తనకి తెలీకుండా రవణతో ఏం పని? రవణ మీదనున్న తన సొతంత్రం తెలియచెయ్యాలనిపించింది. కాని ఎట్లా చెప్పటం? కొంచెంసేపుండి వాళ్ళలో ఒకడు.
"కొంచెం పిలవండి." అన్నాడు.
"రవణా లేదు. గివణా లేదు. పొండి" అనాలనిపించింది. రవణతో వీళ్ళకేం పని? కాని ఈ విధంగానన్నా రవణతో మాట్లాడవచ్చు కదా అని లోపలికి వెళ్ళాడు. రవణ స్నానం చేసి రవిక వేసుకుంటోంది. అతన్ని చూసి ఆ గది మూలకి ఒక్క పరుగు తీసింది.
"నీ కోసం ఎవరోవచ్చారు" అనేసి ఒచ్చేశాడు.
ఎవరన్నా చూస్తారనే భయంతో....
"చెప్పారా?" అని అడిగారు వాళ్ళు. ఇప్పుడు కూడా రవణతో సరిగ్గా మాట్టాడ్డానికి వీలులేకపోయింది కదా అని ఒళ్ళు మండిపోతుంది అతనికి. అదృష్టంకొద్దీ ఆ సమయాన్నే తను వెళ్ళాలీ!
"నాకు తెలీదు పొండి అది యెవరో!" అని ముందున్న కుర్రాణ్ణి ఒక్క తోపు తోసి చెట్లకిందికి వెళ్ళిపోయినాడు. అతను కొంచెం దూరం వెళ్ళగానే కుర్రాళ్ళందరూ నవ్వారు. వాళ్ళని యేం చెయ్యాలి అని యోచించాడు. "వెళ్ళకొడితే! అందరున్నారే! బూతులు తిడితే? వెంకట్రావుగారు వింటారు." అనుకుంటో వాళ్ళవేపు చప్పున తిరిగి ఒచ్చాడు. వాళ్ళు తన వేపే చూట్టంలేదు. అప్పుడే స్నానం చేసి తెల్లచీర కట్టుకుని, కొత్తగా నుంచుంది రవణ. ఒకడు యీ చెయ్యీ, యింకోడు ఆ చెయ్యీ, పట్టుకొని వేళ్ళాడుతున్నారు కుర్రాళ్ళు. పెద్దగాడిద ఒకడు ఆమె భుజం మీద కూడా చెయ్యేశాడు. కలా నిజమా? రమణ అమితానందంతో నవ్వుతోంది, పాదాల చప్పుడు చేశాడు. రవణ తలెత్తి చూసింది. సిగ్గుపడి పరుగెత్తుతుందనుకున్నాడు. ఏం లేదు. అతను అక్కడలేనట్లు వాళ్ళతో మాటాడుతోంది. కొంచెం చూసి, తిరిగి వెళ్ళిపోతున్నాడు.
ఒకడు- "రవణా, వాడెవడు మీ యింటో?" అన్నాడు.
గోపాలరావుకి రవణ ఏమంటుందో వినాలని వుంది, కాని సిగ్గుతో తలతిప్పలేకపోయాడు.
వాళ్ళ సంభాషమ విన్నకొద్దీ బాధ భరించలేకపోయాడు. వెంకన్నపంతులు యెంత మంచివాడో! ఆయన యింటో తనకి ఎంత కష్టంగా వున్నా, రవణని ఏ మొగాళ్ళతోనూ, మాట్లాడకుండా కట్టుదిట్టం చేశారు. ఈ వెంకట్రావు గారింటిలో ఒక్కతోవా, ఒక్క్ పద్ధతీ లేవు. వెంకన్న పంతులికి యీ సంగతి తెలియజేసి, రవణ యింకా చెడిపోకముందే హెచ్చరిక పుట్టించి, యిక్కణ్నుంచి రవణని తీసుకుపోవాలి. ఈ లోపల? వెంకట్రావుగారికి చెపితే? ఆయన వినిపించుకోరనీ, నవ్వుతారనీ అతనికి నిశ్చయం. కాని తప్పదు. తన మర్యాద పోతేనేంగాక, రవణని, తన భార్యని రక్షించుకోవాలి. ఆలోచించి చీటీ వ్రాసి పెట్టాడు.
"జాగ్రత్త జాగ్రత్త.