Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 35


    "అక్కయ్య ఆఫీసుకి వెళ్ళడంలేదే, ఎందుకనో ఏమో?"

    "నువ్వేమీ అడగకు. తిక్కదానిలా మాట్లాడుతుందది" అంది జయ.

    ఆ సాయంత్రం కాంతారావుతో గది చూడ్డానికి వెళ్ళింది. రెండు గదులు, కిచెన్, బాత్ రూమ్. చాలా బావుంది ఇల్లు. అద్దెకూడా తక్కువే!

    "ఇక్కడికి నా గది చాలా దగ్గిర. పదండి" అన్నాడు.

    ఇద్దరూ అక్కడికి నడిచారు. అది పెద్ద గది. ఓ మూల స్ప్రింగ్ మంచం, టేబుల్, నాలుగు కుర్చీలు, రేడియో ఫాన్... గది అంతా నీట్ గా సర్ధి ఉంది.

    "గది చాలా నీట్ గా ఉందే!" అంది కుర్చీలో కూర్చుని.

    "నా హాబీల్లో అదొకటి!" నవ్వాడు.

    గది ఎదురుగ్గా భూతంలా పెద్ద రావిచెట్టు గుబురుగా ఉండి గదిలో వెల్తురు చొరనీయడం లేదు. ఎందుకనో ఆ చెట్టుని చూస్తే భయం కలిగింది జయకి.

    ఎలక్ట్రిక్ స్టౌ మీద కాఫీ తయారుచేశాడతను.

    స్వీట్స్, బిస్కెట్స్ ఆమె ముందుంచాడు. ఇద్దరూ అవి తిని, కాఫీ తాగారు.

    టేబుల్ పైన ఉన్న ఓ పుస్తకం ఆమె చేతికిచ్చాడు.

    "అప్పుడప్పుడు కాలక్షేపానికి చిత్రాలు గీస్తూంటాను."

    ఒక్కొక్క పేజీ చూడసాగిందామె. మధ్యలో ఓ చిత్రం చూసి చాలా సిగ్గు పడిపోయింది. స్త్రీ పురుషులు గట్టి కౌగిలిలో తన్మయత్వంతో ఉన్నారు.

    "ఎలా ఉందిది!"

    "బావుంది." తడబడుతూ అన్నదామె.

    అతను నవ్వాడు.

    "ఇక వెళతాను." లేచి నించుంది.

    "అప్పుడే ఏం తొందర?" ఆమెకి దగ్గరగా వచ్చాడు.

    "అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది."

    హఠాత్తుగా ఆమెని దగ్గిరగా లాక్కున్నాడు.

    "మిమ్మల్నో సంగతి అడగనా?"

    ఆమెకి అతని స్పర్శ ఏదో చక్కిలిగింతలు పెట్టినట్లుంది.

    "ఏమిటది?" అడిగింది.

    "కోప్పడరుగా?"

    జయ ఏమీ మాట్లాడలేదు. అతని కౌగిలి నుండి తప్పించుకోడానికి ప్రయత్నం చేసింది.

    "నాకు మీరు కావాలి. మనం పెళ్ళి చేసుకుందాం. ఇన్నేళ్ళనుంచి నీ అంత అందమయిన అమ్మాయి కోసమే ఎదురుచూస్తున్నాను."

    జయ కళ్ళల్లో వెలుగు కనిపించిందతనికి. సిగ్గుతో అతని హృదయంలో మొహం దాచుకుంది. ఆ రాత్రి ఆమె ఇంటికి వచ్చేసరికి ఎనిమిదయింది.

    "ఇంతసేపయిందేం?" అడిగింది అమ్మ.

    "ఆఫీసులో పార్టీ జరిగింది." తడబడుతూ చెప్పింది.

    ఆ రాత్రి నిద్రపట్టలేదు. కిటికీలోంచి వెన్నెల్ని చూస్తోంది. అక్కయ్య కూడా మొదటిసారి ఇలాగే అబద్ధం చెప్పింది. అక్కయ్యని అనుకొని ఇప్పుడు తను మాత్రం ఏం చేసింది? తనని కాంతారావుకి అర్పించుకొంది. కానీ కాంతారావు అలాంటివాడు కాదు. మోసం చేసే స్వభావం కాదతనిది. తప్పకుండా తనని పెళ్ళి చేసుకుంటాడు.

    "మనం వేరే ఇంట్లోకి మారదాం అమ్మా" అంది పొద్దున.

    "అలాగే నీ ఇష్టం!" అంది తల్లి.

    అక్కయ్య అక్కడే ఉంది. ఏమీ మాట్లాడలేదు. చక్కగా అలంకరించుకొని ఉంది. ఆఫీసుకి వెళ్లడం మానేసి వారం దాటిపోయింది. మళ్ళీ ఈవేళ వెళుతుందేమో! అనుకొంది జయ.

    లలిత లేచి బయటికి వెళ్ళిపోయింది. టేబిల్ పైన గాలికి రెపరెపకొట్టుకొంటున్న లలిత డైరీ జయకి కనబడింది. మెల్లగా తీసి చూసింది జయ.

    జనవరి 3.

    ఉద్యోగంలో చేరి ఇవాల్టికి నెలరోజులు. నారాయణ చాలా మంచి వాడు. అతన్ని మనఃస్ఫూర్తిగా ప్రేమించాను. అతనూ నన్ను ప్రేమించాడు. వివాహం చేసుకొందామన్నాడు. సినిమాకి వెళ్దాం అని ప్రాణం తీస్తున్నాడు. అమ్మ తిడుతుందని భయంగా ఉంది.

    జనవరి 11

    నారాయణని ఇంటికి రమ్మన్నాను. అతను వచ్చాడు. నాన్నకి పరిచయం చేశాను. నాన్నకి ఎలా చెప్పాలో తెలీడంలేదు.

    జనవరి 20.

    నారాయణ బలవంతంపైన సినిమాకి వెళ్ళాను. మధ్యలో నా భుజం చుట్టూ చెయ్యి వేశాడతను. అతని కౌగిలిలో అలాగే ఉండిపోవాలనిపించింది. కానీ ఆడదానికి శీలం ముఖ్యం. జాగ్రత్తగా ఉండాలి.

    ఫిబ్రవరి 4.

    నారాయణతో బీచ్ కి వెళ్ళాను. వెన్నెల్లో ఇద్దరం మైమరిచాం. త్వరలో పెళ్ళి చేసుకుందామన్నాడు. రాత్రి పదకొండు దాటింది. అమ్మ కోప్పడింది. తిరగబడి సమాధానం ఇచ్చాను. అవును, వాళ్ళు నాకు వివాహం చేయలేరు. నేను ప్రయత్నిస్తూంటే అడ్డెందుకు రావాలి?

    ఫిబ్రవరి 12.

    "రాత్రి అంతా నారాయణ ఇంట్లోనే గడిపాను. అతను నా కాబోయే భర్త. అతను లేకపోతే నాకు జీవితమే లేదు . అమ్మా, చెల్లాయి నాతో మాట్లాడ్డం లేదు. నేనూ కోపం వచ్చి ఉద్యోగం మానేస్తే? నాకేం ఫర్వాలేదు - వాళ్ళకే నష్టం.

    ఫిబ్రవరి 27.

    "నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నారాయణ గోముఖ వ్యాఘ్రం. నన్ను పెళ్ళాడ్డానికి తనవాళ్ళు ఒప్పుకోవడం లేదట. అదీకాక ఒక కులం కాకపోవడం చేత, ఓ వేళా పెళ్ళాడితే తన చెల్లాయిల కేవ్వరికీ పెళ్ళిళ్ళు కావట. ఇడియట్! వాడిదంతా నటన! మొహం వాచేటట్టు తిట్టాను. నా ఉసురు ఊరికే పోదు. వాళ్ల చెల్లెళ్ళ బ్రతుకు కూడా నా లాగే కావాలి! సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చుని భోరున ఏడ్చాను. ఇంట్లో నా మొహం ఎలా చూపగలను? ఆత్మహత్యే శరణ్యంలా అనిపిస్తోంది."  

    మార్చి 4.

    "రాత్రి నూతిలో దూకి చనిపోదామని రెండుసార్లు ప్రయత్నించాను. కానీ ఆఖరిలో అమ్మా, నాన్న, చెల్లాయిల భవిష్యత్తు తలుచుకొని మానేయాల్సి వచ్చింది. నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారు?"

    ఏఫ్రిల్ 20.

    "ఆఫీసు నుండి వస్తూంటే రమణ కనిపించాడు. కారాపి పలుకరించాడు. హైస్కూల్లో నాతోపాటు చదివాడు. బలవంతం మీద కారులో ఓ హోటల్ కి తీసుకువెళ్లాడు. నారాయణని గురించి అంతా తెలిసిందిట. తనకి నా మీద జాలి కలిగిందిట. వెతుక్కుంటూ వచ్చాడట. తనకి భార్య చచ్చిపోయిందిట. అభ్యంతరం లేకపోతే వివాహం చేసుకుంటాడట. ఆలోచించి చెప్పమన్నాడు. ఏమీ అర్థం కాలేదు. రమణలో నిజంగా అంత త్యాగం ఉందా? అగమ్యగోచరంగా ఉంది..."  

    మే 1.

    రమణ రోజూ కలుస్తున్నాడు. వివాహం గురించి తొందర చేస్తున్నాడు. నేను ఏ సంగతీ నిర్ణయించుకోలేకపోతున్నాను. అతనితో తిరుగుతున్నానని చెల్లాయి తిట్టింది. క్షమించు చెల్లాయ్! నేనున్న పరిస్థితిలో నాకో స్నేహితుడు కావాలి.

    "రమణ కూడా నన్ను అన్యాయం చేశాడు. కనబడినా చూడకుండా వెళ్తున్నాడు. ఆడదాని కసలు అన్యాయం జరగకూడదు. జరిగిన తరువాత ఇక ఎన్నిసార్లయినా ఒకటే! జీవితంపైన నాకే ఆశాలేదు. చచ్చిపోవాలని ఉంది."

    జూన్ 2.

    "చెల్లాయికి ఉద్యోగం దొరికింది. సంతోషం కలిగింది. ఇప్పుడు నేను ఛస్తే ఏడ్చే వాళ్లుండరు. ఈరోజు కోసమే ఇన్నాళ్లూ ఎదురుచూశాను. ఇక ఆఫీసుకి వెళ్ళను. దేవుడా! నా నీడ మాత్రం చెల్లాయి పైన పడనీకు-"

    జయ కళ్ళలో నీరు గిర్రున తిరిగింది. అక్కయ్య అసలు కథ ఇదా? అక్కయ్య మొదటిసారిగా నారాయణని గురించి డైరీలో రాసినట్లే తనూ కాంతారావుని గురించి డైరీలో రాసింది. మరి కాంతారావూ నారాయణ లాంటివాడేనా? తనకి అన్యాయం చేస్తాడా? చేస్తే- తన గతీ అక్కయ్య లాగే అవుతుంది కదా! అలా జరగకూడదు. వెక్కి వెక్కి ఏడ్చింది జయ.

    జయ ఆఫీసుకు వెళుతూండగా లలిత రిక్షాలో వచ్చేసింది.

    పాపం, అక్కయ్య! చాలా బాధగా ఉంది ఇప్పుడు దాన్ని చూస్తూంటే, అలాంటిదాన్ని ఒంటరిగా వదిలి మరో ఇంట్లోకి వెళ్ళిపోవాలనుకుంది తను. అది ఇలాంటి పరిస్థితిలో తప్పక ఆత్మహత్య చేసుకుంటుంది. ఉహు! అదింక ఉద్యోగం చెయ్యవలసిన పనిలేదు. ఇంట్లోపడి ఉంటే చాలు!    

    కాంతారావు సీట్లో కనిపించలేదు. ఎందుచేతనో గుండె ఝల్లుమంది. నారాయణ ఆమె కళ్లముందు మెదిలాడు. హెడ్ క్లర్క్ దగ్గిరకి వెళ్ళి అడిగింది.

    "పది రోజులు సెలవు తీసుకున్నాడమ్మా. భార్యని తీసుకురావడానికి వెళ్ళాడు. అదృష్టవంతుడులే! అతని భార్య సంవత్సరానికి ఆర్నెల్లు పుట్టింట్లోనే ఉంటుంది."

    తల తిరుగుతున్నట్లు అనిపించింది జయకి. వెంటనే బయటికి వచ్చి వాంతి చేసుకుంది. నిల్చోలేక గోడకి చేరగిలబడింది.

    "ఏమయిందమ్మా!" ఫ్యూన్ పరిగెత్తుకు వచ్చాడు.

    "రిక్షా పిలు. లక్ష్మయ్యా! ఒంట్లో బాగుండలేదు. ఇంటికెళ్ళిపోతాను."

    హెడ్ క్లర్క్ కి చెప్పి ఇంటికి చేరుకుంది. తల పగిలిపోతున్నట్లుంది. తడబడుతూ లోపలికి నడిచింది. లోపలి దృశ్యం చూసి నివ్వెరపోయింది.

    అక్కయ్య మంచంపైన నిర్జీవంగా పడుకొని ఉంది. తల్లి పక్కన కూర్చొని ఏడుస్తూంది.

    "అ..క్క...." మాట బయటికి రాలేదు.

    "అనుకొన్నంత పనీ చేశా వక్కా! కానీ నేనూ నీ మార్గంలోనే ప్రయాణం చేశాను. ఈ నరకం నుండి నేనెలా తప్పించుకోను? నన్ను అడ్డు ఉంచుకొని నువ్వెళ్ళిపోయావు! కానీ నాకెవ్వరూ లేరు. ఎలా, అక్కయ్యా? మగవాణ్ణి నమ్మినందుకు మన కథలింతేనా? ఇక మారవా?

    జయకి స్పృహ తప్పింది.

                                      * * * * 

 Previous Page Next Page