ముందు వరసలో ప్రకాశం, గౌరి చేతుల్లో జండాలతో నడుస్తున్నారు. తెల్లని ఖద్దరు పైజమా, లాల్చీ, తలమీద గాంధీటోపీ..... ఆదర్శం, ఆవేశం కలిసి వుద్భవించినట్లున్న ప్రకాశాన్ని చంద్రం ముగ్ధుడై చూస్తూ నిలబడ్డాడు. హేమ దృష్టి గౌరిమీద పడింది. తన వునికి కూడా మర్చిపోయి చంద్రం గౌరిని చూస్తున్నాడని అపోహపడింది హేమ. అంతలో ఆమె హృదయంలో ద్వేషంతాలూకు తేలు, కొండీ నెత్తింది. రెండడుగులు ముందుకువేసి దూరంగా నిల్చుంది.
కోటి జనంలోవున్నా తన చంద్రాన్ని ఇట్టే గుర్తించగల గౌరి చురుకైన కళ్ళు చంద్రంమీద పడ్డాయి.
"ప్రకాశం! అడుగో చంద్రం!" అంటూ సంతోషంతో గంతులేసినంత పని చేసింది గౌరి.
ప్రకాశం గబగబా చంద్రం దగ్గరకు వచ్చి రెక్క పట్టుకొన్నాడు ఆప్యాయంగా. "రారా చంద్రం! నువ్వు కూడా ఊరేగింపులో నడవాలి అన్నాడు."
చంద్రం కళ్ళు గాబరాగా హేమ కోసం వెతికాయి.
"ఏరా చంద్రం! తెలిసిన వాళ్ళెవరయినా చూస్తారని భయమా? అవునులే, యజమాని కూలీలతోపాటు ఊరేగింపులో నడవటం ఏమిటి?"
చంద్రం ముఖం పాలిపోయింది. తను అన్నమాటలకు బాధపడ్డాడు ప్రకాశం.
"వద్దులేరా చంద్రం! తమాషాగా అన్నాను. మీటింగు దగ్గిరకు మరో గంటకల్లా వచ్చేయ్!" అంటూ ప్రకాశం వెళ్ళి ప్రొసెషన్ లో నిల్చున్నాడు.
దూరంగా నిల్చున్న హేమవైపు క్షమించమన్నట్లు చూశాడు చంద్రం. హేమ ముఖం తిప్పుకొని గబగబా ముందుకు నడుస్తోంది. చంద్రం యాంత్రికంగా వెళ్ళి ప్రకాశం పక్కనే నడవసాగాడు.
రెండడుగులు ముందుకువేసి నిలబడి వెనక్కు తిరిగి చూసిన హేమకు చంద్రం ప్రొసెషన్ లోకి వెళ్ళి నిల్చోవడం కనిపించింది. కోపం, రోషం, అవమానం, ద్వేషం - నేను ముందంటే నేను ముందంటూ హేమ హృదయంలో పోటీ పడుతున్నాయి. మీ అందరికంటే నేను ముందున్నానంటూ దుఃఖం పొర్లుకొచ్చింది. ఏదో ఆవేశించినట్లు నడుస్తోంది గబగబా.
పక్కన మురుగుకాలవ కదిలి గప్పున వాసన వేసింది. హేమ ముఖం తిప్పిచూసింది. వరాహావతారం ఆనందంగా దొర్లుతుంది ఆ మురుగులో!.... అంతే, దానికి కావాల్సింది అదే! పన్నీటి గుంటలో పడేసినా దానికి ఊపిరి సలపదు! కక్షగా అనుకుంది హేమ.
వరండాలో కూర్చొనివున్న తండ్రిని గబగబా దాటుకుంటూ గదిలోకి వెళ్ళి గభాల్న తలుపులు బిగించుకొని మంచం మీద విరుచుకుని పడిపోయింది. అంతవరకూ గొంతులోనూ, కళ్లలోనూ దాగివున్న దుఃఖం స్వేచ్ఛగా పొంగింది. దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది - అంత గంభీరంగా కనిపించే హేమమాలిని!
18
ఆనాడు జరిగిన పబ్లిక్ మీటింగులో ప్రకాశం బలవంతంతో చంద్రం కూడా మాట్లాడాడు. చంద్రం ఉపన్యాసంలో ఉద్రేకంకంటే వివేకం ఎక్కువ కనిపించింది. కార్మికుల హక్కుల్ని గురించి, వాటిని సాధించే మార్గాలను గురించీ మాట్లాడాడు:
"సాధ్యం ఎంత పవిత్రమయిందో దానిని పొందే సాధనాలు కూడా అంత పవిత్రంగానూ ఉండాలి. ఉదాహరణకు - ఒక భక్తుడు శుచిగా స్నానం చేసి, జపమాల ధరించి, పత్రపుష్పాలతో దేవాలయానికి బయలుదేరాడనుకోండి. ఆ దేవాలయానికి వెళ్ళటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి రాజమార్గం, రెండోది నానా అశుద్ధంగా వుండే అడ్డత్రోవ. అడ్డత్రోవన దేవాలయానికి త్వరగా, తేలిగ్గా వెళ్ళవచ్చు కాని, ఆ భక్తుడు మాత్రం శుద్ధమైన త్రోవనే వెళతాడు. అలాగే మనం మన హక్కుల్ని సవ్యమైన మార్గంలో నడిచి సాధించుకోవాలి..." చంద్రం తన ఉపన్యాసం ముగించే ముందు కార్మికులయెడల యజమానుల కర్తవ్యాన్ని గురించి మాట్లాడడం కూడా మరచిపోలేదు. చంద్రం ఉపన్యాసం ముగించగానే కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.
తరవాత వినోద కార్యక్రమం మొదలయింది. చంద్రం రచించిన నృత్యనాటికను ప్రదర్శించారు. పొగాకు మొక్క పుట్టుక నుంచి అది ఫ్యాక్టరీలో సిగరెట్ గా మారేవరకు ఎన్ని రూపాలు ధరించిందో తన నాటికలో చిత్రించాడు చంద్రం. దానిని గౌరి, తను శరణాలయంలో నేర్చుకున్న నృత్యజ్ఞానంతో అభినయించింది. ఆమె నృత్యంలో పరిపక్వత లేదు, తాళం కూడా సరిగా లేదు. కాని, ఆమె తనకున్న ఆ కొద్ది నృత్యపరిచయంతోనే ఎంతో ఆకర్షిణీయంగా అభినయించింది. ఆమెలోని ప్రతిభను చూసి చంద్రం ఆశ్చర్యపోయాడు. ప్రకాశం మురిసిపోయాడు.
ఆనాటి ప్రోగ్రాం ముగిసింది. ఎక్కడివాళ్ళు అక్కడ తమ తమ ఇళ్ళకు బయలుదేరారు.
మొఖానికున్న రంగు కడుక్కుని దుస్తులు మార్చుకొని గౌరి, తన కోసమే ఎదురు చూస్తూ కూర్చున్న ప్రకాశం, చంద్రాల దగ్గిరకు వచ్చింది.
"చాలా బాగుంది నీ అభినయం, ఇంత బాగా చేస్తావనుకోలేదు" అన్నాడు చంద్రం.
చంద్రం ప్రశంసకు గౌరి మనస్సులోనే పొంగిపోయింది. ఆమె కోరింది కూడా అదే. ఆ ఒక్క మాటకోసమే పదిరోజులుగా నిద్రాహారాలు మాని ప్రాక్టీస్ చేసింది.
"మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి. నాకు కొంచెం పనుంది. అర్ధగంటలో వచ్చేస్తాను" అన్నాడు ప్రకాశం.
"ఆ రోజు సినిమాకు తీసుకెళతానని మోసం చేశావు. ఇవ్వాళ సినిమాకు వెళదాం" అంది గౌరి చంద్రంతో.
"సినిమాకా? ఇప్పుడా?" ప్రశ్నించాడు చంద్రం బెదిరిపోతూ.
"తొమ్మిదే అయింది. ఇంకా రెండో ఆట మొదలుపెట్టటానికి చాలా సమయం వుంది, తీసుకెళ్ళు. గౌరి ఇవ్వాళ చాలా సంతోషంగా వుంది. నిరుత్సాహపరచకు" అన్నాడు ప్రకాశం చంద్రంతో.
"నువ్వుకూడా వస్తే అందరం వెళదాం" అన్నాడు చంద్రం.
"నాకు చాలా అవసరమైన పని వుంది. నేను కలుసుకోవాలన్న వ్యక్తి తెల్లవారుఝామునే ఊరికి వెళ్ళిపోతాడు" అన్నాడు ప్రకాశం.
"అయితే, రేపే వెళదాంలే" అని అనాలనుకున్నాడు. కాని, జవాబుకోసం ఎంతో ఆదుర్దాగా తన ముఖంలోకి చూస్తున్న గౌరిని చూసి జాలివేసింది. కాదనలేకపోయాడు.
గౌరి సినిమా శ్రద్ధగా చూస్తుంటే, కొందరు వ్యక్తులు ఆవురావురుమని భోజనం చెయ్యటం గుర్తొచ్చింది చంద్రానికి. చంద్రం మనస్సు సినిమామీద లేదు. గౌరిగురించే ఆలోచించసాగాడు. హేమకూ, గౌరికీ ఎంత తేడా వుంది!
సినిమా ముగిసింది. సినిమాహాలు ప్రకాశం ఇంటికి ఎంతోదూరం లేదు.
చంద్రం, గౌరి ఇంటివైపు బయలుదేరారు. చంద్రం మనస్సును ఒక్కసారిగా హేమ తలపులు చుట్టేశాయి. హేమ ఎందుకలా ప్రవర్తిస్తూంది? హేమతో ఇలా సినిమాకు వచ్చివుంటే తన అనుభూతే వేరుగా వుండేది. చంద్రానికి మనస్సులో ఏదో అర్థంకాని ఖాళీ ఏర్పడ్డట్టనిపించింది.
గౌరి ఆలోచనలూ, అనుభూతీ భేదంగా వున్నాయి. ఆమె శరీరంలోని ప్రతి జీవణువూ ఉత్సాహంతో ఉరకలు తీస్తోంది. ఎంతో కాలంగా తనకు దూరమైన అతి ప్రియతమమైన వస్తువేదో తనకు లభించినట్లు ఆ అమాయిక హృదయం అనుభూతిని పొందింది.
యధాలాపంగా నడుస్తున్న చంద్రం తలమీద ఏదో బలంగా పడింది. 'అబ్బా' అంటూ విరుచుకు పడిపోయాడు. గౌరికి జరిగిందేమిటో తెలుసుకునేలోపల ఎవరో బలంగా తన దండ చెయ్యిని పట్టుకొని లాక్కుపోవటానికి ప్రయత్నిస్తున్నట్లుతోచి గట్టిగా ఓ గావుకేక పెట్టింది. అక్కడక్కడ పలచగా నడుస్తున్న సినిమా జనం కేక వినవచ్చినవైపుకు పరుగెత్తసాగారు. పోలీసుల బూట్లు చప్పుడు దగ్గరవుతుంటే అంతవరకూ గౌరిని లాక్కెళ్ళటానికి ప్రయత్నిస్తున్న అతనూ, మరో అతనూ చేతిలో లాఠీలతో పరిగెత్తారు పక్కసందునపడి.
ఆ పారిపోతున్న వారిలో ఒకడు నాగేంద్రం అని గౌరి చురుకైన కళ్ళు గుర్తించాయి.
చంద్రం చుట్టూ జనం చేరారు. తల నుంచి రక్తం కారుతోంది. చంద్రం బాధగా మూలిగి కదిలాడు. ఇద్దరు ముగ్గురు కలసి చంద్రాన్ని కూర్చోబెట్టారు. గౌరి తన పమిటచెంగు చింపి చంద్రం తలకు రక్తం కారకుండా కట్టడానికి అందించింది. కొంచెం తేరుకున్న చంద్రం 'ఏమంత పెద్ద దెబ్బకాదు, ఆసుపత్రికి అక్కరలేదు' అంటూ లేచాడు.
పోలీసు ఇన్ స్పెక్టరు చంద్రం పేరు, విలాసం అడిగాడు. చంద్రం కృష్ణారావు తమ్ముడని తెలుసుకొని ఇన్ స్పెక్టరు స్టేషన్ కు రమ్మని నిర్బంధించలేదు. గుంటూరులో వున్న ధనికుల్లో ఒకడైన కృష్ణారావు తమ్ముడు కొరిటపాడు అడ్రసు ఇవ్వటం అందరికీ ఆశ్చర్యాన్నే కలిగించింది. అందరి కళ్ళూ కుతూహలంతో గౌరివైపు మళ్ళాయి. ఎవరికి తోచినట్లు వారు వూహించుకుంటూ వెళ్ళిపోయారు.