ఎవరూ? ఎవరో తెల్లవాడు ఇదేమిటి? తెలీక పక్కనున్న ఫస్ట్ క్లాసులో ఎక్కారు.
గోపాలరావు భయంతో తెల్లబోయి చుట్టూ చూశాడు. దొర కోపంతో అతనివంక చూస్తున్నాడు. రవణ యింకా భయంతో చూస్తోంది చేసిన పొరపాటు యింగ్లీషులో చెప్పాడు దొరతో గోపాలరావు.
"ఈ నీళ్ళు చూడు. బుద్ధిలేదూ?"
"అవును తొందరలో వొలికాయి, క్షమించండి."
దొర ఫక్కున నవ్వాడు.
"పక్క పెట్టలో వుంది మీరేనా? ఆ ముసలాయన యెవరు?"
గోపాలం చెప్పాడు.
"కూచోండి, వొచ్చే స్టేషన్ దాకా వొకరి కొకరం తప్పం....... నువ్వూ కూచో, అమ్మాయీ."
రవణకి యింగ్లీషు తెలీదని చెప్పాడు.
"కూచోమను"
"కూచో" సిగ్గుపడ్డది.
"ఎందుకట్లా సిగ్గుపడుతుంది?"
"నా భార్య."
"ఐతే?"
ఏం చెప్పాలో తెలీలేదు.
"అట్లానే సిగ్గుపడతారు."
"ఎందుకు?"
"కొత్త."
దొర అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.
"కూచోపెట్టు."
చెయ్యి పట్టుకుని కూచోపెట్టబోయినాడు. సిగ్గుపడి విదిలించుకుంది.
"ఎంత అందంగా సిగ్గుపడుతుందో! ఈ దేశస్థులకి ఎంత అందమైన కళ్ళు!"
గోపాలరావుకి ముందు తెల్ల ఆయన మీద కోపం వొచ్చింది, తన పెళ్ళాన్ని మెచ్చుకున్నాడని.
"నేను కూచోపెడతాను చూడు."
ఆమె వేపు నడిచాడు ఆ తెల్లాయన.
పరుపు చివరగా చప్పున కూచుంది. ఆమె పెదిమలు నవ్వుతున్నాయి.
గోపాలరావుతో మాటాడుతున్నా, అతని కళ్ళు రవణ మీద వున్నాయి. గోపాలరావుకి భయం యెక్కువయింది. వీడు రవణని మోహించినట్లున్నాడే! తనని కిందికి తోసేసి రవణని యెత్తుకుపోతే! తోసేస్తాడని నిశ్చయ మేర్పడ్డట్టే జాగ్రత్తగా వున్నాడు. దొర పెట్టె తెరుస్తున్నాడు. రివాల్వర్ కోసం కాదుకద? చప్పున వెళ్ళి రవణ పక్కన కూచున్నాడు.