"ఏంటి, పొద్దుట్నుంచీ అలా కూర్చుండిపోయావ్? ఇదేదో కవరొచ్చింది చూడు" అంది అమ్మ.
ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకొంది జయ. కవరు చింపి చూసింది. తను అప్లై చేసిన ఓ కంపెనీ టైపిస్టు ఉద్యోగానికి ఆర్డరు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది. చాలా పెద్ద కంపెనీ. చాలా మంచి జీతం! అందులో తనకీ ఉద్యోగం రావడం నిజంగా తన అదృష్టమే అనాలి!
"అమ్మా! నాకు ఉద్యోగం వచ్చిందమ్మా!" సంతోషంగా చెప్పింది జయ తల్లికి.
"నిజంగానా?" సంతోషంగా అడిగిందామె తల్లి! కానీ అంతలోనే ఆమె మొహంలో విషాదరేఖలు అలుముకొన్నాయి. కళ్ళవెంబడి నీళ్ళు తిరిగాయి. జయకి కనబడనీయకుండా పక్కకి తిరిగి కన్నీరు తుడుచుకోబోయింది.
"అమ్మా!" ఆమెను తన వేపుకి తిప్పుకొంది జయ.
"అమ్మా! అక్కయ్యలా అవుతానని భయంగా ఉందా, అమ్మా! అలాంటి అనుమానం నీకు అక్కరలేదమ్మా! నే నెప్పుడూ అలాంటి పనులు చేయను."
"ఉహు! లేదు, జయా! నీ మీద నాకు నమ్మకముంది. నిన్ను గురించి ఆ విధంగా ఆలోచించను కూడా!"
ఆ సాయంత్రం అక్కయ్యతో చెప్పింది జయ.
"నాకు టైపిస్ట్ ఉద్యోగం వచ్చింది."
"గుడ్. ఎప్పుడు జాయినవుతున్నావు!"
"రేపే!"
సంభాషణ అక్కడికి ఆగిపోయింది.
మరునాడు ఆఫీసుకి వెళ్ళింది జయ. హెడ్ క్లర్క్ ఆమెని మేనేజర్ దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేశాడు. తరువాత టైపింగ్ సెక్షన్ లోకి తీసుకువెళ్ళి స్టెనో కాంతారావుకి పరిచయం చేశాడు.
"మీరు నాలుగయిదు రోజులు ఈయన దగ్గిర పని చూస్తూండండి. తరువాత ఇండిపెండెంట్ గా వర్క్ చేద్దురుగాని....!" అని వెళ్ళిపోయాడు.
"కూర్చోండి" అంటూ కుర్చీ చూపించాడు కాంతారావు.
కుర్చీలో కూలబడింది. అతనితో మాట్లాడ్డానికి కొంచెం సిగ్గుగా ఉంది. మగవాళ్ళతో ఇలా మాట్లాడ్డం ఎప్పుడూ జరగలేదు.
"మీకు పెద్దగా పనేమీ ఉండదులెండి. మహా అంటే రెండు గంటలు బిజీగా ఉంటుందంతే!" కాంతారావు చెప్పాడు.
చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసింది జయ. మరో ఇద్దరు టైపిస్ట్ లు టైపు చేసుకొంటున్నారు. ఇద్దరూ కొంచెం నడివయసువాళ్ళే! మరో వింగ్ లో ఆడపిల్లలున్నారుగానీ... టైపింగ్ సెక్షన్ లో తనొక్కర్లే ఆడది!
"ఈ లెటర్స్ కొన్ని చూడండి. ఐడియా ఉంటుంది" అంటూ ఓ ఫైలు అందించాడు. అంతా చూసింది. అంతలో ఫ్యూన్ ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చాడు "తీసుకోండి!" కాంతారావు నవ్వుతూ అన్నాడు.
వద్దందామనుకుని కూడా ఏమీ మాట్లాడలేకపోయింది జయ. కప్పు తీసుకుని కాఫీ తాగింది.
వారం రోజుల్లోనే పని సాంతం నేర్చుకొంది జయ. ఈ వారం రోజుల్లోనూ కాంతారావుతో సన్నిహితంగా మెలగడం చేత అతనంటే ఓ సదభిప్రాయం కలిగింది జయకి. ఎందుచేతనో గానీ అతను అందరిలాంటి వాడు కాదనిపించింది. అదీకాక ఆ ఆఫీసులో ఓ విచిత్రమైన వాతావరణం అలుముకొని ఉన్నది. మిగతా ఆఫీసుల్లోలా మాట్లాడుకోవడం... నవ్వుకోవడం... అటూ ఇటూ తిరగడం- ఇలాంటివి లేవు.. చాలావరకు ఒకరికొకరు సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు. పక్క సెక్షన్ లో నలుగురు మాత్రం టాయిలెట్ రూమ్ దగ్గిర వాళ్ళ నలుగురినీ కలుసుకొంటూ ఉండేది జయ.
కాంతారావు సరదా మనిషి. ఎప్పుడూ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. జయకి అతని మాటలు వింటూంటే నవ్వు వస్తుంది. ఆఫీసులో ఉన్న మిగిలిన జనాన్ని గురించి కామెంట్లు ఇస్తూంటాడు.
మొదటి రోజునే అన్నాడతను.
"మీకు పని నేర్పుతున్నందుకు మీరు నాకు గురుదక్షిణ ఇవ్వవలసి ఉంటుంది."
జయ ఏమీ మాట్లాడలేదు. నవ్వి వూరుకొంది.
మొదటి జీతం తీసుకొంటున్నరోజు మళ్ళీ అడిగాడు.
"పార్టీ ఇస్తున్నారనుకొంటా మీరు-"
"తప్పకుండా!" అంది జయ నవ్వుతూ.
సాయంత్రం అయిదు అవుతుండగా అన్నాడతను.
"చూడండి, జయా! మీరు డీలక్స్ హోటల్లో ఎయిర్ కండిషన్డ్ గదిలో కూర్చొనుండండి. నేను వెనక వస్తాను. ఇద్దరం కలిసి వెళ్లడం అంతగా బావుండదు. మన ఆఫీసులో అసలే ఏడుపుగొట్టు పక్షులెక్కువ..."
హోటల్లో అతనే ఏవేవో స్వీట్స్, హాట్స్ ఆర్డరిచ్చాడు. అతనేవేవో మాట్లాడుతూంటే ఇద్దరూ తినడం ముగించారు.
అతను మాట్లాడుతూంటే ఎన్ని రోజులయినా వినాలనిపోస్తోంది జయకు. అతని హృదయం చాలా మంచిది. అతని మాటల్లో కల్మషం లేదు. తనకి ఇంకా వివాహం కాలేదనీ, ఇప్పట్లో చేసుకోవడం ఇష్టం లేదనీ, కానీ తల్లీ తండ్రీ పోరుతూ ఉత్తరాల దాడి చేస్తున్నారనీ చెప్పాడు.
తిరిగి వచ్చేస్తూంటే, "నా కో ఇల్లు కావాలి! చూడగలరా?" అంది.
"ఎందుకూ? ఇప్పుడున్న ఇల్లు బాగాలేదా?" అడిగాడు.
"ఉహు! ఇంకో ఇల్లు కావాలి! కారణాలు తరువాత మీకు చెబుతాను.
"సరే! వెదికి మీకు ఆఫీసులో చెబుతాను" అంటూ వెళ్ళిపోయాడు.
చాలా మంచి మనిషి అనుకొంది జయ.
ఇంటికి వెళ్ళేసరికి అక్కయ్య అక్కడే కూర్చుని ఉంది.
"ఇవాళ అది ఆఫీసుకి వెళ్ళలేదు" అంది అమ్మ రహస్యంగా.
"పోన్లే!" అంది జయ మన కెందుకన్న రీతిలో.
ఆ రాత్రి తనకు ఆకలి లేదని ముసుగుతన్ని పడుకొంది లలిత.
నాలుగు రోజుల తరువాత జయకి కాంతారావు చెప్పాడు -
"ఓ ఇల్లు చూశాను. బావుంటే దిగవచ్చు. ఓసారి చూడండి మీరు."
"రేపు వెళదాం లెండి" అంది జయ.
"ఓ- యస్. అలాగే. అన్నట్లు, రేపు నా పుట్టినరోజు, ఎవ్వరినీ పిలవడం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ మీరొక్కరే! అందుచేత మీరు తప్పకుండా రావాలి."
"అలాగే!" అంది జయ నవ్వుతూ.
ఆ రాత్రి జయ చాలాసేపు కాంతారావు గురించి ఆలోచించింది. అతనూ, తనూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకొన్నారు. ఇద్దరిమధ్యా ఎంతో సన్నిహితత్వం ఉంది. హృదయాంతరాళాలలో తనూ అతన్ని ప్రేమిస్తూంది. అతను కూడా తనంటే చాలా ప్రేమగా ఉంటున్నాడు. ఇద్దరూ వివాహం చేసుకొంటే? కొద్దిగా సిగ్గు కలిగింది. కాంతారావు నడగాలి. అతను ఒప్పుకుంటే అంతకంటే తనకేం కావాలి!
మర్నాడు ఆఫీసు కెళ్తూంటే అమ్మ అంది-