నేను అతడికి డబ్బేమీ ఇవ్వలేదు. నేను చెప్పింది కాదనే ధైర్యం ఈ కుర్రడాక్టర్ కి వుందని నేను అనుకోను. అయినా నేనడిగింది పెద్ద కోర్కేమీ కాదు. కడుపులు తియ్యమనీ, రేప్ కేసు మాఫీ చెయ్యమని అడగటంలేదు. నేను మామూలు పైత్యపు నొప్పిలాటిదాన్తో వచ్చిన ఆనంద్ కి గుండెజబ్బనీ బైపాస్ సర్జరీ చేయించుకోవాలనీ డాక్టరుగా సలహా ఇమ్మన్నాను. అదన్నా ఒక నెలరోజుల కోసం మాత్రమే ఈ అబద్దం అని చెప్పాను.
ఇంత చిన్న సాయం చేయటానికి ఆ డాక్టర్ కి అభ్యంతరం ఏముంటుంది. సరే అన్నట్టు తలూపాడు. వెంటనే వాహనం తీసుకుని బయల్దేరాడు.
ఆ తరువాత చూడాలి ఆనంద్ పరిస్థితి.
మింగలేక కక్కలేక చచ్చాడు. ఆ ప్రమద్వర అనే అమ్మాయితో సుదీర్ఘమైన చర్చలు జరిపాడు. ప్రాణం అంటే ఎవరికైనా తీపేకదా, దాని ఖరీదు మాత్రం నా కూతుర్ని పెళ్ళిచేసుకోవటం-
-అయితే నేను ఆనంద్ దగ్గిరకి వెంటనే వెళ్ళలేదు. ఇనుముని కొట్టాలంటే ముందు దాన్ని వేడెక్కించాలి. అందుకే కొంతకాలం వేచివుండి, ఆ తరువాత వెళ్ళి నా ప్రపోజల్ చెప్పాను. అతడు తెల్లబోవటం స్పష్టంగా కనిపించింది. అవును మరి "నా కూతుర్ని చేసుకో నీ గుండెజబ్బు నయం చేయిస్తాను" అని ఎవడూ అనడు. అందులోనూ డబ్బున్న మామగారు అందుకే అతడు నన్నో పిచ్చివాడిని చూసినట్టు చూశాడు. అతడికి మతిపోయి వుంటుంది. "మీరు నా గుండెజబ్బుకి ఆపరేషన్ చేయించిన తరువాత నేను మీ కూతుర్ని చేసుకోకపోతే?" అన్నాడు.
ఫర్వాలేదు నాకున్న పొగరులో సగం ఈ కుర్రాడికి వునంట్టుంది. నాకు తగిన అల్లుడు అవుతాడు. ఆస్తికేం వుంది. కుక్కని కొడితే వస్తుంది.
నవ్వేను. "నీ ఆపరేషన్ నా కూతురితో వివాహం జరిగాకే అవుతుంది" అన్నాడు. అతడి తల తిరిగిపోయింది. "నేను ఆపరేషన్ టేబుల్ మీద చచ్చిపోతే" అన్నాడు. నేను చెప్పిన సమాధానం విని- నా కూతుర్ని ఎలా పెంచాలో చిన్న ఉపన్యాసం ఇచ్చాడు. నాకు నవ్వు ఆగటంలేదు. ఈ కుర్రవాడి మీద నాకు కూడా ఇష్టం పెరుగుతూంది. మా అమ్మాయి ఎన్నిక తప్పుకాదు.
ఇలాంటి యువకుల సంగతి నాకు బాగా తెలుసు. వీళ్ళు అసలు ఆత్మవంచన చేసుకోరు. నిజాయితీ అంటే ఇష్టపడతారు. కానీ జీవితం ఒక గదిలో పడిన తరువాత అతి త్వరగా డానికి అడ్జెస్ట్ అయిపోతారు. రేపు వివాహం జరిగాక అతడికి గుండె నొప్పి లేదని చెప్తే అతడు దానికి ఎలా ప్రతిస్పందిస్తాడో మీకు తెలుసా? ముందు ఎగిరిపడుతాడు. తనని మోసం చేసినందుకు నన్ను నిలదీస్తాడు. కానీ మనసులో మరో మూల ఆనందం కట్టలు తెంచుకుని ప్రవహిస్తూనే వుంటుంది. మృత్యువు కబళించివేస్తూంది అని భయపడుతూన్న వాడికి, అది అసలు తలుపు వరకూ కూడా రాలేదని చెప్తే వింత ఆనందం!
ఇక సంసారం సంగతంటారా- దాని విషయం తరళ చూసుకుంటూంది. తంతే బూర్లె బుట్టలో పడ్డట్టు ఒకవైపు ఇంత ఆస్థివున్న కూతురు మరొకవైపు మరణం గురించిన శుభవార్త....ఇంతకన్నా మంచి బహుమతులు వివాహసందర్భంలో ఏ అల్లుడికి తన మామగారు ఇవ్వగలడు?
అందుకే నా ప్లాన్ పట్ల నేనింత నమ్మకంగా వున్నాను. ఒక్కసారి వివాహం జరిగిపోతే అంతా సర్దుకుంటుంది. నా కూతురి కళ్ళల్లో ఆనందం నాకు ముఖ్యం.
అయినా ఆనంద్ నా ప్రపోజల్ కి వప్పుకోలేదు.
దానికి నేను భయపడలేదు. ఈ రోజు కాకపోతే రేపయినా వప్పుకోక తప్పదు కదా! ఒకవేళ రేపు కూడా వప్పుకోకపోతే ఏం చెయ్యాలి?
ఏం చెయ్యాలని నేను ఆలోచిస్తున్న సమయాన ప్రమద్వర నన్ను కలుసుకుంది.
....
ఆ అమ్మాయి నా దగ్గిరికి రావటం చూసి నేను ఆశ్చర్యపోయాను.
తరళకి ఆనంద్ కి మధ్య ఈ అమ్మాయి రాయబారం జరిపింది అని నాకు తెలుసు. అందుకే నిష్టూరంగా "చూశావా-ఇంతవరకూ వచ్చాక ఇప్పుడు నీ స్నేహితుడు పెళ్ళికి వప్పుకోవటం లేదు" అన్నాను.
ఆమె తలూపి, "ఆ విషయం మాట్లాడటానికే వచ్చాను. ఆనంద్ ప్రాణాలు రక్షింపబడాలంటే దానికి ఒకటే మార్గం" అంది. నాకు నవ్వొచ్చింది. ఆనంద్ ప్రాణాపాయస్థితిలో వున్నాడన్న సమగతి అందరికీ నెమ్మదిగా తెలిస్తూందన్నమాట.
"ఏమిటా మార్గం?" అని అడిగాను.
"నాకు మీరు సాయం చేస్తానంటే తప్ప ఆనంద్ ఈ వివాహానికి వప్పుకోడు".
నాకు ఆశ్చర్యమేసింది. "అదేమిటి?" అన్నాను.
"అవును మీకు తెలియనిదేముంది? కొంతమంది యువకులు అంతే. తమ ప్రాణాలు పోయినా లెక్కచేయరు. కానీ అవతలివాళ్ళ కోసం దేనికైనా వప్పుకుంటారు. ఆనంద్ అలాటివాడు. ఈ వివాహంవల్ల తనకి ఆస్తి వస్తుందంటే వినడు. నాకు కూడా ఏదో లాభం వుంటుందంటే వప్పుకుంటాడు".
"ఇప్పుడు నేనేం చెయ్యాలి?"
ఆమె తలదించుకుని నెమ్మదిగా, "చెప్పాలంటే నాకూ అదోలా వుంది. కానీ ఈ వివాహం జరగాలంటే చెప్పక తప్పదు. నేను ఏ కులంలో పుట్టానో మీకు బాగా తెలుసు. నా భవిష్యత్తుని నాశనం చెయ్యాలని నా కన్నవాళ్ళే చూస్తున్నారు. మీరు నా భవిష్యత్తుకి ఏదో ఒక ఏర్పాటు చేస్తున్నానని ఆనంద్ కి చెప్పండి. దానికి ప్రతిగా యీ వివాహం జరగాలని కండిషను పెట్టండి. అతను వప్పుకుంటాడు" అంది.
"నీ గురించి అంత చేస్తాడా?" అనుమానంగా అడిగాను.
ఆమె ఇంకా తలవంచుకునే, "నేనూ తరళ ఆనంద్ లు ముగ్గురం స్నేహితులం. ఒకరి కొకరం ఏమైనా చేసుకుంటాం" అంది. "మరి నేను వెళ్ళి అడిగితే పెళ్ళికి ఎందుక్కాదన్నాడు?"
"వాళ్ళిద్దరూ చిన్నపిల్లల్లా ఎప్పుడూ దెబ్బలాడుకుంటూవుంటారు. కానీ ఒకరంటే ఒకరికి ప్రేమే. ఏదో బెట్టు చేస్తున్నాడు తప్ప ఆనంద్ తప్పకుండా వప్పుకుంటాడు. అందులోనూ 'ణ అగురించి' అంటే ఇక మరీ బెట్టు చేయలేడు" అంది.
"అంటే కొంపదీసి నీకు నిజంగా డబ్బు ఇవ్వాలా- ఈ సాయం చేసినందుకూ?"
ఆమె మొహం వాడిపోయింది. "అవసరంలేదు" అంది.
అలా అడిగినందుకు బాధపడి వెంటనే సర్దుకుని-
"అయితే నేను చెప్పను. నువ్వే చెప్పు" అన్నాను. "నేను వెళ్ళి ఆనంద్ కి, నువ్వు నా కూతుర్ని చేసుకుంటే ప్రమద్వరకి సాయం చేస్తాను అని చెప్తే మరీ లంచగొండిలా వుంటాను. ఎంతయినా కాబోయే మామగార్ని కదా" అన్నాను.
ఆమె అర్ధం చేసుకున్నట్లు తలూపి, లేచి నిలబడుతూ, "అయితే నేనే చెప్తాను. ఒకవేళ ఆనంద్ మిమ్మల్ని అడుగుతే మాత్రం నిజమేనని చెప్పండి అది చెప్పటానికే వచ్చాను!" అంది వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతూ.
"చివరగా ఒక్క ప్రశ్న" అన్నాను ఆగి ఏమిటన్నట్టు చూసింది.
"ఇదంతా నువ్వు మా తరళ పెళ్ళి కోసం చేస్తున్నావా? ఆనంద్ ఆస్తిపరుడవటం కోసం చేస్తున్నావా?"
ఆమె చప్పున తలెత్తింది.
నేను నవ్వి, సర్దుకుంటున్నట్టు "అహ- ఇద్దరూ నీ స్నేహితులేకదా- ఎవరికోసం చేస్తున్నావా అని-" అన్నాను. "పెళ్ళి కోసమా- ఆస్తికోసమా?"
ఆమె వెళ్ళిపోతూ అంది. "ఆనంద్ బ్రతుకు కోసం!"