్టర్ ఉదయ్ కంఠంలో ధ్వనించిన తీవ్రతకు జయంత్, విల్సన్ చలంచిపోయారు.
    "మీరు కేసు గెలవడం మాత్రమె దృష్టిలో ఉంచుకొని మాధవి ఆరోగ్యాన్ని గురించి ఆదుర్దా పడ్తున్నారు. కాని....డాక్టర్ ఉదయ్ కంఠం పూడిపోయింది.
    జయంత్, విల్సన్ రావూ, ఊపిరి బిగబట్టి ఉదయ్ కళ్ళల్లోకి చూశారు.
    "మాధవిని నేను ప్రేమిస్తున్నాను. మాధవిని, నా జీవిత భాగస్వామినిగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అర్థమయిందా మిస్టర్ విల్సన్ ? ఆమె ఆరోగ్యం గురించి నేనెంత ఆదుర్దా చెందుతున్నానో!"
    "డాక్టర్!డాక్టర్!" నర్సు పరుగెత్తుకొంటూ వచ్చింది.
    డాక్టర్ ఉదయ్ చంద్ర ఆదుర్దాగా లేచి నిలబడ్డాడు.
    మాధవికి మెలుకువ వచ్చింది. త్వరగా రండి."
    డాక్టర్ ఉదయ్ నర్సు వెనకే గదిలోకి నడిచాడు.
                                                        (శుభం)

 Previous Page