రాధిక సురేష్ ని పరిచయం చేసింది.
"ఈమె రజని! నా బెస్ట్ ఫ్రెండ్! వీళ్ళాయన దుబాయ్ లో ఉన్నారు."
"ఆఫ్ కోర్స్- ఆ విషయం ఆమెను చూడగానే తెలిసిపోయింది."
రాధికతో పాటు రజనీ కూడా ఆశ్చర్యపోయింది .
"అదెలా తెలుస్తుంది?"
"భగవంతుడిచ్చిన గిప్ట్!"
రజని నవ్వేసింది.
"ఈమె పేరు హిమరేఖ!" మరోకామేని పరిచయం చేసింది రాధిక౧ "ఈయన ఆమె భర్త! విష్ణు వర్ధన్!"
"హల్లో! గ్లాడ్ టు మీట్ యూ! మీరు తప్పకుండా సైంటిస్ట్ అయి ఉంటారు ."
విష్ణు వర్ధన్ ఆశ్చర్యపోయాడు .
"మీకెలా తెలుసు?"
"ఆమె పేరు హిమరేఖ కదా! కనుక మీరు ఎప్పుడు మన ఇండియన్ సైంటిస్ట్ లాగా అంటార్కిటికా టిప్ లోనే ఎక్స్ పెరిమెంట్స్ చేస్తుండాలి !"
హిమరేఖ నవ్వాపుకోలేక పక్కకు తిరిగి నవ్వేసింది.
"ఈమె పేరు మిసెస్ సహాని -- ' సన్నగా ప్లెయిన్ గా ఉన్న మరోకావిడను పరిచయం చేసింది.
"నమస్తే!" అందామె నార్త్ ఇండియన్ యాక్సెంట్ తో.
"నమస్తే మీ పేరు 'సహారా' అంటే జస్టిఫికేషన్ బావుండేది --"
ఆమె చిన్నబుచ్చుకుని పైట సరిజేసుకుంది.
దూరం నుంచీ వారిని గమనిస్తోన్న ఎమ్. డి శివరావ్ వాళ్ళ దగ్గర కొచ్చాడు.
"హలో జెంటిల్మన్ --- నీ పేరు మర్చిపోయాను ---" అన్నాడు ఆప్యాయంగా కరచాలనం చేస్తూ.
"సురేషండీ!"
'అవునవును గుర్తొచ్చింది. సురేష్! అన్నట్లు ఈ నెల రోజుల్లో ఏమైనా ఇంప్రూమెంట్ వుందా?"
"ఏమోనండీ! ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కష్ట పడుతున్నాను. తప్పకుండా సక్సెస్ అవుతాననే నమ్మకంగా ఉంది నాకు. ఒకటి రెండు హాస్పిటల్స్ వాళ్ళు కూడా పిలిచారు. ఇంకా రిజల్ట్స్ రాలేదు ...."
"కష్టే ఫలీ అన్నారు కదా పెద్దలు -- పైగా నువ్వు రాత్రిబవాళ్ళు కష్టపడ్డానంటున్నావ్! తప్పకుండా కవలపిల్లలు పుడతార్లే--"
సురేష్ ఉలిక్కిపడ్డాడు.
"కవల పిల్లలా? కవలపిల్లలేమిటి?"
"ఓర్నీ! మరీ అంత భయమేమిటోయ్? జోక్ కి అన్నన్లె! కావాలంటే నిజంగా కవల పిల్లలు పుడతారా? వద్దంటే మానేస్తారా? కవల పిల్లలని ఎందుకన్నానంటే ఈ మధ్య పిల్లలు ఒక్కరు పుట్టటానికి భయపడుతున్నారులె! అదే టెర్రరిజం , దోపిడీలు , హత్యలు ఎక్కువయి పోయాయి కదా! అందుకని జంటలు జంటలుగా పుడుతున్నారు ?"
"భలేవారే! మీరు పిల్లల గురించి మాట్లాడుతున్నారా? నేను ఉద్యోగం గురించి అడుగుతున్నారనుకున్నాను."
ఎమ్.డి. పగలబడి నవ్వేశాడు.
"రాత్రిబగళ్ళు కష్టపడుతోంది ఉద్యోగం గురించా?"
"అవునండీ!"
"ఉద్యోగం దొరక్క ఎక్కడికి పోతుందిలే! నేను వర్రీ అవుతోంది మీకు పిల్లలు పుట్టకపోవటం గురించి!"
సురేష్ కంగారు పడ్డారు.
"అదా! అదీ .....అదీ....."
"ఓకే డోంట్ వర్రీ! ఈ పిక్నిక్ కి డాక్టర్ మైత్రేయి కూడా వస్తోందిలే! వీలయితే అక్కడ గెస్ట్ హౌస్ లోనే నిన్ను ఎగ్జామిన్ చేయమని చెప్తాను -- షి ఈజ్ ఎక్స్ పర్డ్ అయ్ సే! నిన్ను టేబుల్ మీద అయిదు నిమిషాలు పడుకోబెట్తిందంటే చాలు -- బయోలాజికల్ జాతకం మొత్తం బయట పెట్టేస్తుంది.
పెద్దగా హరన్ కొడుతూ డీలక్స్ బస్ వచ్చి ఆఫీస్ ఆవరణలో ఆగింది.
అందరూ బస్ ఎక్కేశారు.
బస్ తో పాటు ఎం.డి కార్లు రెండూ కూడా బయల్దేరాయి.
బస్ టర్నింగ్ తిరుగుతుంటే రాధిక మీదకు ఒరిగిపోయాడు సురేష్.
ఆమె కోపంగా చూసింది.
"చిల్లరగా బిహేవ్ చేయకండి! ఐడోంట్ లైకిట్"
"అలాగా! ఆ సంగతి ముందే చెప్పలేదేం మరి! మీలాంటి అందమయిన అమ్మాయి విడాకులు కావాలని కోర్టు కేక్కిందంట! జడ్జిగారు ఆ అమ్మాయిని చూసి జాలిపడి విదాకిలివ్వాలన్న నిర్ణయానికే వచ్చేశారు. ఏదో నాలుగయిదు ప్రశ్నలడిగి విడాకులు ఇచ్చేయాలని "మీ భర్త మిమ్మల్ని రోజూ తాగివచ్చి కొడుతున్నాడా?" అనడిగాడు.
"కొట్టటం లేదు?" అందట ఆమె.
"పోనీ కట్నాలు, కానుకలు తెమ్మని మిమ్మల్ని వేదిస్తున్నాడా?"
"ఊహూ! వేధించటం లేదు "
జడ్జికి చిరాకేసు కొచ్చింది.
"మరి ఏ తప్పు చేయందే విదాకులేలా ఇస్తాను. అల్ రైట్! ఆఖరి ప్రశ్న అడుగుతున్నాను . మీ భర్త ఇంకెవరితోనయినా ప్రేమకలాపాలు జరుపుతున్నాడా?"
"ఆ! అవునండీ!' అనేసిందామె.
"దానికేమయినా రుజువుందా?"
"వుంది! నాకు పుట్టిన పాపల్లో ఆఖరి పాప అయన పాప కాదు"
రాధిక మొఖం కోపంతోనూ, అవమానంతోనూ ఎర్రబడింది.
"ఇది నాకు చెప్పటంలో మీ ఉద్దేశ్యం?"
"జోక్ చెప్పాను! అంతే!"
"నాకిలాంటి జోక్ లు కూడా నచ్చవ్!"
బస్ టర్నింగ్ కొట్టేప్పుడు భుజాలు తగిలినంత మాత్రాన తప్పంతా నాదైనట్లు మాట్లాడటం నాకూ నచ్చదు"
"హు! మీతో మాట్లాడటం నాదీ బుద్ది తక్కువ!"
"నేను కదనుకుంటూన్నాను."
ఆమె ఇంక మాట్లాడలేదు. కిటికినీ అనుకుని కూర్చుని బయటకు చూడసాగింది.
స్టీరియో లో కాసెట్స్ ప్లే చేస్తున్నాడు డ్రైవర్.
ఆ పాటకు జార్జ్ అనే అతను లేచి డాన్స్ ప్రారంభించాడు. అందరూ అతని డాన్స్ చూసి లయబద్దంగా తప్పట్లు కొట్టటం మొదలుపెట్టారు.
మధ్యాహ్ననికల్లా బస్ సాగర్ చేరుకుంది.
గెస్ట్ హౌస్ చాలా పెద్దది. చుట్టూ విశాలమయిన గార్డెన్స్ అందంగా వుంది. ఒక్కొక్క జంటకూ ఒక్కొక్క గది కేటాయించారు
సాయంత్రం వరకూ బోట్ రైడింగ్ , సైట్ సీయింగ్ జరిగింది.
రాధిక సురేష్ కి దూరంగా మసలడంతో సురేష్ తన దారిన తను ఒంటరిగా తిరగసాగాడు. రాత్రి వెన్నెల్లో నది ఒడ్డున గార్డెన్ లో మూన్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు ఎమ్ డి శివరావ్.
భోజనం చేస్తుండగా స్టెనో జ్యోతి చెప్పింది రాధికకు.
"బాస్ ఈ త్రిప్పు ఏర్పాట్లు చేయడంలో ఉద్దేశ్యం ఏమిటో తెలుసా?"
"ఏమిటట?" ఆసక్తిగా అడిగింది.
"అయన కెవరో ఆకాశరామన్న ఉత్తరం రాశారు. నేనే కవరు చింపి చదివాను. మనాఫీసులో పెళ్ళయిందని చెప్పి ఉద్యోగంలో చేరిన కొంతమంది అమ్మాయిలకు నిజంగా పెళ్లి కాలేదని కేవలం ఉద్యోగం సంపాదించడం కోసం అలా అబద్దం చెప్పారనీ రాశారందులో."
రాధిక మొఖంలో కళ తగ్గిపోయింది.
గుండె వేగంగా కొట్టుకోసాగింది.