Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 33


    "అత్తయ్యకూ, భారతికి కూడా తెలియదా?"


    "లేదు" అన్నట్టు తల ఊపింది సుశీలమ్మ.


    తన అన్వేషణ ఇక ప్రారంభించవచ్చును. కొన దొరికింది. దాన్ని పట్టుకొని బయలుదేరాలి. మామయ్యకు తనను కన్నతల్లి ఎవరో తప్పక తెలిసి వుండాలి.     


    కాని, మామయ్య చెబుతాడా? చెప్పకపోతే?


    అమ్మ మాత్రం ఒక పట్టాన చెప్పిందా? మామయ్యకు తనంటే ఎంతో అభిమానం. తన మనశ్శాంతి కోసం తప్పక చెబుతాడు.   


    "శరత్?"


    శరత్ తలెత్తి సుశీలమ్మ ముఖంలోకి చూశాడు.


    "ఏమ్మా?"


    ఏదో అడగాలని పెదవులు కదిల్చింది. కాని అడగలేకపోయింది.


    "ఏమిటమ్మా?"


    "ఈ ప్రయత్నం మానరా బాబూ!"


    శరత్ మాట్లాడలేదు.


    "చెప్పరా!"


    "క్షమించమ్మా!"


    "ఏం చేస్తానంటావు?"


    "మామయ్య దగ్గిరకు వెళ్తాను. నన్ను కన్న స్త్రీ ఎవరో తెలుసుకుంటాను."


    "తెలుసుకొని ఏం చేస్తావు?"


    "ఒకసారి ఆమెను కళ్ళారా చూస్తాను."


    "అంతేనా? అంతకంటే నీకు ఇంకే కోరికా లేదా?"


    "ఇప్పటి కంతే"


    "ఆమెతో మాట్లాడాలని లేదా?"


    "వీలుంటే, పరిస్థితిని బట్టి...."


    "ఒకవేళ ఆ స్త్రీ నీకు కన్పించకపోతే"


    "నేను చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేశాక కన్పించకపోయినా పెద్దగా బాధపడను."


    సుశీలమ్మ నిట్టూర్చింది.


    "అమ్మా! మామయ్య వాళ్ళ ఊరికి ఇవ్వాళే బయలుదేరతాను."


    సుశీలమ్మ కళ్ళలో నీరు తిరిగింది.


    "నన్ను సంతోషంగా పంపించమ్మా!"


    "ఈ ఒక్కరోజుకు ఆగి రేపు వెళ్ళు, ఇవ్వాళంతా నా కళ్ళముందు వుండు. మీ నాన్నగారికి కూడా చెప్పి వెళ్ళు."


    శరత్ ఆలోచనలో పడ్డాడు.


    "ఈ ఒక్కమాటైనా విను. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో? ఈ ఒక్క రోజైనా-"


    "అమ్మా! నీకు కన్పించకుండా నేను ఎక్కడ వుండిపోనమ్మా."


    "నువ్వు వచ్చేంతవరకూ నేనే ఉండకపోతే"


    "అమ్మా!" శరత్ కంఠంలో జీరపలికింది.


    "నీ ఇష్టం!" ఆమె కంఠంలో ఓ రకమయిన నైరాశ్యం ఏదో వుంది.


    "అలాగే! రేపే వెళతాను."


    శరత్ తన గదిలోకి వెళ్ళిపోయాడు.


    సుశీలమ్మ ముఖానికి పైటచెంగు అడ్డుపెట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది.


                                  10


    "నువ్వు వచ్చేంతవరకూ నేనే వుండకపోతే?" తల్లి కంఠం శరత్ కు దీనంగా విన్పిస్తూ వుంది.


    పక్కమీద అశాంతిగా దొర్లుతున్నాడు. నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని నిద్రపట్టడం లేదు. పెంచిన తల్లికీ. ప్రేమించిన కన్యకూ అన్యాయం చేస్తున్నానేమో అనే బాధ మరోవైపు బాధిస్తూ వుంది.


    నిజంగా అమ్మ ఏ అఘాయిత్యానికైనా పాల్పడితే? శరత్ కు వెన్నెముకలోకి ఏదో జరజర పాకినట్టయింది. దిగ్గునలేచి మంచం మీద కూర్చున్నాడు. తనకు తెలియకుండానే లేచి నిల్చున్నాడు. అశాంతిగా గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.     


    "నో! నో! అలా జరగడానికి వీల్లేదు. వీల్లేదు! అమ్మ దగ్గిర ఏ అఘాయిత్యానికి పాల్పడనని మాట తీసుకోవాలి. తనమీద ఒట్టు వేయించుకోవాలి.


    రాజేశ్వరి తను తిరిగి వచ్చేంతవరకూ తనకోసం ఎదురు చూస్తుందా? ఎంతకాలమని  చూస్తుంది? తనకు రాజేశ్వరి దూరం అయితే....?     


    శరత్ గుండెల్లో ఏదో కదిలినట్టు అయింది.


    మామయ్యకు తనెవరో తెలుసు! తనను కన్న స్త్రీ ఎవరో తెలుసు! అందువల్ల పెద్దగా కష్టపడకుండానే తెలుసుకోవచ్చును. త్వరలోనే తిరిగి రావచ్చు.


    కాని.... కాని.... రాజేశ్వరి అన్నట్టు ఆమెను కుటుంబం తిరస్కరించిందేమో? ఎవరికీ తెలియకుండా ఎక్కడకయినా వెళ్ళిపోయిందేమో?    


    తను ఈ ప్రయత్నం విరమించుకుంటే -


    నో. నో. అలా వీల్లేదు. తన ప్రయత్నం తను చేస్తాడు.

 Previous Page Next Page