"ఎవరురాసి వుంటాడలా?" కంగారు బయటకు తెలీకుండా అడిగింది.
"ఏమో! ఎలా చెప్పగలం?"
"ఆ లెటర్ జానీకి చూపించావా?"
"చూపించకుండా ఎలా వుంటాను? అది చూసి అయన ఆలోచనలో పడిపోయాడు. నాకూ ఇద్దరూ ముగ్గురు మీద కొంచెం అనుమానంగా ఉంది! ఏదో ప్లాన్ చేసి అబద్దం చెప్పినవాళ్ళు ఎవరో అరా తీసి డిస్మిస్ చేయాలని శివరావ్ గారి ప్లాన్. అందుకే ఆ విషయం ఎవరికీ చెప్పవద్దని మరిమరీ చెప్పారు. నాకు నువ్ నా బెస్టు ఫ్రెండువని చెప్తున్నాను. నేను నీకీ విషయం చెప్పినట్లు నువ్ ఇంకెవరికీ చెప్పకు"
రాధిక కింక భోజనం మింగుడు పడలేదు.
"కానీ అలా ఎవరుంటారు మనలో! అందరూ వాళ్ళ వాళ్ళ భర్తలతో వచ్చారుగా?"
"అది కూడా ఓ నాటకమేనెమో- ఎవరికి తెలుస్తుంది? అందుకే మన స్టాప్ లోనే ఆయనకు బాగా క్లోజ్ గా వున్నవాళ్ళు కొంతమందిని డిటెక్టివ్ లుగా ఏర్పాటు చేశారు"
రాధిక అదిరిపడింది.
రజని, హిమబిందు తో సహా అందరూ డిటెక్టివ్ ల్లా కనిపించసాగారామెకి.
భోజనాలయ్యాయి.
వెంటనే ఎంటర్ టెయిన్ మెంట్ ప్రోగ్రాం మొదలయింది.
టేప్ రికార్డ్ లో వేసిన సినిమా పాటకు ఒక్కొక్క జంట వచ్చి డాన్స్ చేయటం ప్రారంభించారు.
రాధికకు భయం పట్టుకుంది.
తనూ, సురేష్ కూడా కలసి డాన్స్ చేయాల్సి వస్తుంది.
మరి ఈ సురేష్ ఏమంటాడో ఏమో! దానికి వేరే డబ్బు అడుగుతాడేమో!
ఆమెకు గుండె పిండేసినట్లయి పోయింది.
తను కష్టపడి సంపాదించుకున్న డబ్బు అతనికి ఇవ్వాలంటే ప్రాణం మీద కొస్తుంది. అసలు ఇంకొకరి కోసం డబ్బు ఖర్చు పెట్టాలంటేనే మనసు పాడయిపోతుంది. చిన్నప్పటి నుంచి అంతే! అదీగాక బస్ లో తన మీద పడ్డాడని అనవసరంగా అతనితో తగువు పెట్టుకుంది. ఇప్పుడు డాన్స్ చేయడానికి ఒప్పుకుంటాడో లేదో.
వెంటనే అతనిని ప్రసన్నం చేసుకోవటం ముఖ్యం.
పాట మారింది. రజని వాళ్ళాయన డాన్స్ మొదలు పెట్టారు. వాళ్ళాయనకు అస్సలు డాన్స్ రాకపోవడంతో అందరూ పగలబడి నవ్వుతున్నారు. రజనే చొరవ తీసుకుని అతని నడుము పట్టుకుని డాన్స్ చేయిస్తుంది , వాళ్ళ చూసి నవ్వుతూ మధ్యలో రాధిక వేపు చూశాడు సురేష్.
ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న రాధిక చాలా అందంగా ఆకర్షణీయంగా ఫ్రెండ్లీగా నవ్వింది --- అతని కళ్ళల్లోకి చూస్తూ.
సురేష్ ఆశ్చర్యపోయి --- ఆ నవ్వు తన నుద్దేశించింది కాదేమో అని పక్కనున్న అందరి వేపూ చూశాడు.
ఆ నవ్వు తననుద్దేశించే అన్న విషయం తేలిపోయింది.
ఎందుకయినా మంచిదని తను నవ్వకుండా ఊరుకుండిపోయాడు .
రాదికకేం చేయాలో తెలీలేదు.
డాన్స్ చేయడానికి తన టర్న్ ఏ క్షణాన్నయినా రావచ్చు.
ఎండి శివరావ్ ముందు వరుసలోనే కూర్చుని తమవేపే పరీక్షగా చూస్తున్నాడు.
గుండె ఝల్లుమంది.
ఇంక ఆలస్యం చేస్తే కొంప మునిగిపోతుంది. బహుశా ఆయనకు తనమీదే అనుమానంగా వుందేమో!
కావాలనే సురేష్ వేపు జరిగి అతని భుజానికి తన భుజం తగిలించి అతని మెడ చుట్టూ చేయి వేసి అతని మీదకు జారగిలబడి కూర్చుంది.
సురేష్ బాంబ్ పడినట్లు ఉలిక్కిపడ్డాడు.
"ఏమిటిది?" కంగారుగా అన్నాడు .
"తర్వాత చెప్తాను. మీరు కూడా నా భుజం చుట్టూ చేయి వేయండి" అంది గొంతు తగ్గించి.
"ఇదిగో! ఈ చిల్లర వేషాలు నాకు నచ్చవ్ దూరంగా జరగండి" కోపంగా అని ఆమె చెయ్యి తన మెడ వెనుక నుంచి లాగి ఆమె వేపు విదిలించి కొట్టాడు.
రాధిక కోపంతో అతని వేపూ -- వెంటనే చూపు మార్చి భయంతో ఎండి శివరావ్ వేపూ చూసింది.
శివారావ్ ఆ దృశ్యమంతా మరింత అనుమానంగా ఆశ్చర్యంగా చూస్తున్నట్లు అర్ధమయిందామెకి. వెంటనే తను మరో మూవ్ మెంటు ఏదో ఒకటి చేయకపోతే ఉద్యోగానికి ఎసరు వచ్చేస్తుంది.
చటుక్కున సురేష్ మీదకు వంగి అతని మెడ మీద ముద్దు పెట్టుకుందామె -- వేగంగా కొట్టుకుంటున్న గుండెతో.
సురేష్ స్టన్ అయి ఆమె వేపే చూశాడు.
మరింత అందంగా నవ్వుతూ ప్రియురాలిలాగా గొంతు తగ్గించి రహస్యంగా గుసగుసలాడుతున్నట్లు మాట్లాడింది.
"ప్లీజ్! కోపరేట్ చేయండి మా బాస్ మనవంకే చూస్తున్నాడు"
సురేష్ శివరేవ్ వేపు చూశాడు - చూస్తున్నట్లు అతనికి తెలీకుండా .
"ఐతే ఏమంటారు?"
"మనం కొంచెం క్లోజ్ గా మూవ్ అవకపోతే మనం భార్యాభర్తలం కాదని అనుమానం వస్తుంది."
"ఎందుకనుమానం వస్తుంది?"
"ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశారుట! మా ఆఫీసులో అమ్మాయిలు కొంతమంది పెళ్లయినట్లు అబద్దం చెప్పి ఉద్యోగంలో జాయినయ్యారని! ఆ విషయం తేల్చుకోవడానికే ఈ పిక్నిక్ యేర్పాటు చేశారట"
"మీరెన్నయినా చెప్పండి! నాకలా చిల్లరగా ప్రవర్తించటం ఇష్టం వుండదు -- ముందు దూరంగా జరగండి "
రాధికకు కోపం ఆగటం లేదు.
"నేను జరగను- ఇటీజ్ కోశ్చేన్ ఆఫ్ మై జాబ్"
"అయితే నేనే లేచి వెళ్ళి ఇంకెక్కడైనా కూర్చుంటాను "
అతను లేవబోతుంటే చటుక్కున అతని చెయ్యి పట్టుకుంది రాధిక.
ఆమె కళ్ళల్లో ద్వేషం -- దానితో పాటు సుడులు తిరిగిపోతున్న నీళ్ళు-- కంపిస్తోన్న పెదాలు.
తను రెస్పాండ్ చేయకపోతే ఏ క్షణాన్నయినా యేడ్చేయటం ఖాయం.
"ప్లీజ్! నన్ను అర్ధం చెసుకొన్ది౧ ఇందాక బస్ లో మీతో మిస్ బిహేవ్ చేసిన మాట నిజమే ఐయం రియల్లీ సారీ"
సురేష్ కి నవ్వొచ్చింది.
"మీరు డబ్బు కోసం ఏం చేయటానికైనా రడీ అనుకుంటాను"
"మీరెన్నన్నా పడతానండీ"
"తెలుస్తూనే వుంది కానీ నా సంగతి కూడా మీకు తెలుసు కదా! మీకంటే పిసినారిని -- డబ్బు విషయాల్లో "
"అంటే?' గాభరాగా అడిగింది.
"అంటే ఇంకేముంటుంది? మీరు బస్ లో నన్నన్న చిల్లర డైలాగులు మర్చిపోవటానికి పదిరూపాయలు ఖర్చవుతుంది "
రాధికకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది.
అంతవరకూ ఐదు పైసలు ఖర్చు చెయ్యాలన్నా గిలగిలా కొట్టుకునే ప్రాణం ఆ సమయంలో పదిరూపాయలు ఇవ్వడానికి ఏమాత్రం వెనుకడటం లేదు.
"ఒకే! ఇస్తాను! ముందు కూర్చోండి"
సురేష్ కూర్చున్నాడు.
"నా భుజాల చుట్టూ చేయి వేయండి --- ఎండి ఇటే చూస్తున్నాడు" ఆమె రహస్యంగా మాట్లాడుతుంటే వెచ్చని ఆవిరి చెవులకు తగుల్తోంది. చక్కిలిగిల -- రోమలన్నీ నిక్కబొడుచుకుంతున్నాయ్. తన భుజాన్ని అడుముకుంటున్న ఆమె వెచ్చని స్పర్శకు.