Previous Page Next Page 
వివాహం పేజి 33

   
    "చూడు, నాకేమన్నా అపాయం కలిగితే-"

    రవణ బొమ్మలు ముడిచి వింటోంది. పెట్టెలోంచి ఒక పెద్ద అట్టపెట్టె తెచ్చి రవణ కియ్యబోయినాడు. తీసుకోదు. తలెత్తి చూడదు.

    "తీసుకోమను."

    "ఏమిటిది?"

    "చాకొలెట్లు,"

    "తీసుకో, చాకొలెట్లే. యింకేమీ కాదు."

    చెయ్యి కొంచెం జాచి తీసుకుంది చాల సిగ్గుతో.

    "ఇట్లాంటి సిగ్గు నాకు కొత్తగా వుంది. నే నీ దేశంలో దిగి మూడురోజులు యింకా కాలేదు. ఈ అమ్మాయిని చూస్తే ముచ్చటేస్తూంది. ఆ బట్ట కట్టుకోవడం చాలా బావుంది. ఎంత నెమ్మదిగా కూచుంటారూ! చక్కగా ఏదో సాధు మృగమల్లే నడుస్తారు. ఈ యీడువాళ్ళు మా పిల్లలైతే యీ పాటికి బండిని సగం విరగగొట్టేవారు-"

    రయిలాగింది. గోపాలరావు రవణని ముందుకు తోసుకుంటో తలుపు వేపు పరుగెత్తుతున్నాడు.

    "గుడ్ బై" గోపాలరావుకి షేకాండిచ్చి రవణవేపు చెయ్యిజాచాడు. రవణ మూలకి ఒదిగింది. ఆ దొర తెల్లబోయి చూసి వూరుకున్నాడు.

   
                                                                         8

    వెంకట్రావుగారి బంగళా చాలా పెద్దది. గోపాలరావుకి ప్రత్యేకంగా ఒక గది వుంది. వెంకన్న పంతులు అభ్యంతరం ఒదిలిపోయింది కదా, రవణ యింక తనతో స్వేచ్ఛగా మాట్లాడుతుందనుకున్నాడు గోపాలరావు. అతని ఆశలన్నీ నిరాశలైనాయి. రవణ ఒక్కసారి మాట్లాడలేదు సరికదా, అసలు కనపట్టంలేదు. అంత పెద్దయిల్లు కావటం చేత తప్పించుకోడం చాలా సులభం. వెంకట్రావుగారు తన వ్యవహారాల గొడవలో వీళ్ళ సంగతి కల్పించుకోవటం లేదు.

    వెంకట్రావుగారిని చూడ్డానికి రోజూ డాక్టరు ఒస్తున్నాడు. ఆయన చిన్నప్పుడు రవణనీ, రవణ తండ్రినీ ఆ వూళ్ళో యెరుగును. డాక్టరు గారు చెప్పారని ఆ వూరి హెడ్మాస్టరు రవణని చూడ్డానిరి వచ్చాడు. వీళ్ళందరితోనూ చనువుగా మాట్టాడే రవణ తనతో మాట్లాడకపోవడం అన్యాయంగా కనపడుతోంది గోపాలరావుకి. తనకాలమంతా వంటింటిలోనే గడుపుతోంది. రవణ గదిలో, తను వాకిట్లో కూచోవలసి వొచ్చింది.

    రెండు రోజులైనాక ఒకనాటి సాయంకాలం పది పదిహేనుమంది పిల్లలు గుంపుగా వచ్చాకు. గోపాలరావుతో రవణ కోసమన్నారు.

    "ఏం పని?"

    "పని వుంది."

 Previous Page Next Page