Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 36


                                            తీయని అనుభూతి

    "చలపతీ!"

    వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూశాడు చలపతి. రోడ్డు కటుపక్క సైకిల్ పట్టుకుని నించుని ఉన్నాడు రావు.

    సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు చలపతి. ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వచ్చి రెండు రోజులయింది. తెలిసిన ముఖం ఒక్కటి కూడా కనిపించలేదు. చాలామంది కాలేజ్ మేట్స్ ఇక్కడే పని చేస్తున్నారని తెలుసుగాని, ఎవ్వరి అడ్రెసూ తన దగ్గర లేదు. ఉన్నా - ఉపయోగమేముంది గనుక ? ఎక్కడో బొంబాయిలో తన ఉద్యోగం. అడపా దడపా రాలేనంత దూరం. అందరినీ మరిచిపోయి బొంబాయిలో కొత్త పరిచయాలు చేసుకొంటున్నాడు.

    "ఎప్పుడొచ్చావురా ఇక్కడికి? బాంబేలోనేనా ఉండటం?" సంతోషంగా అడిగాడు రావు దగ్గరికొస్తూ.

    "అవునోయ్! అక్కడికొచ్చి రెండు రోజులయిందిలే! కంపెనీ పనిమీదొచ్చాను."

    "భలే, అనుకోకుండా కలిశావురా! పద! ఆ హోటల్లో కూర్చుందాం!"

    ఇద్దరూ పక్కనే ఉన్న హోటల్లోకి నడిచారు.

    ఓ టేబుల్ ముందు కుర్చీలో కూలబడిన తరువాత - "ఊ ఇప్పుడు చెప్పు నీ విశేషాలన్నీ, అయిదేళ్ళక్రితం మన ఊరు వదిలిన తరువాత మళ్ళీ ఇదే కనిపించడం నువ్వు - అవునా? ఎలా ఉంది బాంబే లైఫ్?" అన్నాడు రావు.

    "రెండు మూడుసార్లు మన ఊరు వచ్చాన్రా, బాబూ! మన బాచ్ లో ఒక్కడు కూడా కనిపించలేదక్కడ! చెట్టుకొకడూ పుట్టకొకడుగా ఎగిరిపోయారు. అయితే, ఎక్కువమంది హైదరాబాద్ లోనే ఉన్నట్లు తెలిసింది."

    "అవును! రాఘవేంద్రరావుగాడు హెవీ  ఎలక్ట్రికల్స్ లో ఉన్నాడు. వీరభద్రం కూడా ఈ మధ్యనే అందులో జాయినయ్యాడు. ఇకపోతే శంకర్రావ్ గాడు. రైల్వేస్టేషన్ టీసీ ప్రభాకర్ గాదు ఏజీ ఆఫీస్ లో ఉన్నాడు. నేనేమో సెక్రటేరియట్ లో..."

    చలపతికి చాలా ఉత్సాహం కలిగింది.

    "అయితే, మీరందరూ తరచుగా కలుస్తూంటారన్నమాట!"

    రావు నెమ్మదిగా నవ్వాడు.

    "లేదురా! ఒకేచోట ఉన్నామన్న మాటేగాని, అయిదారు నెలలకోసారి కలుసుకోవడమే బ్రహ్మ ప్రళయమైపోతోంది."

    "అదేమిటి, ఎందుకని?"

    "ఎందుకేముందీ? లైఫ్! అంతే! అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. సంసారాల్లో పడ్డారు. స్నేహితులూ, సరదాలూ అన్నీ బంద్! రొటీన్ జీవితం. లక్ష సమస్యలు" నిట్టూర్చాడు రావు.

    చలపతికి అర్థమయింది రావుని ఓసారి పరీక్షగా చూశాడు. అదివరకటి రూపానికీ, ఇప్పటికీ చాలా తేడా ఉంది. అతని ముఖంలో ఏదో దిగులు, ఆలోచనలు గూడు కట్టుకొన్నాయి. అందుకే కాబోలు లెక్చరర్లు చెపుతూండేవాళ్లు కాలేజీలో - "మనిషి జీవితంలో కాలేజ్ లైఫ్ గోల్డెన్ పిరీడ్" అని, ఏ బాధ్యతా బాదరబండీ లేని రోజులవి.

    "సరే, ఈ గొడవలదేముంది కానీ - నీ గురించి చెప్పరా. పెళ్ళెప్పుడు చేసుకొంటావ్? లేక చేసుకున్నావా?"

    "మీకు తెలియకుండా చేసుకోన్లేరా, బాబూ!"

    "ఎందుకింకా ఆలస్యం మరి?"

    "వచ్చే సంవత్సరానికి బహుశా ప్రమోషన్ దొరుకుతుంది. అప్పుడు గాని నా జీతం ఇద్దరు మనుషులకి హాయిగా సరిపోయేంత అవదు. పైగా పెళ్ళాన్ని వెతికే అవసరమూ లేదాయె. మామయ్య ఇంట్లో రెడీగా ఎదిగి కూచుని ఉంది. అదీ సంగతి."

    "అదృష్టవంతుడివిరా, బాబూ! దూరపు చూపు ఉంది. మేమంతా చత్వారపు వెధవలం. పెళ్ళి అవగానే గుడ్డి వెధవలమై జీతం సరిపోతుందా, చాలదా, పెళ్లాన్ని సరిగ్గా పోషించగలమా, పిల్లలు పుడితే భరించగలమా అన్న ఆలోచన లేకుండా ఠకీమని తాళికట్టేశాం. అంతే! అన్నట్లు నీకు మన కాలేజీలో చదివిన బ్యూటీ క్వీన్ గుర్తుందా?"

    "ఎందుకు గుర్తులేదు? ఆ అమ్మాయి పేరు శాంత కదూ?"

    "అవును! ఇక్కడే ఉందిప్పుడు. ఆ మధ్య ఓసారి నేనూ, మా శ్రీమతి సినిమా కెళ్ళాం. ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ స్టాల్ దగ్గర కనిపించింది. వాళ్ళాయన ఆర్మీలో మేజర్ అట. ఇంట్రడ్యూస్ చేసింది. ఉత్తరదేశమంతా తిరిగిన తరువాత చివరికి ఇక్కడకు ట్రాన్స్ ఫర్ అయిందిట. మనిషి ఎంత తెల్లగా అయిపోయిందో తెలుసా? లావుగా, పొడుగ్గా, హుందాగా - ఆ అమ్మాయిని చూస్తూంటే నాకు తెగ జెలసీ పుట్టుకొచ్చిందిరా." చలపతి గలగల నవ్వాడు.

    "అన్నట్లు, మీ శిష్యురాలు కూడా ఇక్కడే ఉంది, తెలుసా?"

    ఉలిక్కిపడ్డాడు చలపతి. అతని గుండెలు కొంచెం వేగంగా కొట్టుకోసాగాయి.

    "ఎవరూ?" అన్నాడు, ఆత్రుతను అణుచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ.

    "రెహానా!"

    చలపతిని పాత స్మృతులన్నీ ఊపిరాడకుండా కమ్ముకొన్నయ్.

    "ఐసీ!" అన్నాడు పొడిగా. ఎక్కడుందో, ఏమైనా జాబ్ చేస్తుందేమో అడగాలన్న కోరికను బలవంతంగా అణచుకొన్నాడు.

    తిరిగి అన్నాడు రావు. "స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియాలో రిసెప్షనిస్ట్ గా వర్క్ చేస్తోంది. ఓసారి ఆఫీస్ పనిమీద బాంక్ కి వెళితే కనిపించిందక్కడ."

    "ఎక్కడ ఆ బాంక్?" ఆగలేక అడిగేశాడు చలపతి.

    "ఇక్కడి నుండి ఓ ఫర్లాంగు దూరం ఉంటుంది. ఇదే రోడ్డు! కలుసుకో ఓసారి వెళ్ళేలోగా."

    "చూద్దాం."

    "మా ఇంటి కెప్పుడొస్తావు మరి? ఓ రోజు గెస్ట్ గా ఉండాలి."

    "వస్తాను! కాని, ఇప్పుడు కాదు. మా ఆవిడను కూడా తీసుకొస్తాను."

    "అంటే, మరో సంవత్సరం తరువాత? ఏడ్చినట్లుంది." నవ్వుతూ అన్నాడు రావు.

    "రేపే వెళ్ళిపోవాలిరా! లేకపోతే వచ్చేవాణ్ణి. ఈసారి ఇక్కడి కొచ్చినప్పుడు మన వాళ్ళందర్నీ కలిసి మరీ వెళ్తాను. అందరితో చెప్పు."

    "మరి! నేనుంటా నిక." లేచి నించున్నాడు రావు.

    బిల్లు చెల్లించి బయటి కొచ్చారిద్దరూ. రావు సైకిల్ తీసుకొని మరోసారి" వస్తాన్రా" అంటూ వెళ్ళిపోయాడు. చలపతి టైమ్ చూసుకొన్నాడు. నాలుగు దాటింది ఇప్పుడు బాంక్ కి వెళితే రెహానాని కలుసుకోవచ్చు. బాంక్ వేపు వడివడిగా అడుగులు వేయసాగాడు చలపతి అతని మనసంతా రెహానా గురించిన ఆలోచనలతోనే నిండిపోయింది. బొంబాయి వెళ్ళిన కొత్తలో చాలాసార్లు ఆమె గుర్తు కొస్తూండేది. ఎక్కడుందో, ఏం చేస్తూందో అని తలుచుకొంటూండేవాడామె గురించి. బందరు వెళ్ళినప్పుడు కూడా ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు గాని, 'బందర్ లో లేదు' అన్న సంగతి తప్పితే ఇంకేమీ తెలియలేదు.

    ఆమెతో పరిచయం గుర్తుకొచ్చింది చలపతికి.

    అప్పుడు తన డిగ్రీ అందుకొని ఉద్యోగం కోసం వేట ప్రారంభించాడు. ఓసారి సర్టిఫికెట్స్ ట్రూ కాపీల మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కోసం తాలూకా ఆఫీస్ కి వెళ్ళాడు. తహసీల్దార్ గారు సంతకాలు చేస్తూ, "డిగ్రీ తీసుకొని సంవత్సరమవుతున్నా ఇంకా జాబ్ దొరకలేదుటోయ్?" అన్నారు. ఆయన తనతండ్రికి మంచి ఫ్రెండ్.

    "లేదు, సార్!"

    "ఐసీ! ఎందుకని దొరకలేదూ? మార్కులు బాగా రాలేదా?" సర్టిఫికెట్స్ లో మార్క్స్ మెమొరాండం కోసం వెదుకుతూ అడిగారు.

 Previous Page Next Page